సాక్షి, అమరావతి: అవ్వాతాతలకు దేశంలో రూ.3,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని, ప్రజలందరి ఆశీస్సులతోనే ఇదంతా చేయగలుగుతున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి మొదలయ్యే పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వం అవ్వాతాతల పెన్షన్ మొత్తాన్ని రూ.3,000కు పెంచుతున్న సందర్భంగా ఆయన రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు లేఖలు రాశారు. ఒకటవ తేదీన వలంటీర్లు లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్ డబ్బులు అందజేస్తూ, వారికి ముఖ్యమంత్రి రాసిన లేఖ ప్రతులను అందజేయనున్నారు.
ఇప్పటికే ఆ లేఖల ముద్రణ పూర్తయి, జిల్లాల వారీగా వాటిని చేర్చే ప్రక్రియను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పూర్తి చేసింది. దేశంలో ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమేనని, మనందరి ప్రభుత్వమే ఇవన్నీ చేయగలుగుతోందని చెప్పడానికి సంతోషిస్తున్నట్టు సీఎం జగన్ ఆ లేఖలో తెలిపారు. దేవుడి దయతో, మీ అందరికి ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటున్నట్టు కూడా పేర్కొన్నారు. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది.
ప్రియమైన అవ్వాతాతలకు..
మీకు, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ రోజు 2024 జనవరి 1 నుంచి.. ఇచ్చిన మాట ప్రకారం.. ఇక మీ చేతికి అందే పెన్షన్ రూ.3000 అవుతుంది. నా సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో నోరు తెరిచి అడగలేని ఎంతో మంది అవ్వాతాతలను, దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయి జీవితాన్ని భారంగా నెట్టుకొస్తున్న వితంతువులను.. కష్టాలు, కన్నీరు తుడిచే వారు లేక దుఃఖంలో ఉన్న దివ్యాంగుల కన్నీటి వ్యథలను నేను స్వయంగా చూశాను. మీ మనవడిగా, మీ బిడ్డగా, మీ సోదరుడిగా ఆ మాటకు కట్టుబడి.. మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్టు తూ.చా. తప్పక పెన్షన్‌లను పెంచుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో, దేవుడి దయతో అందిస్తునందుకు సంతోషిస్తున్నాను. ఈ పెన్షన్ పెంపుతో మేనిఫెస్టోలో ఇచ్చిన నూరు శాతం హామీలు అమలు చేశామని చెప్పడానికి గర్వపడుతున్నాను.
చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు వరకు పింఛన్ కేవలం రూ.1,000 ఉండేది. ఆ ఐదేళ్లలో ఒక్కో అవ్వాతాతల కుటుంబానికి ఇచ్చిన పెన్షన్ రూ.58 వేలు. అదే మీ జగన్ తన నాలుగున్నర ఏళ్ల పాలనలో ఇచ్చిన పెన్షన్ ఏకంగా రూ.1.47 లక్షలు. దివ్యాంగులకు ఇచ్చిన పెన్షన్ ఏకంగా రూ.1.67 లక్షలు. రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు అర్హులైన మరో 28.35 లక్షల మందికి.. కొత్తగా పెన్షన్‌లు మంజూరు చేశాం. ప్రతి నెలా పెన్షన్లు అందుకుంటున్న వారి సంఖ్య దాదాపు 66 లక్షలని చెప్పడానికీ సంతోషిస్తున్నాను.
గత ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నప్పటికీ, పెన్షన్ మంజూరు కావాలంటే నరకమే. పెన్షన్ మంజూరు కోసం జన్మభూమి కమిటీలకు లంచాలు, పెన్షన్ తీసుకోవడానికీ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు. కానీ, ఇప్పుడు ప్రతినెలా ఒకటో తేదీన.. అది ఆదివారమైనా, మరే ఇతర సెలవు రోజైనా సరే సూర్యోదయంతోనే మీ ఇంటి తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెపుతూ మన వలంటీర్లు మీకు పెన్షన్ అందిస్తున్నారు. పెన్షన్ కోసం పడిగాపులు పడి, ఎక్కడో ఉన్న కార్యాలయం చుట్టూ తిరిగిన గత ప్రభుత్వ విధానాలకు.. మనందరి ప్రభుత్వానికి మధ్య ఉన్న ప్రధానమైన తేడా.. మనది మనసున్న ప్రభుత్వం. మనది పేదలు, మహిళలు, రైతుల పక్షపాత ప్రభుత్వం.
దేశంలోనే రూ.3,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రమని, ప్రజలందరి మన ప్రభుత్వమే ఇది చేయగలుగుతోందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేశంలో ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే. మీ ఆశీస్సులతోనే ఇదంతా చేయగలిగాను.
మీ ఆశీస్సులు, మీ మద్దతే నా బలం. ఆ బలం వల్లే కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో ఇలాంటి మంచి ప్రయత్నాలను కొనసాగించగలిగాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు మంచి జరగాలని.. ఆ దేవుడి దయ ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి దయతో, మీ అందరికి ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటూ.. మరోసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ప్రేమతో మీ..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment