regode mandal
-
టైమ్ 11 దాటినా పత్తాలేని తహసీల్దార్..
సాక్షి, మెదక్ : పరిపాలన వ్యవస్థ సక్రమంగా నడవాలంటే అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఏ ప్రభుత్వానికైనా మంచిపేరు రావాలంటే అధికారుల కృషి ఉండాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం తరచూ సమయపాలన పాటించకపోవడం పట్ల ప్రజలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన రేగోడ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11గంటలు దాటినా కార్యాలయంలో కేవలం ధరణి కంప్యూటర్ ఆపరేటర్, ఒక వీఆర్ఏ మాత్రమే విధుల్లో ఉన్నారు. దీంతో అక్కడే తహసీల్దార్ కోసం పడిగాపులు కాసిన రైతులు, ప్రజలు విలేకరులకు సమాచారం అందించారు. విలేకరులు వెల్లి చూడగా తహసీల్దార్‌తో పాటు పలువురు అందుబాటులో లేరు. తరచూ సమయపాలన పాటించడం లేదని పలువురు వాపోయారు. గతంలో అధికారుల గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా అధికారుల తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలనెలా వేలరూపాయలు వేతనం తీసుకుంటున్నా విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భూమి మార్పు విషయంలో అడిగిన డబ్బులు ఇచ్చినా ఓ అధికారి, వీఆర్ఓ పనిచేయకుండా తిప్పించుకుంటున్నారని మర్పల్లి గ్రామానికి చెందిన ఒకరు తెలిపారు. మారుమూల మండలంలోని రేగోడ్పై జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆడిందే ఆటగా పాడిందే పాటగా నడిపిస్తున్నారని ఆరోపించారు. కార్యాలయానికి వెల్లే సన్నిహితులకు ప్రాధాన్యత ఇస్తూ సామాన్యులను పట్టించుకోకపోవడం ఏమిటోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోని ఇబ్బందులు తప్పించాలని పలువురు కోరుతున్నారు. చదవండి: ఏంది స్వామి 20 లక్షలు అలా కాల్చినావ్ జిల్లా కేంద్రంలో ఏసీపీ హల్చల్ రెండేళ్లుగా తిరుగుతున్నా మా తాత పేరున ఉన్న 133అ సర్వే నంబరులో ఎకరా మూడుగుంటలనర భూమికి తొమ్మిది గుంటలు భూమి మాత్రమే ఆన్లైన్లో చూపిస్తుంది. మిగతా భుమిని ఆన్లైన్లో పెట్టాలని అధికారులను తరచూ కోరుతున్నా. గత సంవత్సరం కార్యాలయంలోని ఓ అధికారికి, వీఆర్ఓకు డబ్బులు ఇచ్చినా భూమిని సరిచేయలేదని, మా తాతపేరుపై ఉన్న భూమిని మా నాన్న పేరున చేయడం లేదు. రోజూ తిరుగుతున్నా పని కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నా. – అనిల్, మర్పల్లి ఫిర్యాదు చేసినా మారడం లేదు తహసీల్దార్‌తో పాటు సిబ్బంది సమయానికి రావడం లేదు. ఈ విషయమై ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినా అధికారి, సిబ్బందిలో మార్పు రావడం లేదు. ఇక్కడి అధికారుల తీరువల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. – నాగయ్య స్వామి, సిందోల్ ఒక్కోసారి ఆలస్యం అవుతుంది.. ఒక్కోసారి ఆలస్యం అవుతుంది. కానీ ముందుగానే వస్తున్నాం. ఆఫీసుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సేవలు అందిస్తున్నాం – సత్యనారాయణ, తహసీల్దార్ -
మంగ్లీ ‘తీజ్’ మార్
సాక్షి, మెదక్ : యాంకర్‌గా.. సింగర్‌గా మంగ్లీ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. టీవీల్లో మాత్రమే కనిపించే మంగ్లీ ఒక్కసారిగా మనదగ్గరకే వచ్చిందంటే ఇంకేముంది.. పట్టరాని సంతోషంతో పరుగులు పెట్టాల్సిందే. సింగర్ మంగ్లీ ‘తీజ్’ పాట చిత్రీకరణ కోసం మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని రాయిలొంక తండాకు తనబృందంతో శనివారం చేరుకున్నారు. ఎత్తైన గుట్టలు.. పచ్చని చెట్లు.. స్వచ్ఛమైన ప్రకృతి మధ్యన షూటింగ్ చేశారు. లంబాడ వేషధారణలో తీజ్ సాంగ్‌ను చిత్రీకరించారు. మెదక్ జిల్లాలోనే మారుమూల మండలం రాయిలొంక తండాకు ఆమె రాకతో ఆయా తండాల వాసులు, గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. -
బిందాస్ ‘బస్వన్న’
రేగోడ్(మెదక్): అది మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని ఎంపీపీ చాంబర్. స్థానిక ఎంపీడీఓ బస్వన్నప్ప శుక్రవారం ఉదయం 11 గంటలకు తాపీగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. వచ్చీరాగానే ఎంపీపీ చాంబర్లోకి వెళ్లి టేబుల్‌పై ఇలా పడకేశారు. హాయిగా దినపత్రిక చదువుతూ కాలక్షేపం చేశారు. 11.19 గంటలకు మండల పరిషత్ కార్యాలయానికి ‘సాక్షి’ చేరుకోగా ఎంపీడీఓ చాంబర్‌కు గడియ పెట్టి ఉంది. ఎక్కడికి వెళ్లారని ఆరా తీయగా ఎంపీపీ చాంబర్లో ఉన్నారని తెలిసింది. 11:20 గంటలకు ఎంపీపీ చాంబర్ తలుపు తీసి చూడగా.. ఎంపీడీఓ బస్వన్నప్ప ఇదిగో ఇలా కనిపించారు. వివిధ పనుల నిమిత్తం అక్కడికి వచ్చిన వారంతా ఇది చూసి ముక్కున వేలేసుకున్నారు. అధికారి నిర్వాకాన్ని ‘సాక్షి’తన కెమెరాలో క్లిక్‌మనిపించగా, ఎంపీడీఓ టేబుల్‌పై నుంచి లేస్తూ.. ‘మీరిలా ఫొటో తీయడం మంచిది కాదు. నాకు ఆరోగ్యం బాగా లేక పడుకున్నా’అని దాటవేసే ప్రయత్నం చేశారు. -
ఉనికి కోల్పోతున్న రేగోడ్ మండలం
మండలంపై ప్రభుత్వం కక్షసాధింపు నిబంధనలకు విరుద్ధంగా పునర్విభజన మండలానికి ఉండాల్సిన జనాభా 35 వేలు ప్రస్తుతం 22 వేలే.. న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్న ప్రజానీకం రేగోడ్: ఏ ప్రభుత్వమైనా పాలనాపరంగా పారదర్శకంగా... నిస్పక్షపాతంగా వ్యవహరించాలి. ఆంధ్రోళ్లు, నీళ్లను... ఉద్యోగాలను దోచేసుకుంటున్నారని.. మన తెలంగాణ మనకు వస్తే సమస్యలేమీ ఉండవని గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ 14 సంవత్సరాలుగా ఉద్యమాన్ని తన భుజాన వేసుకుని ఉద్యమాలు చేశారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టారు. బంగారు తెలంగాణలో బంగారు భవిషత్ ఉంటుందని కలలుగన్న ప్రజలకు నిరాశే మిగులుతోంది. జిల్లాలు.. మండలాల పునర్విభజనలో తెలంగాణ సర్కారు తీరుపై మండలానికి తీరని అన్యాయం జరిగిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పునర్విభజన చేశారని ఆరోపిస్తున్నారు. న్యాయ పోరాటనికి సిద్ధమవుతున్నారు రేగోడ్ మండల ప్రజలు. దివంగత సీఎం ఎన్టీఆర్ 1985 సంవత్సరంలో మండలాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. దేవునూరు రెవెన్యూ సర్కిల్‌గా ఉండేది. సర్కిల్‌గా ఉన్న దేవునూరు గ్రామాన్ని మండల కేంద్రం హోదా కల్పించాలని అప్పట్లో స్థానికులు ఒత్తిడి తెచ్చారు. రేగోడ్ గ్రామానికి చెందిన కల్లేటి రాజేశ్వర్ గుప్తా తనకున్న పలుకుబడితో దేవునూరు కాకుండా రేగోడ్‌ను మండల కేంద్రం చేయించారు. రేగోడ్ మండలంలో 19 గ్రామ పంచాతీలున్నాయి. ఇందులో ఇప్పటి వరకు 25 గ్రామాలు, 36,167 జనాభా ఉంది. రేగోడ్ మండలం ఏర్పాటు కావడంతో ఖాదిరాబాద్, ఉసిరికపల్లి, నిర్జప్ల, సాయిపేట, దరఖాస్తుపల్లి, దేవునూరు, మేడికుంద పంచాయతీల ప్రజలు 30 కిలో మీటర్లు రేగోడ్ మండలానికి రావాలంటే గత 30 సంవ్సరాలకుపైగా ఇబ్బందులు పడ్డారు. వట్పల్లిలో ఏడు పంచాయతీలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునర్విభజనలో నూతనంగా అల్లాదుర్గం మండలంలోని వట్పల్లిని మండల కేంద్రం చేశారు. రేగోడ్ మండలంలోని దేవునూరు గ్రామ పంచాయతీలో 3,592 జనాభా, ఉసిరికపల్లిలో 1,482 జనాభా, నిర్జప్లలో 1,017 జనాభా, మేడికుందలో 1,604 జనాభా, దుద్యాలలో 1,733 జనాభా, ఖాదిరాబాద్‌లో 3,313 జనాభా, సాయిపేటలో 893 జనాభా ఉంది. ఈ గ్రామాలు వట్పల్లి మండలంలో విలీనం కానున్నాయి. ఈ గ్రామ పంచాయతీల్లో మొత్తం 13,634 జనాభా మాత్రమే ఉంది. రేగోడ్‌కు మిగిలింది 22 వేల జనాభా ప్రస్తుతమున్న రేగోడ్ మండలంలోని రేగోడ్‌లో 3,732 జనాభా, చౌదర్పల్లిలో 1,473 జనాభా, మర్పల్లిలో 2,338 జనాభా, కొత్వాన్‌పల్లిలో 1,471 జనాభా, జగిర్యాలలో 1,020 జనాభా, ఆర్.ఇటిక్యాలలో 1,529 జనాభా, దోసపల్లిలో 2,251 జనాభా, కొండాపురంలో 1,727 జనాభా, ప్యారారంలో 1,077 జనాభా, టి.లింగంపల్లిలో 1,412 జనాభా, సిందోల్లో 2,200 జనాభా, గజ్వాడలో 2,303 జనాభా ఉంది. 22,533 జనాభా మాత్రమే మిగలనుంది. పూర్తిస్థాయి రేగోడ్ మండలం 156 చదరపు కిలో మీటర్లలో విస్తరించి ఉంది. ప్రస్తుతం 81 చదరపు కిలో మీటర్లు మాత్రమే ఉండబోతోంది. రేగోడ్ మండలాన్ని నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్లో కలపాలని ఆందోళనలు చేశారు. ప్రభుత్వానికి రెండువేల మంది ప్రజానీకం విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయింది. రేగోడ్ మండలానికి జరిగిన అన్యాయంపై ఇక్కడి ప్రజలు.. ప్రజాప్రనిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. బాబూమోహన్ ఉప ఎన్నికలో రేగోడ్‌కు కేసీఆర్ అందోల్ నియోజకవర్గానికి 1998లో ఉప ఎన్నిక జరిగింది. హాస్యనటుడు బాబూమోహన్‌ను అందోల్ ఎమ్యెల్యే అభ్యర్థిగా బరిలో దింపారు. అప్పటి కార్మిక శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉప ఎన్నికలో ప్రచారం నిమిత్తం రేగోడ్ మండలానికి వచ్చారు. రేగోడ్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని నాడు కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఆయన సీఎంగా ఉండగానే రేగోడ్ మండలం తన అస్తిత్వాన్ని కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేగోడ్ మండలం నుంచి వట్పల్లిలో పలు గ్రామాలను కలపడాన్ని ఇక్కడి ప్రజలు తప్పుబట్టడం లేదు. 35 వేల జనాభాకంటే తక్కువగా 22 వేలు ఉంచడం... నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్లో రేగోడ్ మండలాన్ని ఉంచాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాభిప్రాయాలను పరిగణణలోకి తీసుకుంటామని ఓ పక్కన సీఎం పదేపదే చెబుతున్నా ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా విభజన చేస్తున్నారు. రాజకీయ అవసరాల కోసమే ఇష్టానుసారంగా మండలానికి తీరని అన్యాయం చేస్తున్నారని అన్ని వర్గాల ప్రజలు.. ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ప్రజల అభిప్రాయాలను సీఎం కేసీఆర్ దృష్టికి పోకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఐదు గ్రామాలను అందోల్ కలిపిన దామోదర రేగోడ్ మండలంలో గతంలో ఆరు గ్రామాలు, మూడు తండాలు మెదక్ నియోజకవర్గంలో ఉండేవి. పరిపాలనా సౌలభ్యం కోసం 2009లో అప్పటి మంత్రి దామోదర రాజనర్సింహ ఆ గ్రామాలు, తండాలను అందోల్ నియోజకవర్గంలో కలిపారు. ప్రస్తుతం పరిపాలనా సౌలభ్యమంటూ పునర్విభజన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్‌ను కాదని 65 కిలోమీటర్ల దూరంలోని మెదక్‌లో రేగోడ్ మండలాన్ని కలపడం ఎంత వరకు న్యాయమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీ కోన్యాయం.. మా కోన్యాయమా..? ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజలు, మేధావులు, యువకులు, అన్ని కుల సంఘాలు, ఉద్యోగులు ధర్నాలు, రాస్తారోకోలు, బందులు చేశారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తమ ప్రాంతం తమకు కావాలని టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు ఎలా ఆందోళనలు చేశారో? రేగోడ్ మండల ప్రజలు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్లో తమను చేర్చాలని ఆందోళనలు చేశారు. అందోల్ ఎమ్యెల్యే బాబూమోహన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళనలు చేసినందుకే పాలకులు మండలాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మెదక్‌లోనే ఉంచడం.. మండలంలో 35 వేలకంటే తక్కువ 22 వేల జనాభాకే పరిమితం చేయడంపై ప్రజలు.. ఆయా పార్టీల నాయకులు మండిపడుతున్నారు. మీరు ఉద్యమం చేస్తే న్యాయం.. మేం ఉద్యమం చేస్తే వ్యతిరేకమా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీర్, మంత్రి హరీశ్‌రావు స్పందించి రేగోడ్ మండలానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
ఎమ్మెల్యే బాబుమోహన్‌పై ఆగ్రహం
రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపకపోవడంపై ఆగ్రహం ఉవ్వెత్తున నిరసనగ సెగ.. ఎమ్యెల్యే దిష్టిబొమ్మకు శవయాత్ర విద్యార్థులతో ర్యాలీ, మానవహారం రేగోడ్: ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డ్రాప్ట్‌లో రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలిపారు. తాజాగా సోమవారం వెలువడిన డ్రాప్ట్ నోటిఫికేషన్లో రేగోడ్ మండలాన్ని మెదక్ జిల్లాలోనే ఉంచినట్లు సర్కారు అధికారికంగా ప్రకటించింది. అందోల్ ఎమ్యెల్యే బాబూమోహన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాత్రికిరాత్రి సంగారెడ్డి నుంచి తప్పించి మెదక్ జిల్లాలో చేర్చినందుకు మండలంలో మంగళవారం నిరసన సెగ ఉవ్వెత్తున ఎగిసి పడింది. అఖిలపక్షం నేతలు, యువజన సంఘాలు, ప్రజలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, దుకాణాలను బంద్ చేయించారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఇక్కడి ప్రజల ఆకాంక్షను.. ప్రజాభిష్టాన్ని గౌరవించి రేగోడ్‌ను సంగారెడ్డి జిల్లాలో కలిపితే.. బాబూమోహన్ మాత్రం రేగోడ్ మండాలన్ని మెదక్ జిల్లాలో చేర్చారని మండిపడుతూ బాబూమోహన్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. డప్పులతో ఊరేగించి బస్టాండ్‌లో బాబూమోహన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అఖిలపక్షం నేతలు నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మున్నూరు కిషన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతాప్ రమేశ్‌జ్యోషి, వట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.దిగంబర్‌రావు, దేవునూర్ సర్పంచ్ (మాజీ జెడ్పీటీసీ) జానయ్య, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు అనీల్‌కుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు పూర్ణచందర్ విలేకరులతో మాట్లాడారు. మండలానికి మంచి చేయకపోయినా పరవాలేదు.. కానీ చెడుమాత్రం చేయొద్దని కోరారు. 23 రోజుల దీక్షల ఫలితం.. కలెక్టర్ కృషి కారణంగా ముందుగా రేగోడ్ మండలం సంగారెడ్డి జిల్లాలో చేర్చారని చెప్పారు. ఆ ప్రకటనతో ప్రజలంతా సంబురపడుతున్న సమయంలో ఎమ్యెల్యే రాత్రికిరాత్రి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సంగారెడ్డి జిల్లాలో ఉన్న రేగోడ్ మండలాన్ని మెదక్ జిల్లాలో చేర్చారని ధ్వజమెత్తారు. నారాయణఖేడ్ ఎమ్యెల్యే భూపాల్‌రెడ్డి ప్రజాభీష్టం మేరకు నారాయణఖేడ్‌ను సంగారెడ్డి జిల్లాలో కలుపుతూ ఖేడ్‌ను రెవెన్యూ కేంద్రంగా చేసుకోవడంలో సఫలీకృతుడయ్యాడని చెప్పారు. ఇక్కడి ప్రజలంతా సంగారెడ్డి జిల్లాలో ఉంచాలని, 7 కిలో మీటర్ల దూరంలోని ఖేడ్ రెవెన్యూ డివిజన్‌లోనే ఉంటామని ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేసి, రేగోడ్‌లో దీక్షలు చేసినా బాబూమోహన్ మాత్రం ప్రజాభీష్టానికి విరుద్ధంగా 60 కిలో మీటర్ల దూరంలోని మెదక్ జిల్లా, రెవెన్యూ డివిజన్లో చేర్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత ఉపాధికి వెన్నుముకలా ఉన్న సంగారెడ్డి జిల్లా నుంచి తప్పించి ఎలాంటి ఉపాధి అవకాశాలు లేని మెదక్ జిల్లాలో రేగోడ్‌ను ఉంచడం దారుణమన్నారు. సంగారెడ్డి జిల్లాలో మండలాన్ని చేర్చగానే కొందరు టీఆర్ఎస్ నాయకులు బాబూమోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారాని.. ఇపుడు మెదక్‌లో ఉండటంపై ప్రజలకు ఏ సమాధానం చెప్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్యెల్యే తీరును టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వ్యతిరేకించారని, మిగతా నాయకులు ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. ప్రజలతో ఓట్లు వేయించుకున్న ఎమ్యెల్యే, టీఆర్ఎస్ మండల నాయకులు వారి ఆకాంక్షýను గౌరవించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం చేతగాకపోతే పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామన్నారు. రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలుపుతూ, ఖేడ్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి సహకరించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని.. న్యాయపోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. కార్యక్రమంలో కొండాపురం సర్పంచ్ గంజి సంగమేశ్వర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ రాధాకిషన్, ఉప సర్పంచ్‌లు నర్సింహులు, తూర్పు మాణయ్య, మైనార్టీ మండల నాయకుడు చోటుబాయ్, వికలాంగుల సంఘం మండల అధ్యక్షుడు మహబూబ్, ఉన్నత పాఠశాల చైర్మన్ అక్బర్, మాజీ సర్పంచ్ పండరి, నాయకులు నారాయణ, పూల్యానాయక్, రామాగౌడ్, జయరావు, పీర్యానాయక్, రాములు, జి.శంకరప్ప, రాజుసాగర్, జ్ణాణేశ్వర్, సుధాకర్, కషి, రాములు, కల్లేటి శ్రీధర్‌గుప్తా పాల్గొన్నారు. -
ఉన్నా.. లేనట్టే?
నిరుపయోగంగా ప్రయాణ ప్రాంగణాలు పలుచోట్ల నోచుకోని నిర్మాణాలు ఇబ్బందుల్లో ప్రయాణికులు.. పట్టించుకోని అధికారులు రేగోడ్: ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు నేటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు వేస్తున్నా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాణ ప్రాంగణాలను నిర్మించడం లేదు. ప్రయాణం చేయాలంటేనే నరకం కనిపిస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. నిర్మించిన చోట్ల నిరుపయోగంగా కొన్ని ఉంటే.. మరికొన్ని మాత్రం శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అధికారులూ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేగోడ్ మండంలో 19 గ్రామ పంచాయతీల పరిధిలో 25 గ్రామాలున్నాయి. 16 గిరిజన తండాలున్నాయి. పదమూడేళ్ల క్రితం అప్పటి మంత్రి బాబూమోహన్ లక్షలాది రూపాయలు మంజూరు చేయడంతో రేగోడ్‌లో ప్రయాణ ప్రాంగణాన్ని నిర్మించారు. నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో బస్సు సర్వీసులు పలుమార్లు ప్రయాణ ప్రాంగణానికి వచ్చి వెళ్లాయి. తరువాత ఈ ప్రాంగణంలోకి బస్సులు రావడం లేదు. ప్రస్తుతం ఈ బస్టాండ్ గొడవలు పడినవారికి పంచాయితీలు నిర్వహించేందుకు, పశువులను కట్టేయడానికి మాత్రం ఉపయోగపడుతోంది. ప్రయాణ ప్రాంగణం శిథిలావస్థకు చేరుకుంటోంది. పోచారం గ్రామంలో ఇటీవల నిర్మించిన బస్‌షెల్టర్‌కు కలర్ కూడా వేయలేదు. కనీసం ఉపయోగంలోకి తేవడం లేదు. టి.లింగంపల్లిలో బస్‌షెల్టర్ నామమాత్రంగా వినియోగంలో ఉంది. మర్పల్లి, సిందోల్, గజ్వాడ, గజ్వాడకు వెళ్తుండగా తాటిపల్లి గట్టు మీద, దేవునూర్, మేడికుంద, దోసపల్లి, ప్యారారం, దుద్యాల, జగిర్యాల, బురాన్వాడి తండా, పెద్దతండా, నిర్జప్ల, ఉసిరికపల్లి, చౌదర్పల్లి, తిమ్మాపురం తదితర గ్రామాల్లో బస్షెల్టర్లు నిర్మాణానికి నోచుకోవడం లేదు. గ్రామాల నుంచి ఇతర గ్రామాలకు రాకపోకలు సాగించే ప్రజలు బస్సులు, ఆటోలు వచ్చే వరకు ఉండటానికి బస్షెల్టర్లు లేక వర్షాలకు తడస్తూ.. ఎండలకు ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ అధికారులు పూర్తిగా విఫలం చెందారు. చెట్ల కిందనో.. టీ హోటల్లో నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంటోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.