ఈ చర్చలో చంద్రబాబు పాల్గొనక పోవడం దురదృష్టకరం. పాల్గొని ఉండుంటే వాళ్లు ప్రవేశపెట్టిన జన్మభూమి కమిటీలు ఎలా విఫలమయ్యాయో.. గ్రామ, వార్డు సచివాలయాలు ఏవిధంగా విజయవం తమవుతున్నాయో ఆయనకు తెలిసేది. సభకు రాలేకపోయినా టీవీలో చూస్తూ నాలెడ్జ్ పెంచుకుంటారని భావిస్తున్నా.
– వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పు రాబోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. వివక్షకు తావులేకుండా అర్హులందరికీ ప్రయోజనాలు అందించడమే గ్రామ సచివాలయాల ఏర్పాటు లక్ష్యమన్నారు. బుధవారం అసెంబ్లీలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు కల్పించడం అన్నది రాష్ట్రంలో మినహా దేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల ద్వారా అక్షరాల 1,28,858 మందికి అపాయింట్‌మెంట్లు ఇచ్చామని, వాళ్లంతా గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్నారని చెప్పారు. నిజంగా ఇది చాలా సంతోషాన్ని ఇచ్చే అంశమని పేర్కొన్నారు. 11,158 గ్రామ, 3,786 వార్డు సచివాలయాల్లో (మొత్తం దాదాపు 15 వేలు) 1,28,858 మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరారని వివరించారు.
ఎవరూ వేలెత్తి చూపకుండా నియామకాలు
సచివాలయం ఉద్యోగ పరీక్షలను దాదాపు 8 రోజుల పాటు 20 లక్షల మంది రాశారని, ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ పరీక్షలు నిర్వహించామని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా అధికారులందరికీ హ్యాట్సాఫ్ చెబుతున్నానన్నారు. ఏ ఒక్కరూ వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకుండా అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించినందుకు సెక్రటరీల దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ల వరకు.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రులనూ ఈ సందర్భంగా ప్రశంసిస్తున్నానని తెలిపారు. 1,28,858 ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 82.5 శాతం ఉద్యోగాలు వచ్చాయంటే.. ఏ స్థాయిలో విప్లవాత్మక బాట ఏర్పడిందో చెప్పాల్సిన అవసరం లేదని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇందులో 51.9 శాతం మంది బీసీలున్నారని చెప్పారు. ఈ ఉద్యోగాలకు అనుబంధంగా 2.65 లక్షల పైచిలుకు గ్రామ వలంటీర్లను.. ప్రతి 50 ఇళ్లకు ఒకరిని నియమించామని వివరించారు.
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇలా..
– వలంటీర్లు అవినీతికి పాల్పడ కూడదనే ఉద్దేశంతో నెలకు రూ.5 వేల చొప్పున జీతం ఇస్తున్నాం. ఎక్కడైనా, ఎవరైనా వివక్ష, పక్షపాతం చూపించినా, లంచాలు తీసుకున్నా.. సీఎం కార్యాలయానికి కనెక్ట్ చేసిన టోల్‌ఫ్రీ నంబర్ 1902కు ఫోన్ చేయొచ్చు. ఎక్కడైనా, ఎవరైనా తప్పులు చేస్తే తొలగిస్తామని స్పష్టంగా చెప్పాం. సచివాలయ ఉద్యోగులు అవినీతికి పాల్పడినా చర్యలుంటాయి.
– ప్రతి 50 ఇళ్లకు సంబంధించిన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ నేరుగా డోర్ డెలివరీ చేసే విధంగా ఈ వ్యవస్థను రూపొందించాం. ప్రతి 2 వేల జనాభాకు ఒక గ్రామ సెక్రటేరియట్ ఉంటుంది.
– సంతృప్త స్థాయిలో లబ్ధిదారుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తాం. ఆయా పథకాలకు ఉండాల్సిన అర్హత, జాతాలో పేరు లేకపోతే ఎలా నమోదు చేసుకోవాలనే విషయాలను కూడా ఆ పక్కనే ప్రదర్శిస్తాం. దీంతో అనర్హులెవరైనా ఉంటే తెలిసిపోతుంది. గ్రామసభలు, సోషల్ ఆడిట్ ద్వారా వారి పేర్లు తొలగిస్తాం. ఇందుకోసం పర్మినెంట్ సోషల్ ఆడిట్ మెకానిజాన్ని గ్రామ సెకట్రేరియట్లలో అంతర్భాగం చేస్తున్నాం.
– దాదాపు 500కు పైగా సేవలను గ్రామ, వార్డు సచివాలయాలు అందించనున్నాయి. ఏదైనా సర్టిఫికెట్, రేషన్ కార్డు, పెన్షన్ కార్డు కావాలంటే 72 గంటల్లో ఇస్తామా? వారం రోజుల్లో ఇస్తామా? లేక రెండు వారాల్లో ఇస్తామో స్పష్టంగా వివరణ ఇస్తూ తెలియజేసే విధంగా డిస్‌ప్లే ఉంటుంది.
– వారానికి ఒక రోజు స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలు సమస్యలు తెలుసుకునేందుకు అధికారులు అందుబాటులో ఉంటారు. ఈ సమస్యలపై మంగళవారం నేను నేరుగా సమీక్షిస్తున్నా. వారానికి ఒకరోజు జరుగుతున్న స్పందన కార్యక్రమం సచివాలయాల్లో ప్రతిరోజు ఉంటుంది. తద్వారా పరిపాలన ముఖచిత్రం మారబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment