ఈ దెబ్బకు చంద్రబాబు సింగిల్‌ డిజిట్‌కే: వైఎస్‌ జగన్‌ | YS Jagan Predicts TDP Single Digit in 2029 Elections | Sakshi
Sakshi News home page

ఈ దెబ్బకు చంద్రబాబు సింగిల్‌ డిజిట్‌కు వెళ్లాల్సిందే: వైఎస్‌ జగన్‌

Published Fri, Nov 29 2024 6:49 PM | Last Updated on Fri, Nov 29 2024 7:07 PM

YS Jagan Predicts TDP Single Digit in 2029 Elections

గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో ఒక క్రమపద్ధతిలో వ్యవస్థల నిర్వీర్యం జరుగుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మోసమే పరమావధిగా ఉన్న వాళ్లను ప్రజలు ఏం చేస్తారో మనం వచ్చే ఎన్నికల్లో చూస్తామని అన్నారాయన. తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణా నేతలతో తాజా రాజకీయాలు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయశారాయన.

రాష్ట్రంలో రెడ్‌ బుడ్‌ రాజ్యాంగం నడుస్తోంది. వ్యవస్ధలన్నీ కూప్పకూలిపోయిన పరిస్దితి కనిపిస్తోంది. దొంగకేసులు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తూ పోస్టింగులు పెట్టినా, ఫార్వార్డ్‌ చేసినా కూడా కేసులు పెడుతున్నారు. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారు.

మనకు అబద్దాలు చెప్పడం చేతగాదు. మన పాలనలో చక్కగా బటన్లు నొక్కాం. కాబట్టి చంద్రబాబు కూడా చేస్తాడేమోనని ప్రజలు ఆశపడ్డారు. కానీ ఆరునెలలు తిరక్కమునుపే వాస్తవం అర్ధమయింది.మన ప్రభుత్వానికి, చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి ప్రజలు పోల్చి చూస్తున్నారు. ప్రతి ఇంట్లో దీనిపై చర్చ జరుగుతోంది.

నేను మీ అందరికీ కోరేది ఒక్కటే. మనలో పోరాట పటిమ సన్నగిల్లగూడదు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలుంటాయి, నష్టాలుంటాయి.  కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష. కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. బెయిల్‌ కూడా ఇవ్వలేదు. అయినా ప్రజల అండతో ముఖ్యమంత్రి అయ్యాను.

ఈ సంక్రాంతి తర్వాత పార్లమెంటు యూనిట్‌గా జిల్లాల్లో పర్యటిస్తాను. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటాను. రెండు రోజుల పాటు కార్యకర్తలతో మమేకం అవుతాను. పూర్తిగా కార్యకర్తలకే కేటాయిస్తాను. కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.

జనవరిలోగా పార్టీలోని వివిధ విభాగాల నియామకాలు పూర్తి చేయాలి. జిల్లాస్ధాయి నుంచి మండల స్ధాయి వరకు పూర్తవ్వాలి. ఆ తర్వాత బూత్‌ కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు జరగాలి. గ్రామస్ధాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రతి ఒక్కరికీ ఫేస్‌ బుక్, ఇన్‌స్టా, వాట్సప్‌ ఉండాలి. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్ని వీడియో తీసి అప్‌ లోడ్‌ చేయాలి. ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ప్రశ్నించాలి. సూపర్‌ సిక్స్‌ ఏమైంది? ఏమైంది సూపర్‌ సెవన్‌? అని నిలదీయాలి.

ఇంకా ఆయన ఏమన్నారంటే..

‘‘ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, మేయర్లందరితో సమావేశం జరుపుకోవడం సంతోషంగా ఉంది. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎంపీపీలపరంగానూ, జడ్పీటీసీలపరంగానూ, మేయర్ల పరంగా జరిగిన స్ధానిక సంస్దలకు సంబందించిన ఎన్నికల్లో మన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. 46 చోట్ల ఎన్నికలు జరిగితే 44 జడ్పీటీసీ స్ధానాల్లో మన పార్టీ గెలిచింది. ఎంపీపీలు, ఎంపీటీసీల స్ధానాల్లో కూడా దేవుడి దయతో గొప్ప విజయాన్ని అందుకున్నాం. ఇవాళ స్ధానిక సంస్ధల్లో ఎక్కడ చూసినా మనమేం కనిపిస్తాం. అయినా జనరల్‌ బాడీ మీటింగ్‌ ఎక్కడ జరిగినా మనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదు.

మనం చెడు చేసి ప్రతిపక్షంలో కూర్చోలేదు. మీరంతా ప్రజాప్రతినిధులగా ఎన్నికలప్పుడు తిరిగినవాళ్లే. ప్రతి ఇంటికి, గడప గడపకూ మనం వెళ్లినప్పుడు ఏ ఇంటికి వెళ్లినా చిక్కటి చిరునవ్వుతోనే ప్రజలు అక్కున చేర్చుకున్నారు. కారణాలు ఏమైనా కానీ ఎన్నికలకు వచ్చేసరికి మనం అనుకున్న ఫలితాలు రాలేదు. మనందరికి తెలిసిన విషయం ఏమిటంటే... జగన్‌ కుటుంబానికి అంతా మేలు చేశాడు. కానీ చంద్రబాబునాయుడు మాత్రం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు చేస్తానని చెప్పాడు. కాబట్టి ఆ ప్రలోభాలకు మొగ్గు చూపిన పరిస్థితులు మనం చూశాం. చాలా మంది నాతో కూడా చెప్పారు. మనం కుటుంబం మొత్తాన్ని ఒకటిగా చేసి మంచి చేశాం. మనం అబద్దాలు చెప్పలేదు. మనం చేయగలిగింది మాత్రమే చెప్పాం.

వాళ్లు మాత్రం ప్రతి ఇంటికి వెళ్లి  ఇంట్లో ఎవరు కనిపించినా అబద్దపు హామీలు చెప్పారు. ఇద్దరు పిల్లలు కనిపిస్తే... నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు అని, తల్లులు కనిపిస్తే నీకు రూ.18వేలు అనే మాటలు, కాస్త పెద్ద వయస్సులో 50 ఏళ్లు దాటిన అమ్మలు, అత్తలు కనిపిస్తే నీకు రూ.48వేలు అని, ఆ ఇంట్లోంచి ఉద్యోగం వెతుక్కుంటున్న 20 ఏళ్ల పిల్లవాడు కనిపిస్తే నీకు రూ.36వేలు అని, అదే ఇంట్లోంచి  రైతు బయటకు వస్తే నీకు రూ.20వేలు అని చెప్పే పరిస్థితి చూశాం. ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ జరగబోతున్నాయని ప్రలోభాలు పెట్టిన నేపధ్యంలో ప్రస్పుటంగా కనిపిస్తున్న పరిస్దితులు. సాధ్యం కాని హామీలని, అవి సాధ్యం కాదని తెలిసినా హామీలిస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్లు ప్రచారం చేస్తున్నారు, ప్రతి ఒక్కరినీ చెడగొట్టే కార్యక్రమం చేస్తున్నారని నా దగ్గరకు వచ్చి చాలా మంది చెప్పారు. అబద్దాలు చెప్పడం మనకు చేతగాదు. అతి నిజాయితీ, అతి మంచితనం మనకున్న సమస్యలు... కానీ ఇదే రేపు మళ్లీ  మనల్ని అధికారంలోకి తీసుకొస్తుంది. కారణం జగన్‌ ఇవన్నీ చేయగలిగాడు.. చంద్రబాబునాయుడు వీటికన్నా ఓ రెండుమూడింతలు  ఎక్కువ చెబుతున్నాడు, అదీ మోదీగారితో కలిసి వస్తున్నాడు చేయగలుగుతాడేమోనని ఆశపడ్డారు. 

మన పరిపాలనకాలంలో మనం ఇంత చక్కగా బటన్లు నొక్కాం కాబట్టి చంద్రబాబు కూడా చేస్తాడేమోనన్న అన్నఆశ ప్రజలకు కలిగింది. దానివల్ల 10శాతం మన ఓటు బ్యాంకు తగ్గింది. కానీ ఆరునెలలు తిరక్కమునుపే ఇవాళ పరిస్థితి చూస్తే.. ప్రతి ఇంట్లో ఒకటే చర్చ జరుగుతోంది. జగన్‌ కనీసం పలావు అన్నా పెట్టేవాడు. చంద్రబాబునాయుడు బిర్యానీ పెడతానన్నాడు. తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ పోయిందనే పరిస్థితి చర్చ జరుగుతోంది. పథకాలమీద చర్చ ఇలా ఉంటే.. మరోవైపున  ప్రతి వ్యవస్ధ కుప్పకూలిపోతుంది.

ఫీజులు ఇవ్వక పిల్లలు కాలేజీలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. జనవరి నుంచి ఫీజులు పెండింగ్‌. మన హయాంలో ప్రతి త్రైమాసికం అయిన వెంటనే ఒక నెల ఇన్సె్ఫక్షన్‌ కి తావుచ్చి.. మరసటి నెల ఇచ్చే పరిస్థితి. అంటే జనవరి, పిబ్రవరి, మార్చికి సంబంధించిన ఫీజులు ఏఫ్రిల్లో వెరిఫికేషన్‌ చేసి మే నెలలో మన హయాంలో ఇచ్చాం. కానీ ఇవాల చూస్తే జనవరి, పిబ్రవరి, మార్చి క్వార్టర్, ఏప్రిల్, మే, జూన్‌ క్వార్టర్, జూలై, ఆగష్టు, సెప్టెంబరు క్వార్టర్‌ ఇక అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ జనవరి నాటికి సంవత్సరం  ఫీజులు పిల్లలకు ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలే రూ.2,800 కోట్లు. మన హయాంలో ప్రతి ఏప్రిల్లో వసతి దీవెన  రూ.1100 కోట్లు ఇచ్చేవాళ్లం. అది కూడా బకాయిలు.

వ్యవస్ధని నడిపించే ఈ కార్యక్రమాలు కుప్పకూలుతున్న పరిస్థితి. దాదాపు రూ.3,900 కోట్లు కేవలం పిల్లల చదువులకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి సంబందించిన మార్చి నుంచి నెట్‌ వర్క్‌ ఆసుపత్రులకు రూ.2,200 కోట్లు పెండింగ్‌ లో ఉన్నాయి. ఇవాళ పేదవాడు ఆసుపత్రి గడప ఎక్కాలంటే, డాక్టర్లు ఉచితంగా వైద్యం అందిస్తారన్న నమ్మకం సన్నగిల్లంది.  ఇక ఆరోగ్య ఆసరా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎక్కడుంది అనుకునే పరిస్థితికి ప్రజలు వచ్చారు. 108, 104 డయల్‌ చేసినా ఆంబులెన్స్‌ వస్తుందన్న పరిస్థితి లేదు. వాళ్లు స్ట్రైక్‌ లు, ధర్నాలు  చేస్తున్నారు. విద్య, వైద్యంతో పాటు చివరకు ధాన్యం కొనుగోలు పరిస్థితి దయనీయంగా ఉంది. దళారీలు కొనేదాకా ప్రభుత్వం అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా లేదు. ధాన్యం కొనుగోలుకు ఎంఎస్పీ రూ.1720 అయితే రైతులు కృష్ణా జిల్లాలోనే రూ.300 తక్కువకు అమ్ముకుంటున్నారు. ఆర్బీకేల ద్వారా దళారీల వ్యవస్ధను తీసేసి, ఇ–క్రాప్‌ చేసి పారదర్శకంగా మనం కొనుగోలు చేసినట్టు.. ఈ  ప్రభుత్వం కొనాల్సిన సమయంలో కొనుగోలు చేస్తే.. రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం అలా చేయకపోవడం వల్ల రైతులు గిట్టుబాటు ధర రాని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. ఇలా ప్రతి వ్యవస్ధ పూర్తిగా దిగజారిపోయిన పరిస్ధతిలున్నాయి.

మరోవైపు రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. దొంగకేసులు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తూ పోస్టింగులు చేసినా, ఫార్వార్డ్‌ చేసినా కూడా కేసులు పెట్టే అధ్వాన్నపరిస్దితులు చూస్తున్నాం. ఒకవైపు మంచి చేయకపోగా.. మరోవైపు ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారు. మామూలుగా ఆరునెలలకు ఊహించినదానికన్నా అధ్వాన్నంగా ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఆర్నెల్లు ఇట్టే గడిచిపోయాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మంచిదే.

వీళ్లు ఈ మాదిరిగా ఇన్నిన్ని అబద్దాలు ఆడి, ఇన్ని మోసాలు చేసిన వీళ్ల పరిస్థితి రేపు ఎన్నికల్లో ఎలా ఉంటుంది అన్నది నేను చెప్పాల్సిన పనిలేదు. ఎవరికైనా అర్ధం అవుతుంది. నేను మీ అందరికీ కోరేది ఒక్కటే. ఈ రోజు నుంచి ఎన్నికలు అయ్యే వరకు అది మూడేళ్లైనా, రెండేళ్లైనా నేను మిమ్నల్ని కోరేది ఒక్కటే. మనలో పోరాట పటిమ సన్నగిల్లగూడదు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎల్లకాలం అధికారంలోనే ఉండం. కానీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం, ఎలా ప్రవర్తించాం అన్నది మాత్రమే మనల్ని పైకి తీసుకువస్తుంది. అది కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కేరెక్టర్, క్రెడిబులిటీ మనం పడేస్తే మరలా ఏరుకోవడం కష్టం. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష.

కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి. కష్టాలు రాకుండా పోవు. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. పలుమార్లు బెయిల్‌ పిటిషన్‌ వేస్తే... రిజెక్ట్‌ అయ్యేది. ప్రతిపక్షంలో ఉంటూ రాష్ట్రంలోనూ, దేశంలోనూ కాంగ్రెస్‌తో యుద్ధం చేశాను. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ ఇద్దరూ నా మీద పిటిషన్లు వేశారు. ఇంత మందితో యుద్ధం చేస్తున్నా... నేను బెయిల్‌ పిటిషన్‌ వేసినప్పుడల్లా అన్న మాటేమిటంటే.. నేను బయటకు వస్తే ఇన్‌ప్లూయన్స్‌ చేస్తానని చెప్పేవారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మీ ప్రభుత్వాలే అయినా నేను ప్రభావితం చేస్తానని బెయిల్‌ తిరస్కరించారు.  ఇలా 16 నెలలు చేసారు. కానీ ఏమైంది.. ఆ తర్వాత బయటకు వచ్చి.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి పరిపాలన చేశాం.

అలానే కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత పగలు రాక తప్పదు. ఇది సృష్టి నేర్పిన రహస్యం. కాబట్టి ఇది కచ్చితంగా గుర్తుపెట్టుకొండి. కష్టాల్లో ఉన్నప్పుడు పోరాటం చేయగలిగితే మనం తిరిగి నిలబడగలుగుతాం. కాలం గడిచే కొద్దీ ఈ భయాలు పోతాయి. మరో రెండు మూడు నెలల్లో అందరూ దైర్యంగా రోడ్డు మీదకు వస్తారు. అందరిలో ఈ ధైర్యం రావాలి. ఎందుకంటే ప్రజల తరపున, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ప్రజా వ్యతిరేక పెరుగుతోంది. ప్రజల తరపున వారికి అండగా నిలవగలిగితే... ప్రజలు మనతో పాటు నడుస్తారు. మీరందరూ ఎంపీపీ, జడ్పీటీసీ వంటి మండలస్ధాయి నాయకులు.. మీరు ఇంకా ఎదగాలంటే.. ప్రతిపక్షంలో మీరు ఏ రకమైన పాత్ర పోషిస్తున్నారు అన్నదే నిర్ణయిస్తుంది.

ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా పార్లమెంటు యూనిట్‌గా జిల్లాల బాట పడతాను. దాదాపుగా జనవరి నెలాఖరునుంచి మొదలుపెడతాను. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటాను. ప్రతి పార్లమెంటును ఒక యూనిట్‌గా తీసుకుని నేను అక్కడకి వచ్చి బస చేస్తాను. బుధవారం మూడు నియోజకవర్గాల కార్యకర్తలతోనూ, గురువారం మరో నాలుగు నియోజకవర్గాల కార్యకర్తలతోనూ మమేకం అవుతాను. పూర్తిగా కార్యకర్తలకే కేటాయిస్తాం. అక్కడే ఉంటూ వారితో మమేకమవుతూ, వారికి తోడుగా ఉంటూ వారికి దగ్గరయ్యే కార్యక్రమం చేస్తాం. కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.

ఈలోగా జిల్లా స్ధాయి, నియోజకవర్గస్దాయి నుంచి మండలస్ధాయి వరకు వివిధ విబాగాలకు సంబంధించిన అధ్యక్షులు, అన్ని కమిటీలు పూర్తి చేయాలని జిల్లా అధ్యక్షులకు ఇప్పటికే చెప్పాం. నా కార్యక్రమం మొదలైన తర్వాత మండలస్ధాయి నుంచి గ్రామస్ధాయి వరకు పార్టీ వ్యవస్ధను బలోపేతం చేసే కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాత బూత్‌ కమిటీల నుంచి గ్రామ కమిటీల ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేపడతాం. ఇది ఎంతవరకు వెళ్లాలంటే.. గ్రామస్ధాయిలో కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రతి ఒక్కరికీ ఒక ఫేస్‌ బుక్, ఇన్‌స్టా, వాట్సప్‌ ఉండాలి. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్ని వీడియో తీసి అప్‌ లోడ్‌ చేయాలి. యూట్యూబ్‌లో కూడా పోస్ట్‌ చేయాలి. సంవత్సరం పూర్తయ్యే సరికి గ్రామంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ప్రశ్నిస్తూ ప్రతి ఇంట్లోంచి వాయిస్‌ రావాలి. అది మనం చేస్తూ, మన కార్యకర్తలతో చేయించాలి. 

సూపర్‌ సిక్స్‌ ఏమైంది? ఏమైంది సూపర్‌ సెవన్‌? మాకు చెప్పిన మాటలు ఏమయ్యాయి? అన్న దగ్గర నుంచి మొదలైన ప్రశ్నల వర్షం... ఏమైంది మా స్కూల్‌? ఏమైంది మా హాస్పిటల్‌? ఏమైంది మా పంటల కొనుగోలు పరిస్థితి? ఏమైంది మా ఆర్బీకే అన్నవరకు ప్రశ్నలు లేవాలి. ఆ దిశగా అడుగులు ముందుకు పడాలి. ఇది జరగాలంటే మండల, మున్సిపాల్టీ వార్డు స్ధాయిలో మీరు చాలా కీలకమైన పాత్ర పోషించాలి. మండలస్దాయి వరకు బలోపేతం చేసే దిశగా మీరంతా అడుగులు వేయాలి. నా కార్యక్రమం మొదలైన తర్వాత మండల స్ధాయి నుంచి గ్రామ స్దాయి వరకు నాతో పాటు మీరూ, నేనూ ఇద్దరం కలిసి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేయాలి. ఇది మన ఎజెండా. 

గతంలో మనకు 151 స్ధానాలు వచ్చాయి. ఈసారి తెలుగుదేశం పార్టీని సింగిల్‌ డిజిట్‌కు పరిమితం చేయాలి. కచ్చితంగా దేవుడు ఈ పనిచేయిస్తాడన్న నమ్మకం ఉంది. ఏ మంచీ చేయకుండా కేవలం అబద్దాలు, మోసం చేసినప్పుడు  అది కోపం కింద మారుతుంది. ప్రజల్లో ఆ కోపం రెట్టింపు అవుతుంది. మన మీద ప్రేమ పెరుగుతుంది. ఆరోజు మనం చూస్తాం. మోసమే పరమావధిగా ఉన్న వాళ్లను ప్రజలు ఏం చేస్తారో మనం చూస్తాం’’ అని జగన్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement