bus stands
-
‘మహాలక్ష్మి’కి భద్రత!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ వసతి కల్పించటంతో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అదనంగా 13 లక్షల ప్రయాణికులు పెరగటంతో బస్సులు చాలక ఆర్టీసీకి కొత్త సమస్య ఎదురుకాగా, అది చాలదన్నట్టు ఇప్పుడు మరో ఇబ్బంది తలెత్తింది. బస్సులతోపాటు బస్టాండ్లు కూడా బాగా రద్దీగా మారటంతో ఒక్కసారిగా దొంగల బెడద తీవ్రమైంది. రోజురోజుకు బస్టాండ్లలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ప్రయాణికుల బ్యాగులు, సెల్ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను మాయం చేస్తున్నారు. వీటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులూ పెరుగుతున్నాయి. బస్టాండ్లలో భద్రత ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో పోలీసు రక్షణ కావాలని ఆర్టీసీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. సొంతంగానే సెక్యూరిటీ.. గతంలో ఆర్టీసీ బస్టాండ్లలో పోలీసు భద్రత ఉండేది. పోలీసు శాఖ హోంగార్డులను కేటాయించింది. కానీ ఆ తర్వాత పోలీసు శాఖలోనే సిబ్బంది కొరత ఏర్పడటంతో వారిని ఉపసంహరించుకుని సొంత అవసరాలకు వాడుకుంటోంది. అప్పటి నుంచి ఆర్టీసీ సొంతంగానే సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటోంది. కానీ డిపోలు, బస్టాండ్లలో నియోగించేంత సంఖ్యలో సిబ్బంది లేరు. ఇప్పుడు కూడా పోలీసు శాఖ నుంచి హోంగార్డులను కేటాయించే పరిస్థితి ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆర్టీసీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రారంభించినట్టు తెలిసింది. ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది. అన్ని బస్టాండ్లలో సీసీటీవీ కెమెరాలు దొంగలు రెచ్చిపోతుండటంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. పోలీసుకు ఫిర్యాదు చేస్తే ఆధారాల కోసం వారు సీసీటీవీ ఫుటేజీలు కోరుతున్నారు. కానీ అన్ని బస్టాండ్లలో సీసీటీవీ కెమెరాలు లేవు. ఇటీవల ఎండీ నిర్వహించిన సమావేశంలో అన్ని రీజియన్ల నుంచి దొంగతనాల అంశం చర్చకు వచ్చింది. దీంతో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు కావాలో కూడా అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్లతోపాటు బస్సులు నిలిపే ప్రధాన రోడ్లలోని పాయింట్ల వద్ద కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అన్నిచోట్లా సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. 60 కొత్త బస్సులు సిద్ధం మహాలక్ష్మి పథకం అందుబాటులోకి రాకముందే కొన్ని కొత్త బస్సులకు ఆర్టీసీ ఆర్డరిచ్చింది. మార్చి నాటికి 2 వేల బస్సులు రానుండగా తొలివిడతలో 60 బస్సులు సిద్ధమయ్యాయి. ఏసీ, నాన్ ఏసీ స్లీపర్, రాజధాని, ఎక్స్‌ప్రెస్ బస్సులు వీటిల్లో ఉన్నాయి. వీటిని బుధవారమే రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించాల్సి ఉంది. కానీ, ఆ కార్యక్రమం రద్దయింది. మరో రెండుమూడు రోజుల్లో వాటిని ప్రారంభించనున్నట్టు తెలిసింది. -
ఎలాగైనా.. ఊరికి పోవాల్సిందే!
నగర దారులన్నీ పల్లె‘టూరు’ దారి పడుతున్నాయ్. బస్సూ, రైలూ, కారూ, బైకూ.. ఏదైనా సరే ఊరికి పోవడమే లక్ష్యం. ఆదివారం సద్దుల బతుకమ్మ, సోమవారం దసరా పండగ కావడంతో శనివారం పట్నవాసులు పల్లెలకు పయనమయ్యారు. సొంతూరిని ఓసారి మనసారా చూసొద్దామని ఆశగా బయలుదేరారు. నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర బస్టాండ్లు, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. – సాక్షి, స్టాఫ్‌ఫొటోగ్రాఫర్ -
ఉచిత ప్రయాణం... ప్రభుత్వం మా పొట్ట కొడుతోంది...
గౌరిబిదనూరు: ప్రభుత్వం తీసుకువచ్చిన శక్తి యోజన పథకం తమను పూర్తిగా రోడ్డున పడేలా చేసిందని పలువురు ప్రైవేట్ బస్సు యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల వైపే మొగ్గు : గతంలో గ్రామీణ ప్రదేశాలలో నగరానికి ప్రైవేట్ బస్సుల్లోనే ఎక్కువగా ప్రయాణం చేసేవారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని ప్రకటించడంతో ఎంత సేపైనా ఆ బస్సుల కోసం మహిళలు వేచి ఉంటున్నారు. సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి వస్తుందని బస్సుల నిర్వాహకులు చెబుతున్నారు. అమ్ముదామన్నా కొనేవారే లేరు : బస్సులను అమ్మేస్తామన్నా కొనేవారు లేరు. రెండేళ్ల క్రితం కరోనా పూర్తిగా దెబ్బతీసింది. ఇప్పుడు ఊహించని పరిణామం ఎదురైంది. కుటుంబాలను ఎలా పోషించుకోవాలి, సిబ్బందికి జీతాలు ఎలా చెల్లించాలని అని బస్సుల యజమానులు నిరాశలో ఉన్నారు. మూడు నెలలకు రూ.7,952 రోడ్డు ట్యాక్స్ కట్టాలి, ఏడాదికి రూ. 72,202 బీమా ప్రీమియం, ఎఫ్‌సిలు చేయించాలి, వ్యాపారాలే లేకున్నప్పుడు ఇంత మొత్తం ఎలా చెల్లించాలి అంటూ బస్సుల ఆపరేటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధిపై వేటు : కేవలం యజమానులే కాదు బస్టాండ్లలో టికెట్లు ఇచ్చే లోడర్లు, డ్రైవర్, కండక్టర్లు, వారి కుటుంబాలు వీధిన పడాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్దల కాలం నుంచి బస్సులపైనే జీవితాలు నడుస్తున్నాయి. ప్రభుత్వం తాజా నిర్ణయం ట్రావెల్ నిర్వాహకులకు అశనిపాతంలా మారింది. కష్టంగా మారింది మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాలు కల్పించడంతో ప్రైవేట్ బస్సులు ముఖం చూసే వారే కనిపించలేదు, దీంతో ఎలా నెట్టుకు రావాలో అర్థం కావడం లేదు. జీతాలు చెల్లించలేని పరిస్థితి వస్తోంది. – ప్రదీప్, బస్సు యజమాని ఎలా బతకాలి నాలుగైదు బస్టాండ్లలో టికెట్లు విక్రయించి రోజుకు రూ. 200 నుంచి 300 సంపాదించే వారం, ప్రభుత్వం ఇప్పుడు మా పొట్ట కట్టింది. ప్రయాణికులే లేకుంటే మాకు కమీషన్ ఎలా వస్తుంది, కుటుంబాలను ఎలా పోషించాలి. గౌరిబిదనూరు బస్టాండులో 15 మందికిపైగా ఏజెంట్లు ఉన్నారు. – నాగేశ్, బస్ ఏజెంట్ -
త్వరలో ఆర్టీసీ ‘జీవా’జలం!
సాక్షి, హైదరాబాద్: సొంతంగా మంచినీటిని తయారు చేసి బస్టాండ్లలో విక్రయించడంతోపాటు మార్కెట్లోకి కూడా విడుదల చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆకట్టుకునే రీతిలో మంచినీటి సీసా డిజైన్‌ను రూపొందించింది. దీనికి ప్రకాశం, కాంతి అన్న అర్ధంలో వినియోగించే జీవా (జెడ్‌ఐవీఏ) అన్న పేరును ఖరారు చేసింది. దీనికి జీవం అన్న మరో అర్థం కూడా ఉండటం విశేషం. ‘స్ప్రింగ్ ఆఫ్ లైఫ్’అన్న ట్యాగ్‌ను దీనికి జతచేసింది. మరో వారం పది రోజుల్లో ఈ బ్రాండ్ మంచినీటిని ఆర్టీసీ విడుదల చేస్తోంది. తొలుత అన్ని ఆర్టీసీ బస్టాండ్లలో వీటిని అందుబాటులో ఉంచుతారు. ఆ తర్వాత క్రమంగా విస్తరించాలని నిర్ణయించింది. నకిలీలను నియంత్రించి.. ఆర్టీసీ బస్టాండ్లలో ఉండే దుకాణాల్లో మంచినీటి సీసాల విక్రయం విరివిగా సాగుతుంది. అదే వేసవిలో అయితే వాటి వినియోగం చాలా ఎక్కువ. దీంతో దుకాణదారులు రూ.20కి విక్రయించాల్సిన లీటరు నీటి సీసాను రూ.25–30కి అమ్ముతుంటారు. బ్రాండెడ్ పేర్లను పోలిన ‘నకిలీ’కంపెనీ నీళ్లు విక్రయిస్తుంటారు. ఇటీవలే వీటిని నియంత్రించిన ఆర్టీసీ ఇప్పుడు బ్రాండెడ్, ఐఎస్ఐ అధీకృత లోకల్ కంపెనీ నీళ్లు మాత్రమే అందుబాటులో ఉండేలా చేయగలిగింది. ఈ తరుణంలోనే తనే సొంతంగా నీటి విక్రయాలను ప్రారంభించాలన్న ఆలోచనను సాకారం చేసుకుంటోంది. పేటెంట్ కోసం దరఖాస్తు ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా అరలీటరు నీటి సీసాలను అందిస్తోంది. ఇందుకోసం ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక కార్యాలయాలు, ఇతర అవసరాలకు కూడా భారీగా ప్యాకేజ్డ్ నీటిని కొంటోంది. ఇందుకు సాలీనా రూ.5.15 కోట్ల ఖర్చును చూపుతోంది. ఇంత భారీ ఖర్చును తనే పెట్టుబడిగా మార్చుకుంటే సొంతంగా నీటిని మార్కెట్లోకి తేవచ్చన్న యోచనతో రెండు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కంపెనీలు ఆకర్షణీయ సీసాల్లో నాణ్యమైన నీటిని నింపి ఆర్టీసీకి అందజేస్తాయి. వాటిని ఆర్టీసీ మార్కెటింగ్ చేసుకుంటుంది. ఇలా ఇతర కంపెనీల ధరలతో సమంగా లీటరు నీటికి రూ.20 ధరను ఖరారు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా అందించేందుకు అర లీటరు సీసాలను అందుబాటులో ఉంచుతారు. బస్టాండ్లలోని దుకాణాల్లో మాత్రం లీటరు పరిమాణంలోని నీటి సీసాలను ఉంచుతారు. కాగా జీవా పేరుతో తెస్తున్న ఈ బాటిళ్లకు ‘స్ప్రింగ్ ఆఫ్ లైఫ్’అన్న ట్యాగ్‌లను పెట్టింది. పేరుకు, బాటిల్ డిజైన్‌కు ఆర్టీసీ పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్టు తెలిసింది. ఆర్టీసీ బస్టాండ్లతోపాటు మార్కెట్లోనూ ఈ సీసాలను అందుబాటులోకి తేవాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పుడు ఒప్పందం మేరకు వేరే కంపెనీ నీటిని కొనేందుకు చేస్తున్న రూ.5 కోట్ల ఖర్చును లేకుండా చేసుకోవటంతోపాటు సాలీనా కనీసం రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు ఆదాయం పొందాలని భావిస్తోంది. -
హైదరాబాద్‌లో ప్రకటనలకేనా షెల్టర్లు? ప్రయాణికులు తలదాచుకోవడానికి కాదా!
సాక్షి, సిటీబ్యూరో: ఒకవైపు వరుస వర్షాలు.. మరోవైపు బస్సుల కోసం నిరీక్షిస్తూ తలదాచుకుందామంటే ఉన్న బస్షెల్టర్లు ప్రయాణికులకు రక్షణనివ్వడం లేదు. ఎండాకాలంలో మండుటెండల్లో నీడనివ్వగలిగేవి వీటిలో కొన్ని మాత్రమే. ఇక ఏసీ బస్షెల్టర్లన్నది ప్రచారార్భాటంగా మిగిలింది. అటు ఆర్టీసీ.. ఇటు జీహెచ్ఎంసీ బస్ షెల్టర్లను ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నాయి? ఎవరి కోసం ఏర్పాటు చేస్తున్నాయి? అంటే.. కేవలం వాటిని ఏర్పాటు చేసే ఏజెన్సీలకు ప్రకటనల ద్వారా ఆదాయం సమకూర్చేందుకేనని చెప్పక తప్పదు. అలంకారప్రాయంగా.. ►జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 1200 బస్ షెల్టర్లున్నాయి. వివిధ ఏజెన్సీలు వాటిని ఏర్పాటు చేశాయి. ఒప్పందం మేరకైతే ప్రజలకు సదుపాయంగా ఉండాలి. కానీ.. అవి అలా ఉన్నాయా.. లేదా అన్నది అందుకు స్థలాలు కేటాయించిన జీహెచ్ఎంసీ గాని.. ప్రజలకు సదుపాయంగా ఉంచాల్సిన ఆర్టీసీ గాని పట్టించుకోలేదు. దీంతో బస్షెల్టర్లు ప్రజావసరాలకు కాకుండా అలంకారప్రాయంగా మారాయి. బస్సుల కోసం ప్రజలెక్కువగా ఎదురు చూసే ప్రాంతాల్లో బస్ షెల్టర్లుండవు. ►ఈ నేపథ్యంలో నగరవ్యాప్తంగా ఉన్న బస్సు షెల్టర్లు.. వాటి స్థితిగతులు.. ప్రజలకుపయోపడుతున్న తీరు వంటివి తనిఖీలు చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగాలు ఆపనిచేయలేదు. పైపెచ్చు కొత్తగా మరో 78 బస్షెల్టర్లు మూడునెలల్లో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే పలు బస్షెల్టర్లను ప్రకటనల ఆదాయ వనరుగా మార్చుకున్న ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాయి. ►పేరుకు మాత్రం సకల సదుపాయాలతో ఏర్పాటు చేయాల్సిందిగా నిబంధనల్లో పొందుపరుస్తున్నప్పటికీ, ఆ తర్వాత పట్టించుకోవడం లేరు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) కింద బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (బీఓటీ) పద్ధతిలో ఏర్పాటుకు అనుమతించారు. అందంగా, ప్రయాణికుల.. పర్యావరణహితంగా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నప్పటికీ, ఏమేరకు వాస్తవ రూపం దాలుస్తాయో వేచి చూడాల్సిందే. ఈ ప్రాంతాల్లో ఏర్పాటు.. బస్షెల్టర్లు ఏర్పాటు కానున్న ప్రాంతాల్లో రాజేంద్రనగర్ ఆర్చి (ఏజీ యూనివర్సిటీ), çపురానాపూల్ గాంధీ విగ్రహం, చౌమహల్లా ప్యాలెస్ ఎదుట, జియాగూడ, వివేకానందనగర్, ఉప్పల్ క్రాస్‌రోడ్స్, హయత్‌నగర్(కెప్టెన్కుక్ ఎదుట), బైరామల్‌గూడ, పనామా క్రాస్‌రోడ్స్, విక్టోరియా మెమోరియల్–సరూర్‌నగర్, కామినేని హాస్పిటల్, హెచ్‌బీకాలనీ, కొత్తపేట ప్రభుత్వ పాఠశాల, నాగోల్ క్రాస్‌రోడ్స్, నాగార్జునసాగర్ రింగ్‌రోడ్(ఒవైసీ ఆస్పతి వైపు), నందనవనం భూపేశ్‌నగర్ , తాళ్లూరి థియేటర్ కమాన్, ఓయూ క్యాంపస్, పద్మారావునగర్ ఎస్పీ కాలేజ్, సెయింట్ ఆన్స్ స్కూల్, చిలకలగూడ (ఉప్పల్వైపు) తదితరమైనవి ఉన్నాయి. నిబంధనల మేరకు.. ►జీపీఎస్ ద్వారా ఆర్టీసీ బస్సులు బస్‌షెల్టర్లకు చేరుకోనున్న రియల్‌టైమ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ►బస్సుల నంబర్లు, రూట్‌మ్యాప్ వంటి వివరాలు సైతం ఉంచాలి. ►రాత్రి వేళల్లో విద్యుత్ ఉండాలి. షెల్టర్లలోని బెంచీలు బలంగా, ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా ఉండాలి. ►మొబైల్ చార్జింగ్ పాయింట్, డస్ట్‌బిన్ వంటివి ఉండాలి. ►వీటి అంచనా వ్యయం దాదాపు రూ.1.09 కోట్లు. -
TSRTC: ఆర్టీసీకి ఐదు కొత్త బస్టాండ్లు
సాక్షి, హైదరాబాద్: చాలాకాలం తర్వాత ఆర్టీసీ కొత్త బస్టాండ్ల నిర్మాణంపై దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు బస్టాండ్లు పాతబడిపోయాయి. పైకప్పులు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. కనీసం 40 వరకు బస్టాండ్లను పునర్నిర్మించాల్సి ఉంది. కానీ నిధుల సమస్యతో దశలవారీగా బస్టాండ్లను పునర్నిర్మించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఐదు కొత్త బస్టాండ్ల నిర్మా ణం చేపట్టాలని భావిస్తోంది. ఇటీవలే ఖమ్మంలో పాత బస్టాండును అలాగే ఉంచి నగర శివారులో కొత్త బస్టాండును ఆర్టీసీ సొంత నిధులతో నిర్మించింది. తాజాగా సిద్దిపేటలోని పాత బస్టాండును కూల్చేసి దాని స్థానంలో రూ.6 కోట్ల ప్రభుత్వ నిధులతో కొత్త బస్టాండు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. అలాగే పాతబడి పెచ్చులూడుతున్న దుబ్బాక, గద్వాల పట్టణ బస్టాండు భవనాలను కూల్చి వాటి స్థానంలో కొత్తవి నిర్మించనున్నారు. ఇందుకు మొత్తంగా రూ.8 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ పనులను ప్రభుత్వ నిధులతోనే చేపట్టనున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానాన్ని పునర్నిర్మించినందున అక్కడికి భక్తుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం ఉన్న బస్టాండు ఎక్కువ సంఖ్యలో వచ్చే భక్తులకోసం సేవలందించేందుకు అనువుగా లేదు. దేవాలయ విస్తరణలో భాగంగా బస్టాండు స్థలాన్ని ప్రభుత్వం ఆలయం కోసం కేటాయించింది. ఈ నేపథ్యంలో కొత్త బస్టాం డు కోసం పట్టణం వెలుపల స్థలాన్ని కేటాయించింది. అక్కడ దాదాపు 10 ప్లాట్‌ఫామ్‌లతో కొత్త బస్టాండును నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు కూడా ప్రభుత్వమే నిధులు సమకూర్చనుంది. కోస్గిలో విస్తరణ.. ఇక ఇరుకుగా మారి ఏమాత్రం యోగ్యంగా లేకపోవటంతో నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని బస్టాండును విస్తరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న భవనానికి ఆనుకుని కొత్త భవనాన్ని నిర్మించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకు కోటి రూపాయల వ్యయం కానుంది. ఈ మొత్తంలో సగం నిధులను ప్రభుత్వం ఇవ్వనుండగా, మిగతా సగం మొత్తాన్ని ఆర్టీసీ భరించనుంది. ఆదిలాబాద్ పట్టణ బస్టాండు కూడా అనుకూలంగా లేదు. ఇక్కడ బస్సులు నిలిపేందుకు ప్లాట్‌ఫామ్స్ సరిపోవడం లేదు. దీంతో దాదాపు రూ.85 లక్షల వ్యయంతో అక్కడ కొత్త ప్లాట్‌ఫామ్స్ నిర్మిస్తున్నారు. -
కొత్త ప్లాన్‌తో ముందుకొస్తున్న టీఎస్ఆర్టీసీ..!
సాక్షి, హైదరాబాద్: పట్టణాల నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలను ఊరు చివరకు మార్చి.. ఖాళీ అయిన ఆ స్థలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసే దిశగా ఆర్టీసీ యోచిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. టికెట్ రూపంలో వచ్చే ఆదాయం ఖర్చులకు సరిపోవడం లేదు. కోవిడ్ కష్టాల నుంచి బయటపడ్డా, ఆ ఆదాయంతో ఆర్టీసీని నెట్టుకురావడం కష్టంగా మారింది. దీంతో ఇప్పటికిప్పుడు ఆర్టీసీ ఇతర ఆదాయాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. గతంలో ఇదే ఉద్దేశంతో ప్రారంభించిన పెట్రోల్ బంకులు కొంత కుదురుకున్నా.. సంస్థకు పెద్దగా ఆదాయాన్ని తెచ్చిపెట్టడంలేదు. ఇటీవల ఎంతో ఆశతో ప్రారంభించిన కార్గో సర్వీసు తెల్ల ఏనుగులా మారింది. అందులో ఆర్టీసీ ఎక్సెస్ సిబ్బందినే వినియోగిస్తుండటంతో దాని ద్వారా వచ్చే ఆదాయం వారి జీతాలకు కూడా సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ స్థలాలను వాణిజ్య అవసరాలకు వాడి తద్వారా ఆదాయాన్ని పొందాలన్న యోచనలో సంస్థ ఉంది. ఈ ఆలోచన కొత్తది కాకున్నా.. దాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్న ప్రతిపాదన సిద్ధం చేసుకుంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలు పట్టణాల మధ్యలో ఉన్నాయి. వీటిల్లో ఏయే ప్రాంతాల్లోని వాటిని ఖాళీ చేయవచ్చో జాబితా రూపొందిస్తున్నారు. గతంలో ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో డిపోల సంఖ్యను పెంచారు. పక్కపక్కనే రెండు డిపోలు ఉన్న చోట ఒక్క దాన్ని ఉంచి, రెండో డిపోను మూసేసే యోచనలో ఉన్నారు. దూరప్రాంతాల సర్వీసులపై ఎక్కువ దృష్టి సారించి సిటీ, పల్లె వెలుగు బస్సుల సంఖ్యను తగ్గించే యోచనలో ఆర్టీసీ ఉంది. అప్పుడు మరికొన్ని డిపోలు నామమాత్రమే కానున్నాయి. ఇలాంటి వాటిని పక్క డిపోలో కలిపేసి ఆ స్థలాలను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని ఆర్టీసీ పరిశీలిస్తోంది. నగరంలో కూడా.. భాగ్యనగరంలోనూ డిపోల సంఖ్యను కుదించే దిశగా ఆర్టీసీ కదులుతోంది. రెండేళ్ల క్రితం ఆర్టీసీ సమ్మె సమయంలో సిటీలో దాదాపు వేయి బస్సులను తగ్గించారు. ప్రతి సంవత్సరం బస్సుల సంఖ్యను పెంచే పద్ధతిని ఆపేశారు. దీంతో కొన్ని డిపోల్లో సర్వీసుల సంఖ్య తగ్గింది. అలాంటి డిపోలను మూసేస్తే ఆ స్థలాలు వాణిజ్య అవసరాలకు చేతికొస్తాయి. ఔటర్ చుట్టూ స్థలాన్ని కేటాయిస్తే, నగరంలో ఉన్న డిపోలను ఖాళీ చేయాలని ఆర్టీసీ భావించింది. కానీ, ఔటర్ చుట్టూ స్థలాలకు ధరలు బాగా పెరగటంతో ఆ ప్రతిపాదనను హెచ్ఎండీఏ అంగీకరించలేదు. ఇప్పుడు చాలా డిపోలకు పెద్దగా డిమాండ్ లేనందున, సిటీ అవతల ఉన్న ప్రభుత్వ స్థలాలను వినియోగించుకుని నగరంలోని కొన్ని బస్‌డిపోలను ఖాళీ చేయాలని ఆర్టీసీ ప్రతిపాదిస్తోంది. లీజా..విక్రయమా.. ఇలా వచ్చిన స్థలాలను లీజుకు ఇవ్వాలా, విక్రయించాలా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఉన్న స్థలాలను అమ్మేస్తే భవిష్యత్తులో ఆర్టీసీ అవసరాలకు భూములు లేకుండా పోతాయన్న ఆందోళన ఉంది. దీంతో లీజుకు ఇవ్వడమే మంచిదన్న అభిప్రాయం సంస్థలో వ్యక్తమవుతోంది. అయితే దీనివల్ల అనుకున్నంత ఆదాయం రాదన్న భిన్నాభిప్రాయమూ ఉంది. దీనిపై ప్రభుత్వ ఆదేశం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. ఆర్టీసీ స్థలాలను కాపాడుకోవాలని, భవిష్యత్తులో స్థలాలు దొరకడం కష్టమని గతంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ అధికారులతో అన్నారు. ఇప్పుడు సంస్థ స్థలాలను వాణిజ్య అవసరాలకు వినియోగించే ప్రతిపాదనకు ఆయన ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. కొత్త ఎండీ సజ్జనార్ దీన్ని తేలుస్తారని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల ఖమ్మం పట్టణంలో ఊరవతల కొత్తగా బస్టాండ్‌ను నిర్మించి ఊరి మధ్య ఉన్న పాత బస్టాండ్‌ను మూసేశారు. ఇప్పుడా స్థలాన్ని వాణిజ్య అవసరాలకు వాడబోతున్నారు. అదే పంథాను ఇతర పట్టణాల్లో కూడా అవలంబించాలని ఆర్టీసీ భావిస్తోంది. కరీంనగర్లోనూ తరలింపునకు సంబంధించిన ప్రతిపాదన సిద్ధం చేసింది. పట్టణంలో రెండు బస్‌డిపోలు ఒకే చోట ఉన్నాయి. అందులో ఒకదాన్ని ఖాళీ చేసి, ఊరవతల ఉన్న వర్క్‌షాపు వద్దకు తరలించాలని నిర్ణయించారు. ఖాళీ చేసిన బస్‌డిపో స్థలాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేయబోతున్నారు. నామమాత్రంగా మారిపోయిన మియాపూర్ ఆర్టీసీ బస్‌బాడీ యూనిట్‌ను తరలించేందుకు ఆర్టీసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దాదాపు16 ఎకరాల్లో ఉన్న ఈ యూనిట్‌ను ఉప్పల్ వర్క్‌షాపులోకి తరలించాలని భావిస్తోంది. మియాపూర్ మంచి డిమాండ్ ఉన్న ప్రాంతం కావటంతో అక్కడి స్థలాన్ని లీజుకు ఇచ్చి భారీగా ఆదాయాన్ని పొందొచ్చని యోచిస్తోంది. ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూమి (ఎకరాల్లో): 1,450 డిపోలు, బస్టాండ్లు తదితర అవసరాలకు ఉపయోగిస్తున్న భూమి (ఎకరాల్లో):1,250 నిర్మాణాలు లేకుండా ఖాళీగా ఉన్న భూమి (ఎకరాల్లో):200 -
పండగ ప్రయాణం
-
‘సచివాలయ’ పరీక్షలకు ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం అన్ని బస్, రైల్వే స్టేషన్లలో హెల్ప్ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు పరీక్షల నిర్వహణ కన్వీనర్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పరీక్ష కేంద్రం చిరునామా వంటి విషయాల్లో హెల్ప్‌డెస్క్ సిబ్బంది సహాయకారిగా ఉంటారన్నారు. సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి సెపె్టంబర్ 1నుంచి 8వ తేదీ వరకు పోస్టుల వారీగా రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో 1,26,728 ఉద్యోగాలకు దాదాపు 21.69 లక్షల మంది పోటీ పడుతున్నందున పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్టు వివరించారు. తొలిరోజు ఉదయం 36,449 ఉద్యోగాలకు పరీక్ష నిర్వహిస్తుండగా.. 12,54,034 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం తర్వాత 11,158 పోస్టులకు పరీక్ష నిర్వహిస్తుండగా.. 2,95,907 మంది హాజరు కావాల్సి ఉందని చెప్పారు. తొలి రోజు పరీక్షలకు మూడింట రెండొంతుల మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. ఇందుకోసం మండల కేంద్రాలు, పట్టణాల్లో 4,478 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్లకు జతపరిచి ఉన్న నియమ నిబంధనలను పరీక్ష కేంద్రానికి వచ్చే ముందే సరిచూసుకుని రావాలని కోరారు. వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ఒకరోజు ముందే చూసుకోవడం.. రాత పరీక్ష మొదలయ్యే సమయానికి గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవడం మంచిదని తెలిపారు. పరీక్షల నిర్వహణలో పోలీసు శాఖ సేవలను పెద్దఎత్తున ఉపయోగించుకుంటున్నట్టు చెప్పారు. హెల్ప్ డెస్క్‌లలో పెద్ద సంఖ్యలో వలంటీర్లను, 1,22,554 మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని చెప్పారు. 1,835 వాహనాలను కూడా ఉపయోగించుకుంటున్నట్టు చెప్పారు. ప్రతి జిల్లాలో 500 బస్సులు ఒకే రోజు దాదాపు 15 లక్షల మంది రాత పరీక్షలకు హాజరవుతున్న నేపథ్యంలో.. ప్రతి జిల్లాలో 500 బస్సులను పరీక్షా కేంద్రాలకు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు అంగీకరించారని కన్వీనర్ తెలిపారు. మండలాల వారీగా ఏ కేంద్రంలో ఎంత మంది రాతపరీక్షకు హాజరవుతారన్న వివరాలను ఆర్టీసీకి అందజేశామన్నారు. ఆటోల ద్వారా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నా.. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పట్టణాల్లో ఆటో యూనియన్లకు ఆ పట్టణంలో పరీక్ష జరిగే కేంద్రాల వివరాలు కూడా ముందుగా తెలియజేసినట్టు చెప్పారు. దివ్యాంగులకు 1,588 మంది సహాయకులు పరీక్షలకు హాజరయ్యే దివ్యాంగులకు సహాయకులుగా 1,588 మందిని అనుమతించనున్నట్టు చెప్పారు. సహాయం కావాలని కోరిన దివ్యాంగులకు ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసిందని, ప్రభుత్వం ఎంపిక చేసిన ఇంటర్ విద్యార్థులను మాత్రమే సహాయకులుగా అనుమతిస్తారని వివరించారు. 8 రోజులు జరిగే పరీక్షలకు 32,839 మంది దివ్యాంగులు హాజరవుతారని పేర్కొన్నారు. పట్టణాల్లో ట్రాఫిక్ నియంత్రణ అభ్యర్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అన్ని పట్టణాల్లో ఆదివారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీని కోరినట్టు తెలిపారు. పరీక్ష కేంద్రాలున్న ప్రాంతంలో ట్రాఫిక్‌ను మళ్లించడం.. అవసరం ఉన్నచోట ఊరి బయట వాహనాలు నిలుపుదల వంటి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పరీక్షా కేంద్రం చుట్టుపక్కల వంద మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేస్తారని, ఆ ప్రాంతంలో ఉండే జిరాక్స్ సెంటర్లు మూసివేస్తారని చెప్పారు. రాతపరీక్ష పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాల్లో ప్రశ్నాపత్రాలతో పాటు పరీక్షా సామగ్రిని ఉంచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసినట్టు వివరించారు. - అభ్యర్థుల హాల్ టికెట్‌పై ఫొటో అస్పష్టంగా ఉన్నా.. కనిపించకుండా చిన్నదిగా ఉన్నా.. అసలు ఫొటోనే ముద్రించకున్నా.. ఫొటో ఉన్నప్పటికీ అభ్యర్థి సంతకం లేకపోయినా.. సదరు అభ్యర్థులు గుర్తింపు కార్డుతో పాటు అదనంగా మూడు పాస్‌పార్ట్ ఫొటోలను తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. ఆ ఫొటోలపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలి. లేదంటే పరీక్షకు అనుమతించరు. - పరీక్ష రాసే సమయంలో అభ్యర్థి ఏదైనా అవసరానికి ఓఎమ్మార్ షీట్‌పై వైట్నర్ లేదా ఏదైనా మార్కర్ వంటివి వాడితే ఏకంగా అనర్హులే అవుతారు. పరీక్ష హాల్లోకి బాల్ పాయింట్ పెన్ మినహా వైట్నర్, మార్కర్ వంటివి తీసుకొచ్చినట్టు గుర్తించినా వారిని అనర్హులుగా ప్రకటిస్తారు. - అభ్యర్థులకు ఇచ్చే ఒరిజనల్ ఓఎమ్మార్ షీట్‌తో పాటు నకలు ఓఎమ్మార్ కూడా ఉంటుంది. వీటి మధ్యలో కార్బన్ పేపర్ ఉంటుంది. పరీక్ష ముగిసిన తరువాత అభ్యర్థులు ఒరిజనల్ షీట్ ఇన్విజిలేటర్‌కు ఇచ్చి.. నకలును ఇంటికి తీసుకెళ్లవచ్చు. - సమయం పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్షా కేంద్రాన్ని విడిచి వెళ్లడానికి అనుమతించరు. ఎవరైనా అభ్యర్థి నిర్ధేశిత సమయానికంటే ముందుగా పరీక్ష కేంద్రాన్ని విడిచి వెళితే అనర్హులవుతారు. - జెల్ పెన్ లేదా ఏ ఇతర రాత వస్తువులతో ఓఎంఆర్ షీట్‌పై ఏదైనా రాసినా జవాబు పత్రం చెల్లదు. -
ఆటోలకు అడ్డా...ఆర్టీసీ బస్టాండ్
సాక్షి, ముక్కామల (అంబాజీపేట): స్థానిక సెంటర్లో నిర్మించిన బస్టాండ్ ఆటోలకు అడ్డాగా మారిందని ప్రయాణికులు, స్థానికులు విమర్శిస్తున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి బస్టాండ్‌ను రూ.లక్షలు వెచ్చించి 1996లో నిర్మించారు. అప్పటి నుంచి బస్టాండ్‌లోకి బస్‌లు లోపలకు రాకుండా బయట నుంచి వెళ్లిపోవడంతో ప్రయాణికులు రోడ్లపైనే జాగారం చేస్తున్నారు. దాంతో స్థానికుడు వనచర్ల పండు అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్‌లు లోపలకు రాకుండానే బయట నుంచి వెళ్లిపోతున్నాయని, లక్షలాది రూపాయలతో నిర్మించిన బస్టాండ్ నిరుపయోగంగా తయారైందని డిపో మేనేజర్‌కు వివరించినట్లు పండు తెలిపారు. బస్టాండ్‌లో ఆర్టీసీ బస్‌లు రాకుండా ఆటోలు అడ్డుగా నిలుపుదల చేస్తున్నారని గతం నుంచి ఆరోపణలు వస్తున్నా ఆర్టీసీ అధికారుల పట్టించుకోలేదనే విషయాన్ని గుర్తు చేశారు. దాంతో ఆర్టీసీ బస్‌లను లోపలకు వచ్చేలా చూడాలని వారం రోజులపాటు బస్టాండ్ వద్ద ఉండాలని అధికారులు సూచించారని పండు తెలిపారు. దాంతో ఆర్టీసీ బస్‌లను బస్టాండ్ లోపలకు తీసుకుని వస్తున్నారని, అయితే బస్‌లు వచ్చే సమయంలో ఆటోలను అడ్డుగా పెడుతున్నారని వాపోయాడు. పసుపల్లి గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు బస్టాండ్ ఆవరణలో హల్‌చల్‌చేసి భయబ్రాంతులకు గురిచేశాడని ఈ విషయాన్ని అంబాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నాడు. బస్‌లకు అడ్డుగా నిలుపుదల చేయవద్దని కోరితే ఆటో డ్రైవర్లు గొడవకు వస్తున్నారని ఈ విషయాన్ని డిపో మేనేజర్‌కు తెలియజేశామన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి ఆర్టీసీ బస్‌లను లోపలకు వచ్చేలా చూడాలని కోరారు. -
నిర్మల్ బస్టాండ్‌లో మంత్రి తనిఖీ
నిర్మల్‌టౌన్ : ∙నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్‌ను ఆదివారం రాష్ట మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తనిఖీ చేశారు. సౌకర్యాలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. బస్సు సర్వీసుల సేవలపై ఆరా తీశారు. బస్సుల వేళల్లో సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా? అని ప్రయాణికులను అడిగారు. ప్రయాణికులు తమ సమస్యలు మంత్రి ఐకేరెడ్డి దృష్టికి తీసుకురాగా, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాయకులు అప్పాల గణేశ్, ముత్యంరెడ్డి, పాకాల రాంచందర్, కౌన్సిలర్ నేల్ల అరుణ్, తోట నర్సయ్య తదితరులున్నారు. -
జలాశయాలుగా రైల్వే స్టేషన్లు, బస్సు స్టాండ్లు
-
బస్టాండ్లలో రూపాయికే వైద్యం
ముంబై: లోకల్, మెట్రో రైల్వే స్టేషన్ల మాదిరి బస్టాండ్లలో కూడా వన్ రూపీ క్లినిక్ పథకాన్ని ప్రారంభించాలని మహారాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో ఆర్టీసీ నిమగ్నమైంది. ముంబైలో లోకల్ రైల్వే స్టేషన్లలో లభిస్తున్న రూపాయికే వైద్యం పథకానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో ఇటీవల మెట్రో రైల్వే స్టేషన్లలో కూడా ప్రారంభించారు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం దీనిపై దృష్టి సారించింది. అందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బస్టాండ్లలో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని భావిస్తోంది. ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తే మిగతా బస్టాండ్లలో కూడా చేపట్టే ప్రయత్నం చేయనుంది. ఈ వైద్య సేవలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎక్కువ శాతం ఉపయోగపడనున్నాయి. 24 గంటలు, రెండు షిప్టుల్లో ఇద్దరు డాక్టర్లు(ఒకరు ఎంబీబీఎస్, ఒకరు ఎండీ) బస్టాండ్లలోని క్లినిక్‌లో వైద్య సేవలందిస్తారు. అలాగే ఔట్ పేషంట్ డిపార్టుమెంట్ (ఓపీడీ), పూర్తి శరీర పరీక్షలు, రక్త పరీక్షలు, మార్గదర్శనం, జన జాగృతి వర్క్‌షాపు, గుండె, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ తదితరాలకు ప్రత్యేక విభాగాలు, అత్యవసర విభాగాలలో వైద్య సేవలందిస్తారని ‘వన్ రూపీ క్లినిక్’ చీఫ్ కార్యనిర్వాహక అధికారి డాక్టర్ రాహుల్ ఘులే పేర్కొన్నారు. ఈ పథకంపై ఇటీవల రవాణ శాఖ మంత్రి దివాకర్ రావుతో అధికారులు భేటీ అయ్యారు. అందుకు ఆయన గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎక్కువ శాతం ఉపయోగపడే విధంగా ఈ పథకం ఉండాలని రాహుల్‌కు సూచించారు. లోకల్ రైల్వే స్టేషన్లలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా కేవలం 45 రోజుల్లో 13 వేలకుపైగా ప్రయాణికులు లబ్ధి పొందారు. ప్రస్తుతం ఈ వైద్య సేవలు నగరంలోని భైకళ, దాదర్, కుర్లా, ఘాట్కోపర్, విక్రోలి, భాండూప్, ములుండ్, థాణే, కల్వా, ఉల్లాస్‌నగర్, అంబర్నాథ్, బద్లాపూర్, వడాల రోడ్, పన్వేల్, సైన్, టిట్వాల, గోవండీ, చెంబూర్, మాన్‌ఖుర్ద్ రైల్వే స్టేషన్లలో లభిస్తున్నాయి. -
నిర్వహణ సరిగాలేదు
జీహెచ్ఎంసీలో బస్టాండ్లపై మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలో బస్టాండుల నిర్వహణ సరిగా జరగడం లేదనేది వాస్తవమేనని మంత్రి కేటీఆర్ అన్నారు. బస్ షెల్టర్లు నిర్మించడం తేలికే కాని నిర్వహణే కష్టమని తెలిపారు. హైదరాబాద్ నగరంలో మొత్తం 1,183 బస్ షెల్టర్లు ఉండగా.. అందులో 430 బస్ షెల్టర్ల ఆధునీకరణకు టెండర్లు పిలిచామని, వారంలో వాటిని పూర్తి చేస్తామని వెల్లడించారు. ‘అధికారులు, ప్రజాప్రతినిధులు ఢిల్లీ, బెంగళూరుల్లో అధ్యయనం చేసి వచ్చారు. నగరంలోని ట్రాన్స్‌పోర్టు వ్యవస్థని జీహెచ్ఎంసీలో భాగం చేయాలనే ప్రయత్నిస్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాల్లో గత మూడేళ్లుగా హైదరాబాద్ దేశంలొనే మొదటి స్థానంలో ఉంది. నగరంలోని ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం చేయడం ఒక్కటే పరిష్కారం’ అని పేర్కొన్నారు. -
రైల్వే, ఆర్టీసీలకు కాసుల వర్షం
♦ దసరా సర్వీసులతో రైల్వేకు రూ.8 కోట్లు... ♦ ఆర్టీసీకి రూ.1.25 కోట్లు సాక్షి, హైదరాబాద్: దసరా రద్దీ రవాణా సంస్థలకు కాసుల వర్షం కురిపించింది. దక్షిణమధ్య రైల్వేకు సుమారు రూ.8 కోట్లు, ఆర్టీసీకి రూ.1.25 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్టీసీ ఆక్యుపెన్సీ సైతం భారీగా పెరిగింది. గతేడాది దసరా సందర్భంగా 82 శాతం ఉన్న ఆక్యుపెన్సీ ఈసారి 94 శాతానికి చేరింది. 3,500 రెగ్యులర్ బస్సులకు అదనంగా 3,060 బస్సులు నడిపింది. మరోవైపు రైళ్లలోనూ ఆక్యుపెన్సీ వంద శాతం దాటింది. ఎక్స్‌ప్రెస్‌లే కాకుండా ప్యాసింజర్లు సైతం ప్రయాణికులతో పోటెత్తాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి రోజూ నడిచే వందకు పైగా ప్రధాన రైళ్లతో పాటు దసరా సందర్భంగా మరో 52 రైళ్లు అదనంగా నడిపారు. దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలో మొత్తం 150 రైళ్లు అదనంగా వేశారు. గత ఏడాది దాదాపు 12 లక్షల మంది సొంతూళ్లకు తరలివెళ్లగా... ఈ దసరాకు ఆ సంఖ్య 15 లక్షల వరకు ఉందని అంచనా. తిరుగు ప్రయాణంలోనూ రద్దీ... దసరా సెలవులు ముగించుకొని తిరిగి నగరానికి వచ్చే ప్రయాణికులతో గురువారం రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు రద్దీగా కనిపించాయి. గౌతమి, నారాయణాద్రి, గరీబ్థ్,్ర చార్మినార్ ఎక్స్‌ప్రెస్, పుష్ఫుల్ తదితర రైళ్లు ఆలస్యంగా నడిచాయి. -
ఉన్నా.. లేనట్టే?
నిరుపయోగంగా ప్రయాణ ప్రాంగణాలు పలుచోట్ల నోచుకోని నిర్మాణాలు ఇబ్బందుల్లో ప్రయాణికులు.. పట్టించుకోని అధికారులు రేగోడ్: ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు నేటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు వేస్తున్నా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాణ ప్రాంగణాలను నిర్మించడం లేదు. ప్రయాణం చేయాలంటేనే నరకం కనిపిస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. నిర్మించిన చోట్ల నిరుపయోగంగా కొన్ని ఉంటే.. మరికొన్ని మాత్రం శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అధికారులూ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేగోడ్ మండంలో 19 గ్రామ పంచాయతీల పరిధిలో 25 గ్రామాలున్నాయి. 16 గిరిజన తండాలున్నాయి. పదమూడేళ్ల క్రితం అప్పటి మంత్రి బాబూమోహన్ లక్షలాది రూపాయలు మంజూరు చేయడంతో రేగోడ్‌లో ప్రయాణ ప్రాంగణాన్ని నిర్మించారు. నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో బస్సు సర్వీసులు పలుమార్లు ప్రయాణ ప్రాంగణానికి వచ్చి వెళ్లాయి. తరువాత ఈ ప్రాంగణంలోకి బస్సులు రావడం లేదు. ప్రస్తుతం ఈ బస్టాండ్ గొడవలు పడినవారికి పంచాయితీలు నిర్వహించేందుకు, పశువులను కట్టేయడానికి మాత్రం ఉపయోగపడుతోంది. ప్రయాణ ప్రాంగణం శిథిలావస్థకు చేరుకుంటోంది. పోచారం గ్రామంలో ఇటీవల నిర్మించిన బస్‌షెల్టర్‌కు కలర్ కూడా వేయలేదు. కనీసం ఉపయోగంలోకి తేవడం లేదు. టి.లింగంపల్లిలో బస్‌షెల్టర్ నామమాత్రంగా వినియోగంలో ఉంది. మర్పల్లి, సిందోల్, గజ్వాడ, గజ్వాడకు వెళ్తుండగా తాటిపల్లి గట్టు మీద, దేవునూర్, మేడికుంద, దోసపల్లి, ప్యారారం, దుద్యాల, జగిర్యాల, బురాన్వాడి తండా, పెద్దతండా, నిర్జప్ల, ఉసిరికపల్లి, చౌదర్పల్లి, తిమ్మాపురం తదితర గ్రామాల్లో బస్షెల్టర్లు నిర్మాణానికి నోచుకోవడం లేదు. గ్రామాల నుంచి ఇతర గ్రామాలకు రాకపోకలు సాగించే ప్రజలు బస్సులు, ఆటోలు వచ్చే వరకు ఉండటానికి బస్షెల్టర్లు లేక వర్షాలకు తడస్తూ.. ఎండలకు ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ అధికారులు పూర్తిగా విఫలం చెందారు. చెట్ల కిందనో.. టీ హోటల్లో నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంటోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రయాణికులతో ఎంజీబీఎస్ కిటకిట