
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీలో అర్హులైన అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న అన్ని పరీక్షలు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రాయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అనేకమంది అభ్యర్ధులు తమ విద్యార్హతలకు తగ్గట్టుగా నాలుగైదు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పరీక్షలన్నిటికీ హాజరయ్యేందుకు వీలుగా ప్రభుత్వం వారికి అనుకూలంగా వేర్వేరు తేదీలను నిర్ణయిస్తోంది. అలాగే, ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు కూడా వీలయ్యేలా చర్యలు తీసుకుంటోంది. వారికి వేర్వేరు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తే, మధ్యాహ్నం పరీక్షకు సకాలంలో చేరుకోడానికి అభ్యర్థులు అనేక వ్యయ ప్రయాసలకు గురయ్యే అవకాశం ఉన్నందున అలాంటి వారు రెండు పరీక్షలను ఒకే కేంద్రంలో రాసేలా చర్యలు తీసుకుంటోంది.
రెండు మూడ్రోజుల్లో పరీక్షల షెడ్యూలు
కాగా, రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒకే విడతలో 1,26,728 ప్రభుత్వోద్యోగాల భర్తీకి ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లకు నిరుద్యోగులు అనూహ్యంగా స్పందించారు. శనివారం నాటికి 21,96,171 దరఖాస్తులు రావడంతో పరీక్షల నిర్వహణకు సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పరీక్షా కేంద్రాల్లో ఫర్నీచర్, తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులు, ఇన్విజిలేటర్లు, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను నియమిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ జె.విజయకుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. వచ్చే నెల 1 నుంచి 8 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని చెప్పారు.
ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు
ఇదిలా ఉంటే.. అభ్యర్థులు అరగంటకు ముందుగానే పరీక్షా కేంద్రానికి రావాలని, ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించేదిలేదని విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. కాలిక్యులేటర్లు, మొబైల్‌ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
దరఖాస్తుల గడువు పొడిగింపు
రాష్ట్రంలో వరదల కారణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 10వ తేదీ శనివారం అర్ధరాత్రి 11.59 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి 11.59 గంటల వరకు పొడిగించారు. వరదల కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ముంపు ప్రాంతాలలో యువత విద్యుత్ అంతరాయాల కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు.
వలంటీర్ పోస్టులకు 26న రెండో నోటిఫికేషన్
ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు వలంటీర్ల పోస్టుల భర్తీకి ఈ నెల 26న రెండో నోటిఫికేషన్ జారీచేసే ఆలోచనలో ఉన్నామని విజయకుమార్ తెలిపారు. ఈ ఒక్కసారికి మాత్రమే కేంద్రస్థాయిలో నియామక ప్రక్రియ జరుగుతుందని, ఆ తరువాత నుంచి ఏర్పడే ఖాళీలను జిల్లా కలెక్టర్లు, పురపాలక శాఖలోని ప్రాంతీయ కార్యాలయ అధికారులు భర్తీచేస్తారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment