రేపటి నుంచి ‘సచివాలయ’ ఉద్యోగ రాత పరీక్షలు | Written exams to fill the vacancies in the village and ward secretariats | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ‘సచివాలయ’ ఉద్యోగ రాత పరీక్షలు

Sep 19 2020 5:22 AM | Updated on Sep 19 2020 8:20 AM

Written exams to fill the vacancies in the village and ward secretariats - Sakshi

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి రాతపరీక్షలు మొదలు కానున్నాయి.

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి రాతపరీక్షలు మొదలు కానున్నాయి. ఈసారి మొత్తం 16,208 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏడు రోజుల పాటు రోజుకు రెండేసి చొప్పున మొత్తం 14 రకాల రాతపరీక్షలను నిర్వహించనున్నారు. రోజూ ఉదయం పది గంటలకు, మధ్యాహ్నం రెండున్నర గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. కరోనా నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. ఉదయం పరీక్ష రాసేవారు 8 గంటల కల్లా, సాయంత్రం పరీక్ష రాసేవారు ఒంటి గంట కల్లా పరీక్ష కేంద్రం వద్ద రిపోర్ట్‌ చేయాలని అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి మించి ఒక్క నిమిషం లేటుగా వచ్చినా పరీక్ష హాల్లోకి అనుమతించబోమన్నారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉన్నప్పటికీ తెలుగు అనువాదం కూడా ఉంటుందని చెప్పారు. తప్పుగా గుర్తించిన జవాబులకు నెగిటివ్‌ మార్కులుంటాయన్నారు.

పరీక్షల తర్వాత కూడా బస్సులు 
విజయవాడ, విశాఖపట్నంలలో శనివారం నుంచి సిటీ సర్వీసులు అందుబాటులోకి వస్తున్నట్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. శుక్రవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల అనంతరం కూడా సిటీ బస్సులు 
నడుపుతామన్నారు.

హాల్‌టికెట్‌లో ఫొటో స్పష్టంగా లేకుంటే..
► మొత్తం 10,56,391 మంది పరీక్షలు రాస్తుండగా.. అందులో 6,81,664 మంది తొలిరోజునే పరీక్షకు హాజరవుతారు. శుక్రవారం సాయంత్రం వరకు 8,72,812 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.  హాల్‌టికెట్‌లో ఫొటో స్పష్టంగా లేకున్నా, బ్లాక్‌ అయిన ఫొటో, చాలా చిన్న సైజులో ఫొటో, సంతకం లేని ఫొటో ఉంటే అభ్యర్థులు గెజిటెడ్‌ ఆఫీసర్‌తో సంతకం చేయించుకున్న మూడు ఫొటోలు వెంట తెచ్చుకోవాలి. హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు కూడా తప్పనిసరి.  

► ఓఎంఆర్‌ షీట్‌లో బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌తో మాత్రమే జవాబులు నింపాల్సి ఉంటుంది. పెన్సిల్, ఇంక్‌ పెన్, జెల్‌ పెన్‌తో నింపకూడదు. 

► కరోనా అనుమానిత లక్షణాలున్న వారు రాతపరీక్షకు హాజరయ్యేందుకు వీలుగా ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ఐసోలేషన్‌ రూమును అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రూముల్లో ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లను అందజేస్తారు. 

► అభ్యర్థులకు మాస్కులు, హ్యాండ్‌ శానిటైజర్లు తప్పనిసరి. పరీక్ష సమయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే పరీక్ష కేంద్రం అధికారుల దృష్టికి తెచ్చి ఐసోలేషన్‌ రూముకు వెళ్లాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement