నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం | TDP Govt to cancel 18 notifications in medical department | Sakshi
Sakshi News home page

నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం

Published Mon, Aug 26 2024 6:24 AM | Last Updated on Mon, Aug 26 2024 12:54 PM

TDP Govt to cancel 18 notifications in medical department

వైద్య శాఖలో 18 నోటిఫికేషన్ల రద్దు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు

నిలిచిపోనున్న పారామెడికల్, ఇతర సహాయక సిబ్బంది పోస్టుల భర్తీ

వైఎస్‌ జగన్‌ హయాంలో నోటిఫికేషన్లు విడుదలవ్వడమే కారణం!

గత ప్రభుత్వం అమలు చేసిన జీరో వేకెన్సీ విధానానికీ స్వస్తి 

కూటమి ప్రభుత్వ చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు

ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం  

సాక్షి, అమరావతి: ‘అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తాం. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం’ అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీడీపీ కూటమి.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కుతోంది. కొత్త ఉద్యోగాల కల్పన దిశగా అడు­గులు వేయకపోగా.. గత వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం చేపట్టిన నియామకాల ప్రక్రియలను సైతం నిలిపివేసే దిశగా అడుగులు వేస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. 

వైద్య, ఆరోగ్య శాఖలో 2 వేలకు పైగా కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను రద్దు చేయాలని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో ఆ శాఖ ఉన్నతాధికారులు పలుమార్లు సమావేశం నిర్వహించి.. నోటిఫికేషన్లు రద్దు చేస్తే తలెత్తే న్యాయపరమైన ఇబ్బందులపై చర్చించినట్లు సమాచారం.  

జీరో వేకెన్సీకి తిలోదకాలు.. 
ప్రభుత్వాస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ డాక్టర్లు, డాక్టర్లు, నర్సుల, ఇతర వైద్య సిబ్బంది కొరత లేకుండా జీరో వేకెన్సీ(ఎప్పటికప్పుడే ఖాళీలు భర్తీ) పాలసీని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూనే.. రోగుల అవసరాలకు అనుగుణంగా కొత్త పోస్టులు మంజూరు చేస్తూ వచ్చింది. 

ఎన్నికలకు ముందు కూడా పారామెడికల్‌తో పాటు ఇతర సహాయక సిబ్బంది పోస్టుల భర్తీ కోసం డిస్టిక్‌ సెలక్షన్‌ కమిటీ(డీఎస్సీ)లు 2 వేలకు పైగా పోస్టుల భర్తీకి 18 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అయితే ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుండగా ఎన్నికల కోడ్‌ వచ్చింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే జీరో వేకెన్సీ పాలసీకి తూట్లు పొడిచింది. అలాగే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విడుదల చేసిన ఈ 18 నోటిఫికేషన్లనూ రద్దు చేసేందుకు చర్యలు చేపట్టింది.  

తుది దశలో ఉన్నా.. రద్దుకే మొగ్గు! 
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విడుదల చేసిన 18 నోటిఫికేషన్లకు సంబంధించి.. మూడింటిలో ఇప్పటికే తుది మెరిట్‌ జాబితాలు విడుదలయ్యాయి. మరో 8 నోటిఫికేషన్‌లలో ప్రాథమిక మెరిట్‌ జాబితాలు జారీ చేయగా.. ఏడింటిలో ప్రాథమిక మెరిట్‌ జాబితాలు విడుదల చేయాల్సి ఉంది. ఇలా దాదాపు ముగింపు దశలో ఉన్న నోటిఫికేషన్లను రెండు నెలలకు పైగా పెండింగ్‌లో ఉంచిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు రద్దు చేసే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. 

అలాగే విజయనగరం వైద్య కళాశాలలో 60 పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసి.. గత నెలలో రెండో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ తర్వాత రెండో నోటిఫికేషన్‌ను కూడా నిలిపివేసింది. ఇక మచిలీపట్నం వైద్య కళాశాలలో 96 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. ఒక విడత ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. రెండో విడత ఎంపిక జాబితా మాత్రం ఇంకా ప్రాసెస్‌లోనే ఉండిపోయింది. దీనిపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంపై ఉన్న కోపంతో.. తమ జీవితాలతో ఆడుకోవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.  

వైద్య సేవలపై ప్రభావం..  
కూటమి ప్రభుత్వ నిర్ణయాల వల్ల వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. రాష్ట్రంలో విష జ్వరాలు విలయతాండవం చేస్తున్న తరుణంలో.. బోధనాస్పత్రుల్లో పారామెడికల్, ఇతర సహాయక సిబ్బంది కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మార్కాపురం బోధనాస్పత్రిలో రోజుకు 500 నుంచి 600 మేర ఓపీలు నమోదవుతున్నాయి. 

ఈ ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీíÙయన్లు 25 మంది అవసరమవ్వగా.. ప్రస్తుతం ఐదుగురే ఉన్నారు. రోజుకు 300 వరకు ల్యాబ్‌ పరీక్షలు చేయాల్సిన చోట.. ఐదుగురే ఉండటంతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయితే గానీ ఈ సమస్య పరిష్కారమవ్వదని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement