బ్రాడ్‌బ్యాండ్, డీఎస్‌ఎల్ వినియోగదారుల వెల్లడి
నెలలో మూడు, అంతకంటే ఎక్కువసార్లు సేవల్లో అంతరాయం
తేల్చిన లోకల్ సర్కిల్ సర్వే
దేశవ్యాప్తంగా 319 జిల్లాల్లో 33 వేల మంది వినియోగదారులపై సర్వే
సాక్షి, అమరావతి: బ్రాడ్‌బ్యాండ్, ఫైబర్, డిజిటల్ సబ్‌స్క్రైబ్ లైన్ (డీఎస్‌ఎల్) సేవలపై దేశవ్యాప్తంగా సగానికిపైగా వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివిధ బ్రాడ్‌బ్యాండ్, డీఎస్‌ఎల్ ఇంటర్నెట్ ప్రొవైడర్ సంస్థల నుంచి సేవలు పొందుతున్న వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై లోకల్ సర్కిల్ సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది. 319 కంటే ఎక్కువ జిల్లాల్లో 33 వేల మంది వినియోగదారుల నుంచి ఈ సర్వేలో అభిప్రాయాలను సేకరించారు.
సర్వేలో 64 శాతం మంది పురుషులు, 36 శాతం మహిళలు పాల్గొన్నారు. ప్రశ్నల రూపంలో వినియోగదారుల నుంచి సమాధానాలు రాబట్టడం ద్వారా సర్వే నిర్వహించారు. కాగా, తమ కనెక్షన్‌లో ప్రతి నెలా మూడు అంతకంటే ఎక్కువ సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్టు 56 శాతం మంది వెల్లడించారు. వీటి పరిష్కారానికి 24 గంటల కంటే ఎక్కువ సమయాన్ని సర్వీస్ ప్రొవైడర్‌లు తీసుకుంటున్నాయని 53 శాతం మంది తెలిపారు.
స్పీడ్ సరిపోవడం లేదు
తాము ఎంచుకున్న ప్లాన్‌కు, ఇంటర్నెట్ స్పీడ్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోందని చాలామంది వినియోగదారులు అభిప్రాయపడ్డారు. సర్వీస్ ప్రొవైడర్‌లు ముందుగా వాగ్దానం చేసిన దానికంటే తక్కువ స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తున్నాయని 66 శాతం మంది వెల్లడించారు. ఇంటర్నెట్ స్పీడ్ అంశంపై 8,430 మంది నుంచి అభిప్రాయాలను సేకరించగా.. తాము చెల్లిస్తున్న దానికంటే ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉంటోందని 33 శాతం మంది తెలిపారు.
21 శాతం మంది ఎలాంటి సమస్యలు ఉండటం లేదన్నారు. ఎటువంటి సమస్యలు లేకుండా మీకు ఇంటర్నెట్ సరఫరా కొనసాగుతోందా? అని 8,430 మందిని సర్వేలో ఆరా తీయగా.. 25 శాతం మంది నెలలో ఒకటి, రెండుసార్లు అవాంతరాలు ఎదురవుతున్నట్టు వెల్లడించారు. మరో 19 శాతం మంది 3నుంచి 5సార్లు, 21 శాతం మంది 5–10 సార్లు, 16 శాతం మంది 10కి పైగా అవాంతరాలను ఎదుర్కొంటున్నట్టు వివరించారు. మిగిలిన 19 శాతం మంది మాత్రం తమకు ఎటువంటి అవాంతరాలు ఎదురవడం లేదని స్పష్టం చేశారు.
తక్షణ స్పందన ఉండటం లేదు
ఇంటర్నెట్ సరఫరాలో సమస్యలు తలెత్తినప్పుడు ఫిర్యాదులు చేసిన సమయంలో సర్వీస్ ప్రొవైడర్ల నుంచి తక్షణ స్పందన ఉండటం లేదని ఎక్కువ మంది తెలిపారు. సర్వీస్ ప్రొవైడర్‌లు ఫిర్యాదులు నివృత్తి చేసే అంశంపై 7,885 మంది నుంచి సర్వీస్‌లో వివరాలు సేకరించారు.
కాగా, 38 శాతం మంది 24 గంటల్లోపు తమ ఫిర్యాదులు నివృత్తి అవుతున్నట్టు వివరించారు. 30 శాతం మంది 1 నుంచి 3 రోజులు, 5 శాతం మంది 4–7 రోజులు, 11 శాతం మంది 7 రోజులకు పైగా సమయం పడుతోందన్నారు. 8 శాతం మంది ఏమీ చెప్పలేమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment