
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలకు చేపట్టే ఉద్యోగ నియామకాలకు సెప్టెంబరు 1వ తేదీన రాత పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఒకే విడతలో దాదాపు 1,33,494 కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీటిని పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలుగా పేర్కొనడంతో పాటు రాతపరీక్ష విధానంలో భర్తీ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష విధానం, విద్యార్హతలు, పరీక్ష విధానంతో పాటు పరీక్ష తేదీతో గురువారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో పాటు అవసరమైన 12 శాఖల ఉన్నతాధికారులు రోజూ సమావేశమవుతున్నారు. కాగా ఈ ఉద్యోగాలకు దాదాపు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటి దాకా వివిధ ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేసే పలువురు కూడా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే రెండు రోజుల పాటు (సెప్టెంబర్ 2వ తేదీ కూడా) రాత పరీక్షలు నిర్వహించాలని కూడా ప్రభుత్వ అధికారుల మధ్య చర్చ జరుగుతుంది. అయితే ఒకే రోజు పరీక్ష నిర్వహణకే అధికారులు మొగ్గు చూపుతున్నారు. కాగా రాతపరీక్షను పూర్తిగా మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో నిర్వహిస్తారు. అధికారుల సమాచారం మేరకు 150 మార్కులకు 150 ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో ఉంటాయి. ఇందులో 75 మార్కులకు జనరల్ నాలెడ్జి ప్రశ్నలు, మిగిలిన 75 మార్కులకు సంబంధిత ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఆధారంగా ప్రశ్నలు ఉంటాయని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment