JOB Replacement
-
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం
సాక్షి, అమరావతి: ‘అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తాం. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం’ అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీడీపీ కూటమి.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కుతోంది. కొత్త ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేయకపోగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన నియామకాల ప్రక్రియలను సైతం నిలిపివేసే దిశగా అడుగులు వేస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. వైద్య, ఆరోగ్య శాఖలో 2 వేలకు పైగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను రద్దు చేయాలని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో ఆ శాఖ ఉన్నతాధికారులు పలుమార్లు సమావేశం నిర్వహించి.. నోటిఫికేషన్లు రద్దు చేస్తే తలెత్తే న్యాయపరమైన ఇబ్బందులపై చర్చించినట్లు సమాచారం. జీరో వేకెన్సీకి తిలోదకాలు.. ప్రభుత్వాస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు, డాక్టర్లు, నర్సుల, ఇతర వైద్య సిబ్బంది కొరత లేకుండా జీరో వేకెన్సీ(ఎప్పటికప్పుడే ఖాళీలు భర్తీ) పాలసీని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూనే.. రోగుల అవసరాలకు అనుగుణంగా కొత్త పోస్టులు మంజూరు చేస్తూ వచ్చింది. ఎన్నికలకు ముందు కూడా పారామెడికల్‌తో పాటు ఇతర సహాయక సిబ్బంది పోస్టుల భర్తీ కోసం డిస్టిక్ సెలక్షన్ కమిటీ(డీఎస్సీ)లు 2 వేలకు పైగా పోస్టుల భర్తీకి 18 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అయితే ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుండగా ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే జీరో వేకెన్సీ పాలసీకి తూట్లు పొడిచింది. అలాగే వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసిన ఈ 18 నోటిఫికేషన్లనూ రద్దు చేసేందుకు చర్యలు చేపట్టింది. తుది దశలో ఉన్నా.. రద్దుకే మొగ్గు! వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసిన 18 నోటిఫికేషన్లకు సంబంధించి.. మూడింటిలో ఇప్పటికే తుది మెరిట్ జాబితాలు విడుదలయ్యాయి. మరో 8 నోటిఫికేషన్లలో ప్రాథమిక మెరిట్ జాబితాలు జారీ చేయగా.. ఏడింటిలో ప్రాథమిక మెరిట్ జాబితాలు విడుదల చేయాల్సి ఉంది. ఇలా దాదాపు ముగింపు దశలో ఉన్న నోటిఫికేషన్లను రెండు నెలలకు పైగా పెండింగ్‌లో ఉంచిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు రద్దు చేసే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. అలాగే విజయనగరం వైద్య కళాశాలలో 60 పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసి.. గత నెలలో రెండో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత రెండో నోటిఫికేషన్‌ను కూడా నిలిపివేసింది. ఇక మచిలీపట్నం వైద్య కళాశాలలో 96 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. ఒక విడత ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. రెండో విడత ఎంపిక జాబితా మాత్రం ఇంకా ప్రాసెస్‌లోనే ఉండిపోయింది. దీనిపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంపై ఉన్న కోపంతో.. తమ జీవితాలతో ఆడుకోవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వైద్య సేవలపై ప్రభావం.. కూటమి ప్రభుత్వ నిర్ణయాల వల్ల వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. రాష్ట్రంలో విష జ్వరాలు విలయతాండవం చేస్తున్న తరుణంలో.. బోధనాస్పత్రుల్లో పారామెడికల్, ఇతర సహాయక సిబ్బంది కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మార్కాపురం బోధనాస్పత్రిలో రోజుకు 500 నుంచి 600 మేర ఓపీలు నమోదవుతున్నాయి. ఈ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీíÙయన్లు 25 మంది అవసరమవ్వగా.. ప్రస్తుతం ఐదుగురే ఉన్నారు. రోజుకు 300 వరకు ల్యాబ్ పరీక్షలు చేయాల్సిన చోట.. ఐదుగురే ఉండటంతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయితే గానీ ఈ సమస్య పరిష్కారమవ్వదని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. -
భారీగా ‘బ్యాక్లాగ్’! ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మిగిలిపోతున్న పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న నియామక సంస్థలకు బ్యాక్లాగ్ తిప్పలు పట్టుకున్నాయి. ఒకే సమయంలో భారీగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియలు చేపడుతుండటంతో.. గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. పోటీ పరీక్షల కోసం పకడ్బందీగా సిద్ధమవుతున్న చాలా మంది అభ్యర్థులు.. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారు. వాటిలో ఒకదానిని ఎంచుకోవడంతో మిగతా ఉద్యోగాలు ఖాళీగా మిగిలిపోతున్నాయి. ఉద్యోగ నియామక సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం, వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల కౌన్సెలింగ్‌ను ఒకే సమయంలో నిర్వహించడం వంటివి దీనికి కారణమవుతున్నాయి. ఉద్యోగాలకు ఎంపికైనవారు వాటిని వదులుకుంటే.. తర్వాతి మెరిట్ అభ్యర్థులకు కేటాయించే పరిస్థితి (రిలిక్విష్ మెంట్) లేకపోవడం కూడా సమస్యకు దారితీస్తోంది. ఇలా మిగిలిపోయిన ఉద్యోగాలకు మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసి, భర్తీ ప్రక్రియ చేపట్టాల్సి వస్తోంది. ఇటీవల భర్తీ చేసిన గురుకుల కొలువులు, పోలీస్ కానిస్టేబుల్, స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్ తదితర కేటగిరీ ఉద్యోగాల్లో సుమారు 10శాతానికిపైగా ఇలా మిగిలిపోవడం గమనార్హం. 33వేల కొలువుల్లో.. 4,590 ఉద్యోగాలు ఖాళీ.. రాష్ట్రంలో గత మూడు నెలల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో 33 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగింది. ఇందులో 4,590 ఉద్యోగాలు మిగిలిపోయినట్టు నియామక సంస్థల ప్రాథమిక గణాంకాలు చెప్తున్నాయి. ఉద్యోగులంతా పూర్తిస్థాయిలో విధుల్లో చేరితే ఇందుకు సంబంధించి మరింత స్పష్టత రానుంది. గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు పరిధిలో ఇప్పటివరకు 8.820 ఉద్యోగాల భర్తీ చేపట్టగా.. ఏకంగా 1,810 ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలినట్టు సమాచారం. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఇటీవల చేపట్టిన 15,644 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో దాదాపు 2వేల ఉద్యోగాలు భర్తీ కాలేదు. ఇక మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7 వేల స్టాఫ్ నర్సు, 1,150 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయగా.. వీటిలోనూ 780 ఉద్యోగాలు మిగిలిపోయాయి. రిలిక్విష్మెంట్ లేకపోవడంతో.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఉద్యోగ ఖాళీల భర్తీలో రిలిక్విష్మెంట్ విధానాన్ని అనుసరించారు. అంటే ఏదైనా నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రకటించిన ఖాళీలు పూర్తిస్థాయిలో భర్తీ కాకుంటే.. అందులోని తర్వాతి మెరిట్ అభ్యర్థులతో భర్తీచేసేందుకు వీలు ఉండేది. 2018 వరకు ఈ విధానాన్ని అనుసరించారు. కానీ ఈ విధానంలో పారదర్శకత లోపించిందంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, దానికితోడు ఇతర కారణాలతో రిలిక్విష్మెంట్ విధానాన్ని పక్కనబెట్టారు. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చాక జారీ అయిన నోటిఫికేషన్లలో రిలిక్విష్మెంట్ అంశాన్ని జతచేయలేదు. అంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎన్ని పోస్టులు మిగిలినా అదే నోటిఫికేషన్ కింద భర్తీ చేసే అవకాశం లేదు. ఇటీవల రిలిక్విష్మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి, నిబంధనలపై చర్చించినా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా భర్తీ ప్రక్రియలో బ్యాక్లాగ్ ఖాళీలు మిగిలిపోతున్నాయి. వాటిని భర్తీ చేయాలంటే మళ్లీ కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయాల్సిందేనని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం నియామకాల ప్రక్రియలు ఇంకా కొనసాగుతుండటంతో.. నోటిఫికేషన్ల వారీగా ఏర్పడే ఖాళీలపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. -
పండుగ నాటికి 12,000 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీలో భాగంగా ఇప్పుడు గురుకుల కొలు వులకు సమయం ఆసన్నమైంది. గత నెల రోజు లుగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎంహెచ్ఎస్ ఆర్బీ) ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ప్రక టనలు జారీ అయ్యాయి. ఉద్యోగాల భర్తీకి రాష్ట్రంలో నాలుగు ప్రధాన నియామక సంస్థలుండగా.. మూడు సంస్థల ద్వారా నోటిఫికేషన్లు వెలువ డ్డాయి. కానీ తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ద్వారా మాత్రం ఇప్పటివరకు ఒక్క ప్రకటన కూడా విడుదల కాలేదు. వాస్తవానికి 9 వేల కొలువులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నిరకాల అనుమతులు జారీ చేసింది. దీంతో సంబంధిత గురుకుల సొసైటీలు ప్రతిపాదనలు పంపాయి. అయితే బీసీ గురుకుల సొసైటీ పరిధిలో కొత్త పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు కావడంతో వాటికి శాశ్వత ప్రాతిపదికన పోస్టులు మంజూరయ్యాయి. దీంతో వీటికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇస్తే ఒకేసారి ప్రకటనలు విడుదల చేయవచ్చని గురుకుల నియామకాల బోర్డు సూచించింది. అయితే బీసీ గురుకుల సొసైటీ పరిధిలో కొత్తగా మంజూరైన పోస్టులకు ప్రభుత్వ అనుమతులు రావడంలో ఇప్పటివరకు జాప్యం నెలకొంది. దీంతో కొలువుల ప్రకటనల జారీ కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఆనుమతులు దాదాపుగా వచ్చాయి. ఈ క్రమంలో ఉద్యోగ ప్రకటనల జారీకి టీఆర్‌ఈఐఆర్‌బీ కసరత్తు వేగవంతం చేసింది. పండుగ నాటికి ప్రకటనల జారీ.. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుక బడిన తరగతులు సంక్షేమ విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్) పరిధిలో 9,096 కొలువుల భర్తీకి ప్రభుత్వం ఇదివరకే ఆమోదం తెలిపింది. తాజాగా బీసీ గురుకులాల్లో మరో 3 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో దాదాపు 69 కేటగిరీలకు చెందిన కొలువులున్నాయి. ఈ పోస్టుల భర్తీకిగాను గురు కుల సొసైటీలు జోనల్, మల్టీజోనల్, జిల్లా కేడర్లు, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు తదితర పూర్తిస్థాయి సమాచారంతో రూపొందించిన ప్రతిపాదనలను గురుకుల నియామకాల బోర్డుకు సమర్పించాయి. బోర్డు అధికారులు వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకు న్నాక ప్రకటనలు జారీ చేయనున్నట్లు అధికా రులు చెబుతున్నారు. పరిశీలన ప్రక్రియతో పాటు బీసీ గురుకుల సొసైటీకి సంబంధించిన కొన్ని పోస్టులకు పూర్తిస్థాయి అనుమతులు జారీ అయ్యేందుకు మరో రెండ్రోజుల సమయం పడుతుందని సొసైటీ అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న వారం, పది రోజుల్లో అంటే సంక్రాంతి పండుగ నాటి కల్లా టీఆర్‌ఈఐఆర్‌బీ నుంచి ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. -
TS: కొత్త కొలువుల ఏడాది.. వరుసగా ఉద్యోగ భర్తీ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ఏడాదిలో వరుసగా ఉద్యోగ భర్తీ పరీక్షలు జరగనున్నాయి. ఏడాదిలోగా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీచేయగా, త్వరలో మరికొన్ని కొలువులకు ప్రకటన చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వచ్చిన పలు నోటిఫికేషన్లకు సంబంధించి జనవరి చివరి వారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలవనుంది. వాటికి 2023 ఏడాది మధ్యలో నియామక పరీక్షలు జరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇక ముందు వెలువడబోయే నోటిఫికేషన్లకు ఆ తర్వాత రాత పరీక్షలు ఉంటాయని అంటున్నాయి. మొత్తంగా 2023 ఏడాది పొడవునా నియామక సంస్థలు ఉద్యోగ అర్హత పరీక్షలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో నిరుద్యోగులు ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవడంలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 42 వేల పోస్టులకు.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గత ఏడాది మార్చిలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 80 వేల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. అందులో భాగంగా పలు పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నియామక సంస్థలు 42,293 కొలువులకు ప్రకటనలు జారీ చేశాయి. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామకాల బోర్డు 17,516 పోస్టులకు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 17,457 పోస్టులకు, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 7,320 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చాయి. మరోవైపు గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు ద్వారా 12వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు రానున్నాయి. వీటికితోడు ఉపాధ్యాయ పోస్టులు, యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి కూడా ప్రకటనలు వెలువడనున్నాయి. ఈ ఉద్యోగాలన్నింటి భర్తీకి 2023 సంవత్సరమే వేదిక కానుంది. వరుసగా భర్తీ పరీక్షలు ఇప్పటికే నోటిఫికేషన్లు వెలువడిన ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షలు నిర్వహించేందుకు నియామక సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. పోలీసు ఉద్యోగాలకు సంబంధించి వచ్చే ఏప్రిల్ లేదా మే నెలలో మెయిన్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అదే విధంగా గ్రూప్–1 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా త్వరలో వెలువడనుంది. వచ్చే మే తర్వాత మెయిన్ పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఆ పరీక్షల తర్వాత కొంత విరామమిచ్చి గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 పరీక్షలు నిర్వహించనున్నట్టు అంచనా. ఇదే సమయంలో ఇతర పోస్టులకు సంబంధించి అర్హత పరీక్షలను కూడా నిర్వహించనుంది. మరోవైపు గురుకుల పోస్టులకు సంబంధించి జనవరిలో ప్రకటనలు వెలువడితే.. జూన్ తర్వాత పరీక్షలు జరిగే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. నోటిఫికేషన్లు, పోస్టుల వివరాలివీ.. ► తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) 17,515 పోలీస్ కొలువులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో 587 సబ్ ఇన్స్పెక్టర్, 16,929 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహించిన బోర్డు.. దేహ దారుఢ్య పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత మెయిన్ పరీక్షలను 2023 ఏడాది మధ్యలో నిర్వహించే అవకాశం ఉంది. ► టీఎస్పీఎస్సీ 2022లో మొత్తంగా 22 నోటిఫికేషన్లు ఇచ్చింది. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 కేటగిరీలు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులతోపాటు ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో కలిపి 17,457 ఉద్యోగాలకు ప్రకటనలు విడుదల చేసింది. కీలకమైన గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలతోపాటు పలు కేటగిరీల్లో కొలువుల భర్తీకి అర్హత పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ► తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) మొత్తం 7,320 ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేసింది. ఇందులో సివిల్ అసిస్టెంట్ సర్జన్ 969, స్టాఫ్ నర్సులు 5,204, అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో 1,147 పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఎంపిక దాదాపు పూర్తవగా.. మిగతా కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ► తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) సైతం గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో వివిధ కేటగిరీల్లో 12వేల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో కేటగిరీల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. జనవరి నెలాఖరుకల్లా దాదాపు అన్నిరకాల కొలువులకు ప్రకటనలు వెలువడనున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ పోస్టులకు 2023 ఏడాదిలోనే అర్హత పరీక్షలు నిర్వహించనున్నారు. -
గురుకుల కొలువుల భర్తీకి వేగంగా కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు అంశం కొలిక్కి రావడంతో ప్రభుత్వ శాఖల్లో నూతన ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమమైంది. ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి తాజాగా వెలువడిన కొత్త రోస్టర్ పాయింట్లతో దాదాపు రెండు నెలలుగా ఉద్యోగ ప్రకటనలపై నెలకొన్న స్తబ్ధతకు తెరపడింది. దీంతో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన కొలువులకు త్వరలో నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కసరత్తు వేగవంతమైంది. రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు ఆరుశాతం నుంచి పది శాతానికి పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో 80 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రత్యేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా శాఖలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) మాత్రం ఒక్క నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఇంతలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపు అంశం తెరపైకి రావడంతో నియామకాలకు సంబంధించిన ప్రక్రియలో జాప్యం జరిగింది. తాజాగా నియామకాల భర్తీకి ఆటంకాలు తొలగిపోవడంతో గురుకుల ఉద్యోగాల భర్తీకి సొసైటీలు చర్యలను వేగవంతం చేశాయి. 4 సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో 9,096 ఉద్యోగాలను టీఆర్‌ఈఐఆర్‌బీ ద్వారా భర్తీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కొలువుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలనుటీ ఆర్ఈఐఆర్బీకి సమర్పించేందుకు సొసైటీలు కసరత్తు మొదలుపెట్టాయి.ఈ నెలాఖరులోగా తమ ప్రతిపాదనలు గురుకుల నియామకాల బోర్డుకు సమర్పించేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రతిపాదనలు అందిన తర్వాత గురు కుల బోర్డు పరిశీలించి నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. -
గురుకులం.. ఇక కొలువుల కోలాహలం!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో కొలువుల జాతరకు వేళ అయింది. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ప్రక్రియ పట్టాలెక్కింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల సొసైటీల పరిధిలో బోధన సిబ్బంది కేటగిరీలో 9,096 ఉద్యోగ నియామకాలకు గతవారం ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యం లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనల రూపకల్పనలో సొసైటీలు తలమునకలయ్యాయి. అనుమతించిన పోస్టులు, జోన్లవారీగా విభజన, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లకు సంబంధించి మరోమారు పరిశీలన చేపట్టాయి. ఒకట్రెండు రోజుల్లో వీటిని నిర్ధారణ చేసుకున్న తర్వాత గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డుకు ప్రతిపాదనలు సమర్పించనున్నట్లు సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం బీసీ గురుకుల విద్యాసంస్థలు 261, ఎస్సీ 230, ఎస్టీ 105, మైనారిటీ విద్యాసంస్థలు 207 ఉన్నాయి. బీసీ గురుకులాల్లో అత్యధిక పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాసంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. విద్యాసంస్థల మంజూరు సమయంలోనే శాశ్వత ఉద్యోగ నియామకాలపై స్పష్టత ఇచ్చింది. ఏటా 25 శాతం చొప్పున నాలుగేళ్లలో అన్ని సొసైటీల్లో రెగ్యులర్ ఉద్యోగ నియామకాలు పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించింది. నియామకాల కోసం ప్రత్యేకంగా తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ)ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే 10 వేల ఉద్యోగాలను భర్తీ చేయగా, తాజాగా మరో 9,096 ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న కొలువుల్లో అత్యధికం బీసీ గురుకుల సొసైటీ పరిధిలోనే ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత అత్యధికంగా 238 బీసీ గురుకుల విద్యాసంస్థలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీసీ గురుకులాల్లోనే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. బీసీ గురుకుల సొసైటీకి 3,870, ఎస్సీ 2,267, ఎస్టీ 1,514, మైనార్టీ సొసైటీలో 1,445 చొప్పున ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. సొసైటీలవారీగా ప్రతిపాదనలు స్వీకరించిన తర్వాత గురుకుల నియామకాల బోర్డు వాటిని అన్నివిధాలా పరిశీలించి ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయనుంది. -
AP: 8,000 పోస్టులు సత్వరం భర్తీ
ఉన్నత విద్యలో టీచింగ్ పోస్టుల భర్తీలో సమర్థతకు పెద్దపీట వేసేలా నిర్ణయాలు ఉండాలి. రెగ్యులర్ పోస్టులు అయినా, కాంట్రాక్టు పోస్టులు అయినా పారదర్శకంగా నియామకాలు జరగాలి. ఇందు కోసం ప్రతిపాదనలు తయారు చేయాలి. పోలీసు ఉద్యోగాల భర్తీపై పోలీసు విభాగం, ఆర్థిక శాఖ అధికారులు సమన్వయంతో వీలైనంత త్వరగా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి. వచ్చే నెల మొదటి వారంలో దానిని నాకు నివేదించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: జాబ్ క్యాలెండర్ (202122)లో మిగిలిన సుమారు 8 వేల పోస్టులను సత్వరమే భర్తీ చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. 202122 ఆర్థిక సంవత్సరంలో 39,654 పోస్టులను ఇప్పటికే భర్తీ చేశామని స్పష్టం చేశారు. ఇవి కాక ఈ ప్రభుత్వం వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా మరో 50 వేల మందిని ప్రభుత్వంలోకి తీసుకున్నామని చెప్పారు. ఇలా పలు శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరిగిందన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో జాబ్ క్యాలెండర్‌పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏడాది కాలంగా జరిగిన రిక్రూట్మెంట్, ఇంకా భర్తీ చేయాల్సిన పోస్టులపై సమగ్రంగా చర్చించారు. జాబ్ క్యాలెండర్లో భాగంగా రిక్రూట్ చేసిన పోస్టుల వివరాలను ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. బ్యాక్‌లాక్ పోస్టులు, ఏపీపీఎస్సీ, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఉన్నత విద్య తదితర శాఖల్లో జరిగిన, జరుగుతున్న రిక్రూట్‌మెంట్‌ను సీఎం జగన్ సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఏమన్నారంటే.. జాబ్ క్యాలెండర్‌పై ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గడువులోగా మిగిలిన పోస్టుల భర్తీ ► జాబ్ క్యాలెండర్లో నిర్దేశించుకున్న పోస్టుల్లో ఇంకా భర్తీ కాకుండా మిగిలిన వాటి రిక్రూట్మెంట్పై కార్యాచరణ రూపొందించుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖలో మిగిలిన పోస్టులను ఈ నెలాఖరులోగా, ఉన్నత విద్యా శాఖలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను సెప్టెంబర్‌లోగా, ఏపీపీఎస్సీలో పోస్టులను మార్చిలోగా భర్తీ చేయాలి. నిర్దేశించుకున్న సమయంలోగా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ► విద్య, వైద్యంపై చాలా డబ్బు వెచ్చించి ఆస్పత్రులు, విద్యాలయాలు కడుతున్నాం. ఇక్కడ ఖాళీలు భర్తీ చేయకపోతే వాటి ప్రయోజనాలు ప్రజలకు అందవు. ► ఈ సమీక్షలో డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె హేమచంద్రారెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా, జీఏడీ కార్యదర్శి (సర్వీసులు హెచ్ఆర్ఎం) హెచ్ అరుణ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ► 202122లో 39,654 పోస్టుల భర్తీ. ► ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే 39,310 పోస్టుల్లో నియామకాలు పూర్తి. ► గుర్తించిన 47,465 పోస్టుల్లో 83.5 శాతం పోస్టుల రిక్రూట్మెంట్ ఈ ఒక్క ఏడాదిలో పూర్తి. ► 16.5 శాతం పోస్టులను, అంటే సుమారు 8 వేల పోస్టులు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. ► ఇందులో 1,198 పోస్టులు వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నాయి. -
ఉద్యోగాల భర్తీ నిలిపివేత
-
రాత పరీక్షపై పీఆర్బీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్పీఆర్బీ) నేతృత్వంలో జరుగుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహణపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. దరఖాస్తులకు గడువు ఈ నెల 26వ తేదీతో ముగియనుండటంతో పరీక్ష తేదీని ఖరారు చేయడం, రాత పరీక్ష కోసం ఏర్పాటు చేయాల్సిన పరీక్ష కేంద్రాలు, ఇన్విజిలేటర్ల ఎంపిక తదితర అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. జూలై రెండు లేదా మూడో వారంలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసు ఉద్యోగాలకు ఇప్పటికే దాదాపు 13 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో చాలామంది రెండు నుంచి మూడు ఉద్యోగాలకు దరఖాస్తు చేయడంతో పెద్ద సంఖ్యలో రాత పరీక్ష కేంద్రాల ఎంపిక కత్తిమీద సాములా మారినట్టు తెలుస్తోంది. ముందుగా సబ్ ఇన్స్పెక్టర్, సమాన ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. దీనితో అభ్యర్థుల సంఖ్యకు తగ్గట్టుగా కాలేజీలు, స్కూళ్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పరీక్ష ఆదివారం రోజు నిర్వహించాల్సి ఉంటుందని భావిస్తున్న అధికారులు ఈ మేరకు యాజమాన్యాలతో చర్చిస్తున్నారు. ఆయా జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, కలెక్టర్లతో సంపద్రించి ఎన్ని కాలేజీలు, స్కూళ్లు సెంటర్లుగా ఏర్పాటు చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఒకే తేదీల్లో రాకుండా.. ఒకవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మరోవైపు టీఎస్పీఆర్బీ నిర్వహించే పరీక్షల తేదీలు ఒకేరోజు రాకుండా చూడటంపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. రైల్వేతో పాటు వివిధ పోటీ పరీక్షలు సైతం జూన్, జూలైలో ఉండటంతో ఈ పరీక్షలు రాసే అభ్యర్థులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జూలై రెండో వారం లేదా మూడో వారంలో ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించాలని టీఎస్పీఆర్బీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తొలుత జూన్ ఆఖరులో లేదా జూలై మొదటి వారంలో నిర్వహించాలని భావించినా, ప్రభుత్వం ఈ ఉద్యోగాలకు మరో రెండేళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు ఇవ్వడంతో.. దరఖాస్తు దాఖలుకు గడువును కూడా పొడిగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రెండు వారాలు ఆలస్యంగా రాత పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నట్టు బోర్డు అధికార వర్గాలు తెలిపాయి. -
ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య యజ్ఞం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైద్య, ఆరోగ్య రంగంలో 39,000 పోస్టుల భర్తీని చేపట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల వరకు ఆధునికీకరణ, వైద్య ఆరోగ్య రంగంలో నాడు – నేడు ద్వారా మెరుగైన వసతుల కల్పనకు రూ.16 వేల కోట్లకు పైగా వెచ్చిస్తున్నట్లు చెప్పారు. దశాబ్దాలుగా మార్పులకు నోచుకోని విద్య, వైద్యం తదితర రంగాల్లో వ్యవస్థలను మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, గృహ నిర్మాణం తదితర కీలక రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు చరిత్రాత్మకమన్నారు. వైద్య, ఆరోగ్య రంగంపై సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ఆసుపత్రులలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్ మోడల్‌ను ఈ సందర్భంగా పరిశీలించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ఆసుపత్రులలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్ మోడల్‌ను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి విడదల రజిని ఆరోగ్యశ్రీ సేవలపై బోర్డులు విలేజ్, వార్డు క్లినిక్స్ దగ్గర నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకూ నాడు– నేడు కింద పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆరోగ్యశ్రీలో ఎలాంటి పెండింగ్ బిల్లులు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామన్నారు. ఇప్పటివరకు దాదాపు రూ.5,200 కోట్లు వ్యయం చేసినట్లు చెప్పారు. గత సర్కారు బకాయి పెట్టిన రూ.680 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులను కూడా అధికారంలోకి రాగానే చెల్లించామన్నారు. రోగులను ఆర్థికంగా ఆదుకునేందుకు శస్త్ర చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటి వెళ్లే సమయంలో ఆరోగ్య ఆసరా ద్వారా డబ్బులు కూడా ఇస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్సల సంఖ్యను గణనీయంగా పెంచామన్నారు. మరింత సులువుగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలను పొందేలా సూచనలతో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీలో అవసరం మేరకు ప్రొసీజర్లను పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. యజ్ఞంలా పనిచేద్దాం.. రాష్ట్రంలో వైద్య సేవలను బలోపేతం చేసేందుకు కొత్తగా 16 టీచింగ్ ఆస్పత్రులను నెలకొల్పుతున్నామని సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలున్న మందులు ఇస్తున్నామన్నారు. భారీ మార్పులను ఆశించి అందుకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుని విద్య, వైద్యం సహా కీలక రంగాలపై అత్యంత శ్రద్ధ వహిస్తూ అనుభవం, సమర్థత ఉన్న అధికారులను ఆయా శాఖలకు కేటాయించామన్నారు. ముఖ్యమంత్రిగా తాను నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు యజ్ఞంలా అధికారులు పని చేయాలని సూచించారు. శాఖాధిపతులు, సిబ్బంది దీన్ని చాలెంజ్‌గా స్వీకరించి ఆశించిన మార్పుల సాధనకు కృషి చేయాలన్నారు. మే నెలాఖరుకు పోస్టుల భర్తీ పూర్తి వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సమీక్షలో ముఖ్యమంత్రి ఆరా తీశారు. మే నెలాఖరు నాటికి అన్ని నియామకాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇందులో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించేందుకు పెద్ద సంఖ్యలో డాక్టర్లను నియమిస్తున్నామని, వైద్యులకు ఇచ్చే జీతాల విషయంలో ఎలాంటి రాజీపడకూడదని సూచించారు. ప్రజలకు కచ్చితంగా వైద్యుల సేవలు అందుబాటులో ఉండేలా గతంలో జీతాలు పెంచుతూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అందుకనే ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం విధించామన్నారు. నిర్మాణాల్లో ఎక్కడా రాజీపడొద్దు ఆస్పత్రుల్లో నాడు– నేడు పనులు, విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్ నిర్మాణం, కొత్త పీహెచ్‌సీలు, మెడికల్ కాలేజీల నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సమీక్షిస్తూ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. వసతులు, సౌకర్యాలకు సంబంధించి ఎక్కడా లోటు రాకూడదన్నారు. జోరుగా 6 కొత్త మెడికల్ కాలేజీల పనులు పలాస కిడ్నీ ఆస్పత్రి, కడప సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, గిరిజన ప్రాంతాల్లో స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణాల ప్రగతి గురించి సమీక్షలో అధికారులు వివరించారు. 16 కొత్త మెడికల్ కాలేజీల్లో 6 చోట్ల జోరుగా నిర్మాణాలు సాగుతున్నాయని చెప్పారు. పులివెందుల, పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల, విజయనగరం, అమలాపురం మెడికల్ కాలేజీల నిర్మాణాల ప్రగతిని తెలియచేశారు. మిగిలిన చోట్ల మే 15 నాటికల్లా మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారు. కేంద్రం నుంచి అనుమతులపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. పరిశుభ్రతకు పెద్దపీట ఆస్పత్రుల్లో సౌకర్యాలు, సదుపాయాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆస్పత్రి నిర్వహణ పరిశుభ్రంగా ఉందా? లేదా? అన్నదానిపై పరిశీలన చేయాలన్నారు. టాయిలెట్ల దగ్గర నుంచి ప్రతి విభాగం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పాజిటివ్ కేసులు ఐదే రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ కేసులు కేవలం ఐదు మాత్రమే ఉన్నాయని, డైలీ యాక్టివిటీ రేటు 0.13 శాతానికి పడిపోయిందని అధికారులు తెలిపారు. 4,30,81,428 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైనట్లు వెల్లడించారు. 15 – 17 ఏళ్ల వారికి వంద శాతం రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది. 12 – 14 ఏళ్ల వారికి మొదటిడోసు 94.47 శాతం వ్యాక్సిన్లు ఇచ్చారు. సమీక్షలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్‌శర్మ, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్ అండ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్ చంద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ, ఎండీ డి.మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య మిత్రలకూ ప్రోత్సాహకాలు ప్రతిభ ఆధారంగా వలంటీర్ల మాదిరిగా ఆరోగ్య మిత్రలకు కూడా నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ సమీక్షలో ఆదేశించారు. దీనిద్వారా ఆరోగ్య మిత్రల సేవలను గుర్తించినట్లు అవుతుందన్నారు. ఏడాదిలో ఒక రోజు ఎంపిక చేసి నగదు ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. -
స్థానికత వర్తింపుపై సందేహాలు! ఆ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేదెవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన నోటిఫికేషన్ అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తోంది. ఉద్యోగ ఖాళీలు, విద్యార్హతల్లో స్పష్టత ఉన్నప్పటికీ నియామకాలకు సంబంధించి స్థానికత విషయంలో అయోమయం నెలకొంది. జ్యుడీషియల్ కోర్టులు, జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీసెస్ విభాగాల్లో మొత్తం 592 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈనెల మూడో తేదీన నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఇందులో అత్యధికంగా జూనియర్ అసిస్టెంట్–173, టైపిస్ట్–104 కాకుండా ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్–3, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ కేటగిరీల్లో జిల్లాల వారీగా ఖాళీలను నోటిఫికేషన్లో ప్రకటించారు. నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు–1975ని ప్రస్తావిస్తూ అప్పటి స్థానికత నిబంధనలను వర్తింపజేయనున్నట్లు ప్రకటన పేర్కొంది. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నాల్గోతరగతి నుంచి పదోతరగతి వరకు చదువుకున్న ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో గరిష్టంగా నాలుగేళ్లు ఒకే దగ్గర చదివితే ఆ ప్రాంతాన్ని స్థానికత కింద పరిగణిస్తారు. ఇక 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదివిన ప్రాంతాన్ని బట్టి స్థానికతను నిర్ధారిస్తారు. ఇందులో గరిష్టంగా నాలుగేళ్లు ఒకే చోట చదివినా దాన్ని స్థానికత కింద గుర్తిస్తారు. అయితే ప్రస్తుతం రాష్ట్రపతి ఉత్తర్వులు–2018 ప్రకారం రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లో ఉంది. దీంతో పలువురు అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. మరోవైపు ఉమ్మడి రెవెన్యూ జిల్లాల ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొనడంతో స్థానికత ధ్రువీకరణ పత్రాల జారీపై సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే జిల్లాల పునర్విభజన తర్వాత కొత్త జిల్లాల ప్రకారం రాష్ట్రంలో స్థానికతను ధ్రువీకరిస్తున్నారు. మరిప్పుడు పూర్వ జిల్లాల ప్రకారం స్థానికత ధ్రువీకరణ పత్రాలు ఎవరు జారీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. బీసీలకు లేని ఫీజు రాయితీ న్యాయస్థానాల్లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ఫీజును రూ.800గా హైకోర్టు నిర్దేశించింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులతో పాటు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మాత్రం ఫీజులో 50 శాతం రాయితీ ఇచ్చింది. దీంతో వీరు రూ.400తో పాటు సర్వీసు చార్జీ చెల్లిస్తే సరిపోతుంది. దీంతో బీసీ అభ్యర్థులు నిరుత్సాహ పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ సమయంలో నియామక సంస్థలు ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ అభ్యర్థులకు కూడా ఫీజు రాయితీ ఇస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 50 శాతం రాయితీ ఇస్తూ.. బీసీలు పూర్తి ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. దీంతో తమకూ ఫీజులో రాయితీ ఇవ్వాలని బీసీ అభ్యర్థులు కోరుతున్నారు. -
ఆ ఉద్యోగాలను కలిపినందుకే!
సాక్షి, హైదరాబాద్: ‘‘పీఆర్సీ నివేదికలో వివిధ సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా కలిపి 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలున్నట్టు చూపారు. బిశ్వాల్ కమిటీ శాంక్షన్డ్ స్ట్రెంత్‌లో పోస్టులు చూపిందే తప్ప.. సగం ధ్యాస (హాఫ్ మైండెడ్‌గా)తో వర్కింగ్ స్ట్రెంత్‌ను చూపలేదు. దానిని పట్టుకుని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి..’’అని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. అప్పటికే వైద్య విధాన పరిషత్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యాసంస్థల సొసైటీల్లో పనిచేస్తున్న 54,118 మందిని వర్కింగ్ స్ట్రెంత్‌గా చూపి ఉంటే.. 1.91 లక్షల ఖాళీల్లో అసలు 1,36,534 మాత్రమే ఖాళీ అని వెల్లడయ్యేదని వివరించారు. వీటిలోనూ ప్రమోషన్ కల్పించే 48,634 పోస్టులు తీసేస్తే మిగిలే ఖాళీలు 87,880 మాత్రమేనని చెప్పారు. అయితే సీఎం కేసీఆర్ ముందుచూపుతో మరో ఐదు వేల పోస్టులు కలిపి 91 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సగం తెలివితేటలు, తెలిసీ తెలియనితనంతో బీజేపీ, కాంగ్రెస్ విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. గురువారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చకు హరీశ్‌రావు సమాధానమిచ్చారు. బడుగు బలహీనవర్గాల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచేలా రాష్ట్ర బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల తరహాలో గుడ్డెద్దు చేనులో పడ్డట్టు కాకుండా.. సమాజంలోని చిట్టచివరి మైలురాయి దాకా ప్రయోజనాలు చేరేలా చూస్తున్నామన్నారు. కేంద్ర ఉద్యోగాల కోసం పోరాడండి ఏటా రెండున్నర కోట్ల చొప్పున ఉద్యోగాలిస్తామని ఏడేళ్ల కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, మరి ఎన్ని భర్తీ చేసిందో తెలపాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బీజేపీ నేతలకు దమ్ముంటే 15.62 లక్షల కేంద్రప్రభుత్వ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదో ఢిల్లీ వెళ్లి ప్రధానిని నిలదీయాలన్నారు. కాంగ్రెస్ కూడా ఆ దిశగా పోరాడాలన్నారు. రాష్ట్రంలో ఒక్క ఉద్యోగ ఖాళీ లేకుండా నింపేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే.. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అనవసర విమర్శలతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటోందని.. ఇక విపక్షాలు ‘నెత్తిమీద తడిగుడ్డ’వేసుకోవడమే తరువాయని వ్యాఖ్యానించారు. త్వరలో గొర్రెల పంపిణీ రాష్ట్రంలో త్వరలోనే రెండోదశ గొర్రెలు, మేకల పంపిణీ ప్రారంభిస్తామని.. ఒక్కో యూనిట్ ధరను రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచామని హరీశ్‌రావు తెలిపారు. సంబంధిత కార్పొరేషన్ నిధులతోపాటు బయటి నుంచి రూ.4,500 కోట్లు సమీకరించి.. ప్రతీ గొల్లకురుమ కుటుంబానికి గొర్రెల యూనిట్ అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా నీళ్లు అందుబాటులోకి రావడంతో వలసలు ఆగిపోయాయని.. పైగా 11 రాష్ట్రాల ప్రజలే పనుల కోసం తెలంగాణకు వలస వస్తున్నారని చెప్పారు. 2014కు ముందు తెలంగాణలో మూడే మెడికల్ కాలేజీలు ఉంటే.. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయబోతోందన్నారు. -
నోటిఫికేషన్లు ఇవ్వకపోతే అసెంబ్లీ నడవనివ్వం
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే అసెంబ్లీని నడవనీయబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీజేపీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు శాసనసభలో ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకుని ‘ట్రిపుల్ ఆర్’ సినిమా చూపిస్తారని, బయట కార్యకర్తలు, నిరు ద్యోగులు అసెంబ్లీని దిగ్బంధిస్తారని అన్నారు. నోటి ఫికేషన్ల కోసం బీజేపీ ఉద్యమాలతో ఒత్తిడి తెస్తున్నందున, నిరుద్యోగులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని కోరారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న బీజేపీని ప్రజలు విశ్వసించి 2023లో అధికారంలోకి తీసుకురావాలని కోరారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద బీజేపీ నిర్వహించిన ‘నిరుద్యోగ దీక్ష’లో ఆయన మాట్లాడారు. ఉద్యోగాల భర్తీని విస్మరిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని ఏమి లాభమని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మూర్ఖపు పాలన, తుగ్లక్ నిర్ణయాలతో స్థానికత అనేది ప్రశ్నార్థకంగా మారిందని, ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు చెట్టుకొకరు, పుట్టకొకరుగా విడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఉద్యోగి ఈ నిర్ణయాలతో బాధపడుతున్నా, ఉద్యోగ సంఘా లు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సీఎం ఇకనైనా అర్థం చేసుకోవాలి ఎక్కడికక్కడ అరెస్టులు చేసినా, పోలీసుల వలయాన్ని చేధించుకుని దీక్షాశిబిరం వద్దకు వచ్చిన యువత ఆవేశాన్ని, ఆక్రందనను సీఎం ఇకనైనా అర్థం చేసుకోవాలని సంజయ్ అన్నారు. కేంద్రంపై నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తే, సీఎం సంగతి తేలుస్తామని, మంత్రులు, ఎమ్మెల్యేలెవరినీ వదలబోమని హెచ్చరించారు. ‘నాది దొంగ దీక్ష అని కేటీఆర్ అంటుండు. వాళ్ల నాయనను అడిగితే దొంగదీక్షలు ఎట్లా చేస్తారో చెబుతారు. ఉద్యమప్పుడు కేసీఆర్ చేసింది ముమ్మాటికీ దొంగదీక్షే. బాత్రూంలో ఇడ్లీలు తిన్న నీచమైన చరిత్ర ఆయనది. నువ్వు.. నన్నా దొంగ దీక్ష అనేది’అని ధ్వజమెత్తారు. ఏడేళ్లలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు సీఎం కేసీఆర్ సిద్ధమా అని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జీ తరుణ్ ఛుగ్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయకపోగా వివిధ శాఖల్లోని 50 వేల మంది కాంట్రాక్ట్, ఇతర ఉద్యోగులను తొలగించిందని ఆరోపించారు. బంగారం తెలంగాణ అంటున్న కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయమైం దని ఆయన ఎద్దేవా చేశారు. నిరుద్యోగ దీక్షకు వివిధ నిరు ద్యోగ, ఓయూ, ఇతర విద్యార్థి సంఘాల నేతలు, సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. కార్యక్రమంలో బీజేపీ నేతలు డా.కె.లక్ష్మణ్, విజయశాంతి, జితేందర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, డా.జి.మనోహర్‌రెడ్డి, విజయరామారావు, ఎ.చంద్రశేఖర్, ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, శాంతికుమార్, కౌన్సిల్ మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు నందీశ్వర్‌గౌడ్, కూన శ్రీశైలం గౌడ్, తీన్మార్ మల్లన్న, విఠల్, డాక్టర్ ఎస్.ప్రకాశ్‌రెడ్డి, కొల్లి మాధవి, జయశ్రీ, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, సంగప్ప పాల్గొన్నారు. -
పార్టీ ఆఫీస్‌లో దీక్షకు మీ అభ్యంతరమేంటి?: బండి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నిబంధనలకు లోబడి తమ పార్టీ కార్యాలయంలో ‘నిరు ద్యోగ దీక్ష’ చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీ కోసం బీజేపీ చేపట్టిన ‘నిరుద్యోగ దీక్ష’కు తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులను, పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. నిరుద్యోగ యువతీ, యువకుల పక్షాన బీజేపీ చేపడుతున్న ‘నిరుద్యోగ దీక్ష’కు రాజకీయాలకు అతీతంగా మద్దతివ్వాలని ప్రజాస్వామిక వాదులను కోరారు. బీజేపీ దీక్షతో తమ పీఠం కదులుతుందనే భయంతోనే ఈ దుందుడుకు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. కాగా, దీక్షకు అనుమతినిచ్చే విషయాన్ని పున:పరిశీలించాలని, లేకుంటే సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్, ఇతర నేతలు నిబంధనలకు అనుగుణంగా ‘నిరుద్యోగ దీక్ష’ను కొనసాగిస్తారని బీజేపీ ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్, ఉపాధ్యక్షుడు డా.జి.మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడతామని, ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసేంత వరకు బీజేపీ పోరాటం ఆగదని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
కొత్త ఏడాది ఆశావహమే
ముంబై: కరోనా కల్లోలం నుంచి ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా కోలుకుంటోంది. ఉద్యోగాల భర్తీ పట్ల కంపెనీలు ఆశావహంగా ఉన్నాయని, ఉద్యోగార్థులు నిరాశపడవలసిన పనిలేదని నౌకరీడాట్‌కామ్ తాజా సర్వే పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న 1,327 కంపెనీలు, కన్సల్టెంట్లపై నిర్వహించిన ఈ సర్వే ఇంకా ఏం చెప్పిందంటే... ► రానున్న 3–6 నెలల వ్యవధిలోనే ఉద్యోగాల భర్తీ కరోనా ముందటి స్థాయికి చేరగలదని సర్వేలో పాల్గొన్న 26% కంపెనీలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. అయితే ఉద్యోగాల భర్తీ కరోనా ముందు స్థాయికి చేరడానికి 6 నెలల నుంచి ఏడాది కాలం పడుతుందని 34% కంపెనీలు భావిస్తున్నాయి. ► కరోనా కల్లోలం మెడికల్, హెల్త్‌కేర్, ఐటీ, బీపీఓ/ఐటీఈఎస్ రంగాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే రిటైల్, ఆతిథ్య, పర్యాటక రంగాలపై పెను ప్రభావమే చూపింది. అయితే ఈ రంగాలతో పాటు వాహన రంగంలో కూడా ఉద్యోగాల భర్తీ క్రమేపీ మెరుగుపడుతోంది. ► 2020 ఆరంభంలో హైరింగ్ మార్కెట్ సానుకూలంగానే ఉంది. ఉద్యోగాల కల్పన పెరిగింది. మార్చి నుంచి కరోనా కల్లోలం ఉద్యోగ మార్కెట్‌పై ప్రభావం చూపించడం మొదలైంది. ఏప్రిల్, మే నెలల్లో హైరింగ్ 60 శాతం తగ్గింది. నౌకరీడాట్‌కామ్ ప్లాట్ఫార్మ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఇదే అత్యంత కనిష్ట స్థాయి. ► నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ గత నెలలో 28 శాతం తగ్గింది. అయితే అంతకు ముందటి నెలలతో పోల్చితే ఉద్యోగాల భర్తీ క్రమక్రమంగా పెరుగుతోంది. -
15లోగా 'సచివాలయ' ఫలితాలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాతపరీక్షల ఫలితాలను మరో వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 15వ తేదీ కల్లా ఫలితాల వెల్లడి పూర్తవుతుందని తెలిపాయి. ఆ తర్వాత మరో వారం రోజుల వ్యవధిలోనే జిల్లా సెలక్షన్ కమిటీల ఆధ్వర్యంలో ఉద్యోగ నియామక ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. 19 కేటగిరీలలో మొత్తం 16,208 ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 14 రకాల రాతపరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం 10,57,355 మంది దరఖాస్తు చేసుకోగా.. 7,69,034 మంది పరీక్షలకు హాజరయ్యారు. ► రాతపరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీని ఏపీపీఎస్సీ అధికారులు గురువారం ప్రకటిస్తారు. కీ వివరాలను గ్రామ సచివాలయం వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ► జవాబుల ఓఎమ్మార్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అభ్యర్థుల జవాబుల వివరాలతో పైనల్ కీ అనుసంధానం చేసి మార్కుల జాబితాలను తయారు చేయనున్నారు. ► ఈ ప్రక్రియ ముగియగానే ర్యాండమ్‌గా కొందరు అభ్యర్థుల మార్కులు కంప్యూటరీకరణ ప్రక్రియ ద్వారా, ప్రత్యక్ష పరిశీలనలోనూ అదే అభ్యర్థుల మార్కుల వివరాలను సరిపోల్చనున్నారు. ఆ తర్వాత రాతపరీక్షల ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నట్టు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ వర్గాలు ఈ సందర్భంగా తెలిపాయి. -
పరీక్షలన్నీ పూర్తయ్యాకే ‘కీ’
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకోసం ఆదివారం నుంచి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో మొత్తం వారంపాటు జరిగే ఈ పరీక్షలన్నీ పూర్తయ్యాకే అన్నిటికీ కలిపి ఒకేసారి ‘కీ’ విడుదల చేసే వీలుందని అధికార వర్గాలు వెల్లడించాయి. 19 కేటగిరీలలో పారదర్శకంగా 16,208 ఉద్యోగాల భర్తీకి చేపట్టిన ఈ పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్ల మధ్య తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 26 వరకు రోజుకు రెండేసి చొప్పున పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. మొదటిరోజు జరిగిన పరీక్షలకు 6,81,664 మంది దరఖాస్తు చేసుకోగా 5,06,386 మంది హాజరయ్యారు. రాత పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. పోటాపోటీగా... ► ఆదివారం ఉదయం జరిగిన పరీక్షలో ఒక్కో ఉద్యోగానికి 332 మంది చొప్పున రాతపరీక్షల్లో పోటీపడగా సాయంత్రం జరిగిన పరీక్షల్లో ఒక్కో ఉద్యోగానికి 147 మంది చొప్పున పోటీపడ్డారు. ► 1,025 పోస్టులకు ఆదివారం ఉదయం జరిగిన పరీక్షలకు 4,56,997 మంది దరఖాస్తు చేసుకోగా 4,08,687 మంది హాల్‌టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 3,40,386 మంది రాతపరీక్షలకు హాజరయ్యారు. 2,221 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. ► సాయంత్రం పరీక్షలకు 2,24,667 మంది దరఖాస్తు చేసుకోగా, 2,02,998 మంది హాల్‌టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 1,65,922 మంది 1,059 కేంద్రాల్లో పరీక్షకు హాజరయ్యారు. వారికి ఐసోలేషన్ గదుల్లో పరీక్షలు.. ► తొలిరోజు 634 మంది కరోనా అనుమానిత లక్షణాలున్న అభ్యర్థులు హాజరవగా.. వీరికి ప్రత్యేకంగా ఐసోలేషన్ గదుల్లో పరీక్ష నిర్వహించారు. ► పరీక్ష కేంద్రాల వద్ద కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ అనంతరం అభ్యర్థులను లోపలకు అనుమతించారు. పరీక్ష ప్రారంభానికి ముందు, తర్వాత సోడియం హైపో క్లోరైట్‌తో పూర్తి స్థాయిలో శానిటైజ్ చేశారు. ► పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్లు పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు. ► రాతపరీక్షలు ముగియగానే అన్నిచోట్ల నుంచి జవాబు పత్రాలను గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంకు తరలించారు. పకడ్బందీగా పరీక్షలు: పెద్దిరెడ్డి యూనివర్సిటీ క్యాంపస్: సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి చేపట్టిన రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతి ఎస్వీయూ క్యాంపస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని మంత్రి తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ సంఖ్యలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు నియంత్రణ చర్యలు పక్కాగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. -
రేపటి నుంచి ‘సచివాలయ’ ఉద్యోగ రాత పరీక్షలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి రాతపరీక్షలు మొదలు కానున్నాయి. ఈసారి మొత్తం 16,208 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏడు రోజుల పాటు రోజుకు రెండేసి చొప్పున మొత్తం 14 రకాల రాతపరీక్షలను నిర్వహించనున్నారు. రోజూ ఉదయం పది గంటలకు, మధ్యాహ్నం రెండున్నర గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. కరోనా నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులందరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ఉదయం పరీక్ష రాసేవారు 8 గంటల కల్లా, సాయంత్రం పరీక్ష రాసేవారు ఒంటి గంట కల్లా పరీక్ష కేంద్రం వద్ద రిపోర్ట్ చేయాలని అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి మించి ఒక్క నిమిషం లేటుగా వచ్చినా పరీక్ష హాల్లోకి అనుమతించబోమన్నారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉన్నప్పటికీ తెలుగు అనువాదం కూడా ఉంటుందని చెప్పారు. తప్పుగా గుర్తించిన జవాబులకు నెగిటివ్ మార్కులుంటాయన్నారు. పరీక్షల తర్వాత కూడా బస్సులు విజయవాడ, విశాఖపట్నంలలో శనివారం నుంచి సిటీ సర్వీసులు అందుబాటులోకి వస్తున్నట్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. శుక్రవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల అనంతరం కూడా సిటీ బస్సులు నడుపుతామన్నారు. హాల్‌టికెట్‌లో ఫొటో స్పష్టంగా లేకుంటే.. ► మొత్తం 10,56,391 మంది పరీక్షలు రాస్తుండగా.. అందులో 6,81,664 మంది తొలిరోజునే పరీక్షకు హాజరవుతారు. శుక్రవారం సాయంత్రం వరకు 8,72,812 మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్‌లో ఫొటో స్పష్టంగా లేకున్నా, బ్లాక్ అయిన ఫొటో, చాలా చిన్న సైజులో ఫొటో, సంతకం లేని ఫొటో ఉంటే అభ్యర్థులు గెజిటెడ్ ఆఫీసర్‌తో సంతకం చేయించుకున్న మూడు ఫొటోలు వెంట తెచ్చుకోవాలి. హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు కూడా తప్పనిసరి. ► ఓఎంఆర్ షీట్లో బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో మాత్రమే జవాబులు నింపాల్సి ఉంటుంది. పెన్సిల్, ఇంక్ పెన్, జెల్ పెన్‌తో నింపకూడదు. ► కరోనా అనుమానిత లక్షణాలున్న వారు రాతపరీక్షకు హాజరయ్యేందుకు వీలుగా ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ఐసోలేషన్ రూమును అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రూముల్లో ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లను అందజేస్తారు. ► అభ్యర్థులకు మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు తప్పనిసరి. పరీక్ష సమయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే పరీక్ష కేంద్రం అధికారుల దృష్టికి తెచ్చి ఐసోలేషన్ రూముకు వెళ్లాలి. -
కరోనా వేళ.. ఉద్యోగాల మేళా
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్న వారికి కాస్త ఊరటనిచ్చే అంశమిది. గడచిన నాలుగు వారాల్లో దేశంలో దాదాపు 2 లక్షల ఉద్యోగాల భర్తీకి పలు కంపెనీలు నోటిఫికేషన్లు ఇచ్చాయి. సంక్షోభానంతర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కార్యకలాపాల విస్తృతిని దృష్టిలో ఉంచుకుని నియామక ప్రక్రియ చేపడుతున్నాయి. దేశంలో కంపెనీల ఉద్యోగాల నియామక ప్రణాళికలను ప్రముఖ స్టాఫింగ్ సొల్యూషన్స్ కంపెనీ ‘ఎక్స్ ఫినో’ నివేదిక వెల్లడించింది. లాక్డౌన్ సమయం లోనూ పలు కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాయని విశ్లేషించింది. 2 లక్షల జాబ్ ఓపెనింగ్స్ ► ఎక్స్ ఫినో నివేదిక ప్రకారం.. గత 4 వారాల్లో దేశంలోని పలు కంపెనీలు దాదాపు 2 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాయి. ► వాటిలో 80 వేల ఉద్యోగాలను కొత్తగా డిగ్రీలు పొందిన ఫ్రెషర్స్‌తో భర్తీ చేయాలని నిర్ణయించాయి. ► మరో 80 వేల ఉద్యోగాలు మిడ్ సీనియర్ స్థాయిలోనివి. అంటే ఇతర కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉన్నవారితో భర్తీ చేసేందుకు ఉద్దేశించినవి. ► మొత్తంగా 91% ఫుల్‌టైమ్ ఉద్యోగాలే. మిగిలినవి కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు. ► 2 లక్షల ఉద్యోగాల్లో 25 శాతం అంటే 50 వేల మందికి గత వారంలో నియామక ఉత్తర్వులు కూడా అందాయి. ► కొత్తగా ఉద్యోగులను నియమించుకున్న వాటిలో గూగుల్, టెక్ మహీంద్ర, ఐబీఎం, కేప్ జెమిని, డెలాయిట్, జేపీ మోర్గాన్, అమెజాన్, వాల్ మార్ట్ ల్యాబ్స్, వీఎంవేర్, ఫ్లిప్ కార్ట్, బైజూస్, గ్రోఫెర్స్, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలున్నాయి. ► కొత్తగా నియమించిన ఉద్యోగాల్లో 79 శాతం ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల్లోనే ఉన్నాయి. 15 శాతం ఉద్యోగాలు బ్యాంకింగ్, ఇతర ఆర్థిక సేవా రంగాల్లో లభించాయి. 16 శాతం ఇతర రంగాల్లోని కంపెనీలు భర్తీ చేసుకున్నాయి. అత్యధికంగా 20 శాతం ఉద్యోగ నియామకాలతో బెంగళూరులోని కంపెనీలు మొదటి స్థానంలో నిలిచాయి. 8 శాతం ఉద్యోగాల భర్తీతో రెండో స్థానంలో ఢిల్లీ, 7 శాతం ఉద్యోగాల భర్తీతో మూడో స్థానంలో చెన్నై ఉన్నాయి. -
పోస్టుల భర్తీకి సమగ్ర కార్యాచరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల్లోని ఖాళీలను ప్రాధాన్యత క్రమంలో భర్తీ చేసే విషయమై ఆ విభాగాలతో చర్చించాలని సూచించారు. ఆ దిశగా సమగ్ర క్యాలెండర్‌ను రూపొందించి దశల వారీగా పోస్టుల భర్తీ చేపట్టాలన్నారు. వైద్య, విద్యా రంగాల్లో అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండర్ రూపొందించడంపై తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు రావాలి. ఆ లక్ష్య సాధనకు అవసరమైన మేరకు సిబ్బందిని నియమించాలి. తొలుత ఈ పోస్టులను భర్తీ చేయాలి’ అని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ‘ఆసుపత్రికి ఎవరైనా వెళ్తే అక్కడ అవసరమైన సిబ్బంది లేకపోతే ఆ ఆసుపత్రి నిర్వహించినా వృధానే. ఇప్పటికే నాడు–నేడు ద్వారా ఆసుపత్రులను అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రారంభించాం. అందుకు అనుగుణంగా డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు ఉండాలి. అందుకే ఆ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి’ అని సీఎం సూచించారు. స్కూళ్లలో సిబ్బంది ఖాళీలూ భర్తీ చేయాలి ప్రభుత్వ స్కూళ్లలో నాడు–నేడు పథకం కింద కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నామని, అక్కడ సరిపడా సిబ్బంది లేకపోతే పెట్టిన ఖర్చు వృధా అవుతుందని సీఎం అన్నారు. ‘టీచర్లు సరిపడా లేకపోతే ప్రమాణాలు తగ్గుతాయి. టీచర్లనే కాకుండా ల్యాబ్ టెక్నీషియన్లనూ నియమించాలి. అప్పుడే స్కూళ్ల అభివృద్ధికి మనం చేపడుతున్న ఆధునికీకరణ పనులు, అమ్మ ఒడి, మధ్యాహ్న భోజనంలో నాణ్యత వంటి చర్యలకు అర్థం ఉంటుంది’ అని అభిప్రాయపడ్డారు. పోలీసు విభాగంలో వారాంతపు సెలవును ప్రకటించామని, దీనివల్ల ఆ శాఖ సామర్థ్యం తగ్గకుండా ఖాళీలు భర్తీ చేయాలన్నారు. రెవెన్యూ విభాగంలో కూడా ప్రాధాన్యతలను అనుసరించి పోస్టుల భర్తీ చేపట్టాలని, ఈ శాఖలో సర్వే సిబ్బందికి అవసరమైన పరికరాలను సమకూర్చాలని సీఎం సూచించారు. ఇలా శాఖల వారీగా ప్రాధాన్యతలను నిర్ధారించుకొని పోస్టుల భర్తీకి కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. మూడు వారాల్లో ప్రాధాన్యత పోస్టులను నిర్ధారించి, వాటి భర్తీకి ప్రణాళిక రూపొందిస్తామని అధికారులు సీఎంకు వివరించారు. ఈనెల 21న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఆ సమావేశానంతరం ఉద్యోగాల భర్తీపై కార్యాచరణను ప్రకటిస్తూ.. సమగ్ర క్యాలెండర్‌ను విడుదల చేయనున్నారు. -
కేంద్ర ఉద్యోగాలకు ‘సెట్’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోగాల భర్తీకి ఒకే పరీక్ష ద్వారా చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. అందుకు ఒక ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఐఏఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్), ఐపీఎస్(ఇండియన్ పోలీస్ సర్వీసెస్), ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారిన్ సర్వీసెస్), ఐఎఫ్ఓఎస్(ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్) ఉద్యోగాలతో పాటు గ్రూప్ ఏ, గ్రూప్ బీలోని కొన్ని గెజిటెడ్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మధ్య, దిగువ స్థాయి ఉద్యోగాల భర్తీకి, ముఖ్యంగా కొన్ని గ్రూప్ బీ ఉద్యోగాల కోసం ఏటా పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో.. ‘కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని గ్రూప్ బీ నాన్ గెజిటెడ్ పోస్ట్‌లు, కొన్ని గ్రూప్ బీ గెజిటెడ్ పోస్ట్స్, గ్రూప్ సీ పోస్ట్‌ల భర్తీకి ప్రత్యేకంగా ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి, ఆ ఏజెన్సీ ద్వారా కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష ‘కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్(సెట్)’ను నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది’ అని కేంద్ర సిబ్బంది శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై స్పందించాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరామన్నారు. అలాగే, ఉద్యోగార్థులు ఈ ప్రతిపాదనపై స్పందించాలని కోరారు. సెట్ నిర్వహణతో ఉద్యోగార్థులకు, ప్రభుత్వ సంస్థలకు డబ్బు, సమయం ఆదా అవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర చెప్పారు. ప్రధాని లక్ష్యమైన సులభతర పాలనలో భాగంగా ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చామన్నారు. ‘ప్రస్తుతం, ప్రభుత్వ ఉద్యోగం కోసం వేర్వేరు సంస్థలు ప్రకటించే వేర్వేరు ఉద్యోగాలకు అభ్యర్థులు వేరుగా దరఖాస్తు చేయాల్సి వస్తోంది. వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రాంతాల్లో జరిగే ఆ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడం నుంచి పరీక్షకు హాజరవడం వరకు అభ్యర్థి అనేక వ్యయ ప్రయాసలకు లోనవాల్సి వస్తోంది. అందువల్ల ఒకే ఏజెన్సీ నిర్వహించే ఒకే పరీక్ష ద్వారా అభ్యర్థి వివిధ ఉద్యోగాలకు ఒకేసారి ప్రిపేర్ కావచ్చు’ అని అన్నారు. అధికారిక లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 6,83,823 ఖాళీలున్నాయి. -
సచివాలయ పరీక్షల నిర్వహణపై సర్వత్రా ప్రశంసలు
సాక్షి, అమరావతి : ప్రతిపక్షాల ప్రచారం నమ్మి ‘సచివాలయ’ ఉద్యోగాలంటే ఏవేవో అనుమానాలు వ్యక్తం చేసిన అభ్యర్థులు సైతం రాత పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని చూసి శభాష్ అంటున్నారు. ఒక రాష్ట్రంలో 1,34,524 ఉద్యోగాలకు ఏకంగా 19,49,218 మంది హాజరవ్వడం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించడం రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే రికార్డు అని అధికారులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆదివారంతో ఉద్యోగాల రాత పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. ఈ నెల 1వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య ఆరు రోజుల పాటు జరిగిన పరీక్షలకు ఏకంగా 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రశ్నాపత్రం రూపకల్పన, పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లు సివిల్స్ రాతపరీక్షలు నిర్వహించే యూపీఎస్సీ స్థాయిలో ఉన్నాయని అటు పరీక్ష రాసిన అభ్యర్థులు, ఇటు మేధావులు ప్రశంసలు కురిపిస్తున్నారు. లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎగతాళి చేశారు.. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశంలోని మరే రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఒకే విడత 1,34,524 ఉద్యోగాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జూలై నెలలో నోటిఫికేషన్లు జారీ చేసింది. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు కలిపి 1,26,728 ఉద్యోగాలకు, విద్యుత్ సంస్థలు మరో 7,796 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. స్వాతంత్య్రం వచ్చాక గత 72 ఏళ్లలో జరిగిన నియామకాల ద్వారా రాష్ట్రంలో ఇప్పుడున్న మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 4.61 లక్షలుగా ఉంది. ఆ సంఖ్యలో దాదాపు మూడో వంతు ప్రభుత్వ ఉద్యోగాలను ఒకే విడతలో భర్తీ చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున వైఎస్ జగన్ లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేస్తే.. అవన్నీ వాళ్ల పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకుంటారులే అంటూ ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసేందుకు 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తే 21,69,589 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రతిపక్షాలు చేసే ప్రచారం నమ్మి దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు ఈ ఉద్యోగాలు మెరిట్ ఆధారంగా జరగుతాయా లేదా అని అనుమానం వ్యక్తం చేశారు. అలా అనుమానం వ్యక్తం చేసిన వారు సైతం రాత పరీక్షలు ముగిశాక ప్రభుత్వ చిత్తశుద్ధిని కొనియాడుతున్నారు. అతి తక్కువ సమయంలో నిర్వహణ రాష్ట్రంలో ఇదివరకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడ్డాక భర్తీ ప్రక్రియ పూర్తవ్వడానికి ఏడాదో, రెండేళ్లో, కొన్ని సార్లు మూడు నాలుగేళ్లు పట్టిన ఉదంతాలున్నాయి. కానీ ‘సచివాలయ’ ఉద్యోగ నియామకాల ప్రక్రియ అంతా రెండున్నర నెలల్లోనే ముగియనుంది. 1,26,728 ఉద్యోగాలకు జూలై 26న నోటిఫికేషన్ విడుదల అయింది. సెప్టెంబర్ 8వ తేదీ నాటికి అన్ని ఉద్యోగాలకు రాత పరీక్షలు మగిశాయి. జవాబు పత్రాల స్కానింగ్ ప్రక్రియ కూడా ఇప్పటికే చాలా వరకు పూర్తయినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నాటికి నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు ఉద్యోగ నియామకాల పత్రాలు అందజేసి, వారు విధుల్లో కూడా చేరిపోతారని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 125 రోజుల్లో.. నోటిఫికేషన్ జారీ చేశాక కేవలం 65 – 70 రోజుల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని అధికారులు కంకణం కట్టుకొని పని చేస్తున్నారు. యూపీఎస్సీ పరీక్షల స్థాయిలో ఏర్పాట్లు ఉద్యోగ నియామక ప్రక్రియలో కీలకమైన రాత పరీక్షల నిర్వహణ కూడా జాతీయ స్థాయి పోటీ పరీక్షలను నిర్వహించే యూపీఎస్సీ స్థాయికి ఏ మాత్రం తక్కువగా లేదని పరీక్ష రాసిన అభ్యర్థులు చెబుతున్నారు. ఒకేసారి దరఖాస్తు చేసుకున్న 21.69 లక్షల మంది అభ్యర్థులకు సాధ్యమైనంత మేర అతి తక్కువ దూరంలో పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నెల 1వ తేదీ ఉదయం జరిగిన రాత పరీక్షకు ఒక్కదానికే 12.54 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడంతో రాష్ట్రంలోని మారు మూల మండల కేంద్రాల్లో సైతం కేంద్రాలను ఏర్పాటు చేసింది. 4,465 కేంద్రాల్లో పరీక్షలు జరపడంతో ఆ పరీక్షకు ఏకంగా 92.77 శాతం మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రంలో ప్రతి 24 మంది అభ్యర్థులకు ఒక గది కేటాయించారు. సమగ్ర పర్యవేక్షణకు ఒక పరీక్షా కేంద్రంలో పది గదులు మించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు మంచి నీటి పేరుతో తమ సీటు నుంచి కదలకుండా కూర్చున్న చోటుకే అందజేసేలా ముందుస్తు ఏర్పాటు చేశారు. మెటీరియల్ తరలింపులో పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకండా పట్టణాల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పరీక్షా కేంద్రాల పరిధిలో వంద మీటర్ల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు ముందస్తుగా మూసి వేశారు. ఏర్పాట్ల విషయంలో ప్రతి చోటా యూపీఎస్సీ ప్రమాణాలను పాటించినట్టు అభ్యర్థులు చెబుతున్నారు. పొరపాట్లకు తావేలేదు ప్రశ్నాపత్రాలు లీకు చేస్తారని ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే వారు కొందరు సోషల్ మీడియాలో పనిగట్టుకొని ప్రచారం చేశారు. ఆరు రోజుల పాటు 5,314 పరీక్షా కేంద్రాల్లో.. తొలిరోజు మూరుమూల మండల కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినా ప్రశ్నాపత్రాల భద్రత విషయంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మూరు మూల ప్రాంతంలో ఉండే పరీక్షా కేంద్రానికి చేరాల్సిన ప్రశ్నాపత్రాలను ఒక్క రోజు ముందు దానికి దగ్గరలోని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ రూం నుంచి వాటిని పర్యవేక్షించారు. ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్న జాగత్రలతో ఆరు రోజుల పాటు ఎక్కడా చిన్న పొరపాటు చోటు చేసుకోలేదు. ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఉన్న ఏపీపీఎస్సీ ద్వారా జరిగే పరీక్షలో ప్రశ్నాపత్రాల్లో పెద్ద ఎత్తున తప్పులు దొర్లడం అనేది పోటీ పరీక్ష రాసే అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఏపీపీఎస్సీ ద్వారా కాకుండా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించినప్పటికీ, ప్రశ్నాపత్రాల రూపకల్పన సైతం అభ్యర్థులను మెప్పించింది. ప్రశ్నపత్రాలలో నామమాత్రపు పొరపాట్లు కూడా జరగలేదని అభ్యర్థులు చెబుతున్నారు. పరీక్ష జరిగిన రోజు ప్రాథమిక ‘కీ’ని అధికారికంగా విడుదల చేశారు. నాలుగు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం తుది ‘కీ’ విడుదల చేశారు. ఇంత పకడ్బందీ ప్రణాళిక ఇటీవల కాలంలో ఏ పోటీ పరీక్షలలోనూ చూడలేదని అభ్యర్థులు వ్యాఖ్యానించారు. ఇంటర్వ్యూ రద్దుతో దళారులకూ చెక్ పకడ్బందీ పరీక్ష నిర్వహణే కాదు.. పారదర్శకంగా ఈ ప్రక్రియ ఉండాలని అధికారులు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో దళారుల వ్యవస్థకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ఇంటర్వ్యూ అన్నది లేకుండా ఉండాలని, కేవలం రాత పరీక్షల్లో అభ్యర్థులకు వచ్చే మార్కుల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. పారదర్శకతగా పరీక్షలు నిర్వహిస్తూనే.. పోటీ పడుతున్న అభ్యర్థులు దళారులను నమ్మవద్దని ప్రభుత్వం విస్త్ర్తతంగా ప్రచారం చేసింది. ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల మేరకు కొన్ని జిల్లాల్లో దళారులపై కేసులు నమోదు చేయడం గమనార్హం. అధికారుల పాత్ర కీలకం.. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రత్యేక వ్యవస్థ ఉన్న ఏపీపీఎస్సీనే ఒకే విడతలో 1,26,728 ఉద్యోగాలను నిర్ణీత సమయంలో ఎప్పుడూ భర్తీ చేయలేదు. ఈ పరిస్థితుల్లో జిల్లా సెలక్షన్ కమిటీల ద్వారా ఉద్యోగ భర్తీ ప్రక్రియను చేపట్టారు. ఈ పోస్టుల భర్తీని చాలా పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టి పట్టుదలతో ఎప్పటికప్పుడు మంత్రులకు, సంబంధిత అధికారులకు సూచనలతో పాటు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎంవో కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్, మున్సిపల్ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్ కమిషనర్ విజయకుమార్‌లు ఒక జట్టుగా ఏర్పడి సంబంధిత అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ ఈ నియామక ప్రక్రియలో కీలకమై పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించారు. పరీక్షల రాష్ట్ర కమిటీ కన్వీనర్‌గా గిరిజా శంకర్ ప్రతి అంశం దగ్గర ఉండి పర్యవేక్షించారు. దీంతో పాటు జిల్లా కలెక్టరు, ఎస్పీలు, జిల్లా అధికార యంత్రాంగం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖ సిబ్బంది పరీక్షల నిర్వహణలో చిత్తశుద్ధితో పని చేశారు. చరిత్రాత్మకం మొత్తం 19 రకాల ఉద్యోగాలకు 21.69 లక్షల మంది పరీక్షలు రాశారు. తప్పన్నదానికి తావులేకుండా పరీక్షలు నిర్వహించాం. ఇదొ చరిత్రాత్మక ఘటన. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయి నియామకాలు, ఇన్ని లక్షల మందికి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం జరగలేదు. పక్కా ప్రణాళికతో సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించిన పంచాయతీరాజ్ కమిషనర్, రాష్ట్ర స్థాయి సిబ్బంది, జిల్లా కలెక్టర్లు, సిబ్బందికి అభినందనలు. – గోపాలకృష్ణ ద్వివేది, పరీక్ష నిర్వహణ కమిటీ చైర్మన్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి. అందరికీ అభినందనలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఉద్యోగ నియామకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ మేరకు ఆయన అధికారులందరినీ అప్రమత్తం చేశారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా అందరం పనిచేశాం. ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల మేరకు జిల్లాల్లో పరీక్షల నిర్వహణను విజయవంతం చేసిన జిల్లా కలెక్టర్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర, జిల్లా స్థాయి సిబ్బందికి అభినందనలు. – గిరిజా శంకర్, పంచాయతీరాజ్ కమిషనర్, రాష్ట్ర స్థాయి పరీక్షల కమిటీ కన్వీనర్ సీఎం అరుదైన అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికార యంత్రాంగానికి అరుదైన అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పారదర్శకంగా, ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించి ప్రభుత్వం çపట్ల తమ చిత్తశుద్ధిని ప్రదర్శించింది. జిల్లా కలెక్టర్లు, అధికారులు పరీక్షల నిర్వహణకు రేయింబవళ్లు పనిచేశారు. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. చిన్నపాటి విమర్శలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించేందుకు సహకరించిన అన్ని వర్గాల వారికి కృతజ్ఞతలు. – విజయకుమార్, మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ -
జనరంజక పాలనకు వైఎస్ జగన్ శ్రీకారం
సాక్షి, అమరావతి: ప్రజల కష్టాలు దగ్గరి నుంచి చూశారు.. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.. కులం, మతం, రాజకీయం చూడకుండా సాయం చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే వాయు వేగంతో నిర్ణయాలు.. నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు శ్రీకారం.. విప్లవాత్మక బిల్లులతో పారదర్శక పాలన దిశగా అడుగులు.. సమాజంలో సగం ఉన్న మహిళలకు అన్నింట్లో సగం.. సచివాలయాల ద్వారా ఇంటి ముంగిటకే పాలన.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. వంద రోజుల్లో వందకు పైగా కీలక నిర్ణయాలు.. ఇదో చరిత్ర.. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ నవ చరిత్ర. ప్రజలకిచ్చిన హామీల అమల్లో నాన్చుడు లేదు.. మీన మేషాలు లెక్కించడం అసలే లేదు.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగుతోంది. కనీసం ఆరు నెలలైనా గడవందే పాలనపై ఓ అంచనాకు రావడం కష్టం. అలాంటిది కేవలం వంద రోజుల్లోనే వందకు పైగా కీలక నిర్ణయాలు తీసుకుని ‘ఇది అందరి ప్రభుత్వం’ అని నిరూపించారు. గత పాలకుల తీరుకు భిన్నంగా సీఎం వైఎస్ జగన్ వంద రోజుల పాలన ఐదు కోట్ల ప్రజానీకానికి కళ్లకు కట్టినట్లు కనిపించింది. మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్.. జూన్ 10వ తేదీన నిర్వహించిన తొలి కేబినెట్ భేటీలోనే నవరత్నాల్లో ప్రజలకిచ్చిన హామీల్లో 80 శాతం మేర అమలుకు నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తూ గ్రామ స్వరాజ్యానికి గాంధీ జయంతి రోజు నుంచి నాంది పలుకుతున్నారు. ఈ మేరకు తొలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే చరిత్రాత్మక చట్టాలు చేశారు. సీఎం వంద రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలు ఇలా.. పింఛన్ల పెంపుపై తొలి సంతకం ► అవ్వా తాతలకు వృద్ధాప్య పింఛన్ ఏకంగా రూ. 2,250కు పెంపు. ఏటా రూ.250 చొప్పున పెంచుతూ రూ.3000 వరకు తీసుకెళ్లాలని నిర్ణయం. ► పింఛను పొందడానికి అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గింపు. దీంతో అదనంగా 5 లక్షల మందికి పైగా ప్రయోజనం. ► కిడ్నీ బాధితులకు నెలకు రూ.10 వేల పింఛన్. తలసీమియా, పక్షవాతం, మస్కులర్ డిస్ట్రాఫీ వంటి వ్యాధులకు గురైన బాధితులకు పింఛన్లు ఇచ్చే పథకంపై సమాలోచన. మహిళలకు చేయూత ► డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా.. అధికారంలోకి వచ్చేనాటి వరకు ఉన్న రుణాలకు సమానమైన సొమ్మును నాలుగు విడతల్లో అందజేయాలని నిర్ణయం. ► ఉగాది రోజు 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు. ► అక్రమ మద్యం, నాటుసారాను అరికట్టేందుకు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుల నియామకం. ► పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి జగనన్న అమ్మ ఒడి ద్వారా ఏటా రూ.15,000. ఇంటర్ వరకూ పథకం వర్తింపు. జనవరి 26 నుంచి అమలు రైతాంగానికి అన్ని విధాలా భరోసా ► ప్రతి రైతు కుటుంబానికి వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా (ఈ ఏడాది అక్టోబర్ నుంచే) రూ.12,500. విడతల వారీగా రూ.50 వేలు చెల్లించేందుకు నిర్ణయం. వచ్చే ఏడాది నుంచి ఖరీఫ్‌లో మాత్రమే ఇస్తారు. ► వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ లేని రుణాలు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రైతులకు ఉచితంగా 200 రిగ్గు బోర్లు. పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా. ► ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలు యూనిట్‌కు రూ.1.50కు తగ్గింపు. ► గిట్టుబాటు ధర కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు. రూ. 2000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ టాక్స్ రద్దు. ► ప్రమాదవశాత్తూ చనిపోయిన లేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్సార్ బీమా ద్వారా రూ.7 లక్షల పరిహారం. ► ప్రతి నియోజకవర్గంలో శీతల గిడ్డంగులు. అవసరం మేరకు çఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు. ► భూ యాజమానుల హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతులకు 11 నెలలు పంట మీద మాత్రమే హక్కు ఉండేలా కౌలుదార్ల చట్టం. తద్వారా వైఎస్సార్ రైతు భరోసాతో పాటు పంటల బీమా, పంటల పరిహారం అందించే ఏర్పాటు. ► జలయజ్ఞం ద్వారా సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిర్ణయం. గోదావరి జలాలను నాగార్జున సాగర్, శ్రీశైలంకు తరలించడం ద్వారా కృష్ణా ఆయకట్టును స్ధిరీకరిస్తూ రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించేలా ప్రణాళిక. ► సీఎం చైర్మన్‌గా వ్యవసాయ మిషన్ ఏర్పాటు. ► రైతు పండించే పంటలకు ప్రభుత్వమే బీమా చేయించి ప్రీమియం చెల్లించేలా వైఎస్సార్ ఉచిత బీమా పథకం. ► 2018 ఖరీఫ్‌లో కరువుకు సంబంధించి రైతులకు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.2,000 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ విడుదల. ► ధాన్యం సేకరణకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.960 కోట్లు చెల్లించడానికి చర్యలు. రూ.360 కోట్లు విడుదల. ► కష్టాల్లో ఉన్న శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున రూ.300 కోట్లు బోనస్‌గా విడుదల. ► ఆయిల్ పామ్ రైతులకు అదనపు మద్దతు ధర కోసం రూ.80 కోట్లు విడుదల. ► నాఫెడ్ ఏర్పాటు చేసిన 5 కొనుగోలు కేంద్రాల ద్వారా కొబ్బరికి కనీస మద్దతు ధర కోసం చర్యలు. ► తొలి ఏడాదే సహకార రంగ పునరుద్ధరణకు చర్యలు. ► గత ప్రభుత్వం విత్తన బకాయిలకు సంబంధించిన రూ.384 కోట్లు ఇచ్చేందుకు చర్యలు. ► వరదలు, భారీ వర్షాలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారానికి అదనంగా 15 శాతం ఇన్పుట్ సబ్సిడీ. ► పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం. ► కొబ్బరి తోటల సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం. సెంట్రల్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం. నాఫెడ్ సహకారంతో తూర్పుగోదావరి జిల్లాలో 5 కొనుగోలు కేంద్రాలు. మార్కెట్ సెస్ రద్దు. ఫలితంగా క్వింటాల్ రూ.8,500కు పెరిగిన కొబ్బరి ధర. కొబ్బరి పంటల బీమా ప్రీమియంలో 75 శాతం కొబ్బరి బోర్డుతో కలిసి ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం. జీతాల పెంపు ► పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ.18,000కు పెంపు. ఆశా వర్కర్ల జీతాలు రూ.10 వేలకు పెంపు. ► అంగన్వాడీ వర్కర్ల జీతాలు రూ.10,500 నుంచి రూ.11,500కు పెంపు. ఆయాల జీతం రూ.6 వేల నుంచి రూ.7 వేలకు పెంపు. ► డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్ పర్సన్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపునకు నిర్ణయం. ► గిరిజన తండాల్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల జీతాలు రూ.400 నుంచి రూ.4,000కు పెంపు ► హోంగార్డుల వేతనాలు పెంచుతూ నిర్ణయం. ఉద్యోగాలు.. ఉపాధి.. విద్య ► గ్రామ స్వరాజ్యం సాధన దిశగా అడుగులు.. గ్రామ, వార్డు సచివాలయాలకు శ్రీకారం. 4 లక్షలకుపైగా ఉద్యోగాలు.. వీటిలో శాశ్వత ప్రాతిపదికన 1లక్షా 27 వేల ఉద్యోగాలు. ► గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వలంటీర్ నియామకం. వీరి ద్వారా ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు, సేవలు అందించేందుకు శ్రీకారం. ► కాపు కార్పొరేషన్‌కు తొలి బడ్జెట్లోనే రూ.2 వేల కోట్ల నిధులు.. 5 ఏళ్లలో రూ. 10 వేల కోట్లు కేటాయింపునకు రంగం సిద్ధం. ► ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం షాపుల నిర్వహణ. మద్యం దుకాణాల్లో 16 వేల ఉద్యోగాలు. ► జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రతి పేదవాడి పెద్ద చదువుకు అయ్యే ఖర్చు కోసం 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్. ► ఇంటర్ అనంతరం ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు. ► రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో.. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు,,.. మొత్తం 25 సెంటర్లు ఏర్పాటు. ► సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజీ, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు నిర్ణయం. ► దశలవారీగా ప్రతి ప్రభుత్వ పాఠశాలకూ కాంపౌండ్, టాయ్లెట్లు, మంచినీటి సదుపాయం, ఫర్నిచర్, బ్లాక్‌బోర్డ్, పాఠశాల భవనాలకు మరమ్మతులు, పెయింట్లు వేయించటం వంటి చర్యలతో పాఠశాలలన్నింటి రూపురేఖల్ని మార్చేందుకు బడ్జెట్లో రూ.1500 కోట్లు కేటాయింపు ► ఉద్యోగాలకు ఉపయోగపడేలా చదువుల ప్రణాళికను మార్చాలని నిర్ణయం. తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా ప్రతి స్కూల్లో ఇంగ్లిష్ మీడియం. ► పాఠశాలల్లో విద్యార్థుల మానసిక ఉల్లాసానికి శనివారం నో బ్యాగ్ డే ప్రజా సొమ్ము ఆదా ► వివిధ ప్రభుత్వ శాఖల్లో రూ. కోటి దాటిన కొనుగోళ్లన్నింటిలో పారదర్శకత పెంచేలా ఆన్లైన్లోనే టెండర్లు. కొనుగోలు చేయాల్సిన వస్తువుల నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించి, మునుపటి రేట్ల కంటే తక్కువకు సరఫరా చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారికే అవకాశం. ► గత ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉన్నవారికి, కాంట్రాక్టర్లకు ఏటీఎం మిషన్‌గా మారిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రీటెండరింగ్ ► రూ.100 కోట్లు దాటిన కాంట్రాక్టులన్నింటినీ జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపేలా చట్టం. కీలక బిల్లులు.. చట్టాల సవరణ ► 45 ఏళ్లు దాటిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు వచ్చే ఏడాది నుంచి ఆయా కార్పొరేషన్ల ద్వారా నాలుగు విడతల్లో మొత్తంగా రూ.75 వేలు ఆర్థిక సాయం. ► కబ్జాలు, దందాలు, అవకతవకలకు విరుగుడుగా భూమి మీద నిజమైన హక్కు ఉన్న వారికి న్యాయం జరిగేలా ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ – 2019 బిల్లు ఆమోదం. అత్యాధునిక విధానంలో సమగ్రంగా భూముల సర్వే. ► రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో భాగంగా వ్యవసాయ మార్కెట్లను పటిష్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చట్టం సవరణ బిల్లు ఆమోదం. ► మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం. ఇందులో నలుగురు డిప్యూటీ సీఎంలు. ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు. ► శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు. ► ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు. ► పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు. ► దశల వారీగా మద్య నిషేధం దిశగా.. మద్య నియంత్రణ చట్ట సవరణ. బెల్టు షాపులు పూర్తిగా ఎత్తివేత. తగ్గిన మద్యం వినియోగం. ► ఆలయ పాలక మండళ్లలో (టీటీడీ మినహా) 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు. ► ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ఏర్పాటుకు ఆమోదం. ► పాఠశాల విద్య, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఏర్పాటు బిల్లులు –2019కు ఆమోదం. ► గిట్టుబాటు ధర కల్పించేందుకు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో గౌరవ చైర్మన్లుగా స్థానిక ఎమ్మెల్యేల నియామకం. అందరికీ వైద్యం.. అదే ధ్యేయం ► ప్రపంచంలోనే రోల్ మోడల్‌గా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అమలు. రూ.1000 బిల్లు దాటినట్టయితే, వార్షిక ఆదాయం రూ.5 లక్షలు లోపు ఉన్న అన్ని వర్గాల వారికి పథకం వర్తింపు. 2031 జబ్బులకు ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో చికిత్స చేయించుకున్నా వర్తింపు. ► అధునాతన సౌకర్యాలతో 108, 104 అంబులెన్స్‌లు.. కొత్త వాహనాలు కొనుగోలు. ► రెండేళ్లలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఆసుపత్రులను తీర్చిదిద్దేందుకు చర్యలు. ► శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, చుట్టుపక్కల గ్రామాల కిడ్నీ బాధితుల కోసం.. 200 పడకలతో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ఉత్తర్వులు (రూ. 50 కోట్లు తక్షణ కేటాయింపు) ► డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు (అక్టోబరు 10 నుంచి అమలు) కార్యక్రమం కింద ఉచితంగా కంటి పరీక్షలు. ► రాష్ట్రంలోని 7 ఐటీడీఏల్లో (గిరిజన ప్రాంతాలు) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు నిర్ణయం. ► విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కర్నూలు, కడపలో క్యాన్సర్ ఆసుపత్రుల ఏర్పాటు. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ ఆసుపత్రులు. ► పాడేరు, విజయనగరం, పల్నాడులో మెడికల్ కాలేజీల ఏర్పాటు పారదర్శక పాలన ► అవినీతి, పైరవీలకు తావు లేని ఇసుక విధానం.. ప్రజల సమస్యల పరిష్కారానికి ‘స్పందన’. చిన్న చిన్న సమస్యలకు 72 గంటల్లోనే పరిష్కారం. ► ‘స్పందన’లో వచ్చిన అర్జీలపై ప్రతి మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష.. ► ప్రజా సమస్యలపై సోమ, మంగళవారాల్లో కలెక్టర్లు, ఎస్పీలు తమ పరిధిలోని అధికారులతో భేటీ ► ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి కేబినెట్ ఆమోదం. ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంపు. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు చర్యలు. ► రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్. సీపీఎస్ రద్దుకు నిర్ణయం. ► అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.1,150 కోట్లు ► వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్‌కు ఈ ఏడాది డిసెంబరు 26న శంకుస్థాపన. ► పారిశ్రామిక పెట్టుబడుల కోసం.. అవినీతికి తావులేని, పారదర్శకమైన ఇండస్ట్రీయల్ పాలసీ. రాష్ట్రంలో కొత్తగా మరో 4 పోర్టులు, ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు చర్యలు. అవినీతి, లంచగొండితనం లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా అడుగులు. ► అక్రమ నిర్మాణాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం. ► అమరావతిలో గత ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్‌పై వాస్తవాల వెలికితీతకు చర్యలు ► గత ప్రభుత్వం దోపిడీకి సంబంధించి 30 అంశాల్లో విచారణకు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు. ► గ్రామాల్లో 11,158 సచివాలయాలు, పట్టణాల్లో 3,768 వార్డు సచివాలయాల ఏర్పాటు. ప్రజాభ్యుదయమే లక్ష్యం ► ఉద్దానం కిడ్నీ వ్యాధుల కోసం రూ.600 కోట్లతో మంచినీటి పథకం. ► విశాఖ ఏజెన్సీలో గిరిజనుల హక్కులకు అగ్ర తాంబూలం.. బాక్సైట్ తవ్వకాలకు నో. ► రేషన్ కార్డుల ద్వారా 5, 10, 15 కిలోల బ్యాగుల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ. ► దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా పోలీసులకు వీక్లీ ఆఫ్.. ఫ్రెండ్లీ పోలీసింగ్. ► షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం. ► ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పరిమితి 100 నుంచి 200 యూనిట్లకు పెంపు ► చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేలు ఆర్థిక సాయం. డీజిల్‌పై ఇస్తున్న సబ్సిడీ లీటరుకు రూ.6 నుంచి రూ.9కి పెంపు. ► సొంత ఆటో, ట్యాక్సీ నడిపేవారికి మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ అవసరాల కోసం రూ.10 వేలు ఆర్థిక సాయం ► మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు ఏటా రూ.24 వేలు ఆర్థిక సాయం. ► వైఎస్సార్ కళ్యాణ కానుక కింద.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని యువతులు వివాహాలకు రూ.లక్ష ఆర్థిక సాయం. బీసీ యువతుల వివాహాలకు రూ.50 వేలు. ► ప్రమాదవశాత్తు పెద్ద దిక్కును కోల్పోయిన గిరిజన కుటుంబాలకు వైఎస్సార్ బీమా పథకం కింద రూ.5 లక్షలు ఆర్థిక సాయం. ► క్రీడాకారులకు ప్రోత్సాహకాలు. ► ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు మూడు దశల్లో వాటర్ గ్రిడ్ పథకాలు. ► ముస్లింలు, క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో వెళ్లే హజ్, జెరూసలెం యాత్రలకు ప్రభుత్వం ఇచ్చే సాయం పెంపు. ఇమామ్, మౌజమ్, పాస్టర్లకు గౌరవ వేతనాల పెంపు. ► ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు బడ్జెట్లో నిధుల కేటాయింపు. -
నేటి నుంచే ‘సచివాలయ’ పరీక్షలు
-
నేటి నుంచే ‘సచివాలయ’ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ ఉద్యోగాల పోస్టుల భర్తీకి ఉద్దేశించిన రాత పరీక్షలు ఆదివారం ఉదయం 10గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. సరిగ్గా 40రోజుల క్రితం జూలై 26న మొత్తం 1,26,728 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు మొత్తం 21,69,719మంది దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న ఈ రాత పరీక్షల్లో తొలిరోజు ఒక్కరోజే 15,49,941 మంది హాజరుకానున్నారు. 3వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య ఐదు రోజుల పాటు జరిగే పరీక్షలను 6,19,812 మంది రాయనున్నారు. కాగా, మొదటిరోజు మొత్తం 4,478 కేంద్రాల్లో రాతపరీక్షలు జరగనున్నాయి. జిల్లా కేంద్రాలు మినహా.. ఇతర ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాల సమీపంలోని పోలీస్స్టేషన్లకు శనివారం మధ్యాహ్నానికే ప్రశ్నపత్రాలను తరలించి భద్రపరిచారు. పరీక్ష ప్రారంభానికి కొద్దిసేపటి ముందు వీటిని కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయా కేంద్రాలకు తరలిస్తారు. మరోవైపు.. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ప్రశ్నాపత్రాలు భద్రపరిచిన పోలీసుస్టేషన్లతో సీసీ కెమెరాల ద్వారా అనుసంధానించి పర్యవేక్షిస్తున్నారు. కాగా, పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 2 నుంచి విధుల్లో చేరనున్నారు. రేపటి నుంచే జవాబుపత్రాల స్కానింగ్? ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పరీక్ష కేంద్రాల నుంచి ఏ రోజు జవాబు పత్రాలను ఆ రోజు గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక స్ట్రాంగ్ రూమ్‌కి అధికారులు తరలించనున్నారు. వినాయక చవితి కారణంగా సోమవారం సెలవు అయినప్పటికీ వీలైతే ఆ రోజు నుంచే ఓఎమ్మార్ షీట్ల స్కానింగ్ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. స్కానింగ్ ప్రక్రియ విధులలో పాల్గొనే అధికారులకు శనివారం వర్సిటీలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హాల్ టికెట్‌తోపాటు ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి గ్రామ, వార్డు కార్యదర్శుల పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ విజయకుమార్ పలు సూచనలు చేశారు. – పరీక్షా సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. – పరీక్ష ముగిసేంత వరకు అభ్యర్థులను బయటకు అనుమతించరు. ఎవరైనా మధ్యలో వెళ్లిపోతే వారిని అనర్హులుగా ప్రకటిస్తారు. – హాలు టికెట్‌తోపాటు అభ్యర్థి గుర్తింపు కోసం ప్రభుత్వం జారీచేసిన ఫొటో ఆధార్ కార్డు, పాన్‌కార్డు, ఓటరు కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో ఏదో ఒకటి ఒరిజినల్ కార్డును అభ్యర్థులు తీసుకువెళ్లాలి. – హాలు టికెట్లో ఫోటో సక్రమంగా లేకపోతే ఫొటోపై గజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించాలి. – ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. – బ్లూ లేక బ్లాక్ పెన్ మాత్రమే అనుమతిస్తారు. పెన్సిల్ లేదా జెల్‌పెన్స్, వైటనర్‌లను అనుమతించరు. పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులందరూ ఎటువంటి వదంతులను నమ్మవద్దనీ, పూర్తిగా మెరిట్ ప్రాతిపదికనే ఈ ఉద్యోగాలన్నీ భర్తీ చేయనున్నట్లు విజయకుమార్ స్పష్టంచేశారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల సందేహాల నివృత్తికి రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ ఫోను నెంబర్లు : 9121296051, 9121296052, 9121296053, 9121296054, 9121296055