village Secretariat
-
గ్రామ, వార్డు సచివాలయాలు సీఎం జగన్ మానస పుత్రికలు: బొప్పరాజు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ ఆవిర్భావ సభ.. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించారు. ఈ సభకు మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, నవరత్నాల కమిటీ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఒకే సారి లక్షా 35 వేల ఉద్యోగాలు ఇవ్వడం ఒక చరిత్ర అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు సీఎం జగన్ మానస పుత్రికలు సచివాలయాలు ఏర్పాటు నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. చదవండి: ఎవరు హోల్డ్? ఎవరు ఓపెన్?.. అసలు కథేంటో తర్వాత అర్థమైందట.. -
వాటిని కట్టకున్నా.. నిధులు కొట్టేశారు
సాక్షి, వరంగల్: ఖానాపురం మండలంలోని మంగళవారంపేట గ్రామ పంచాయతీ పరిధిలో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని కార్యదర్శిని సస్పెండ్ చేశారు. పూర్తి విచారణ, వివరాలు తెలియకముందే అతడికి ఆత్మకూరు మండలంలో పోస్టింగ్ సైతం ఇచ్చేశారు. ఈ క్రమంలో మరోసారి గ్రామంలో నిధుల గోల్‌మాల్‌పై దుమారం రేగింది. మరుగుదొడ్లు నిర్మించుకోకుండానే బిల్లులు కాజేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై ఫోర్జరీ సంతకాలతో బిల్లులు కాజేసిన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ పాలకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. నిర్మించకున్నా బిల్లులు.. గతంలో మంగళవారిపేట పంచాయతీ కార్యదర్శిగా శ్రీధర్ పని చేశారు. అయితే, పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలతో మే 4న ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ఇదే క్రమంలో పంచాయతీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టకుండానే బిల్లులు కొట్టేశారనే ఆరోపణలు గత రెండు రోజులుగా వెల్లువెత్తుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణాలు చేయకున్నా బిల్లులు ఎలా సాధ్యమయ్యాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తుండగా.. తమకేమీ తెలియకుండానే ఇలా జరిగిందంటూ ప్రజాప్రతినిధులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 50 మరుగుదొడ్లు మంజూరు కాగా, ఇందులో అసలు నిర్మించుకోని వారికి బిల్లులు వచ్చాయి. నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి మాత్రం సగం బిల్లులు, కొంత మందికి రెండుసార్లు బిల్లులు మంజూరయ్యాయి. పూర్తిగా కట్టుకున్న వారిలో కొంత మందికి మాత్రమే బిల్లులు రావడంతో ఇందులో ఎవరి హస్తం ఉందని, బిల్లులు ఎవరు కాజేసారో తెలియాల్సిందేననంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. రూ.6 లక్షలు డ్రా.. బిల్లుల విషయమై పాలకవర్గ సభ్యులు మాత్రం గతంలో పని చేసిన కార్యదర్శిపైనే ఆరోపణలు చేస్తున్నారు. నిధుల గోల్మాల్ విషయంలో అసలేం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇన్చార్జ్ కార్యదర్శి ఆధ్వర్యంలో బ్యాంకుకు వెళ్లి వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఇందులో పాత కార్యదర్శి తమ సంతకాలు ఫోర్జరీ చేసి సుమారు రూ.6 లక్షలు కాజేసి నర్సంపేటకు చెందిన నలుగురి ఖాతాల్లో జమచేసినట్లు సర్పంచ్ లావుడ్య రమేష్‌నాయక్, ఉప సర్పంచ్ ఉపేందర్ గుర్తించారు. ఈ మేరకు ఫోర్జరీగా గుర్తించిన చెక్కులను జిరాక్స్ తీయించి ఎంపీడీఓ సుమణవాణికి ఫిర్యాదు చేసి విచారణ చేపట్టాలని కోరారు. అలాగే, సంతకాలు ఫోర్జరీ చేసి డబ్బులు కాజేసిన కార్యదర్శిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సైకి సైతం ఫిర్యాదు చేశారు. కాగా, మరుగుదొడ్ల బిల్లులపై విచారణ జరిపి కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. -
గ్రామ వార్డు సచివాలయలపై బిగ్ డిబేట్
-
సంక్షేమ పాలనలో సరికొత్త అధ్యాయం
ఇంటి ముంగిటకే వచ్చి పింఛన్ అందజేస్తున్న సరికొత్త విధానం నవ్యాంధ్రలో నవచరిత్రకు శ్రీకారం.. గత 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో కనీ వినీ ఎరుగని రీతిలో ఒక ప్రభుత్వ పథకాన్ని నేరుగా లబ్ధిదారుడి ఇంటికే చేర్చిన ఘన చరితం.. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం..ప్రజల వద్దకే పాలన ఆవిష్కృతం.. ఒకే ఒక్క రోజులో లక్షలాది మంది లబ్ధిదారుల ఇంటి వద్దే పింఛన్ల పంపిణీతో ముఖ్యమంత్రి కల సాకారం.. ఇచ్చిన మాట మేరకు అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, దీర్ఘ వ్యాధిగ్రస్తులకు ఊరట కలిగించే విప్లవాత్మక నిర్ణయం సాక్షాత్కారం.. గతం ఎంతో బాధాకరం.. పింఛన్ కోసం ఎండనక.. వాననక.. చెట్ల కింద.. గుడి ముందు.. బడి వెనుక.. గుట్టల పైన.. గంటల తరబడి పడిగాపులు.. అడుగు తీసి అడుగెయ్యలేని దైన్య స్థితిలో మరొకరి తోడు.. ఆ రోజు పింఛన్ అందుతుందో లేదో తెలియని ఆందోళన.. మరుసటి రోజు కాళ్లీడ్చుకుంటూ మళ్లీ రావాలనే భయం.. వెరసి పలుచోట్ల పండుటాకులు అక్కడే ప్రాణాలొదిలిన దయనీయ పరిస్థితి.. ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించి, మాటల కోటలతో మైమరపించి.. ఆనక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మొహం చాటేసే నేతలు.. బాధితులకు తీరని వెతలు.. ఇక అలాంటి దుస్థితికి వైఎస్ జగన్ ప్రభుత్వం చరమగీతం.. ఎన్నెన్నో చెబుతారు కానీ, ఏం చేస్తారులే అనుకుంటున్న వేళ.. అసాధ్యమనుకున్నది సుసాధ్యమైన వేళ.. పండుటాకుల మోములో ఆనందం.. దివ్యాంగుల సంభ్రమాశ్చర్యం.. వితంతువుల్లో సంబరం.. అడుగు తీసి అడుగెయ్యలేని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొండంత ఊరట.. వెరసి వడివడి అడుగులతో ప్రజల వద్దకే ప్రజారంజక పాలన. సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు వలంటీరే స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను డబ్బులు ఇచ్చే సరికొత్త పాలనకు రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన ‘గడప వద్దకే పెన్షన్’ కార్యక్రమం 13 జిల్లాల్లో శనివారం ఉదయం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గ్రామ, వార్డు వలంటీర్లు వారి ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేశారు. ఒక్క పూటలో 42,81291 మందికి పింఛన్ల పంపిణీ పూర్తయింది. ప్రభుత్వ ఉద్యోగులకు వారి జీతం డబ్బులు 1వ తేదీనే బ్యాంకు ఖాతాలో టంచన్‌గా పడినట్టు పింఛన్ లబ్ధిదారులందరికీ కూడా 1వ తేదీనే వారి ఇంటి వద్దకే వలంటీరు వెళ్లి అందజేసి వచ్చారు. ఇంతకాలం పింఛన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడిన పింఛనుదారులు.. శనివారం తమ పింఛను డబ్బులు ఇవ్వడానికి వలంటీరే ఇంటి వద్దకు రావడం చూసి ఉబ్బితబ్బిబ్బయ్యారు. ప్రభుత్వం అందజేసిన మొబైల్ ఫోను, బయోమెట్రిక్ డివైస్‌ను వెంట తీసుకెళ్లిన వలంటీర్లు.. లబ్ధిదారునితో వేలి ముద్రలు తీసుకొని పింఛన్ డబ్బులు అందజేశారు. ఈ కార్యక్రమంలో 2,16,874 మంది వలంటీర్లు తొలి రోజే 80% పైగా లబ్ధిదారులకు రూ.1,019 కోట్లు పంపిణీ చేశారు. బాధ తప్పింది.. ఇతని పేరు కె.మహమ్మద్. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండల కేంద్రానికి చెందినవారు. రెండు కాళ్లూ లేవు. ప్రస్తుతం రూ. 3 వేల పింఛన్ అందుతోంది. ఇంతకుముందు ప్రతినెలా పింఛన్ కోసం పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లాలంటే మరొకరి సాయం అవసరం వచ్చేది. ఈ నెల నుంచి ఆ బాధ తప్పింది. శనివారం గ్రామ వలంటీర్ ఇంటి వద్దకే వచ్చి పింఛన్ మొత్తాన్ని అందజేశాడు. దీంతో మహమ్మద్ సంతోషం వ్యక్తం చేశాడు. ఆస్పత్రి వద్దకు వెళ్లి పింఛన్ ప్రకాశం జిల్లా రాచర్ల ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న చిట్టెం పోలయ్య అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామ వలంటీర్ ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న పోలయ్య వద్దకు వెళ్లి శనివారం పింఛను సొమ్ము అందజేశారు. తనలాంటి వారికి ఎంతో సహాయం చేస్తున్న సీఎం జగన్ చల్లగా ఉండాలని పోలయ్య ఆశీర్వదించాడు. ‘కొండంత’ కష్టం తగ్గింది పింఛను తీసుకోవాలంటే తాము పడే కొండంత కష్టం తొలగిపోయిందని సంబర పడుతున్నారు అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని గరుగుచింతలపల్లి గ్రామానికి చెందిన పింఛనుదారులు. ఈ గ్రామంలో పింఛను తీసుకోవాలంటే గ్రామానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం ఉన్న గుట్టను ఎక్కి నిరీక్షించాల్సి వచ్చేది. గ్రామంలో పింఛను పంపిణీకి సిగ్నల్స్ సరిగా ఉండవని, అధికారులు గ్రామంలోని పింఛన్‌దారులను గుట్టపైకి రప్పించి పింఛను పంపిణీ చేసేవారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఊతకర్రల సహాయంతో పింఛను పంపిణీ ప్రదేశానికి చేరుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం పింఛను తమ వద్దకే రావడంతో ఆ పింఛనుదారులు ఎంతో సంతోషపడుతున్నారు. తమకు ఎంతో గౌరవం కల్పించిన సీఎం జగన్‌కు పింఛనుదారులు కృతజ్ఞతలు తెలిపారు. తెలతెలవారగానే లక్ష్మీదేవి తలుపు తట్టింది చిత్రంలో పింఛన్ అందుకుంటూ కనిపిస్తున్న వృద్ధురాలి పేరు బత్సల కామమ్మ. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అమలపాడు గ్రామంలో ఉంటున్న ఈమెకు కిడ్నీ వ్యాధి ఓ పక్క కబళిస్తోంది. మంచానికే పరిమితమైన ఈమె గతంలో కుటుంబసభ్యుల సహకారంతో పింఛన్ కోసం కిలో మీటరు దూరంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఆరోజు కుటుంబసభ్యులు పనులకు వెళ్లేందుకు వీలుపడేది కాదు. నెట్వర్క్ పనిచేయకపోవడం, రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల కనీసం రెండు సార్లయినా తిరగాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితి నుంచి ఈమెకు శనివారంతో విముక్తి కలిగింది. తెలతెలవారగనే వలంటీర్ ఇంటి తలుపుతట్టి పింఛన్ అందించారు. దీంతో ఆ వృద్ధురాలి ఆనందానికి అవధుల్లేవు. నాయనా నా ఇంటికే లక్ష్మీదేవి తెచ్చారా అంటూ మురిసిపోయింది. ఆ దేవుడు చల్లగా చూడాలి అంటూ ముఖ్యమంత్రికి ఆశీర్వాదాలు అందించింది. పింఛన్ నడిచెళ్లింది.. ఈమె పేరు కరణం అప్పలనరసమ్మ. విజయనగరం జిల్లా కొమరాడ మండలం అర్ధం గ్రామ పంచాయతీ. ఆమె నడవలేదు. ఎక్కడికి వెళ్లాలన్నా కాళ్లు, చేతులు మీద పాక్కుంటూ వెళ్లాలి. ప్రతి నెలా చాలా దూరం వెళ్లి రెండు గంటలు పడిగాపులు కాసి డబ్బు తెచ్చుకునేది. ఆమెకు శనివారం కాలు కదప అవసరం లేకుండా వలంటీరు ఇంటికే వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు. ఎంతో శ్రమ పడి పింఛన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి నుంచి నా మనవడు జగన్ విముక్తి కలిగించారని ఆనందం వ్యక్తం చేసింది. ఇక ఎదురుచూపులు ఉండవ్.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన పమిడిముక్కల అన్నమ్మ పక్షవాతంతో గత కొంత కాలంగా మంచానికే పరిమితమైంది. అయితే గతంలో ఈమె పింఛన్ తీసుకోవాలంటే పంచాయతీ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ రెండు మూడు రోజులు ఎదురు చూపులు చూడాల్సి వచ్చేది. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. తెల్లవారు జామునే వలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులతో సహా సిబ్బంది అంతా ఇంటి తలుపు తట్టి నగదు చేతిలో పెట్టి వేలిముద్ర వేయించుకోవడంతో ఆమె ఆనంద బాష్పాలు జారవిడిచింది. శతాధిక వృద్ధురాలి కష్టాలు తీరాయి.. నా వయసు వందేళ్లు. గతంలో పింఛన్ తీసుకునేందుకు చాలా ఇబ్బందులు పడేదాన్ని. శరీరం సహకరించకపోయినా.. ఎలాగోలా పంపిణీ కేంద్రం వద్దకు చేరుకొని డబ్బుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మా కష్టాలు తీరుతున్నాయి. పొద్దున్నే వలంటీర్ నా ఇంటి వద్దకే వచ్చి పింఛన్ అందజేసి వెళ్లారు. – శరగడం అచ్చియ్యమ్మ, శతాధిక వృద్ధురాలు, యలమంచిలి, విశాఖ జిల్లా హమ్మయ్య.. ఇప్పుడు బాగుంది.. ఈ ఫొటోలో ఉన్న వృద్ధురాలి పేరు కె.సువర్చల. కడప నగరంలోని ఏపీహెచ్‌బీ కాలనీలో నివసిస్తోంది. ఈమె కిడ్నీ వ్యాధిగ్రస్తురాలు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈమెకు రూ. 10 వేల పింఛన్ ఇస్తున్నారు. ప్రతినెలా పింఛన్ తీసుకోవాలంటే ఈమె కడప నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఏదైనా సమస్య వచ్చి పింఛన్లు పంచకపోతేనో, సమయానికి పింఛన్ పంచే వ్యక్తి లేకపోతే ఉసూరుమంటూ ఇంటికి రావాల్సి వచ్చేది. ఇంటి నుంచి కార్పొరేషన్ దగ్గరికి పోవాలంటే ఆటో మాట్లాడుకొని వెళ్లాలి. ఇప్పుడు వలంటీర్ ఇంటి వద్దే పింఛన్ ఇవ్వడంతో సమయం, ఆటో ఖర్చులు అన్నీ ఆదా అయ్యాయని ఈమె చెబుతోంది. శ్రమ, ఖర్చు తగ్గింది.. ఇంటి వద్దకే పింఛన్ రావడంతో శ్రమ తగ్గింది. గతంలో ఆయా పింఛన్ కేంద్రాల వద్ద సిబ్బంది వచ్చే వరకు గంటల తరబడి వేచి ఉండవలసి వచ్చేది. నడవలేని స్థితిలో ఉండటంతో రిక్షాలో పింఛన్ ఇచ్చే కేంద్రానికి వెళ్లి రావడానికి రూ. 200 ఖర్చు అయ్యేది. ఇంటికి వచ్చి పింఛన్ ఇవ్వడం ఎంతో మంచి పథకం. – ఆదిరెడ్డి నారాయణమ్మ,5వ వార్డు, పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా మాలాంటి వారికి ఎంతో ఉపశమనం నడవలేని ఇద్దరు ఆడ పిల్లలను మూడు చక్రాల బండిపై తోసుకెళ్తున్న ఈమె పేరు కిన్నెర నరసమ్మ. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం గుడిపాడులో నివాసం ఉంటున్నారు. ఈమెకు భర్త లేరు. కుటుంబాన్ని పోషించుకునే శక్తి లేదు. నెలానెలా పింఛన్ కోసం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకు దగ్గరికి ఇద్దరు పిల్లలను మూడు చక్రాల బండిపై తీసుకొని వెళ్లాల్సి వచ్చేది. అక్కడ రద్దీ ఎక్కువ ఉంటే మరో రోజు శ్రమ తప్పేది కాదు. ఒక్కోసారి రెండు మూడు సార్లు తిరగాల్సి వచ్చేది. రెండు మూడేళ్లుగా గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద పింఛన్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా మూడు సార్లు తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేశారు. ఇది మాలాంటి వారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. శనివారం ఉదయమే ఇంటి దగ్గరికే వచ్చి కేవలం మూడు నిముషాల్లో పింఛన్ ఇచ్చారు. ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం. దేవుడిలా ఆదుకున్నారు.. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం కె.ఇల్లిందలపర్రు గ్రామానికి చెందిన పిల్లి దుర్గారావు గతంలో సింగపూర్‌లో భవన నిర్మాణ కార్మికునిగా పనిచేశాడు. అతనికి ఆరేళ్ల కిందట ఒక పాప పుట్టింది. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఆ పాపకు కిడ్నీ సమస్యలు మొదలయ్యాయి. వైద్యం కోసం విజయవాడ, హైదరాబాద్, చెన్నై ఇలా తెలిసిన ఆస్పత్రుల చుట్టూ తిప్పాడు. సంపాదించిన డబ్బులన్నీ అయిపోయాయి. గత ప్రభుత్వంలో పెన్షన్ కోసం, తన పాపను ఆదుకోవాలని అధికారుల చుట్టూ తిరిగాడు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ పాపకు 15 రోజులకు ఒకసారి ఏలూరు ఆసుపత్రికి తీసుకువెళ్లి డయాలసిస్ చేయించాలి. లేకపోతే ముక్కు నుంచి రక్తం వస్తుంది. పుట్టెడు కష్టాన్ని తట్టుకుంటూ ఉన్న ఆస్తులను అమ్ముకుంటూ బిడ్డ బాగుంటే చాలని ఎదురు చూస్తున్న ఆ దంపతులను ఈ ప్రభుత్వం ఆదుకుంది. డయాలసిస్ రోగులకు రూ. 10 వేల పింఛన్ అందిస్తున్నారని తెలిసి దరఖాస్తు చేశారు. వెంటనే ఆ పాపకు పింఛన్ మంజూరు అయ్యింది. ప్రతి నెల పంపిణీ కేంద్రం వద్దకు పాపను తీసుకెళ్లి పింఛన్ తెచ్చుకోవడానికి ఇబ్బంది ఉండేది. జగన్ పుణ్యమా అని ఆ సమస్య తీరింది. జగన్‌కు జన్మంతా రుణపడి ఉంటామని ఆ దంపతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాట ఇచ్చాడు.. నెరవేర్చాడు దివ్యాంగుడైన ఇతని పేరు మందా రమేష్. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం నెల్లబల్లిరెట్టపల్లి. పింఛన్ కోసం ప్రతి నెలా ఇంటి నుంచి కిలోమీటరు దూరంలోని పంచాయతీ కార్యాలయానికి వెళ్లి గంటల తరబడి పడిగాపులు కాసి, ఒక్కో సారి మళ్లీ మళ్లీ వెళ్లి తెచ్చుకున్న సందర్భాలెన్నో. శనివారం తెల్లారేసరికి గ్రామ సచివాలయ వలంటీర్ ఇతని ఇంటికి వెళ్లి దివ్యాంగ పింఛన్ అందజేశాడు. పింఛన్ తీసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. జగనన్న నాకు మాట ఇచ్చాడు.. నెరవేర్చాడని ఆనందం వ్యక్తం చేశాడు. సరిగ్గా రెండేళ్ల కిందట వైఎస్ జగన్ కలిసిన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘ఆ రోజు ప్రజాసంకల్పయాత్ర గూడూరు రూరల్‌లోని కొండాగుంట సమీప ప్రాంతానికి వచ్చేటప్పటికి నెల్లబల్లిరెట్టపల్లి నుంచి 12 కి.మీ. ట్రై సైకిల్‌పై అక్కడికి వెళ్లి జగన్‌ను కలిశా. ఎందుకు బాబు ఇంత కష్ట పడడం అని జగన్ సార్ అన్నారు. ప్రతి నెల పింఛన్ తీసుకునేందుకు కిలోమీటరు దూరం ఇలానే వెళ్తున్నాను.. మిమ్ములను చూసేందుకు ఇక్కడదాక రాలేమా అని చెప్పాను. ఆ సందర్భంగా దివ్యాంగులు పడుతున్న కష్టాన్ని ఆయనకు విన్నవించా. దీంతో జగనన్న ధైర్యం ఇస్తూ నేను ఉన్నాను.. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్ ఇంటి వద్దకే వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు మా గ్రామ వలంటీర్ పొద్దునే ఇంటి వద్దకు వచ్చి పింఛన్ ఇచ్చాడు. ఇది నేను కలలో కూడా అనుకోలేదు’ అని చెప్పాడు. తొంభై ఏళ్లకు పింఛన్.. ఇంటి ముంగిటకే ఈమె పేరు ఎం.నీల (91). చిత్తూరు జిల్లా సత్యవేడు పంచాయతీ దళితవాడకు చెందిన ఈమె భర్త కేశవన్ చనిపోయిన 31 ఏళ్ల తర్వాత శనివారం వితంతు పింఛను అందుకోవడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. పెళ్లిళ్లు అయిన అనంతరం పిల్లలు వేరు కాపురం పెట్టి తల్లిని ఒంటరిగా వదిలేశారు. ఎన్నిసార్లు పింఛన్ కోసం తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆమె రాజీవ్‌నగర్‌లో ఉంటోంది. ఈమె పరిస్థితి గమనించిన వలంటీర్ గ్రామ సచివాలయంలో పేరు నమోదు చేయించాడు. వెంటనే వృద్ధాప్య పింఛన్ మంజూరైంది. ‘30 ఏళ్లు నిరాశ చెందిన నాకు ప్రాణం పోయేలోపు పింఛన్ వస్తుందో రాదో అనుకున్నా. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని నాకూ పింఛన్ వచ్చింది. నా మందుల ఖర్చుకు పింఛన్ డబ్బు తోడవుతుంది’ అని ఆమె ఆనందపడింది. -
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో విప్లవాత్మక మార్పు
ఈ చర్చలో చంద్రబాబు పాల్గొనక పోవడం దురదృష్టకరం. పాల్గొని ఉండుంటే వాళ్లు ప్రవేశపెట్టిన జన్మభూమి కమిటీలు ఎలా విఫలమయ్యాయో.. గ్రామ, వార్డు సచివాలయాలు ఏవిధంగా విజయవం తమవుతున్నాయో ఆయనకు తెలిసేది. సభకు రాలేకపోయినా టీవీలో చూస్తూ నాలెడ్జ్ పెంచుకుంటారని భావిస్తున్నా. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పు రాబోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు. వివక్షకు తావులేకుండా అర్హులందరికీ ప్రయోజనాలు అందించడమే గ్రామ సచివాలయాల ఏర్పాటు లక్ష్యమన్నారు. బుధవారం అసెంబ్లీలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు కల్పించడం అన్నది రాష్ట్రంలో మినహా దేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల ద్వారా అక్షరాల 1,28,858 మందికి అపాయింట్మెంట్లు ఇచ్చామని, వాళ్లంతా గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్నారని చెప్పారు. నిజంగా ఇది చాలా సంతోషాన్ని ఇచ్చే అంశమని పేర్కొన్నారు. 11,158 గ్రామ, 3,786 వార్డు సచివాలయాల్లో (మొత్తం దాదాపు 15 వేలు) 1,28,858 మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరారని వివరించారు. ఎవరూ వేలెత్తి చూపకుండా నియామకాలు సచివాలయం ఉద్యోగ పరీక్షలను దాదాపు 8 రోజుల పాటు 20 లక్షల మంది రాశారని, ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ పరీక్షలు నిర్వహించామని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా అధికారులందరికీ హ్యాట్సాఫ్ చెబుతున్నానన్నారు. ఏ ఒక్కరూ వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకుండా అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించినందుకు సెక్రటరీల దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ల వరకు.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రులనూ ఈ సందర్భంగా ప్రశంసిస్తున్నానని తెలిపారు. 1,28,858 ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 82.5 శాతం ఉద్యోగాలు వచ్చాయంటే.. ఏ స్థాయిలో విప్లవాత్మక బాట ఏర్పడిందో చెప్పాల్సిన అవసరం లేదని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇందులో 51.9 శాతం మంది బీసీలున్నారని చెప్పారు. ఈ ఉద్యోగాలకు అనుబంధంగా 2.65 లక్షల పైచిలుకు గ్రామ వలంటీర్లను.. ప్రతి 50 ఇళ్లకు ఒకరిని నియమించామని వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇలా.. – వలంటీర్లు అవినీతికి పాల్పడ కూడదనే ఉద్దేశంతో నెలకు రూ.5 వేల చొప్పున జీతం ఇస్తున్నాం. ఎక్కడైనా, ఎవరైనా వివక్ష, పక్షపాతం చూపించినా, లంచాలు తీసుకున్నా.. సీఎం కార్యాలయానికి కనెక్ట్ చేసిన టోల్‌ఫ్రీ నంబర్ 1902కు ఫోన్ చేయొచ్చు. ఎక్కడైనా, ఎవరైనా తప్పులు చేస్తే తొలగిస్తామని స్పష్టంగా చెప్పాం. సచివాలయ ఉద్యోగులు అవినీతికి పాల్పడినా చర్యలుంటాయి. – ప్రతి 50 ఇళ్లకు సంబంధించిన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ నేరుగా డోర్ డెలివరీ చేసే విధంగా ఈ వ్యవస్థను రూపొందించాం. ప్రతి 2 వేల జనాభాకు ఒక గ్రామ సెక్రటేరియట్ ఉంటుంది. – సంతృప్త స్థాయిలో లబ్ధిదారుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తాం. ఆయా పథకాలకు ఉండాల్సిన అర్హత, జాతాలో పేరు లేకపోతే ఎలా నమోదు చేసుకోవాలనే విషయాలను కూడా ఆ పక్కనే ప్రదర్శిస్తాం. దీంతో అనర్హులెవరైనా ఉంటే తెలిసిపోతుంది. గ్రామసభలు, సోషల్ ఆడిట్ ద్వారా వారి పేర్లు తొలగిస్తాం. ఇందుకోసం పర్మినెంట్ సోషల్ ఆడిట్ మెకానిజాన్ని గ్రామ సెకట్రేరియట్లలో అంతర్భాగం చేస్తున్నాం. – దాదాపు 500కు పైగా సేవలను గ్రామ, వార్డు సచివాలయాలు అందించనున్నాయి. ఏదైనా సర్టిఫికెట్, రేషన్ కార్డు, పెన్షన్ కార్డు కావాలంటే 72 గంటల్లో ఇస్తామా? వారం రోజుల్లో ఇస్తామా? లేక రెండు వారాల్లో ఇస్తామో స్పష్టంగా వివరణ ఇస్తూ తెలియజేసే విధంగా డిస్ప్లే ఉంటుంది. – వారానికి ఒక రోజు స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలు సమస్యలు తెలుసుకునేందుకు అధికారులు అందుబాటులో ఉంటారు. ఈ సమస్యలపై మంగళవారం నేను నేరుగా సమీక్షిస్తున్నా. వారానికి ఒకరోజు జరుగుతున్న స్పందన కార్యక్రమం సచివాలయాల్లో ప్రతిరోజు ఉంటుంది. తద్వారా పరిపాలన ముఖచిత్రం మారబోతోంది. -
‘సచివాలయ’ పరీక్షలకు ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం అన్ని బస్, రైల్వే స్టేషన్లలో హెల్ప్ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు పరీక్షల నిర్వహణ కన్వీనర్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పరీక్ష కేంద్రం చిరునామా వంటి విషయాల్లో హెల్ప్‌డెస్క్ సిబ్బంది సహాయకారిగా ఉంటారన్నారు. సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి సెపె్టంబర్ 1నుంచి 8వ తేదీ వరకు పోస్టుల వారీగా రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో 1,26,728 ఉద్యోగాలకు దాదాపు 21.69 లక్షల మంది పోటీ పడుతున్నందున పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్టు వివరించారు. తొలిరోజు ఉదయం 36,449 ఉద్యోగాలకు పరీక్ష నిర్వహిస్తుండగా.. 12,54,034 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం తర్వాత 11,158 పోస్టులకు పరీక్ష నిర్వహిస్తుండగా.. 2,95,907 మంది హాజరు కావాల్సి ఉందని చెప్పారు. తొలి రోజు పరీక్షలకు మూడింట రెండొంతుల మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. ఇందుకోసం మండల కేంద్రాలు, పట్టణాల్లో 4,478 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్లకు జతపరిచి ఉన్న నియమ నిబంధనలను పరీక్ష కేంద్రానికి వచ్చే ముందే సరిచూసుకుని రావాలని కోరారు. వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ఒకరోజు ముందే చూసుకోవడం.. రాత పరీక్ష మొదలయ్యే సమయానికి గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవడం మంచిదని తెలిపారు. పరీక్షల నిర్వహణలో పోలీసు శాఖ సేవలను పెద్దఎత్తున ఉపయోగించుకుంటున్నట్టు చెప్పారు. హెల్ప్ డెస్క్‌లలో పెద్ద సంఖ్యలో వలంటీర్లను, 1,22,554 మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని చెప్పారు. 1,835 వాహనాలను కూడా ఉపయోగించుకుంటున్నట్టు చెప్పారు. ప్రతి జిల్లాలో 500 బస్సులు ఒకే రోజు దాదాపు 15 లక్షల మంది రాత పరీక్షలకు హాజరవుతున్న నేపథ్యంలో.. ప్రతి జిల్లాలో 500 బస్సులను పరీక్షా కేంద్రాలకు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు అంగీకరించారని కన్వీనర్ తెలిపారు. మండలాల వారీగా ఏ కేంద్రంలో ఎంత మంది రాతపరీక్షకు హాజరవుతారన్న వివరాలను ఆర్టీసీకి అందజేశామన్నారు. ఆటోల ద్వారా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నా.. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పట్టణాల్లో ఆటో యూనియన్లకు ఆ పట్టణంలో పరీక్ష జరిగే కేంద్రాల వివరాలు కూడా ముందుగా తెలియజేసినట్టు చెప్పారు. దివ్యాంగులకు 1,588 మంది సహాయకులు పరీక్షలకు హాజరయ్యే దివ్యాంగులకు సహాయకులుగా 1,588 మందిని అనుమతించనున్నట్టు చెప్పారు. సహాయం కావాలని కోరిన దివ్యాంగులకు ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసిందని, ప్రభుత్వం ఎంపిక చేసిన ఇంటర్ విద్యార్థులను మాత్రమే సహాయకులుగా అనుమతిస్తారని వివరించారు. 8 రోజులు జరిగే పరీక్షలకు 32,839 మంది దివ్యాంగులు హాజరవుతారని పేర్కొన్నారు. పట్టణాల్లో ట్రాఫిక్ నియంత్రణ అభ్యర్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అన్ని పట్టణాల్లో ఆదివారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీని కోరినట్టు తెలిపారు. పరీక్ష కేంద్రాలున్న ప్రాంతంలో ట్రాఫిక్‌ను మళ్లించడం.. అవసరం ఉన్నచోట ఊరి బయట వాహనాలు నిలుపుదల వంటి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పరీక్షా కేంద్రం చుట్టుపక్కల వంద మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేస్తారని, ఆ ప్రాంతంలో ఉండే జిరాక్స్ సెంటర్లు మూసివేస్తారని చెప్పారు. రాతపరీక్ష పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాల్లో ప్రశ్నాపత్రాలతో పాటు పరీక్షా సామగ్రిని ఉంచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసినట్టు వివరించారు. - అభ్యర్థుల హాల్ టికెట్‌పై ఫొటో అస్పష్టంగా ఉన్నా.. కనిపించకుండా చిన్నదిగా ఉన్నా.. అసలు ఫొటోనే ముద్రించకున్నా.. ఫొటో ఉన్నప్పటికీ అభ్యర్థి సంతకం లేకపోయినా.. సదరు అభ్యర్థులు గుర్తింపు కార్డుతో పాటు అదనంగా మూడు పాస్‌పార్ట్ ఫొటోలను తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. ఆ ఫొటోలపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలి. లేదంటే పరీక్షకు అనుమతించరు. - పరీక్ష రాసే సమయంలో అభ్యర్థి ఏదైనా అవసరానికి ఓఎమ్మార్ షీట్‌పై వైట్నర్ లేదా ఏదైనా మార్కర్ వంటివి వాడితే ఏకంగా అనర్హులే అవుతారు. పరీక్ష హాల్లోకి బాల్ పాయింట్ పెన్ మినహా వైట్నర్, మార్కర్ వంటివి తీసుకొచ్చినట్టు గుర్తించినా వారిని అనర్హులుగా ప్రకటిస్తారు. - అభ్యర్థులకు ఇచ్చే ఒరిజనల్ ఓఎమ్మార్ షీట్‌తో పాటు నకలు ఓఎమ్మార్ కూడా ఉంటుంది. వీటి మధ్యలో కార్బన్ పేపర్ ఉంటుంది. పరీక్ష ముగిసిన తరువాత అభ్యర్థులు ఒరిజనల్ షీట్ ఇన్విజిలేటర్‌కు ఇచ్చి.. నకలును ఇంటికి తీసుకెళ్లవచ్చు. - సమయం పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్షా కేంద్రాన్ని విడిచి వెళ్లడానికి అనుమతించరు. ఎవరైనా అభ్యర్థి నిర్ధేశిత సమయానికంటే ముందుగా పరీక్ష కేంద్రాన్ని విడిచి వెళితే అనర్హులవుతారు. - జెల్ పెన్ లేదా ఏ ఇతర రాత వస్తువులతో ఓఎంఆర్ షీట్‌పై ఏదైనా రాసినా జవాబు పత్రం చెల్లదు. -
‘గ్రామ, వార్డు సచివాలయ’ పరీక్షలు అభ్యర్థులకు అనుకూలంగా..
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీలో అర్హులైన అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న అన్ని పరీక్షలు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రాయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అనేకమంది అభ్యర్ధులు తమ విద్యార్హతలకు తగ్గట్టుగా నాలుగైదు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పరీక్షలన్నిటికీ హాజరయ్యేందుకు వీలుగా ప్రభుత్వం వారికి అనుకూలంగా వేర్వేరు తేదీలను నిర్ణయిస్తోంది. అలాగే, ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు కూడా వీలయ్యేలా చర్యలు తీసుకుంటోంది. వారికి వేర్వేరు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తే, మధ్యాహ్నం పరీక్షకు సకాలంలో చేరుకోడానికి అభ్యర్థులు అనేక వ్యయ ప్రయాసలకు గురయ్యే అవకాశం ఉన్నందున అలాంటి వారు రెండు పరీక్షలను ఒకే కేంద్రంలో రాసేలా చర్యలు తీసుకుంటోంది. రెండు మూడ్రోజుల్లో పరీక్షల షెడ్యూలు కాగా, రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒకే విడతలో 1,26,728 ప్రభుత్వోద్యోగాల భర్తీకి ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లకు నిరుద్యోగులు అనూహ్యంగా స్పందించారు. శనివారం నాటికి 21,96,171 దరఖాస్తులు రావడంతో పరీక్షల నిర్వహణకు సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పరీక్షా కేంద్రాల్లో ఫర్నీచర్, తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులు, ఇన్విజిలేటర్లు, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను నియమిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ జె.విజయకుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. వచ్చే నెల 1 నుంచి 8 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు ఇదిలా ఉంటే.. అభ్యర్థులు అరగంటకు ముందుగానే పరీక్షా కేంద్రానికి రావాలని, ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించేదిలేదని విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. కాలిక్యులేటర్లు, మొబైల్ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. దరఖాస్తుల గడువు పొడిగింపు రాష్ట్రంలో వరదల కారణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 10వ తేదీ శనివారం అర్ధరాత్రి 11.59 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి 11.59 గంటల వరకు పొడిగించారు. వరదల కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ముంపు ప్రాంతాలలో యువత విద్యుత్ అంతరాయాల కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు. వలంటీర్ పోస్టులకు 26న రెండో నోటిఫికేషన్ ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు వలంటీర్ల పోస్టుల భర్తీకి ఈ నెల 26న రెండో నోటిఫికేషన్ జారీచేసే ఆలోచనలో ఉన్నామని విజయకుమార్ తెలిపారు. ఈ ఒక్కసారికి మాత్రమే కేంద్రస్థాయిలో నియామక ప్రక్రియ జరుగుతుందని, ఆ తరువాత నుంచి ఏర్పడే ఖాళీలను జిల్లా కలెక్టర్లు, పురపాలక శాఖలోని ప్రాంతీయ కార్యాలయ అధికారులు భర్తీచేస్తారని చెప్పారు. -
సెప్టెంబర్ 1న సచివాలయ ఉద్యోగాల పరీక్ష
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలకు చేపట్టే ఉద్యోగ నియామకాలకు సెప్టెంబరు 1వ తేదీన రాత పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఒకే విడతలో దాదాపు 1,33,494 కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీటిని పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలుగా పేర్కొనడంతో పాటు రాతపరీక్ష విధానంలో భర్తీ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష విధానం, విద్యార్హతలు, పరీక్ష విధానంతో పాటు పరీక్ష తేదీతో గురువారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో పాటు అవసరమైన 12 శాఖల ఉన్నతాధికారులు రోజూ సమావేశమవుతున్నారు. కాగా ఈ ఉద్యోగాలకు దాదాపు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి దాకా వివిధ ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసే పలువురు కూడా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే రెండు రోజుల పాటు (సెప్టెంబర్ 2వ తేదీ కూడా) రాత పరీక్షలు నిర్వహించాలని కూడా ప్రభుత్వ అధికారుల మధ్య చర్చ జరుగుతుంది. అయితే ఒకే రోజు పరీక్ష నిర్వహణకే అధికారులు మొగ్గు చూపుతున్నారు. కాగా రాతపరీక్షను పూర్తిగా మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో నిర్వహిస్తారు. అధికారుల సమాచారం మేరకు 150 మార్కులకు 150 ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో ఉంటాయి. ఇందులో 75 మార్కులకు జనరల్ నాలెడ్జి ప్రశ్నలు, మిగిలిన 75 మార్కులకు సంబంధిత ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఆధారంగా ప్రశ్నలు ఉంటాయని సమాచారం. -
ఊరికి దారేది..?
సాక్షి, సిర్పూర్(టి): మండలంలోని గ్రామాల రోడ్లు అధ్వానంగా మారాయి. ఏళ్లు గడుస్తున్నా రోడ్లు మరమ్మతులకు నోచుకోకపోవడంతో రోడ్లు గుంతలమయమైన ప్రతీ రోజు ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అసలు ఊళ్లలోకి వెళ్లేందుకు రోడ్లు ఉన్నాయా? అన్న పరిస్థితి నెలకొంది. ఇది పరిస్థితి.. మండలంలోని ఇటిక్యాలపహాడ్ గ్రామం మండలకేంద్రం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉండగా జ్యోతినగర్ ప్రధాన రహదారి నుంచి రోడ్డు పూర్తిగా ఇసుకతో ఉండటంతో ఇబ్బందులు తప్పడంలేదు. ఇటిక్యాలపహాడ్ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వాహనాల రాకపోకలు కొనసాగడంలేదు. మండలంలోని చీలపల్లి గ్రామం మండలకేంద్రం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉండగా, రోడ్డు మట్టికొట్టుకుపోయి కంకరతేలడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. లోనవెల్లి గ్రామానికి రోడ్డు వసతి ఉన్నప్పటికీ బీటీరోడ్డు పూర్తిగా కంకరతేలింది. సిర్పూర్(టి)–కౌటాల ప్రధాన రహదారి వెంబడి కర్జపల్లి క్రాస్‌రోడ్డు నుంచి లోనవెల్లి గ్రామం వరకు 4 కిలోమీటర్ల దూరం రోడ్డు పూర్తిగా కంకరతేలి గుంతలమయంగా మారింది. అదేవిధంగా డోర్పల్లి గ్రామానికి వెళ్లే 4 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారి వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం.. గుంతలు, మట్టి, ఇసుక రోడ్లతో ప్రతీ రోజు ఇబ్బందులకు గురవుతున్నా అధికారులు మాత్రం మరమ్మతు చర్యలు చేపట్టడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట అత్యవసర సమయాల్లో గ్రామాల నుంచి మండలకేంద్రానికి, పట్టణాలకు వెళ్లేందుకు పడే ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతుందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు వసతి లేని గ్రామాలకు రోడ్డు వసతి కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తరుచూ వాహనాల మరమ్మతులు... మండల కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా ఉండటంతో వాహనాలు తరుచూ మరమ్మతులు చేయించాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. ఇటిక్యాలపహాడ్ గ్రామానికి వెళ్లే రహదారిలో మూడు వాగులు ఉండటంతో వాహనాల్లో ప్రయాణికులను వాహనాల నుంచి దింపి వాగులు దాటిస్తున్నారు. వాగుల్లో వాహనాలు కూరుకుపోవడంతో తరచూ వాహనాలు పాడవుతున్నాయని, దీంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొంటున్నారు. ఇబ్బందులకు గురవుతున్నాం లోనవెల్లి క్రాస్‌రోడ్డు నుంచి లోనవెల్లి గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా గుంతలు ఏర్పడి కంకరతేలింది. మండలంలోని చీలపల్లి, ఇటిక్యాలపహాడ్, డోర్పల్లి గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. అధికారులు స్పందించి రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు అధికారులు రోడ్డు వసతి కల్పించాలి. – ప్రసాద్, లోనవెల్లి అధికారులు స్పందించాలి మండలంలోని గ్రామాలకు వెళ్లేందుకు ప్రధాన రహదారులు గుండా వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర సమయాల్లో వాహనాల రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. ఏళ్లుగా రోడ్డు వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి. – సురేశ్, సిర్పూర్(టి) -
‘కష్ట’ర్లు
♦ నాలుగైదు క్లస్టర్లకు ఒకరే కార్యదర్శి ♦ 179 క్లస్టర్లలో పోస్టులు ఖాళీ ♦ అస్తవ్యస్తంగా పల్లె పాలన ♦ గ్రామ సచివాలయాల వద్ద ప్రజల పడిగాపులు దేశానికి పట్టుగొమ్మలైన పల్లెల్లో పాలన కుంటుపడింది.. కార్యదర్శుల్లేక రోజు రోజుకు కునారిల్లుతున్నాయి. స్మార్ట్‌విలేజ్ అంటూ హడావుడిచేసిన సర్కార్ ఆ తర్వాత ఆ ఊసెత్తడం లేదు. కనీసం పల్లెల్లో పాలనపై కూడా దృష్టి పెట్టడం లేదు. కేంద్రం నుంచి నేరుగా వచ్చే నిధులను దారి మళ్లిస్తూ దొడ్డిదారిన పెత్తనం చెలాయిస్తోంది. సాక్షి, విశాఖపట్నం : గ్రామ సచివాలయాలుగా పిలవబడే పంచాయతీ కార్యాలయాలు ఎప్పుడు చూసినా తాళాలు వేసే కన్పిస్తున్నాయి. అవసరానికి తగ్గట్టుగా కార్యదర్శుల్లేక ఈ కార్యాలయాల్లో పాలన పట్టాలు తప్పింది. ఉన్న కొద్ది మంది కార్యదర్శులపై పనిభారం పెరిగి పోవడంతో వారానికో రోజు కూడా కార్యాలయాల్లో అందుబాటులో ఉండలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 925 పంచాయతీలున్నాయి. 2 నుంచి 5 పంచాయతీల కొకటి చొప్పున 558 క్లస్టర్లుగా కుదించారు. కనీసం ఈ క్లస్టర్లకైనా పూర్తిస్థాయిలో కార్యదర్శులున్నారా అంటే అదీలేదు. 558 క్లస్టర్లుకు కేవలం 379 మంది కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. 179 క్లస్టర్లలో పోస్టులు ఖాళీ : రూ.5 లక్షలపైబడి ఆదాయమున్న గ్రేడ్-1 క్లస్టర్లు 77 ఉంటే వాటి పరిధిలో 61 క్లస్టర్లకు మాత్రమే కార్యదర్శులున్నారు. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయమున్న గ్రేడ్-2 క్లస్టర్లు 50 ఉంటే 39కి మాత్రమే కార్యదర్శులున్నారు. ఇక రూ.లక్ష నుంచి రూ.3 లక్షల ఆదాయమున్న గ్రేడ్-3 క్లస్టర్లు 151 ఉంటే.. కేవలం 49 చోట్లే కార్యదర్శులున్నారు. ఇక రూ.లక్ష లోపు ఆదాయం ఉన్న 280గ్రేడ్-4 క్లస్టర్లకు గాను 230 మంది కార్యదర్శులున్నారు. 2013లో 55 మంది కాంట్రాక్టు కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయగా.. ఏపీపీ ఎస్సీ ద్వారా 155 మందిని కొత్తగా నియమించడంతో ఆ మాత్రమైనా కార్యదర్శులున్నారు. లేకపోతే మరీ ఘోరంగా ఉండేది. ఇంకా 179 క్లస్టర్లకు కార్యదర్శులు లేకపోవడం వల్ల వీటి పరిధిలో ఉన్న సగానికి పైగా పంచాయతీలు దిక్కూమొక్కూలేని అనాథల్లా తయారయ్యాయి. పంచాయతీల్లో వారానికోరోజే.. కార్యదర్శుల కొరత కారణంగా నాలుగైదు క్లస్టర్స్ కొకరు చొప్పున కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంటే ఒక్కో కార్యదర్శిపై ఐదునుంచి 10 పంచాయతీల భారం పడింది. ప్రతీనెలా 1 నుంచి 10వ తేదీ వరకు పింఛన్ల పంపిణీలో తలమునకలవ్వాల్సి వస్తోంది. ఆ తర్వాత సమావేశాలు.. సమీక్షలు, పన్నుల వసూళ్లంటూ ఊళ్లమ్మట తిరగడంతో నెలలో పట్టుమని నాలుగైదురోజులు కూడా కార్యాలయాల్లో ఉండలేని పరిస్థితి. కొంతమంది అయితే ఇదేఆసరాగా చేసుకుని సొంత పనులు చక్కబెట్టుకుంటూ కాలం గడిపేస్తున్నారు. లక్ష్యానికి దూరంగా పన్నుల వసూలు జిల్లాలో పన్నుల వసూలు డిమాండ్ రూ.38 కోట్లు కాగా మరో నెలలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా.. రూ.13కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. మరో పక్క జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఎన్వోసీలు ఇలా పనుల కోసం వచ్చే సామాన్య ప్రజలు కార్యదర్శుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సి వస్తోంది. చివరకు మిగిలింది ఆరుగురే.. ఖాళీ పోస్టులను భర్తీచేయాల్సిన సర్కార్ ఆ ఊసెత్తకుండా వివిధ శాఖల్లో అదనపు సిబ్బందిని పంపించాలన్న ఆలోచనతో జీవో 966ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలకు లేఖలు రాసినా పెద్దగా స్పందన రాలేదు. కేవలం 19 మంది మాత్రమే కార్యదర్శులుగా చేరేందుకు ఆసక్తిచూపగా.. డిగ్రీ అర్హత ఉన్న రెగ్యులర్ ఉద్యోగులను పరిగణనలోకి తీసుకోవాలని తొలుత జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 10మందిని అర్హులుగా నిర్ధారించారు. కానీ తాజాగా జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉన్న ఉద్యోగులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని చెప్పడంతో దరఖాస్తు చేసిన అటెండర్ స్థాయి సిబ్బందిని జాబితా నుంచి తప్పించడంతో చివరికి మిగిలింది ఆరుగురే. వీరికి శిక్షణ కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు. వెనక్కి వెళ్లనున్న డిప్యుటేషన్ సిబ్బంది మరో పక్క ఇప్పటికే డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న 22 మందిలో ఒకరు లాంగ్ లీవ్‌లో ఉండగా.. మిగిలిన 21మంది పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. 14 ఏళ్లుగా పనిచేస్తూ, పదోన్నతులు పొందే అవకాశాన్ని కోల్పోతుండడంతో సొంత శాఖలకు వెళ్లేందుకు ఆసక్తిచూపుతున్నారు. వీరు కూడా వెళ్లిపోతే పరిస్థితి మరీ ఘోరంగా తయారవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయకుంటే పంచాయతీల పాలన మరింత కుదేలయ్యే పరిస్థితి నెలకొంది.