సాక్షి, అమరావతి: కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్‌సీపీ గళం విప్పింది. సోమవారం నల్లకండువాలతో అసెంబ్లీకి వచ్చిన సభ్యులు.. గవర్నర్ ప్రసంగ సమయంలోనూ ‘హత్యా రాజకీయాలు నశించాలి.. సేవ్ డెమోక్రసీ’నినాదాలు చేశారు. అయినా గవర్నర్ ప్రసంగం కొనసాగడంతో.. నిరసనగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు.
అనంతరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో అదుపుతప్పిన శాంతిభద్రతలపై మీడియాతో మాట్లాడారు. ‘‘ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. శాంతిభద్రతలు కాపాడటంలో కూటమి ప్రభుత్వం విఫలం అయింది. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన నడుస్తోంది. ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళలు బయటకు రావాలంటే బయటపడుతున్నారు. రాష్ట్రంలో రోజుకో అత్యాచారం, హత్య. ఏపీలో రాష్ట్రపతిపాలన విధించాలి’’ అని అన్నారు.
ఏపీలో మహిళలకు రక్షణ లేదు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
‘‘ ఏపీలో మహిళలకు రక్షణ లేదు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణలో ఘటన జరిగితే ఏపీలో దిశా చట్టాన్ని రూపొంచించాం. కూటమి ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, 36 మందిని హత్య చేశారు. హామీలు అమలు చేయలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
.. ప్రజలగొంతుకగా వైఎస్సార్‌సీపీ ఉంటుంది. ఢిల్లీలో బుధవారం ధర్నా చేస్తాం. దేశ వ్యాప్తంగా ఏపీలో ఏం జరుహుతుందో చెబుతాం. హోంమంత్రి అనిత ఫ్రస్టేషన్‌లో ఉన్నారు. హోంమంత్రి నియోజకవర్గంలోనే ఒక అమ్మాయి దారుణ హత్య జరిగింది. ముచ్చుమర్రిలో ఒక బాలిక హత్యకు గురైతే ప్రభుత్వం స్పందించలేదు. ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు’’ అని ఆమె మండిపడ్డారు.
ప్రజల మధ్యనే మా నిరసన
అప్పులు చేయటానికే ఈ ప్రభుత్వం పని చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు. ‘‘శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతున్నా పట్టించుకోవడం లేదు. హత్యలు, అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అందుకే గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. అయినా పట్టింపులేనందునే బాయ్ కట్ చేశాం. హోంమంత్రి మీడియా సమావేశాలు పెట్టి కామెడీ చేస్తున్నారు. ప్రధాని, రాష్ట్ర పతికి కూడా ఫిర్యాదు చేశాం. ఒక వర్గం మీడియా దారుణంగా వ్యవహరిస్తోంది. అందుకే ప్రజల మధ్యనే మా నిరసన తెలుపుతున్నాం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment