కులం, మతం, పార్టీలు చూడలేదు | CM Jagan Comments In YSR Pension Kanuka Program | Sakshi
Sakshi News home page

YSR Pension Kanuka: కులం, మతం, పార్టీలు చూడలేదు

Published Sun, Jan 2 2022 3:30 AM | Last Updated on Sun, Jan 2 2022 7:36 AM

CM Jagan Comments In YSR Pension Kanuka Program - Sakshi

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పింఛను లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతున్న సీఎం జగన్‌

ఏ సమాజమైనా చీకటి నుంచి వెలుగులోకి రావాలని, వెనుకబాటు నుంచి అభివృద్ధి వైపు అడుగులు పడాలని ఆరాట పడుతుంది. అసమానతల నుంచి సమానత్వం అందాలని, తద్వారా ఆత్మాభిమానంతో బతకాలని, అరాచకం నుంచి చట్టబద్ధ పాలన వైపు పాలకులు ప్రయాణం చేయాలని తాపత్రయ పడుతుంది. అలాగే ఏ మనిషైనా, ఏ కుటుంబమైనా.. నిన్నటి కంటే నేడు బాగుండాలని, నేటి కంటే రేపు ఇంకా బాగుండాలని, రేపటి కంటే తమ భవిష్యత్‌ ఇంకెంతో బాగుండాలని కోరుకుంటారు. అటువంటి పాలన దిశగా ఈ రోజు మీ బిడ్ద అడుగులు వేస్తూ.. అభివృద్ధి బాటలో నడిపించ గలుగుతున్నాడని గర్వంగా చెబుతున్నాను.  

ప్రతి ఒక్కరికీ హ్యాపీ న్యూ ఇయర్‌
ఈ రోజు జనవరి ఒకటి.. రాష్ట్రంలో ఉన్న ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ, ప్రతి ఒక్కరికీ గుండెల నిండా ప్రేమతో మీ బిడ్డ హ్యాపీ న్యూ ఇయర్‌ తెలియజేస్తున్నాడు.   
 – ముఖ్యమంత్రి  జగన్‌ 

సాక్షి ప్రతినిధి, గుంటూరు:  ‘రాష్ట్రంలో ఈ రోజు పెన్షన్లకు కోటాల్లేవు. కోతల్లేవు. లంచాలు లేవు. జన్మభూమి కమిటీల అడ్డంకులు లేవు. ఎంత ఎక్కువ మందికి ఎగ్గొట్టాలి.. అన్న కుతంత్రాలు లేవు.  అందుకే కులం, మతం, వర్గం చూడలేదు. ఆఖరుకు మనకు ఓటు వేసినా వేయకపోయినా సరే ఇవ్వాలని చెప్పి ఏకంగా రూల్‌ తీసుకొచ్చాం. అర్హత ఉంటే చాలు.. పెన్షన్‌ వాళ్ల గడప వద్దకే వచ్చేట్టు చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. ప్రతినెలా ఒకటో తేదీన ఆ రోజు ఆదివారమైనా, సెలవు దినమైనా సరే సూర్యోదయానికి ముందే వలంటీర్‌ మీ గడప ముందుకు వచ్చి చిరునవ్వుతో గుడ్‌ మార్నింగ్‌ చెబుతూ పింఛన్‌ డబ్బులు అందజేస్తున్నారని తెలిపారు. ఈసారైతే హ్యాపీ న్యూ ఇయర్‌ అని విష్‌ చేస్తూ.. పెన్షన్లు ఇస్తున్నారని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..  
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పింఛన్‌ లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఆస్పత్రిలో ఉంటే అక్కడికే వెళ్లి ఇస్తున్నారు 
► అవ్వాతాతలు అనారోగ్యం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే నా వలంటీర్‌ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు స్వయంగా అక్కడికి వెళ్లి పెన్షన్‌ అందజేస్తున్న గొప్ప వ్యవస్థ మన రాష్ట్రంలో ఉంది. దాదాపు 2.70 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లు ఇవాళ పెన్షన్ల పంపిణీ అనే యజ్ఞంలో పని చేస్తున్నారు.  
► ఈ రోజు పెన్షన్‌ అందుకోవడంలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఆ గ్రామ, వార్డు సచివాలయాన్ని, లేక  మీ వలంటీర్‌ను సంప్రదించండి. వారే దగ్గరుండి మీకు పెన్షన్‌ అందేలా సాయం చేస్తారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పాల్గొన్నారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement