సంక్షేమ పాలనలో సరికొత్త అధ్యాయం | A new chapter in the reign of welfare with pension to home | Sakshi
Sakshi News home page

సంక్షేమ పాలనలో సరికొత్త అధ్యాయం

Published Sun, Feb 2 2020 4:16 AM | Last Updated on Sun, Feb 2 2020 9:31 AM

A new chapter in the reign of welfare with pension to home - Sakshi

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో.., తిరుపతిలోని కొర్లగుంటలో..

ఇంటి ముంగిటకే వచ్చి పింఛన్‌ అందజేస్తున్న సరికొత్త విధానం నవ్యాంధ్రలో నవచరిత్రకు శ్రీకారం..  గత 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో కనీ వినీ ఎరుగని రీతిలో ఒక ప్రభుత్వ పథకాన్ని నేరుగా లబ్ధిదారుడి ఇంటికే చేర్చిన ఘన చరితం..  గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం..ప్రజల వద్దకే పాలన ఆవిష్కృతం.. ఒకే ఒక్క రోజులో లక్షలాది మంది లబ్ధిదారుల ఇంటి వద్దే పింఛన్ల పంపిణీతో ముఖ్యమంత్రి కల సాకారం..  ఇచ్చిన మాట మేరకు అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, దీర్ఘ వ్యాధిగ్రస్తులకు ఊరట కలిగించే విప్లవాత్మక నిర్ణయం సాక్షాత్కారం..  

గతం ఎంతో బాధాకరం.. పింఛన్‌ కోసం ఎండనక.. వాననక.. చెట్ల కింద.. గుడి ముందు.. బడి వెనుక.. గుట్టల పైన.. గంటల తరబడి పడిగాపులు.. అడుగు తీసి అడుగెయ్యలేని దైన్య స్థితిలో మరొకరి తోడు..  ఆ రోజు పింఛన్‌ అందుతుందో లేదో తెలియని ఆందోళన.. మరుసటి రోజు కాళ్లీడ్చుకుంటూ మళ్లీ రావాలనే భయం.. వెరసి పలుచోట్ల పండుటాకులు అక్కడే ప్రాణాలొదిలిన దయనీయ పరిస్థితి.. ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించి, మాటల కోటలతో మైమరపించి.. ఆనక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మొహం చాటేసే నేతలు.. బాధితులకు తీరని వెతలు..  

ఇక అలాంటి దుస్థితికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చరమగీతం.. ఎన్నెన్నో చెబుతారు కానీ, ఏం చేస్తారులే అనుకుంటున్న వేళ.. అసాధ్యమనుకున్నది సుసాధ్యమైన వేళ.. పండుటాకుల మోములో ఆనందం.. దివ్యాంగుల సంభ్రమాశ్చర్యం.. వితంతువుల్లో సంబరం..  అడుగు తీసి అడుగెయ్యలేని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొండంత ఊరట.. వెరసి వడివడి అడుగులతో ప్రజల వద్దకే ప్రజారంజక పాలన.  

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు వలంటీరే స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను డబ్బులు ఇచ్చే సరికొత్త పాలనకు రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన ‘గడప వద్దకే పెన్షన్‌’ కార్యక్రమం 13 జిల్లాల్లో శనివారం ఉదయం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గ్రామ, వార్డు వలంటీర్లు వారి ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేశారు. ఒక్క పూటలో 42,81291 మందికి పింఛన్ల పంపిణీ పూర్తయింది. ప్రభుత్వ ఉద్యోగులకు వారి జీతం డబ్బులు 1వ తేదీనే బ్యాంకు ఖాతాలో టంచన్‌గా పడినట్టు పింఛన్‌ లబ్ధిదారులందరికీ కూడా 1వ తేదీనే వారి ఇంటి వద్దకే వలంటీరు వెళ్లి అందజేసి వచ్చారు. ఇంతకాలం పింఛన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడిన పింఛనుదారులు.. శనివారం తమ పింఛను డబ్బులు ఇవ్వడానికి వలంటీరే ఇంటి వద్దకు రావడం చూసి ఉబ్బితబ్బిబ్బయ్యారు. ప్రభుత్వం అందజేసిన మొబైల్‌ ఫోను, బయోమెట్రిక్‌ డివైస్‌ను వెంట తీసుకెళ్లిన వలంటీర్లు.. లబ్ధిదారునితో వేలి ముద్రలు తీసుకొని పింఛన్‌ డబ్బులు అందజేశారు. ఈ కార్యక్రమంలో 2,16,874 మంది వలంటీర్లు తొలి రోజే 80% పైగా లబ్ధిదారులకు రూ.1,019 కోట్లు పంపిణీ చేశారు.  

బాధ తప్పింది.. 
ఇతని పేరు కె.మహమ్మద్‌. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండల కేంద్రానికి చెందినవారు. రెండు కాళ్లూ లేవు. ప్రస్తుతం రూ. 3 వేల పింఛన్‌ అందుతోంది. ఇంతకుముందు ప్రతినెలా పింఛన్‌ కోసం పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లాలంటే మరొకరి సాయం అవసరం వచ్చేది. ఈ నెల నుంచి ఆ బాధ తప్పింది. శనివారం గ్రామ వలంటీర్‌ ఇంటి వద్దకే వచ్చి పింఛన్‌ మొత్తాన్ని అందజేశాడు. దీంతో మహమ్మద్‌ సంతోషం వ్యక్తం చేశాడు. 

ఆస్పత్రి వద్దకు వెళ్లి పింఛన్‌ 
ప్రకాశం జిల్లా రాచర్ల ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న చిట్టెం పోలయ్య అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామ వలంటీర్‌ ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న పోలయ్య వద్దకు వెళ్లి శనివారం పింఛను సొమ్ము అందజేశారు. తనలాంటి వారికి ఎంతో సహాయం చేస్తున్న సీఎం జగన్‌ చల్లగా ఉండాలని పోలయ్య ఆశీర్వదించాడు. 

‘కొండంత’ కష్టం తగ్గింది 
పింఛను తీసుకోవాలంటే తాము పడే కొండంత కష్టం తొలగిపోయిందని సంబర పడుతున్నారు అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని గరుగుచింతలపల్లి గ్రామానికి చెందిన పింఛనుదారులు. ఈ గ్రామంలో పింఛను తీసుకోవాలంటే గ్రామానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం ఉన్న గుట్టను ఎక్కి నిరీక్షించాల్సి వచ్చేది. గ్రామంలో పింఛను పంపిణీకి సిగ్నల్స్‌ సరిగా ఉండవని, అధికారులు గ్రామంలోని పింఛన్‌దారులను గుట్టపైకి రప్పించి పింఛను పంపిణీ చేసేవారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఊతకర్రల సహాయంతో పింఛను పంపిణీ ప్రదేశానికి చేరుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం పింఛను తమ వద్దకే రావడంతో ఆ పింఛనుదారులు ఎంతో సంతోషపడుతున్నారు. తమకు ఎంతో గౌరవం కల్పించిన సీఎం జగన్‌కు పింఛనుదారులు కృతజ్ఞతలు తెలిపారు.

తెలతెలవారగానే లక్ష్మీదేవి తలుపు తట్టింది 
చిత్రంలో పింఛన్‌ అందుకుంటూ కనిపిస్తున్న వృద్ధురాలి పేరు బత్సల కామమ్మ. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అమలపాడు గ్రామంలో ఉంటున్న ఈమెకు కిడ్నీ వ్యాధి ఓ పక్క కబళిస్తోంది. మంచానికే పరిమితమైన ఈమె గతంలో కుటుంబసభ్యుల సహకారంతో పింఛన్‌ కోసం కిలో మీటరు దూరంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఆరోజు కుటుంబసభ్యులు పనులకు వెళ్లేందుకు వీలుపడేది కాదు. నెట్‌వర్క్‌ పనిచేయకపోవడం, రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల కనీసం రెండు సార్లయినా తిరగాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితి నుంచి ఈమెకు శనివారంతో విముక్తి కలిగింది. తెలతెలవారగనే వలంటీర్‌ ఇంటి తలుపుతట్టి పింఛన్‌ అందించారు. దీంతో ఆ వృద్ధురాలి ఆనందానికి అవధుల్లేవు. నాయనా నా ఇంటికే లక్ష్మీదేవి తెచ్చారా అంటూ మురిసిపోయింది. ఆ దేవుడు చల్లగా చూడాలి అంటూ ముఖ్యమంత్రికి ఆశీర్వాదాలు అందించింది. 

పింఛన్‌ నడిచెళ్లింది.. 
ఈమె పేరు కరణం అప్పలనరసమ్మ.  విజయనగరం జిల్లా కొమరాడ మండలం అర్ధం గ్రామ పంచాయతీ. ఆమె నడవలేదు. ఎక్కడికి వెళ్లాలన్నా కాళ్లు, చేతులు మీద పాక్కుంటూ వెళ్లాలి. ప్రతి నెలా చాలా దూరం వెళ్లి రెండు గంటలు పడిగాపులు కాసి డబ్బు తెచ్చుకునేది. ఆమెకు శనివారం కాలు కదప అవసరం లేకుండా వలంటీరు ఇంటికే వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు. ఎంతో శ్రమ పడి పింఛన్‌ తెచ్చుకోవాల్సిన పరిస్థితి నుంచి నా మనవడు జగన్‌ విముక్తి కలిగించారని ఆనందం వ్యక్తం చేసింది. 

ఇక ఎదురుచూపులు ఉండవ్‌.. 
గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన పమిడిముక్కల అన్నమ్మ పక్షవాతంతో గత కొంత కాలంగా మంచానికే పరిమితమైంది. అయితే గతంలో ఈమె పింఛన్‌ తీసుకోవాలంటే పంచాయతీ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ రెండు మూడు రోజులు ఎదురు చూపులు చూడాల్సి వచ్చేది. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. తెల్లవారు జామునే వలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులతో సహా సిబ్బంది అంతా ఇంటి తలుపు తట్టి నగదు చేతిలో పెట్టి వేలిముద్ర వేయించుకోవడంతో ఆమె ఆనంద బాష్పాలు జారవిడిచింది. 

శతాధిక వృద్ధురాలి కష్టాలు తీరాయి..  
నా వయసు వందేళ్లు. గతంలో పింఛన్‌ తీసుకునేందుకు చాలా ఇబ్బందులు పడేదాన్ని. శరీరం సహకరించకపోయినా.. ఎలాగోలా పంపిణీ కేంద్రం వద్దకు చేరుకొని డబ్బుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక మా కష్టాలు తీరుతున్నాయి. పొద్దున్నే వలంటీర్‌ నా ఇంటి వద్దకే వచ్చి పింఛన్‌ అందజేసి వెళ్లారు. 
– శరగడం అచ్చియ్యమ్మ, శతాధిక వృద్ధురాలు, యలమంచిలి, విశాఖ జిల్లా 

హమ్మయ్య.. ఇప్పుడు బాగుంది..  
ఈ ఫొటోలో ఉన్న వృద్ధురాలి పేరు కె.సువర్చల. కడప నగరంలోని ఏపీహెచ్‌బీ కాలనీలో నివసిస్తోంది. ఈమె కిడ్నీ వ్యాధిగ్రస్తురాలు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈమెకు రూ. 10 వేల పింఛన్‌ ఇస్తున్నారు. ప్రతినెలా పింఛన్‌ తీసుకోవాలంటే ఈమె కడప నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఏదైనా సమస్య వచ్చి పింఛన్లు పంచకపోతేనో, సమయానికి పింఛన్‌ పంచే వ్యక్తి లేకపోతే ఉసూరుమంటూ ఇంటికి రావాల్సి వచ్చేది. ఇంటి నుంచి కార్పొరేషన్‌ దగ్గరికి పోవాలంటే ఆటో మాట్లాడుకొని వెళ్లాలి. ఇప్పుడు వలంటీర్‌ ఇంటి వద్దే పింఛన్‌ ఇవ్వడంతో సమయం, ఆటో ఖర్చులు అన్నీ ఆదా అయ్యాయని ఈమె చెబుతోంది.  

శ్రమ, ఖర్చు తగ్గింది..
ఇంటి వద్దకే పింఛన్‌ రావడంతో శ్రమ తగ్గింది. గతంలో ఆయా పింఛన్‌ కేంద్రాల వద్ద సిబ్బంది వచ్చే వరకు గంటల తరబడి వేచి ఉండవలసి వచ్చేది. నడవలేని స్థితిలో ఉండటంతో రిక్షాలో పింఛన్‌ ఇచ్చే కేంద్రానికి వెళ్లి రావడానికి రూ. 200 ఖర్చు అయ్యేది. ఇంటికి వచ్చి పింఛన్‌ ఇవ్వడం ఎంతో మంచి పథకం. 
– ఆదిరెడ్డి నారాయణమ్మ,5వ వార్డు, పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా 

మాలాంటి వారికి ఎంతో ఉపశమనం 
నడవలేని ఇద్దరు ఆడ పిల్లలను మూడు చక్రాల బండిపై తోసుకెళ్తున్న ఈమె పేరు కిన్నెర నరసమ్మ. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం గుడిపాడులో నివాసం ఉంటున్నారు. ఈమెకు భర్త లేరు. కుటుంబాన్ని పోషించుకునే శక్తి లేదు. నెలానెలా పింఛన్‌ కోసం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకు దగ్గరికి ఇద్దరు పిల్లలను మూడు చక్రాల బండిపై తీసుకొని వెళ్లాల్సి వచ్చేది. అక్కడ రద్దీ ఎక్కువ ఉంటే మరో రోజు శ్రమ తప్పేది కాదు. ఒక్కోసారి రెండు మూడు సార్లు తిరగాల్సి వచ్చేది. రెండు మూడేళ్లుగా గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద పింఛన్‌ ఇస్తున్నారు. ఇక్కడ కూడా మూడు సార్లు తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఇంటి వద్దనే పెన్షన్‌ ఇచ్చే ఏర్పాటు చేశారు. ఇది మాలాంటి వారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. శనివారం ఉదయమే ఇంటి దగ్గరికే వచ్చి కేవలం మూడు నిముషాల్లో పింఛన్‌ ఇచ్చారు. ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం. 

దేవుడిలా ఆదుకున్నారు..
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం కె.ఇల్లిందలపర్రు గ్రామానికి చెందిన పిల్లి దుర్గారావు గతంలో సింగపూర్‌లో భవన నిర్మాణ కార్మికునిగా పనిచేశాడు. అతనికి ఆరేళ్ల కిందట ఒక పాప పుట్టింది. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఆ పాపకు కిడ్నీ సమస్యలు మొదలయ్యాయి. వైద్యం కోసం విజయవాడ, హైదరాబాద్, చెన్నై ఇలా తెలిసిన ఆస్పత్రుల చుట్టూ తిప్పాడు. సంపాదించిన డబ్బులన్నీ అయిపోయాయి. గత ప్రభుత్వంలో పెన్షన్‌ కోసం, తన పాపను ఆదుకోవాలని అధికారుల చుట్టూ తిరిగాడు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ పాపకు 15 రోజులకు ఒకసారి ఏలూరు ఆసుపత్రికి తీసుకువెళ్లి డయాలసిస్‌ చేయించాలి. లేకపోతే ముక్కు నుంచి రక్తం వస్తుంది. పుట్టెడు కష్టాన్ని తట్టుకుంటూ ఉన్న ఆస్తులను అమ్ముకుంటూ బిడ్డ బాగుంటే చాలని ఎదురు చూస్తున్న ఆ దంపతులను ఈ ప్రభుత్వం ఆదుకుంది. డయాలసిస్‌ రోగులకు రూ. 10 వేల పింఛన్‌ అందిస్తున్నారని తెలిసి దరఖాస్తు చేశారు. వెంటనే ఆ పాపకు పింఛన్‌ మంజూరు అయ్యింది. ప్రతి నెల పంపిణీ కేంద్రం వద్దకు పాపను తీసుకెళ్లి పింఛన్‌ తెచ్చుకోవడానికి ఇబ్బంది ఉండేది. జగన్‌ పుణ్యమా అని ఆ సమస్య తీరింది. జగన్‌కు జన్మంతా రుణపడి ఉంటామని ఆ దంపతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మాట ఇచ్చాడు.. నెరవేర్చాడు  
దివ్యాంగుడైన ఇతని పేరు మందా రమేష్‌. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం నెల్లబల్లిరెట్టపల్లి. పింఛన్‌ కోసం ప్రతి నెలా ఇంటి నుంచి కిలోమీటరు దూరంలోని పంచాయతీ కార్యాలయానికి వెళ్లి గంటల తరబడి పడిగాపులు కాసి, ఒక్కో సారి మళ్లీ మళ్లీ వెళ్లి తెచ్చుకున్న సందర్భాలెన్నో. శనివారం తెల్లారేసరికి గ్రామ సచివాలయ వలంటీర్‌ ఇతని ఇంటికి వెళ్లి దివ్యాంగ పింఛన్‌ అందజేశాడు. పింఛన్‌ తీసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. జగనన్న నాకు మాట ఇచ్చాడు.. నెరవేర్చాడని ఆనందం వ్యక్తం చేశాడు. సరిగ్గా రెండేళ్ల కిందట వైఎస్‌ జగన్‌ కలిసిన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘ఆ రోజు ప్రజాసంకల్పయాత్ర గూడూరు రూరల్‌లోని కొండాగుంట సమీప ప్రాంతానికి వచ్చేటప్పటికి నెల్లబల్లిరెట్టపల్లి నుంచి 12 కి.మీ. ట్రై సైకిల్‌పై అక్కడికి వెళ్లి జగన్‌ను కలిశా. ఎందుకు బాబు ఇంత కష్ట పడడం అని జగన్‌ సార్‌ అన్నారు. ప్రతి నెల పింఛన్‌ తీసుకునేందుకు కిలోమీటరు దూరం ఇలానే వెళ్తున్నాను.. మిమ్ములను చూసేందుకు ఇక్కడదాక రాలేమా అని చెప్పాను. ఆ సందర్భంగా దివ్యాంగులు పడుతున్న కష్టాన్ని ఆయనకు విన్నవించా. దీంతో జగనన్న ధైర్యం ఇస్తూ నేను ఉన్నాను.. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్‌ ఇంటి వద్దకే వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు మా గ్రామ వలంటీర్‌ పొద్దునే ఇంటి వద్దకు వచ్చి పింఛన్‌ ఇచ్చాడు. ఇది నేను కలలో కూడా అనుకోలేదు’ అని చెప్పాడు.

తొంభై ఏళ్లకు పింఛన్‌.. ఇంటి ముంగిటకే
ఈమె పేరు ఎం.నీల (91). చిత్తూరు జిల్లా సత్యవేడు పంచాయతీ దళితవాడకు చెందిన ఈమె భర్త కేశవన్‌ చనిపోయిన 31 ఏళ్ల తర్వాత శనివారం వితంతు పింఛను అందుకోవడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. పెళ్లిళ్లు అయిన అనంతరం పిల్లలు వేరు కాపురం పెట్టి తల్లిని ఒంటరిగా వదిలేశారు. ఎన్నిసార్లు పింఛన్‌ కోసం తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆమె రాజీవ్‌నగర్‌లో ఉంటోంది. ఈమె పరిస్థితి గమనించిన వలంటీర్‌ గ్రామ సచివాలయంలో పేరు నమోదు చేయించాడు. వెంటనే వృద్ధాప్య పింఛన్‌ మంజూరైంది. ‘30 ఏళ్లు నిరాశ చెందిన నాకు ప్రాణం పోయేలోపు పింఛన్‌ వస్తుందో రాదో అనుకున్నా. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యమా అని నాకూ పింఛన్‌ వచ్చింది. నా మందుల ఖర్చుకు పింఛన్‌ డబ్బు తోడవుతుంది’ అని ఆమె ఆనందపడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement