సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ వసతి కల్పించటంతో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అదనంగా 13 లక్షల ప్రయాణికులు పెరగటంతో బస్సులు చాలక ఆర్టీసీకి కొత్త సమస్య ఎదురుకాగా, అది చాలదన్నట్టు ఇప్పుడు మరో ఇబ్బంది తలెత్తింది. బస్సులతోపాటు బస్టాండ్లు కూడా బాగా రద్దీగా మారటంతో ఒక్కసారిగా దొంగల బెడద తీవ్రమైంది.
రోజురోజుకు బస్టాండ్లలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ప్రయాణికుల బ్యాగులు, సెల్‌ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను మాయం చేస్తున్నారు. వీటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులూ పెరుగుతున్నాయి. బస్టాండ్లలో భద్రత ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో పోలీసు రక్షణ కావాలని ఆర్టీసీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.
సొంతంగానే సెక్యూరిటీ..
గతంలో ఆర్టీసీ బస్టాండ్లలో పోలీసు భద్రత ఉండేది. పోలీసు శాఖ హోంగార్డులను కేటాయించింది. కానీ ఆ తర్వాత పోలీసు శాఖలోనే సిబ్బంది కొరత ఏర్పడటంతో వారిని ఉపసంహరించుకుని సొంత అవసరాలకు వాడుకుంటోంది. అప్పటి నుంచి ఆర్టీసీ సొంతంగానే సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటోంది. కానీ డిపోలు, బస్టాండ్లలో నియోగించేంత సంఖ్యలో సిబ్బంది లేరు. ఇప్పుడు కూడా పోలీసు శాఖ నుంచి హోంగార్డులను కేటాయించే పరిస్థితి ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆర్టీసీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రారంభించినట్టు తెలిసింది. ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది.
అన్ని బస్టాండ్లలో సీసీటీవీ కెమెరాలు
దొంగలు రెచ్చిపోతుండటంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. పోలీసుకు ఫిర్యాదు చేస్తే ఆధారాల కోసం వారు సీసీటీవీ ఫుటేజీలు కోరుతున్నారు. కానీ అన్ని బస్టాండ్లలో సీసీటీవీ కెమెరాలు లేవు. ఇటీవల ఎండీ నిర్వహించిన సమావేశంలో అన్ని రీజియన్ల నుంచి దొంగతనాల అంశం చర్చకు వచ్చింది. దీంతో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు కావాలో కూడా అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్లతోపాటు బస్సులు నిలిపే ప్రధాన రోడ్లలోని పాయింట్ల వద్ద కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అన్నిచోట్లా సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు.
60 కొత్త బస్సులు సిద్ధం
మహాలక్ష్మి పథకం అందుబాటులోకి రాకముందే కొన్ని కొత్త బస్సులకు ఆర్టీసీ ఆర్డరిచ్చింది. మార్చి నాటికి 2 వేల బస్సులు రానుండగా తొలివిడతలో 60 బస్సులు సిద్ధమయ్యాయి. ఏసీ, నాన్ ఏసీ స్లీపర్, రాజధాని, ఎక్స్‌ప్రెస్ బస్సులు వీటిల్లో ఉన్నాయి. వీటిని బుధవారమే రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించాల్సి ఉంది. కానీ, ఆ కార్యక్రమం రద్దయింది. మరో రెండుమూడు రోజుల్లో వాటిని ప్రారంభించనున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment