వైఫల్యాలు, మోసాలపై నిలదీస్తామని పాలక పక్షానికి భయం: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy Meets YSRCP Party MLCs To Discuss Strategies For Andhra Assembly Session, More Details Inside | Sakshi
Sakshi News home page

వైఫల్యాలు, మోసాలపై నిలదీస్తామని పాలక పక్షానికి భయం: వైఎస్‌ జగన్‌

Published Tue, Nov 12 2024 3:25 AM | Last Updated on Tue, Nov 12 2024 10:56 AM

YS Jagan Mohan Reddy meets YSRCP party MLCs to discuss strategies for Andhra Assembly session

పార్టీ ప్రజాప్రతినిధులతో భేటీలో వైఎస్‌ జగన్‌ ధ్వజం

అందుకే 40 శాతం ఓట్లు సాధించిన వైఎస్సార్‌సీపీని 

ప్రతిపక్షంగా గుర్తించడం లేదు.. ప్రభుత్వ వైఫల్యాలు, 

మోసాలను శాసనసభ వెలుపల సాక్ష్యాధారాలతో నిలదీస్తాం

మండలిలో ఎమ్మెల్సీలు ప్రజాగళాన్ని గట్టిగా వినిపించాలి.. 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్‌ దిశానిర్దేశం

కేసులకు ఎవరూ భయపడొద్దు.. నేను అండగా ఉంటానంటూ భరోసా  

సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలు, సూపర్‌ సిక్స్‌ మోసాలపై శాసనసభలో పాలకపక్షాన్ని నిలదీస్తామనే భయంతోనే 40 శాతం ఓట్లు సాధించిన వెఎస్సార్‌సీపీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదని పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి సర్కారు వైఫల్యాలను సభ వెలుపల ప్రభుత్వ సాక్ష్యాధారాలతో ఎండగట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. శాసన మండలిలో ప్రజాగళాన్ని గట్టిగా వినిపించి వైఫల్యాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఎమ్మెల్సీలకు సూచించారు. 

ప్రశ్నించే స్వరమే వినిపించకూడదనే ఆలోచనతో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసులు పెడతారని ఎవరూ భయపడవద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం శాసన సభ్యులతో, మధ్యాహ్నం శాసన మండలి సభ్యులతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన  ఏమన్నారంటే..

అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతూ కోర్టులో పిటిషన్‌ వేశాం. కానీ స్పీకర్‌ కోర్టు ఆదేశాలకు సమాధానం ఇవ్వలేదు. కోర్టు నుంచి వచ్చిన సమన్లు కూడా స్పీకర్‌ తీసుకోలేదు. అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మనమే. మనం మినహా మరో ప్రతిపక్షం లేదు. అయినా కూడా వారు మనల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అలా గుర్తిస్తే... ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడ్డానికి అవకాశాలు ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే వారు ముందుకు రావడం లేదు.   

⇒ సభా నాయకుడికి మాట్లాడటానికి ఎంత సమ­యం ఇస్తారో.. ఆ తర్వాత అంతే హక్కుగా ప్రతిపక్ష నాయకుడికి కూడా సమయం ఇవ్వాల్సి వస్తుందేమోనని, ఇవ్వక తప్పని పరిస్థితులు వస్తాయనే విషయాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష నాయకుడిగా అంగీకరించడం లేదు. 40 శాతం ఓట్‌ షేర్‌ సాధించిన పార్టీని ప్రతిపక్షపార్టీగా గుర్తిం­చడానికి ఇష్టపడని పరిస్థితులు 
కనిపిస్తున్నాయి.  

⇒  హైకోర్టులో మనం వేసిన పిటిషన్‌పై కౌంటర్‌ వేయడానికి కూడా స్పీకర్‌ సుముఖంగా లేరు. అందుకే మన ఎమ్మెల్యేలు తమ గళాన్ని మీడియా వేదికగా ప్రజలకు వినిపించాలి.

⇒ ప్రతి రోజూ మన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు మీడియా ద్వారా మాట్లాడతారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తారు. 

⇒ అసెంబ్లీలో ఏ మాదిరిగా ప్రశ్నలు వేస్తామో, అదే రీతిలో ఇక్కడ నుంచి అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాం. పూర్తి వివరాలు, ఆధారాలు, సాక్ష్యాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ వివరాలన్నింటినీ శాసన మండలి సభ్యులు ప్రతి ఒక్కరికీ పంపిస్తాం. వాటి ఆధారంగా  ప్రభుత్వాన్ని నిలదీయాలి.. ప్రశ్నించాలి.  

⇒ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనిపై ప్రశ్నిస్తే బుల్డోజ్‌ చేస్తూ సిగ్గు లేకుండా  మాట్లాడుతున్నారు.   

⇒ అప్పుల విషయంలో ఎన్నికలకు ముందు వాళ్లు చేసిన ప్రచారం పచ్చి అబద్ధమని వాళ్లే తాజాగా బడ్జెట్‌ పత్రాల ద్వారా చాటి చెప్పారు. అప్పుల సంఖ్యల్లోనూ అన్నీ అబద్ధాలే. వాళ్లే అసెంబ్లీకి బడ్జెట్‌ పత్రాలు విడుదల చేశారు. అందులోని వాస్తవాలతో ఇప్పటివరకూ వారు చెప్పినవి అబద్ధాలేనని తేలిపోయింది. పాలక పక్షానికి చెందినవారు అడ్డంగా దొరికిపోయారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు సమగ్ర వివరాలను ప్రెస్‌ మీట్‌ ద్వారా నేనే వివరిస్తా. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని, చేసేవన్నీ మోసాలేనని ఇప్పటికే తేలిపోయింది. ఈ ఆరు నెలల కాలంలో చంద్రబాబు నైజాన్ని ప్రజలు మరోసారి గుర్తించారు.  

⇒ అందరికీ ఒకటే చెబుతున్నా... ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. కష్టాలు అనేవి శాశ్వతం కాదు. వ్యక్తిత్వాన్ని, విలువలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుదాం. కచ్చితంగా మనం తిరిగి అధికారంలోకి వస్తాం. జమిలి ఎన్నికలు లాంటి వార్తలు కూడా వింటున్నాం.   

⇒ వైఎస్సార్‌సీపీ సైనికులుగా మండలిలో ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. గట్టిగా పోరాటం చేయండి. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలి. ప్రశ్నిస్తే కేసులు పెడతారన్న ఆందోళన అనవసరం. నేను మీకు అండగా ఉంటా.  

⇒ నా వయసు చిన్నదే. మరో 30 ఏళ్లు రాజకీయాలను చూస్తా. మనం అందరం కలసి రాజకీయాలలో సుదీర్ఘకాలం ప్రయాణం చేస్తాం. ఎప్పుడూ లేని విధంగా మనం సోషల్‌ ఇంజనీరింగ్‌ చేశాం. ఎక్కడాలేని మార్పులు తీసుకువచ్చాం. కాలక్రమేణా మనం చేసిన పనుల ప్రాధాన్యతను ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement