internet providers
-
ప్చ్.. ఇంటర్నెట్ సేవలు బాగుండలేదు!
సాక్షి, అమరావతి: బ్రాడ్‌బ్యాండ్, ఫైబర్, డిజిటల్ సబ్‌స్క్రైబ్ లైన్ (డీఎస్ఎల్) సేవలపై దేశవ్యాప్తంగా సగానికిపైగా వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివిధ బ్రాడ్‌బ్యాండ్, డీఎస్ఎల్ ఇంటర్నెట్ ప్రొవైడర్ సంస్థల నుంచి సేవలు పొందుతున్న వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై లోకల్ సర్కిల్ సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది. 319 కంటే ఎక్కువ జిల్లాల్లో 33 వేల మంది వినియోగదారుల నుంచి ఈ సర్వేలో అభిప్రాయాలను సేకరించారు. సర్వేలో 64 శాతం మంది పురుషులు, 36 శాతం మహిళలు పాల్గొన్నారు. ప్రశ్నల రూపంలో వినియోగదారుల నుంచి సమాధానాలు రాబట్టడం ద్వారా సర్వే నిర్వహించారు. కాగా, తమ కనెక్షన్లో ప్రతి నెలా మూడు అంతకంటే ఎక్కువ సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్టు 56 శాతం మంది వెల్లడించారు. వీటి పరిష్కారానికి 24 గంటల కంటే ఎక్కువ సమయాన్ని సర్వీస్ ప్రొవైడర్లు తీసుకుంటున్నాయని 53 శాతం మంది తెలిపారు. స్పీడ్ సరిపోవడం లేదుతాము ఎంచుకున్న ప్లాన్‌కు, ఇంటర్నెట్ స్పీడ్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోందని చాలామంది వినియోగదారులు అభిప్రాయపడ్డారు. సర్వీస్ ప్రొవైడర్లు ముందుగా వాగ్దానం చేసిన దానికంటే తక్కువ స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తున్నాయని 66 శాతం మంది వెల్లడించారు. ఇంటర్నెట్ స్పీడ్ అంశంపై 8,430 మంది నుంచి అభిప్రాయాలను సేకరించగా.. తాము చెల్లిస్తున్న దానికంటే ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉంటోందని 33 శాతం మంది తెలిపారు.21 శాతం మంది ఎలాంటి సమస్యలు ఉండటం లేదన్నారు. ఎటువంటి సమస్యలు లేకుండా మీకు ఇంటర్నెట్ సరఫరా కొనసాగుతోందా? అని 8,430 మందిని సర్వేలో ఆరా తీయగా.. 25 శాతం మంది నెలలో ఒకటి, రెండుసార్లు అవాంతరాలు ఎదురవుతున్నట్టు వెల్లడించారు. మరో 19 శాతం మంది 3నుంచి 5సార్లు, 21 శాతం మంది 5–10 సార్లు, 16 శాతం మంది 10కి పైగా అవాంతరాలను ఎదుర్కొంటున్నట్టు వివరించారు. మిగిలిన 19 శాతం మంది మాత్రం తమకు ఎటువంటి అవాంతరాలు ఎదురవడం లేదని స్పష్టం చేశారు. తక్షణ స్పందన ఉండటం లేదుఇంటర్నెట్ సరఫరాలో సమస్యలు తలెత్తినప్పుడు ఫిర్యాదులు చేసిన సమయంలో సర్వీస్ ప్రొవైడర్ల నుంచి తక్షణ స్పందన ఉండటం లేదని ఎక్కువ మంది తెలిపారు. సర్వీస్ ప్రొవైడర్లు ఫిర్యాదులు నివృత్తి చేసే అంశంపై 7,885 మంది నుంచి సర్వీస్‌లో వివరాలు సేకరించారు. కాగా, 38 శాతం మంది 24 గంటల్లోపు తమ ఫిర్యాదులు నివృత్తి అవుతున్నట్టు వివరించారు. 30 శాతం మంది 1 నుంచి 3 రోజులు, 5 శాతం మంది 4–7 రోజులు, 11 శాతం మంది 7 రోజులకు పైగా సమయం పడుతోందన్నారు. 8 శాతం మంది ఏమీ చెప్పలేమన్నారు. -
కేంద్రం కీలక ఆదేశాలు! కాల్ రికార్డ్స్, ఇంటర్నెట్ యూజర్ల వివరాలన్నీ..
టెలికాం ఆపరేటర్లకు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న యూజర్ల కాల్ రికార్డింగ్ డాటాను, ఇంటర్నెట్ యూసేజ్ డాటాను రెండేళ్ల పాటు భద్రపర్చాలంటూ ఆ ఆదేశాల్లో పేర్కొంది. గతంలో ఈ సమయం ఏడాది పాటే ఉండేది. ఒకవేళ భద్రతా ఏజెన్సీలు కోరితే ఆ గడువును పెంచే విధంగా సవరణ వెసులుబాటు ఉండేది(గతంలో ఎన్నడూ జరగలేదు!). అయితే ఈసారి రెండేళ్లపాటు భద్రపర్చాలంటూ యునిఫైడ్ లైసెన్స్ అగ్రిమెంట్‌కు సవరణ చేయడం విశేషం. రెండేళ్లపాటు లేదంటే ప్రభుత్వం చెప్పేవరకు వివరాలను భద్రపర్చి ఉంచాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం(DoT) డిసెంబర్ 21న ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా టెలికామ్ కంపెనీలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, టెలికాం లైసెన్స్‌లు కలిగిన ఇతరులు.. కమర్షియల్‌తో పాటు యూజర్ల కాల్ వివరాల రికార్డ్లను భద్రపర్చాలని స్పష్టం చేసింది. భద్రతా ఏజెన్సీలు కోరినందునే ఈసారి ఈ సవరణ చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రజాప్రయోజనాల దృష్ట్యా లేదంటే భద్రతాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని టెల్కోస్, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు టెలికమ్యూనికేషన్ విభాగం ఈ తరహా ఆదేశాల్ని జారీ చేస్తుంటుంది. కాల్ రికార్డింగులు, మెసేజ్‌ల వివరాలతో పాటు ఇంటర్నెట్ సేవలకు సంబంధించి ఈ-మెయిల్, లాగిన్, లాగ్ అవుట్.. ఇలా అన్ని వివరాలను జాగ్రత్త పర్చాల్సి ఉంటుంది. ఐపీ అడ్రస్ వివరాలకు అదనంగా ఈసారి ఇంటర్నెట్ టెలిఫోనీ(యాప్‌ల ద్వారా చేసే కాల్స్, వైఫై కాల్స్ తదిరత వివరాలు) సైతం రెండు సంవత్సరాలపాటు భద్రపర్చాల్సిందే!. దర్యాప్తు, విచారణ, భద్రతా ఏజెన్సీలు ఎప్పుడు కోరితే అప్పుడు ఆ వివరాల్ని కంపెనీలు సమర్పించాల్సి ఉంటుంది. థర్డ్ జనరేషన్ ఇంటర్నెట్.. మీరూ కుబేరులు అయిపోవచ్చు! -
'బాహుబలిని పైరసీకి బలిచేయొద్దు'
హైదరాబాద్: బాహుబలి చిత్రాన్ని ఎవరూ పైరసీకి బలి చేయోద్దని, అలాంటి అవకాశాలను తొలగించాలని కోర్టు పలు ఇంటర్నెట్ నిర్వహణ సంస్థలకు ఆదేశించింది. ఇంటర్నెట్ సంస్థలుగానీ, నెట్ సర్వీసలు సంస్థలు గానీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి చిత్రాన్ని పైరసీ చేయకుండా ఉండేలా ఆదేశించాలంటూ ఏ వెంకటేశ్ అనే పిటిషనర్ కోర్టులో పిటిషన్ వేయగా అడిషనల్ చీఫ్ జడ్జి జీవీఎన్ భరత లక్ష్మీ ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ కమ్యునికేషన్స్, భారతీ ఎయిర్ టెల్ వంటి మొబైల్ ద్వారా ఆన్లైన్ సేవలు అందించే సంస్థలకు ప్రత్యేక సూచనలు సూచించారు. బాహుబలి చిత్రానికి సంబంధించిన సన్నివేశాలుగానీ, ఇతర ఏ విధమైన అంశాలుగానీ ఆయా నెట్ సంస్థల ద్వారా ఎవరైనా డౌన్లోడ్ చేసే చర్యలకు పాల్పడటంగానీ, అప్లోడ్ చేయడంవంటి పనులు చేయడంగానీ చేస్తే వాటిని గుర్తించి వెంటనే నియంత్రించాలని చెప్పారు. ఒకవేళ ఇప్పటికే బాహుబలి చిత్రం పైరసీ తాలూకు వీడియోలు ఉంటే వెంటనే వాటిని బ్లాక్ చేయడంగానీ, లేదా పూర్తిగా తొలగించడం గానీ చేయాలని ఆదేశించారు. దాదాపు 250 కోట్ల భారీ వ్యయంతో రూపొందిన ఈ చిత్రం పలు చోట్ల పైరసీకి గురవుతుందని చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.