‘మద్దతు’నిస్తాం
* రైతులకు అండగా ఉంటాం
* జిల్లాలో 175 వరి, 70 మక్క కొనుగోలు కేంద్రాలు
* నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు
జోగిపేట: ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా 175 వరి, 70 మక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆరు పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే బాబూమోహన్ కోరిక మేరకు అందోలు నియోజకవర్గంలోని జోగిపేట, వట్‌పల్లి మార్కెట్‌లలో పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బుధవారం ఆయన జోగిపేటలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, ఒకవేళ రైతుకు మద్దతు ధర దక్కకపోతే ప్రభుత్వమే ఆ రైతుకు మద్దతు ధరకు ఎంతతక్కువైతే అంత మొత్తం ఇస్తుందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ నిధి కూడా ఏర్పాటు చేసే యోచనలో సీఎం ఉన్నారని తెలిపారు. టీఆర్‌ఎస్ సర్కార్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. అందువల్లే రుణమాఫీ అమలు చేయడంతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా అందించామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.700 కోట్ల కొత్త రుణాలను రైతులకు మంజూరు చేయించామని, త్వరలోనే మరో రూ.200 కోట్ల రుణాలను మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అంతేకాకుండా చిన్న, సన్నకారు రైతులకు 80 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందించేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటోందన్నారు. షేడ్‌నెట్‌లు వేసుకొని కూరగాయలు పండించుకునేందుకు వీలుగా 50 శాతం సబ్సిడీతో నెట్‌లను అందజేయనున్నట్లు వివరించారు. జోగిపేట వ్యవసాయ మార్కెట్‌లో మరుగుదొడ్ల నిర్మా ణం, సీడ్ గోడౌన్ పనులను రూ.40 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
రాహుల్ బొజ్జా డైనమిక్ కలెక్టర్
జిల్లాలో రైతు రుణమాఫీ, రైతులకు కొత్త రుణాల మంజూరు విషయంలో జిల్లా కలెక్టర్ బొజ్జా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, ఆయన డైనమిక్ కలెక్టర్ అని మంత్రి అభివర్ణించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా కలెక్టర్ బ్యాంకర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎంపీ పి.మాణిక్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎంపీపీ అధ్యక్షురాలు విజయలక్ష్మి, ఉపాధ్యాక్షులు రమేశ్, డీసీసీబీ మాజీ ఉపాధ్యాక్షులు పి.జైపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు జి.లింగన్న, నాగభూషణం, వర్తక సంఘం అధ్యక్షులు ఎం.మల్లికార్జున్, మార్కెటింగ్ ఏడీఎం ఎస్‌ఎఫ్ హమీద్, జోగిపేట మార్కెట్ సెక్రటరీ నాగేశ్వరరావు, జహీరాబాద్ మార్కెట్ సెక్రటరీ శివరామ శాస్త్రి, తహ శీల్దాదారు నాగేశ్వరరావు, సర్పంచ్‌లు బీరప్ప, కాళీదాస్ గౌడ్, మాజీ సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్, నాయకులు సీహెచ్. వెంకటేశం, ఏ.శ్రీకాంత్, నాగరత్నంగౌడ్, అనిల్, సత్తిబాబు, సార శ్రీధర్, అ నిల్‌రాజ్, మాణిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ నిజమైన రైతు బిడ్డ
కరువు మంత్రిగా, రవాణా మంత్రిగా, 14 ఏళ్లు ఉద్యమకారుడిగా, ప్రస్తుతం సీఎంగా ఉన్నప్పటికీ కేసీఆర్ ఎప్పుడూ వ్యవసాయాన్ని విస్మరించలేదని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆయన ఎప్పుడు ఏ హోదాలో ఉన్నా, తాను రైతునన్న విషయాన్ని ఎప్పుడూ మరచిపోరన్నారు. అందువల్లే సీఎంగా ఉండి కూడా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవళ్లిలోని తన ఫాంహౌస్‌లో వ్యవసాయం చేస్తున్నాడన్నారు. అందువల్ల సీఎంకు రైతుల సమస్యలు తెలుసుననీ, తప్పకుండా రైతులకు న్యాయం చేస్తారన్నారు.