సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ఏడాదిలో వరుసగా ఉద్యోగ భర్తీ పరీక్షలు జరగనున్నాయి. ఏడాదిలోగా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీచేయగా, త్వరలో మరికొన్ని కొలువులకు ప్రకటన చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వచ్చిన పలు నోటిఫికేషన్లకు సంబంధించి జనవరి చివరి వారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలవనుంది.
వాటికి 2023 ఏడాది మధ్యలో నియామక పరీక్షలు జరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇక ముందు వెలువడబోయే నోటిఫికేషన్లకు ఆ తర్వాత రాత పరీక్షలు ఉంటాయని అంటున్నాయి. మొత్తంగా 2023 ఏడాది పొడవునా నియామక సంస్థలు ఉద్యోగ అర్హత పరీక్షలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో నిరుద్యోగులు ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవడంలో నిమగ్నమయ్యారు.
ఇప్పటివరకు 42 వేల పోస్టులకు..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గత ఏడాది మార్చిలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 80 వేల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. అందులో భాగంగా పలు పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నియామక సంస్థలు 42,293 కొలువులకు ప్రకటనలు జారీ చేశాయి.
తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామకాల బోర్డు 17,516 పోస్టులకు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 17,457 పోస్టులకు, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు 7,320 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చాయి. మరోవైపు గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు ద్వారా 12వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు రానున్నాయి. వీటికితోడు ఉపాధ్యాయ పోస్టులు, యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి కూడా ప్రకటనలు వెలువడనున్నాయి. ఈ ఉద్యోగాలన్నింటి భర్తీకి 2023 సంవత్సరమే వేదిక కానుంది.
వరుసగా భర్తీ పరీక్షలు
ఇప్పటికే నోటిఫికేషన్లు వెలువడిన ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షలు నిర్వహించేందుకు నియామక సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. పోలీసు ఉద్యోగాలకు సంబంధించి వచ్చే ఏప్రిల్ లేదా మే నెలలో మెయిన్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అదే విధంగా గ్రూప్–1 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా త్వరలో వెలువడనుంది. వచ్చే మే తర్వాత మెయిన్ పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే సంకేతాలిచ్చింది.
ఆ పరీక్షల తర్వాత కొంత విరామమిచ్చి గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 పరీక్షలు నిర్వహించనున్నట్టు అంచనా. ఇదే సమయంలో ఇతర పోస్టులకు సంబంధించి అర్హత పరీక్షలను కూడా నిర్వహించనుంది. మరోవైపు గురుకుల పోస్టులకు సంబంధించి జనవరిలో ప్రకటనలు వెలువడితే.. జూన్ తర్వాత పరీక్షలు జరిగే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు చెప్తున్నాయి.
నోటిఫికేషన్లు, పోస్టుల వివరాలివీ..
► తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామకాల బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) 17,515 పోలీస్ కొలువులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో 587 సబ్ ఇన్‌స్పెక్టర్, 16,929 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహించిన బోర్డు.. దేహ దారుఢ్య పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత మెయిన్ పరీక్షలను 2023 ఏడాది మధ్యలో నిర్వహించే అవకాశం ఉంది.
► టీఎస్‌పీఎస్సీ 2022లో మొత్తంగా 22 నోటిఫికేషన్లు ఇచ్చింది. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 కేటగిరీలు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులతోపాటు ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో కలిపి 17,457 ఉద్యోగాలకు ప్రకటనలు విడుదల చేసింది. కీలకమైన గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలతోపాటు పలు కేటగిరీల్లో కొలువుల భర్తీకి అర్హత పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
► తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) మొత్తం 7,320 ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేసింది. ఇందులో సివిల్ అసిస్టెంట్ సర్జన్ 969, స్టాఫ్ నర్సులు 5,204, అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో 1,147 పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఎంపిక దాదాపు పూర్తవగా.. మిగతా కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
► తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) సైతం గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో వివిధ కేటగిరీల్లో 12వేల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో కేటగిరీల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. జనవరి నెలాఖరుకల్లా దాదాపు అన్నిరకాల కొలువులకు ప్రకటనలు వెలువడనున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ పోస్టులకు 2023 ఏడాదిలోనే అర్హత పరీక్షలు నిర్వహించనున్నారు.
TS: కొత్త కొలువుల ఏడాది.. వరుసగా ఉద్యోగ భర్తీ పరీక్షలు
Published Sun, Jan 1 2023 1:27 AM | Last Updated on Sun, Jan 1 2023 4:03 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment