
పేదల్లో అట్టడుగున ఉండే 20 శాతం నిరుపేదలను గుర్తించడం కోసం వివరాల నమోదు
ఫిబ్రవరి 20–మార్చి 2 మధ్య తొలి విడతలో 10 జిల్లాల్లో కొనసాగిన సర్వే
రెండో విడత ఈ నెల 18 వరకు ఇంటింటి వివరాలు సేకరణ
1.28 కోట్ల కుటుంబాల వివరాలు సచివాలయాల ఉద్యోగుల ద్వారా సేకరణ
బ్యాంకు ఖాతా, ఆస్తుల వివరాలతో నెలకు ఎంత కరెంటు బిల్లు కడుతున్నారంటూ ప్రశ్నలు
ప్రజల్లో పలు సందేహాలు.. పథకాలను పరిమితం చేసే ఎత్తుగడ అని అనుమానాలు
సాక్షి, అమరావతి: పీ–4 రెండో విడత సర్వే 16 జిల్లాల్లో శనివారం మొదలైంది. రాష్ట్రంలోని మొత్తం పేదల్లో అట్టడుగున ఉండే 20 శాతం నిరుపేదలను గుర్తించేందుకు కూటమి ప్రభుత్వం తొలి విడతగా ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2 మధ్య పది జిల్లాల్లో ఈ సర్వేను పూర్తి చేసింది. మిగిలిన 16 జిల్లాల్లో ఈ నెల 18 వరకు ప్రక్రియ కొనసాగనుంది.
రెండు విడతల్లో మొత్తం 1,28,14,471 కుటుంబాల నుంచి సామాజిక, ఆర్థిక స్థితిగతులపై 27 ప్రశ్నల ద్వారా ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటి నుంచి సమాచార సేకరణ చేపడుతున్నారు. కుటుంబాల జాబితాను ప్రభుత్వం సర్వే నిర్వహణకు ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌తో అనుసంధానం చేసింది.
సర్వేపై సవాలక్ష అనుమానాలు
సర్వే సందర్భంగా కుటుంబ యజమాని ఆధార్, ఫోన్ నంబర్లతో పాటు, ఇంట్లో టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీ, ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ వంటివి ఉన్నాయా? ఎంతమంది సంపాదించే వ్యక్తులు ఉన్నారు..? మున్సిపల్, పట్టణ పరిధిలో ఏ ఆస్తులు ఉన్నాయి..? నెలకు ఎంత కరెంటు బిల్లు వస్తుంది? వంటి ప్రశ్నలు అడుగుతుండడంతో ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలేవీ అమలు చేయడం లేదని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. సర్కారు మాత్రం పేదల్లో పెద్ద పేదలు, చిన్న పేదలు ఎవరు అన్నది తేల్చడానికి సర్వే చేయడం భవిష్యత్తులో పథకాలను కొద్దిమందికే పరిమితం చేసే ఎత్తుగడ అని భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మాత్రం వివిధ ప్రాజెక్టుల ద్వారా అవసరమైన కుటుంబాలకు ప్రైవేట్ రంగ సాయం అందించడం కోసమే సర్వే నిర్వహిస్తున్నట్టు పేర్కొంటున్నది.
పథకాల్లో కోతకేనా? అనే భయం
పథకాల్లో కోతలు పెట్టేందుకే సర్వే నిర్వహిస్తున్నారన్న సందేహంతో పాటు బ్యాంకు ఖాతా, కుటుంబ ఆదాయం వంటి సున్నిత వివరాలు సైతం అడుగుతుండడంతో పలు కుటుంబాలు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఇలాంటి కుటుంబాలను జాబితాలో ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు.
తొలి విడత పది జిల్లాలతో పాటు శనివారం నుంచి రెండో దఫా మొదలైన 16 జిల్లాల్లో సర్వే సిబ్బంది 54,70,565 కుటుంబాల సందర్శన పూర్తి చేశారు. ఇందులో 46,46,773 కుటుంబాలు వివరాలను తెలపగా, 8,23,792 కుటుంబాలు నిరాకరించాయి. సర్వే పూర్తయ్యాక ఈ నెల 21న వివరాలతో జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శించనున్నట్టు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment