12 లక్షల మందికే భృతి | AP Government likely to issue notification for 20000 jobs | Sakshi
Sakshi News home page

12 లక్షల మందికే భృతి

Published Fri, Aug 3 2018 3:52 AM | Last Updated on Fri, Aug 3 2018 4:13 AM

AP Government likely to issue notification for 20000 jobs - Sakshi

గురువారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు

సాక్షి, అమరావతి: ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అంశాలకు సంబంధించి రాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 20 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకునే విషయంపై గురువారం మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్చించారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు కానిస్టేబుళ్లు, ఇతర శాఖల్లోని పోస్టులన్నీ కలిపి పదివేల వరకు ఇప్పటికే భర్తీ చేసినందున మిగిలిన పదివేల పోస్టులతోపాటు కొత్తగా మరో 9వేలకు పైగా పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

అలాగే, ఎన్నికల మేనిఫెస్టోలోని నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ పథకాన్ని అర్హులైన అందరికీ కాకుండా కొందరికే పరిమితం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సుమారు 12.26 లక్షల మందికే ఈ భృతి ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను గురువారం సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఖరారు చేశారు. ఆ వివరాలను మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర మీడియాకు వివరించారు.

నిరుద్యోగ భృతికి ‘ముఖ్యమంత్రి యువ నేస్తం’గా పేరు
‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పేరుతో నిరుద్యోగ భృతి పథకాన్ని అమలుచేయాలని నిర్ణయించారు. ఆగస్టు మూడు, నాలుగు వారాల్లో దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించి దాని ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ల (దరఖాస్తుల స్వీకరణ) ప్రక్రియను ప్రారంభిస్తారు. వెబ్‌సైట్‌ ప్రారంభమైన తర్వాత 15 రోజులపాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఉంటుంది.

ఆ తర్వాత పథకాన్ని అమలుచేస్తారు. ప్రజాసాధికారిక సర్వేలో సేకరించిన సమాచారం, ఆధార్‌ అనుసంధానం ఆధారంగా ఈ రిజిస్ట్రేషన్లను నిర్వహిస్తారు. ఈ వెబ్‌సైట్‌లో తమ పేరును రిజిస్టర్‌ చేసుకున్న వారు.. వారి వివరాల ఆధారంగా వారు ఈ పథకానికి అర్హులో కాదో తేలిపోతుంది. ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం నమోదైన రిజిస్ట్రేషన్లనే ఆన్‌లైన్‌ స్వీకరిస్తుంది. వాటికి విరుద్ధంగా ఉంటే వెంటనే ఆ రిజిస్ట్రేషన్‌ను కంప్యూటర్‌ తిరస్కరించేలా ఏర్పాటుచేశారు.

ఇదిలా ఉంటే.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఈ పథకాన్ని అమలుచేస్తున్నామని మంత్రి లోకేష్‌ తెలిపారు. ఈ పథకానికి ఎంపికైన వారికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కింద శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వివిధ కంపెనీల్లో అప్రెంటీస్‌కు అవకాశం కల్పిస్తామన్నారు. ఇలాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా అమలుచేయలేదని, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే అమలు తేదీని ప్రకటిస్తామని లోకేష్‌ తెలిపారు. చంద్రబాబు ఒక బ్రాండ్‌ అంబాసిడర్‌ అని ఆయన ముఖ్యమంత్రిని కొనియాడారు.  

భృతికి అర్హతలు ఇవే..
22 నుంచి 35ఏళ్ల వయస్సు.. డిగ్రీ లేదా పాలిటెక్నిక్‌ చదివిన వారు మాత్రమే అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజాసాధికార సర్వే ప్రకారం సుమారు 12 లక్షల మంది ఈ పథకానికి అర్హులని అంచనా వేసిన ప్రభుత్వం.. ఇందుకు సుమారు రూ.600 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టింది. ఏదైనా సంస్థలో పనిచేస్తూ పీఎఫ్‌ కట్‌ అవుతున్న వారు.. ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి కింద రుణాలు తీసుకున్న వారు ఈ పథకానికి అనర్హులు. ప్రతినెలా వేలిముద్రలు తీసుకుని బ్యాంకు అకౌంట్లలో ఈ మొత్తాన్ని జమచేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement