సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం అన్ని బస్, రైల్వే స్టేషన్లలో హెల్ప్ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తున్నట్టు పరీక్షల నిర్వహణ కన్వీనర్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పరీక్ష కేంద్రం చిరునామా వంటి విషయాల్లో హెల్ప్‌డెస్క్ సిబ్బంది సహాయకారిగా ఉంటారన్నారు. సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి సెపె్టంబర్ 1నుంచి 8వ తేదీ వరకు పోస్టుల వారీగా రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో 1,26,728 ఉద్యోగాలకు దాదాపు 21.69 లక్షల మంది పోటీ పడుతున్నందున పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్టు వివరించారు.
తొలిరోజు ఉదయం 36,449 ఉద్యోగాలకు పరీక్ష నిర్వహిస్తుండగా.. 12,54,034 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం తర్వాత 11,158 పోస్టులకు పరీక్ష నిర్వహిస్తుండగా.. 2,95,907 మంది హాజరు కావాల్సి ఉందని చెప్పారు. తొలి రోజు పరీక్షలకు మూడింట రెండొంతుల మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. ఇందుకోసం మండల కేంద్రాలు, పట్టణాల్లో 4,478 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్లకు జతపరిచి ఉన్న నియమ నిబంధనలను పరీక్ష కేంద్రానికి వచ్చే ముందే సరిచూసుకుని రావాలని కోరారు. వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ఒకరోజు ముందే చూసుకోవడం.. రాత పరీక్ష మొదలయ్యే సమయానికి గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవడం మంచిదని తెలిపారు. పరీక్షల నిర్వహణలో పోలీసు శాఖ సేవలను పెద్దఎత్తున ఉపయోగించుకుంటున్నట్టు చెప్పారు. హెల్ప్ డెస్క్లలో పెద్ద సంఖ్యలో వలంటీర్లను, 1,22,554 మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని చెప్పారు. 1,835 వాహనాలను కూడా ఉపయోగించుకుంటున్నట్టు చెప్పారు.
ప్రతి జిల్లాలో 500 బస్సులు
ఒకే రోజు దాదాపు 15 లక్షల మంది రాత పరీక్షలకు హాజరవుతున్న నేపథ్యంలో.. ప్రతి జిల్లాలో 500 బస్సులను పరీక్షా కేంద్రాలకు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు అంగీకరించారని కన్వీనర్ తెలిపారు. మండలాల వారీగా ఏ కేంద్రంలో ఎంత మంది రాతపరీక్షకు హాజరవుతారన్న వివరాలను ఆర్టీసీకి అందజేశామన్నారు. ఆటోల ద్వారా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నా.. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పట్టణాల్లో ఆటో యూనియన్లకు ఆ పట్టణంలో పరీక్ష జరిగే కేంద్రాల వివరాలు కూడా ముందుగా తెలియజేసినట్టు చెప్పారు.
దివ్యాంగులకు 1,588 మంది సహాయకులు
పరీక్షలకు హాజరయ్యే దివ్యాంగులకు సహాయకులుగా 1,588 మందిని అనుమతించనున్నట్టు చెప్పారు. సహాయం కావాలని కోరిన దివ్యాంగులకు ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసిందని, ప్రభుత్వం ఎంపిక చేసిన ఇంటర్ విద్యార్థులను మాత్రమే సహాయకులుగా అనుమతిస్తారని వివరించారు. 8 రోజులు జరిగే పరీక్షలకు 32,839 మంది దివ్యాంగులు హాజరవుతారని పేర్కొన్నారు.
పట్టణాల్లో ట్రాఫిక్ నియంత్రణ
అభ్యర్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అన్ని పట్టణాల్లో ఆదివారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీని కోరినట్టు తెలిపారు. పరీక్ష కేంద్రాలున్న ప్రాంతంలో ట్రాఫిక్‌ను మళ్లించడం.. అవసరం ఉన్నచోట ఊరి బయట వాహనాలు నిలుపుదల వంటి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పరీక్షా కేంద్రం చుట్టుపక్కల వంద మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేస్తారని, ఆ ప్రాంతంలో ఉండే జిరాక్స్ సెంటర్లు మూసివేస్తారని చెప్పారు. రాతపరీక్ష పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాల్లో ప్రశ్నాపత్రాలతో పాటు పరీక్షా సామగ్రిని ఉంచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసినట్టు వివరించారు.
- అభ్యర్థుల హాల్ టికెట్‌పై ఫొటో అస్పష్టంగా ఉన్నా.. కనిపించకుండా చిన్నదిగా ఉన్నా.. అసలు ఫొటోనే ముద్రించకున్నా.. ఫొటో ఉన్నప్పటికీ అభ్యర్థి సంతకం లేకపోయినా.. సదరు అభ్యర్థులు గుర్తింపు కార్డుతో పాటు అదనంగా మూడు పాస్‌పార్ట్ ఫొటోలను తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. ఆ ఫొటోలపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలి. లేదంటే పరీక్షకు అనుమతించరు.
- పరీక్ష రాసే సమయంలో అభ్యర్థి ఏదైనా అవసరానికి ఓఎమ్మార్ షీట్‌పై వైట్‌నర్ లేదా ఏదైనా మార్కర్ వంటివి వాడితే ఏకంగా అనర్హులే అవుతారు. పరీక్ష హాల్‌లోకి బాల్ పాయింట్ పెన్ మినహా వైట్‌నర్, మార్కర్ వంటివి తీసుకొచ్చినట్టు గుర్తించినా వారిని అనర్హులుగా ప్రకటిస్తారు.
- అభ్యర్థులకు ఇచ్చే ఒరిజనల్ ఓఎమ్మార్ షీట్‌తో పాటు నకలు ఓఎమ్మార్ కూడా ఉంటుంది. వీటి మధ్యలో కార్బన్ పేపర్ ఉంటుంది. పరీక్ష ముగిసిన తరువాత అభ్యర్థులు ఒరిజనల్ షీట్ ఇన్విజిలేటర్‌కు ఇచ్చి.. నకలును ఇంటికి తీసుకెళ్లవచ్చు.
- సమయం పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్షా కేంద్రాన్ని విడిచి వెళ్లడానికి అనుమతించరు. ఎవరైనా అభ్యర్థి నిర్ధేశిత సమయానికంటే ముందుగా పరీక్ష కేంద్రాన్ని విడిచి వెళితే అనర్హులవుతారు.
- జెల్ పెన్ లేదా ఏ ఇతర రాత వస్తువులతో ఓఎంఆర్ షీట్‌పై ఏదైనా రాసినా జవాబు పత్రం చెల్లదు.
Comments
Please login to add a commentAdd a comment