
బ్రాడ్‌బ్యాండ్, డీఎస్‌ఎల్ సేవల్లో 62 శాతం మందికి సమస్యలు
‘లోకల్ సర్కిల్స్ సర్వే’లో వెల్లడి
సాక్షి, అమరావతి: ఉద్యోగం, విద్యా, వినోదం ఇలా వివిధ అవసరాల కోసం ఇళ్లకు బ్రాడ్ బ్యాండ్, ఫైబర్, డిజిట్–సబ్‌స్క్రైబర్ లైన్ (డీఎస్‌ఎల్) ఇంటర్నెట్ కనెక్షన్‌లు తీసుకోవడం సర్వసాధారణంగా మారింది. కాగా, ఆయా సంస్థలు అందిస్తున్న సేవలపై సగానికి పైగా వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లోకల్ సర్కిల్స్ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశ వ్యాప్తంగా ఏకంగా 62% మంది తమ ఇంటర్నెట్ కనెక్షన్‌లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్వే స్పష్టం చేసింది. సర్వేలో వెల్లడైన కొన్ని ముఖ్యాంశాలు..
» ఇంటర్నెట్ కనెక్షన్‌లో అంతరాయం ఎదుర్కొంటున్నారా! అని 29,701 మందిని ప్రశ్నించగా 62 % మంది అవునని సమాధానం ఇచ్చారు.
» నెలలో ఎన్నిసార్లు ఇంటర్నెట్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని 29,529 మందిని ఆరా తీయగా 37 శాతం మంది ప్రతి నెలా మూడు కంటే ఎక్కువ సార్లు అంతరాయం ఎదుర్కొంటున్నామని వెల్లడించారు. 36% మంది ఒకటి, రెండు సార్లు అంతరాయం ఉందని, మిగిలిన వారు సమస్యలు తలెత్తడం లేదని పేర్కొన్నారు.
» ఇంటర్నెట్ సరఫరాలో సమస్యలు వచ్చిన సందర్భాల్లో పరిష్కారానికి 24 గంటల కంటే ఎక్కువ సమయాన్ని సర్వీస్ ప్రొవైడర్లు తీసుకుంటున్నారని సర్వేలో తేలింది.
» వినియోగదారుల ఫిర్యాదులపై సర్వీస్ ప్రొవైడర్స్ స్పందనపై 29 వేల మందిని ఆరా తీశారు. కేవలం 43 శాతం మంది 24 గంటల్లో ఫిర్యాదులు పరిష్కరిస్తున్నారని అన్నారు. 35 శాతం మంది ఒకటి నుంచి మూడు రోజులు, మిగిలినవారు 4 నుంచి ఏడు, అంతకంటే ఎక్కువ రోజులు పడుతోందన్నారు.
» దాదాపు 66 శాతం మంది వినియోగదారులు మెరుగైన నాణ్యత, సేవ లేదా ధర కోసం ప్రత్యామ్నాయ ప్రొవైడర్‌కు మారడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
» గతేడాది కూడా బ్రాడ్‌బ్యాండ్, ఫైబర్ నెట్, డీఎస్‌ఎల్ సేవలపై ఈ సంస్థ సర్వే చేసింది. అప్పట్లో సర్వీస్ ప్రొవైడర్ వాగ్థానం చేసిన వేగం కంటే తక్కువకు ఇంటర్నెట్ సరఫరా ఉంటోందని 66 శాతం మంది అభిప్రాయపడ్డారు. అదే విధంగా ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉండటం లేదని 38 శాతం మంది అసహనం వ్యక్తం చేశారు.
మొత్తం 333 జిల్లాల్లో సర్వే
దేశవ్యాప్తంగా మొత్తం 333 జిల్లాల్లో ఫిక్స్‌డ్ లైన్ ఇంటర్నెట్ వినియోగదారుల నుంచి వచ్చిన 1.40 లక్షల సమాధానాల మదింపు ద్వారా సంస్థ సర్వే ఫలితాలను వెలువరించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 62 శాతం మంది పురుషులుకాగా, 38 శాతం మహిళా వినియోగదారులు ఉన్నారు. వివిధ ప్రశ్నల రూపంలో వినియోగదారుల నుంచి సమాధానాలను స్వీకరించారు.