రేగోడ్‌లో శిథిలావస్తకు చేరుకుంటున్న ప్రయాణ ప్రాంగణం
- నిరుపయోగంగా ప్రయాణ ప్రాంగణాలు
- పలుచోట్ల నోచుకోని నిర్మాణాలు
- ఇబ్బందుల్లో ప్రయాణికులు.. పట్టించుకోని అధికారులు
రేగోడ్: ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు నేటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు వేస్తున్నా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాణ ప్రాంగణాలను నిర్మించడం లేదు. ప్రయాణం చేయాలంటేనే నరకం కనిపిస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. నిర్మించిన చోట్ల నిరుపయోగంగా కొన్ని ఉంటే.. మరికొన్ని మాత్రం శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అధికారులూ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రేగోడ్ మండంలో 19 గ్రామ పంచాయతీల పరిధిలో 25 గ్రామాలున్నాయి. 16 గిరిజన తండాలున్నాయి. పదమూడేళ్ల క్రితం అప్పటి మంత్రి బాబూమోహన్ లక్షలాది రూపాయలు మంజూరు చేయడంతో రేగోడ్‌లో ప్రయాణ ప్రాంగణాన్ని నిర్మించారు. నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో బస్సు సర్వీసులు పలుమార్లు ప్రయాణ ప్రాంగణానికి వచ్చి వెళ్లాయి. తరువాత ఈ ప్రాంగణంలోకి బస్సులు రావడం లేదు. ప్రస్తుతం ఈ బస్టాండ్ గొడవలు పడినవారికి పంచాయితీలు నిర్వహించేందుకు, పశువులను కట్టేయడానికి మాత్రం ఉపయోగపడుతోంది.
ప్రయాణ ప్రాంగణం శిథిలావస్థకు చేరుకుంటోంది. పోచారం గ్రామంలో ఇటీవల నిర్మించిన బస్‌షెల్టర్‌కు కలర్ కూడా వేయలేదు. కనీసం ఉపయోగంలోకి తేవడం లేదు. టి.లింగంపల్లిలో బస్‌షెల్టర్ నామమాత్రంగా వినియోగంలో ఉంది. మర్పల్లి, సిందోల్, గజ్వాడ, గజ్వాడకు వెళ్తుండగా తాటిపల్లి గట్టు మీద, దేవునూర్, మేడికుంద, దోసపల్లి, ప్యారారం, దుద్యాల, జగిర్యాల, బురాన్‌వాడి తండా, పెద్దతండా, నిర్జప్ల, ఉసిరికపల్లి, చౌదర్‌పల్లి, తిమ్మాపురం తదితర గ్రామాల్లో బస్‌షెల్టర్లు నిర్మాణానికి నోచుకోవడం లేదు.
గ్రామాల నుంచి ఇతర గ్రామాలకు రాకపోకలు సాగించే ప్రజలు బస్సులు, ఆటోలు వచ్చే వరకు ఉండటానికి బస్‌షెల్టర్లు లేక వర్షాలకు తడస్తూ.. ఎండలకు ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ అధికారులు పూర్తిగా విఫలం చెందారు. చెట్ల కిందనో.. టీ హోటల్లో నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంటోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.