సాక్షి, హైదరాబాద్: ‘‘పీఆర్సీ నివేదికలో వివిధ సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా కలిపి 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలున్నట్టు చూపారు. బిశ్వాల్ కమిటీ శాంక్షన్డ్ స్ట్రెంత్‌లో పోస్టులు చూపిందే తప్ప.. సగం ధ్యాస (హాఫ్ మైండెడ్‌గా)తో వర్కింగ్ స్ట్రెంత్‌ను చూపలేదు. దానిని పట్టుకుని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి..’’అని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు.
అప్పటికే వైద్య విధాన పరిషత్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యాసంస్థల సొసైటీల్లో పనిచేస్తున్న 54,118 మందిని వర్కింగ్ స్ట్రెంత్‌గా చూపి ఉంటే.. 1.91 లక్షల ఖాళీల్లో అసలు 1,36,534 మాత్రమే ఖాళీ అని వెల్లడయ్యేదని వివరించారు. వీటిలోనూ ప్రమోషన్ కల్పించే 48,634 పోస్టులు తీసేస్తే మిగిలే ఖాళీలు 87,880 మాత్రమేనని చెప్పారు. అయితే సీఎం కేసీఆర్ ముందుచూపుతో మరో ఐదు వేల పోస్టులు కలిపి 91 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సగం తెలివితేటలు, తెలిసీ తెలియనితనంతో బీజేపీ, కాంగ్రెస్ విమర్శిస్తున్నాయని మండిపడ్డారు.
గురువారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చకు హరీశ్‌రావు సమాధానమిచ్చారు. బడుగు బలహీనవర్గాల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచేలా రాష్ట్ర బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల తరహాలో గుడ్డెద్దు చేనులో పడ్డట్టు కాకుండా.. సమాజంలోని చిట్టచివరి మైలురాయి దాకా ప్రయోజనాలు చేరేలా చూస్తున్నామన్నారు.
కేంద్ర ఉద్యోగాల కోసం పోరాడండి
ఏటా రెండున్నర కోట్ల చొప్పున ఉద్యోగాలిస్తామని ఏడేళ్ల కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, మరి ఎన్ని భర్తీ చేసిందో తెలపాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బీజేపీ నేతలకు దమ్ముంటే 15.62 లక్షల కేంద్రప్రభుత్వ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదో ఢిల్లీ వెళ్లి ప్రధానిని నిలదీయాలన్నారు. కాంగ్రెస్ కూడా ఆ దిశగా పోరాడాలన్నారు.
రాష్ట్రంలో ఒక్క ఉద్యోగ ఖాళీ లేకుండా నింపేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే.. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అనవసర విమర్శలతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటోందని.. ఇక విపక్షాలు ‘నెత్తిమీద తడిగుడ్డ’వేసుకోవడమే తరువాయని వ్యాఖ్యానించారు.
త్వరలో గొర్రెల పంపిణీ
రాష్ట్రంలో త్వరలోనే రెండోదశ గొర్రెలు, మేకల పంపిణీ ప్రారంభిస్తామని.. ఒక్కో యూనిట్ ధరను రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచామని హరీశ్‌రావు తెలిపారు. సంబంధిత కార్పొరేషన్ నిధులతోపాటు బయటి నుంచి రూ.4,500 కోట్లు సమీకరించి.. ప్రతీ గొల్లకురుమ కుటుంబానికి గొర్రెల యూనిట్ అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా నీళ్లు అందుబాటులోకి రావడంతో వలసలు ఆగిపోయాయని.. పైగా 11 రాష్ట్రాల ప్రజలే పనుల కోసం తెలంగాణకు వలస వస్తున్నారని చెప్పారు. 2014కు ముందు తెలంగాణలో మూడే మెడికల్ కాలేజీలు ఉంటే.. ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయబోతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment