MLA babumohan
-
ఎమ్యెల్యే బాబూమోహన్‌కు నిరసన సెగ
రేగోడ్(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు కార్యక్రమంలో అందోల్ ఎమ్యెల్యే పి.బాబూమోహన్‌కు నిరసన సెగ తగిలింది. కారును అడ్డుకుని బాబూమోహన్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సుమారు అరగంట పాటు ఎమ్యెల్యే తన కారులోనే ఉండిపోయారు. ఈ సంఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని సిందోల్ గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. రైతుబంధు కార్యక్రమంలో భాగంగా సిందోల్ గ్రామంలో ఆదివారం రైతులకు చెక్కులు, పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అందోల్ ఎమ్యెల్యే పి.బాబూమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి చేరుకోగానే గ్రామానికి చెందిన పలువురు యువకులు, గ్రామస్తులు ఎమ్యెల్యే కారును అడ్డుకున్నారు. కారుముందు ఉండి బాబూమోహన్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఐదేళ్లుగా రోడ్డును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, నిరసన కారుల తోపులాటలతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోక్యంతో ఎమ్యెల్యే కారు చెక్కుల పంపిణీ కార్యక్రమం వద్దకు కదిలింది. ఎవడ్రా ఫొటోలు తీసేది.. నిరసన కారులు పక్కకు వెళ్లిన అనంతరం కారులో నుంచి కిందకి దిగుతున్న తనను విలేఖరులు ఫొటోలు తీస్తుండటాన్ని గమనించిన బాబూమోహన్‌కు ఎవడ్రా ఫొటోలు తీసేదంటూ విలేఖరులపై ఆగ్రహంతో ఊగిపోయారు. మేము విలేఖరులం.. మీ వార్తలు కవర్ చేయడానికే వచ్చాం. మాకు స్వేచ్ఛ ఉంది.. వద్దంటే వెళ్లిపోతామంటూ బాబూమోహన్‌తో విలేఖరులు తెలిపారు. -
‘అందోలు’కు రూ.80 కోట్లు
అందోలు-ఎర్రారం వరకు బైపాస్‌రోడ్డు మోడల్‌స్కూల్ టెండర్లు పూర్తి అందోలు ఎమ్మెల్యే పి.బాబూమోహాన్ జోగిపేట: అందోలు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు గాను ప్రభుత్వం ఇటీవల రూ.80 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పీ.బాబూమోహన్ పేర్కొన్నారు. గురువారం అందోలు గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని ఎస్సీ కాలనీలల్లో సీసీ రోడ్ల కోసం రూ.5 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఏడు మండలాల్లోని పాఠశాలలో టాయ్లెట్ల నిర్మాణం, పైప్లైన్ల ఏర్పాటు, డ్రింకింగ్ వాటర్ కోసం రూ.5 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కోటి, జిల్లా మంత్రి ద్వారా రూ. 2 కోట్లు, విద్యాశాఖ మంత్రి ద్వారా రూ.2కోట్లు మంజూరు చేస్తున్నారన్నారు, పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. రూ.13 కోట్లతో నిర్మిస్తున్న పాలిటెక్నిక్ కళాశాలల నూతన భవనాలు శరవేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. బుదేరాలో రూ.12 కోట్లతో డిగ్రీ కళాశాల నిర్మాణం, రాయికోడ్‌లో రూ. 13 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్, బుదేరాలో రోడ్లు భవనాల శాఖ గెస్ట్‌హౌస్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అందోలు పెద్ద చెరువు వద్ద రూ.4.50 కోట్లతో మినీ ట్యాంకు బండ్ నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జోగిపేట-నాందేడ్ అకోలా రహదారి ఫోర్‌లైన్ రోడ్లుగా విస్తరించేందుకు గాను ఎలాంటి అడ్డంకులు రాకుండా అల్మాయిపేట వద్ద నుంచి బైపాస్‌రోడ్డు పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. ఆత్మకమిటీ చైర్మన్ లక్ష్మికాంతరెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు కే.రమేశ్, మాజీ ఉపాధ్యాక్షుడు లింగాగౌడ్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు డీబీ నాగభూషణం, కౌన్సిలర్లు శ్రీకాంత్, లక్ష్మణ్, టేక్మాల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు యూసూఫ్ అలీ, నాయకులు రవీంద్రగౌడ్, గోపాల్, సీహెచ్.వెంకటేశం, చేనేత సొసైటీ చైర్మన్ వర్కల అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే బాబుమోహన్‌పై ఆగ్రహం
రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపకపోవడంపై ఆగ్రహం ఉవ్వెత్తున నిరసనగ సెగ.. ఎమ్యెల్యే దిష్టిబొమ్మకు శవయాత్ర విద్యార్థులతో ర్యాలీ, మానవహారం రేగోడ్: ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డ్రాప్ట్‌లో రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలిపారు. తాజాగా సోమవారం వెలువడిన డ్రాప్ట్ నోటిఫికేషన్లో రేగోడ్ మండలాన్ని మెదక్ జిల్లాలోనే ఉంచినట్లు సర్కారు అధికారికంగా ప్రకటించింది. అందోల్ ఎమ్యెల్యే బాబూమోహన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాత్రికిరాత్రి సంగారెడ్డి నుంచి తప్పించి మెదక్ జిల్లాలో చేర్చినందుకు మండలంలో మంగళవారం నిరసన సెగ ఉవ్వెత్తున ఎగిసి పడింది. అఖిలపక్షం నేతలు, యువజన సంఘాలు, ప్రజలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, దుకాణాలను బంద్ చేయించారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఇక్కడి ప్రజల ఆకాంక్షను.. ప్రజాభిష్టాన్ని గౌరవించి రేగోడ్‌ను సంగారెడ్డి జిల్లాలో కలిపితే.. బాబూమోహన్ మాత్రం రేగోడ్ మండాలన్ని మెదక్ జిల్లాలో చేర్చారని మండిపడుతూ బాబూమోహన్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. డప్పులతో ఊరేగించి బస్టాండ్‌లో బాబూమోహన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అఖిలపక్షం నేతలు నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మున్నూరు కిషన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతాప్ రమేశ్‌జ్యోషి, వట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.దిగంబర్‌రావు, దేవునూర్ సర్పంచ్ (మాజీ జెడ్పీటీసీ) జానయ్య, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు అనీల్‌కుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు పూర్ణచందర్ విలేకరులతో మాట్లాడారు. మండలానికి మంచి చేయకపోయినా పరవాలేదు.. కానీ చెడుమాత్రం చేయొద్దని కోరారు. 23 రోజుల దీక్షల ఫలితం.. కలెక్టర్ కృషి కారణంగా ముందుగా రేగోడ్ మండలం సంగారెడ్డి జిల్లాలో చేర్చారని చెప్పారు. ఆ ప్రకటనతో ప్రజలంతా సంబురపడుతున్న సమయంలో ఎమ్యెల్యే రాత్రికిరాత్రి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సంగారెడ్డి జిల్లాలో ఉన్న రేగోడ్ మండలాన్ని మెదక్ జిల్లాలో చేర్చారని ధ్వజమెత్తారు. నారాయణఖేడ్ ఎమ్యెల్యే భూపాల్‌రెడ్డి ప్రజాభీష్టం మేరకు నారాయణఖేడ్‌ను సంగారెడ్డి జిల్లాలో కలుపుతూ ఖేడ్‌ను రెవెన్యూ కేంద్రంగా చేసుకోవడంలో సఫలీకృతుడయ్యాడని చెప్పారు. ఇక్కడి ప్రజలంతా సంగారెడ్డి జిల్లాలో ఉంచాలని, 7 కిలో మీటర్ల దూరంలోని ఖేడ్ రెవెన్యూ డివిజన్‌లోనే ఉంటామని ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేసి, రేగోడ్‌లో దీక్షలు చేసినా బాబూమోహన్ మాత్రం ప్రజాభీష్టానికి విరుద్ధంగా 60 కిలో మీటర్ల దూరంలోని మెదక్ జిల్లా, రెవెన్యూ డివిజన్లో చేర్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత ఉపాధికి వెన్నుముకలా ఉన్న సంగారెడ్డి జిల్లా నుంచి తప్పించి ఎలాంటి ఉపాధి అవకాశాలు లేని మెదక్ జిల్లాలో రేగోడ్‌ను ఉంచడం దారుణమన్నారు. సంగారెడ్డి జిల్లాలో మండలాన్ని చేర్చగానే కొందరు టీఆర్ఎస్ నాయకులు బాబూమోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారాని.. ఇపుడు మెదక్‌లో ఉండటంపై ప్రజలకు ఏ సమాధానం చెప్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్యెల్యే తీరును టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వ్యతిరేకించారని, మిగతా నాయకులు ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. ప్రజలతో ఓట్లు వేయించుకున్న ఎమ్యెల్యే, టీఆర్ఎస్ మండల నాయకులు వారి ఆకాంక్షýను గౌరవించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం చేతగాకపోతే పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామన్నారు. రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలుపుతూ, ఖేడ్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి సహకరించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని.. న్యాయపోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. కార్యక్రమంలో కొండాపురం సర్పంచ్ గంజి సంగమేశ్వర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ రాధాకిషన్, ఉప సర్పంచ్‌లు నర్సింహులు, తూర్పు మాణయ్య, మైనార్టీ మండల నాయకుడు చోటుబాయ్, వికలాంగుల సంఘం మండల అధ్యక్షుడు మహబూబ్, ఉన్నత పాఠశాల చైర్మన్ అక్బర్, మాజీ సర్పంచ్ పండరి, నాయకులు నారాయణ, పూల్యానాయక్, రామాగౌడ్, జయరావు, పీర్యానాయక్, రాములు, జి.శంకరప్ప, రాజుసాగర్, జ్ణాణేశ్వర్, సుధాకర్, కషి, రాములు, కల్లేటి శ్రీధర్‌గుప్తా పాల్గొన్నారు. -
బాబూమోహన్ ఆకస్మిక తనిఖీలు
- ప్రిన్సిపాల్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం - సస్పెండ్ చేయాలంటూ అధికారులకు ఆదేశం పుల్కల్ : పిల్లలకు పురుగుల అన్నం పెట్టి చంపుతారా..మీకు జీతాలు ఇవ్వడంలేదా.. మీ పిల్లలను ఇలాగే చూసుకుంటారా.. అంటూ అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ సింగూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై మండిపడ్డారు.మిషన్ కలాం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా డిప్యూటీ స్పీకర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లోని హాస్టళ్లలో రాత్రి బస చేశారు. అందులో భాగంగానే అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ సింగూర్ గురుకుల పాఠశాలలో బసచేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ నిర్వహణపై మండిపడ్డారు. అసలు హాస్టల్లో పిల్లలు ఇలాగే ఉంటారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ వెల్పేర్ గురుకుల పాఠశాలల కన్వీనర్ కొండల్‌రావును హాస్టల్ వద్దకు పిలిపించి వాస్తవ పరిస్థితిని వివరించారు. -
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఖబడ్దార్..!
- విలేకరులకు బాబూమోహన్ అనుచరుల హెచ్చరిక - రూ. 50వేలు ఇచ్చినట్లు నేను చెప్పలేదు - కాంట్రాక్టర్ రవీందర్‌గౌడ్ సంగారెడ్డి మున్సిపాలిటీ: అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్‌పై వ్యతిరేక కథనాలు రాస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని టేక్మాల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు యూసుఫ్, అల్లాదుర్గం మండల పరిషత్ ఉపాధ్యక్షుడు భిక్షపతి విలేకరులను హెచ్చరించారు. కొందరు పనిగట్టుకొని ఎమ్మెల్యేపై అసత్య కథనాలు రాస్తున్నారని, ఇకపై అలాంటివార్తలు వస్తే సహించేది లేదన్నారు. ఇటీవల జేఎన్టీయూలో విద్యార్ధులకు, మెస్ కాంట్రాక్టర్ మధ్య వివాదం జరిగి, నెలకు రూ. 50 వేలు ఎమ్మెల్యేకు కాంట్రాక్టర్ ఇస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ కథనాన్ని ఖండించేందుకు మెస్ కాంట్రాక్టర్ రవీందర్‌గౌడ్ గురువారం సంగారెడ్డిలోని ఐబీ అతిథి గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవీందర్‌గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ వార్తలు రాస్తారా.. అంటూ మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే ఆదేశాల మేరకే మెస్ కాంట్రాక్టు కోసం టెండర్ వేశానని ఇందులో ఎమ్మెల్యేకు మామూళ్లు ఇస్తున్న వచ్చిన ఆరోపణలు నిరాధారమన్నారు. నిబంధనల ప్రకారమే మెస్ కాంట్రాక్టు తీసుకున్నానన్నాన్నారు. టెండర్ సమయంలో ఐదుగురు దరఖాస్తులు తీసికెళ్లినా ఎవరూ వేయలేదని, దీంతో ఎమ్మెల్యే తనను వేయమని కోరితే టెండర్ వేశానన్నారు. తాను ఎమ్మెల్యేకు నెలకు రూ.50 వేలు ఇస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తాను అన్నట్లు నిరూపిస్తే జేఎన్టీయూ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానన్నారు. -
పింఛన్ అడిగితే దౌర్జన్యం చేశారు
♦ బాబూమోహన్‌కు వ్యతిరేకంగా జోగిపేటలో రాస్తారోకో ♦ ఎమ్మెల్యే ఎవరిపై దౌర్జన్యం చేయలేదు: ఎస్సై జోగిపేట : పింఛన్ అడిగిన కాంగ్రెస్ కార్యకర్తపై ఎమ్మెల్యే బాబూ మోహన్, ఆయన అనుచరుడు దౌర్జన్యం చేశారని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జోగిపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శివరాజ్ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోమవారం మండల పరిధిలోని నేరడిగుంట పంచాయతీ పరిధిలోని మక్తగూడెం వద్ద మిషన్ కాకతీయ పనులను బాబూమోహన్ ప్రారంభించి వెళుతుండగా నేరడిగుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త నర్సింలు ఎమ్మెల్యే వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించడంతో ఈ వివాదం తలెత్తినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట రాస్తారోకో చేపట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి రాస్తారోకోను విరమింపజేశారు. అంతకు ముందు దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సింలును మాజీ ఎంపీపీ అధ్యక్షుడు హెచ్.రామాగౌడ్, మాజీ ఎంపీటీసీ మల్లయ్య, హరికృష్ణ తదితరులు పరామర్శించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అనిల్‌రెడ్డి, నేరడిగుంట, మాసానిపల్లి గ్రామాల ఉప సర్పంచ్‌లు ప్రతాప్‌రెడ్డి, కృష్ణ, మాజీ మార్కెట్ డెరైక్టర్ భూమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ విషయమై స్థానిక ఎస్సై వివరణ ఇస్తూ ఎమ్మెల్యే ఎవరిపై దౌర్జన్యం చేయలేదని, నర్సింలు ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా తాము అతడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. -
40 వేల ఎకరాలకు సాగునీరు
- ఎమ్మెల్యే బాబూమోహన్ - నేరడిగుంటలో మిషన్ కాకతీయ పనులు ప్రారంభం జోగిపేట: నియోజకవర్గంలోని 40వేల ఎకరాలకు సింగూరు జలాలను అందించి తీరుతామని అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. సోమవారం అందోలు మండలం నేరడిగుంట పంచాయతీ పరిధిలోని మక్తగూడెం చెరువులో మిషన్ కాకతీయ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ సేద్యానికి నీరందించేందుకు అవసరమైన పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు అధ్యక్షతన ఉన్నత స్థాయి ఇరిగేషన్ అధికారులతో పనుల విషయమై సమీక్షించారన్నారు. చెరువు పూడికతీత పనులను రాజకీయాలకు అతీతంగా, ఐక్యంగా గ్రామస్తులంతా కలిసి పూర్తయ్యేలా సహకరించాలని కోరారు. చెరువులు బాగుంటేనే ఊరు బాగుంటుందని, చెరువులో నీరుంటే చేతివృత్తుల వారికి కూడా పని దొరుకుతుందన్నారు. మక్తగూడెం చెరువుకు ప్రభుత్వం రూ.25 లక్షలు మంజూరు చేసిందని, అవసరమైతే నిధులను పెంచేందుకు మంత్రి హరీష్‌రావుతో మాట్లాడతానన్నారు. చెరువు అలుగు, తూములను కూడా మరమ్మతు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పూడిక తీసిన మట్టిని పొలాల్లో వేసుకోవాలని, మిగతా మట్టిని గ్రామంలోని గుంతలు పూడ్చడం, పాడుపడిన బావులను పూడ్చడం, రోడ్లు వేసుకోవడం వంటి పనులకు వినియోగించుకోవాలన్నారు. పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే, మాజీ ఎంపీ మక్తగూడెం చెరువులో మిషన్ కాకతీయ పనులను సోమవారం ప్రారంభించారు. చెరువు వద్దకు ఎమ్మెల్యే బాబూమోహన్, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డితో పాటు నాయకులు, కార్యక ర్తలు, అధికారులు, గ్రామస్తులు కాలినడకన వెళ్లారు. చెరువు వద్ద పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మెల్యే గడ్డపారతో మట్టి తవ్వితీసి తట్టల్లో నింపి ట్రాక్టర్లో పోశారు. అనంతరం జేసీబీ నడిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు ఖాదిరాబాద్ రమేశ్, తహశీల్దార్ నాగేశ్వర్రావు, ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ జలంధర్, ఏఈ బాలగణేష్, సర్పంచ్ కిష్టయ్య, ఎంపీటీసీ సంగమేశ్వర్, నగర పంచాయతీ అధ్యక్ష, కార్యదర్శులు డీబీ నాగభూషణం, గోపాల్, పార్టీ సీనియర్ నాయకులు లింగాగౌడ్, కౌన్సిలర్ శ్రీకాంత్, పి.లక్ష్మణ్ పాల్గొన్నారు. -
‘మద్దతు’నిస్తాం
* రైతులకు అండగా ఉంటాం * జిల్లాలో 175 వరి, 70 మక్క కొనుగోలు కేంద్రాలు * నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు జోగిపేట: ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా 175 వరి, 70 మక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆరు పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే బాబూమోహన్ కోరిక మేరకు అందోలు నియోజకవర్గంలోని జోగిపేట, వట్పల్లి మార్కెట్లలో పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బుధవారం ఆయన జోగిపేటలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, ఒకవేళ రైతుకు మద్దతు ధర దక్కకపోతే ప్రభుత్వమే ఆ రైతుకు మద్దతు ధరకు ఎంతతక్కువైతే అంత మొత్తం ఇస్తుందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ నిధి కూడా ఏర్పాటు చేసే యోచనలో సీఎం ఉన్నారని తెలిపారు. టీఆర్ఎస్ సర్కార్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. అందువల్లే రుణమాఫీ అమలు చేయడంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ కూడా అందించామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.700 కోట్ల కొత్త రుణాలను రైతులకు మంజూరు చేయించామని, త్వరలోనే మరో రూ.200 కోట్ల రుణాలను మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అంతేకాకుండా చిన్న, సన్నకారు రైతులకు 80 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందించేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటోందన్నారు. షేడ్నెట్లు వేసుకొని కూరగాయలు పండించుకునేందుకు వీలుగా 50 శాతం సబ్సిడీతో నెట్లను అందజేయనున్నట్లు వివరించారు. జోగిపేట వ్యవసాయ మార్కెట్లో మరుగుదొడ్ల నిర్మా ణం, సీడ్ గోడౌన్ పనులను రూ.40 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. రాహుల్ బొజ్జా డైనమిక్ కలెక్టర్ జిల్లాలో రైతు రుణమాఫీ, రైతులకు కొత్త రుణాల మంజూరు విషయంలో జిల్లా కలెక్టర్ బొజ్జా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, ఆయన డైనమిక్ కలెక్టర్ అని మంత్రి అభివర్ణించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా కలెక్టర్ బ్యాంకర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎంపీ పి.మాణిక్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎంపీపీ అధ్యక్షురాలు విజయలక్ష్మి, ఉపాధ్యాక్షులు రమేశ్, డీసీసీబీ మాజీ ఉపాధ్యాక్షులు పి.జైపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జి.లింగన్న, నాగభూషణం, వర్తక సంఘం అధ్యక్షులు ఎం.మల్లికార్జున్, మార్కెటింగ్ ఏడీఎం ఎస్ఎఫ్ హమీద్, జోగిపేట మార్కెట్ సెక్రటరీ నాగేశ్వరరావు, జహీరాబాద్ మార్కెట్ సెక్రటరీ శివరామ శాస్త్రి, తహ శీల్దాదారు నాగేశ్వరరావు, సర్పంచ్‌లు బీరప్ప, కాళీదాస్ గౌడ్, మాజీ సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్, నాయకులు సీహెచ్. వెంకటేశం, ఏ.శ్రీకాంత్, నాగరత్నంగౌడ్, అనిల్, సత్తిబాబు, సార శ్రీధర్, అ నిల్రాజ్, మాణిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ నిజమైన రైతు బిడ్డ కరువు మంత్రిగా, రవాణా మంత్రిగా, 14 ఏళ్లు ఉద్యమకారుడిగా, ప్రస్తుతం సీఎంగా ఉన్నప్పటికీ కేసీఆర్ ఎప్పుడూ వ్యవసాయాన్ని విస్మరించలేదని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆయన ఎప్పుడు ఏ హోదాలో ఉన్నా, తాను రైతునన్న విషయాన్ని ఎప్పుడూ మరచిపోరన్నారు. అందువల్లే సీఎంగా ఉండి కూడా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవళ్లిలోని తన ఫాంహౌస్‌లో వ్యవసాయం చేస్తున్నాడన్నారు. అందువల్ల సీఎంకు రైతుల సమస్యలు తెలుసుననీ, తప్పకుండా రైతులకు న్యాయం చేస్తారన్నారు.