ఎమ్మెల్యే బాబుమోహన్‌పై ఆగ్రహం | people fires on MLA babumohan | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే బాబుమోహన్‌పై ఆగ్రహం

Published Tue, Aug 23 2016 6:06 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

ఎమ్మెల్యే బాబూమోహన్‌ దిష్టిబొమ్మ దహనం

ఎమ్మెల్యే బాబూమోహన్‌ దిష్టిబొమ్మ దహనం

  • రేగోడ్‌ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపకపోవడంపై ఆగ్రహం
  • ఉవ్వెత్తున నిరసనగ సెగ.. ఎమ్యెల్యే దిష్టిబొమ్మకు శవయాత్ర
  • విద్యార్థులతో ర్యాలీ, మానవహారం
  • రేగోడ్‌: ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డ్రాప్ట్‌లో రేగోడ్‌ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలిపారు. తాజాగా సోమవారం వెలువడిన డ్రాప్ట్‌ నోటిఫికేషన్‌లో రేగోడ్‌ మండలాన్ని మెదక్‌ జిల్లాలోనే ఉంచినట్లు సర్కారు అధికారికంగా ప్రకటించింది. అందోల్‌ ఎమ్యెల్యే బాబూమోహన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాత్రికిరాత్రి సంగారెడ్డి నుంచి తప్పించి మెదక్‌ జిల్లాలో చేర్చినందుకు మండలంలో మంగళవారం నిరసన సెగ ఉవ్వెత్తున ఎగిసి పడింది.

    అఖిలపక్షం నేతలు, యువజన సంఘాలు, ప్రజలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, దుకాణాలను బంద్‌ చేయించారు. జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ ఇక్కడి ప్రజల ఆకాంక్షను.. ప్రజాభిష్టాన్ని గౌరవించి రేగోడ్‌ను సంగారెడ్డి జిల్లాలో కలిపితే.. బాబూమోహన్‌ మాత్రం రేగోడ్‌ మండాలన్ని మెదక్‌ జిల్లాలో చేర్చారని మండిపడుతూ బాబూమోహన్‌ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు.

    డప్పులతో ఊరేగించి బస్టాండ్‌లో బాబూమోహన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అఖిలపక్షం నేతలు నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మున్నూరు కిషన్, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రతాప్‌ రమేశ్‌జ్యోషి, వట్‌పల్లి మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఎస్‌.దిగంబర్‌రావు, దేవునూర్‌ సర్పంచ్‌ (మాజీ జెడ్పీటీసీ) జానయ్య, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు అనీల్‌కుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు పూర్ణచందర్‌ విలేకరులతో మాట్లాడారు.

    మండలానికి మంచి చేయకపోయినా పరవాలేదు.. కానీ చెడుమాత్రం చేయొద్దని కోరారు. 23 రోజుల దీక్షల ఫలితం.. కలెక్టర్‌ కృషి కారణంగా ముందుగా రేగోడ్‌ మండలం సంగారెడ్డి జిల్లాలో చేర్చారని చెప్పారు. ఆ ప్రకటనతో ప్రజలంతా సంబురపడుతున్న సమయంలో ఎమ్యెల్యే రాత్రికిరాత్రి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సంగారెడ్డి జిల్లాలో ఉన్న రేగోడ్‌ మండలాన్ని మెదక్‌ జిల్లాలో చేర్చారని ధ్వజమెత్తారు. నారాయణఖేడ్‌ ఎమ్యెల్యే భూపాల్‌రెడ్డి ప్రజాభీష్టం మేరకు నారాయణఖేడ్‌ను సంగారెడ్డి జిల్లాలో కలుపుతూ ఖేడ్‌ను రెవెన్యూ కేంద్రంగా చేసుకోవడంలో సఫలీకృతుడయ్యాడని చెప్పారు.

    ఇక్కడి ప్రజలంతా సంగారెడ్డి జిల్లాలో ఉంచాలని, 7 కిలో మీటర్ల దూరంలోని ఖేడ్‌ రెవెన్యూ డివిజన్‌లోనే ఉంటామని ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేసి, రేగోడ్‌లో దీక్షలు చేసినా బాబూమోహన్‌ మాత్రం ప్రజాభీష్టానికి విరుద్ధంగా 60 కిలో మీటర్ల దూరంలోని మెదక్‌ జిల్లా, రెవెన్యూ డివిజన్‌లో చేర్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    యువత ఉపాధికి వెన్నుముకలా ఉన్న సంగారెడ్డి జిల్లా నుంచి తప్పించి ఎలాంటి ఉపాధి అవకాశాలు లేని మెదక్‌ జిల్లాలో రేగోడ్‌ను ఉంచడం దారుణమన్నారు. సంగారెడ్డి జిల్లాలో మండలాన్ని చేర్చగానే కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు బాబూమోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారాని.. ఇపుడు మెదక్‌లో ఉండటంపై ప్రజలకు ఏ సమాధానం చెప్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎమ్యెల్యే తీరును టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వ్యతిరేకించారని, మిగతా నాయకులు ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు.

    ప్రజలతో ఓట్లు వేయించుకున్న ఎమ్యెల్యే, టీఆర్‌ఎస్‌ మండల నాయకులు వారి ఆకాంక్షýను గౌరవించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం చేతగాకపోతే పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామన్నారు. రేగోడ్‌ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలుపుతూ, ఖేడ్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

    ఇందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి సహకరించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని.. న్యాయపోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. కార్యక్రమంలో కొండాపురం సర్పంచ్‌ గంజి సంగమేశ్వర్, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ రాధాకిషన్, ఉప సర్పంచ్‌లు నర్సింహులు, తూర్పు మాణయ్య, మైనార్టీ మండల నాయకుడు చోటుబాయ్, వికలాంగుల సంఘం మండల అధ్యక్షుడు మహబూబ్, ఉన్నత పాఠశాల చైర్మన్‌ అక్బర్, మాజీ సర్పంచ్‌ పండరి, నాయకులు నారాయణ, పూల్యానాయక్, రామాగౌడ్, జయరావు, పీర్యానాయక్, రాములు, జి.శంకరప్ప, రాజుసాగర్, జ్ణాణేశ్వర్, సుధాకర్, కషి, రాములు, కల్లేటి శ్రీధర్‌గుప్తా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement