100% మించిన ఆక్యుపెన్సీ రేషియో | TSRTC earns record revenue of Rs 21 crore on Consecutive holidays | Sakshi
Sakshi News home page

100% మించిన ఆక్యుపెన్సీ రేషియో

Published Mon, Dec 25 2023 2:42 AM | Last Updated on Mon, Dec 25 2023 3:53 PM

TSRTC earns record revenue of Rs 21 crore on Consecutive holidays - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తుండటంతో టీఎస్‌ఆర్టీసీ చరిత్రలో తొలిసారి బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో వంద శాతం దాటింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల సంఖ్య పోటెత్తటంతో రికార్డు స్థాయిలో 100.09% ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది.

కి.మీ.కు రూ.65.07 చొప్పున ఆదాయం నమో నమోదైంది. కిలోమీటరుకు నమోదయ్యే ఆదాయం ఆధారంగా ఆక్యుపెన్సీ రేషియోను లెక్కిస్తారు. రెండో శనివారం, ఆదివారం, క్రిస్మస్, బాక్సింగ్‌డే..ఇలా వరుస సెలవులు రావటంతో జనం ఊళ్ల బాట పట్టడంతో శనివారం ఒక్కరోజే 49,00,723 మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. శనివారం తెల్లవారుజాము నుంచే ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండు, ఎల్‌బీనగర్, ఆరాంఘర్, ఉప్పల్‌కూడలి తదితర ప్రాంతాలు జనసంద్రమయ్యాయి. ఒక్క ఎంజీబీఎస్‌ నుంచే దాదాపు నాలుగు లక్షల మంది ప్రయాణించినట్టు అంచనా. 

ఒక్క రోజులో రూ.21.24 కోట్ల ఆదాయం
ఆర్టీసీ బస్సుల్లో సంక్రాంతి, దసరా పండగల సమయాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. పండగ సెలవుల్లో ఎక్కువ మంది ప్రయాణించటం ద్వారా రూ.20 కోట్ల వరకు ఆదాయం నమోదవుతుంది. సాధారణ రోజుల్లో అయితే, సోమవారం రద్దీ ఎక్కువగా ఉండి రూ.18 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. సోమవారం కాకుండా, సంక్రాంతి, దసరా లాంటి పండగ సెలవులు లేనప్పటికీ శనివారం ఏకంగా రూ.21.24 కోట్ల ఆదాయం నమోదు కావటం విశేషం. క్రమంగా జనం పోటెత్తుతుండటంతో బస్సుల సంఖ్యను పెంచటంతోపాటు సిబ్బందిని ముఖ్య ప్రాంతాల్లో ఉంచి మానిటరింగ్‌ చేశారు.

శనివారం ఒక్కరోజే సూపర్‌లగ్జరీ, డీలక్స్, గరుడ, రాజధాని బస్సులు రద్దీగా మారాయి. ఎక్కువ చార్జి ఉండే సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో సీట్లు నిండిపోవటంతో భారీగా ఆదాయం నమోదైంది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్లే ఒక్కో గరుడ బస్సులో ట్రిప్పునకు రూ.లక్షన్నర చొప్పున ఆదాయం లభించింది. దీంతో ఆదాయం గరిష్ట స్థాయిలో నమోదై ఆక్యుపెన్సీ రేషియో పెరిగేందుకు కారణమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement