తేల్చి చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం
అసెంబ్లీలో రాతపూర్వకంగా వెల్లడి
యువతను దగా చేసిన సర్కారు
ఇంకా మార్గదర్శకాల రూపకల్పనలోనే ఉచిత బస్ ప్రయాణం
సాక్షి, అమరావతి: జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై గంపెడు ఆశలు పెట్టుకున్న యువతకు చంద్రబాబు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలన్నింటినీ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ యువత భవిష్యత్‌తో చెలగాటం ఆడుతున్న బాబు ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచి్చన నిరుద్యోగ భృతి హామీ అమలును సైతం గాలికి వదిలేసింది. నిరుద్యోగులకు భృతి అందించే ప్రతిపాదనే ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని శుక్రవారం శాసన సభ సాక్షిగా ప్రభుత్వం రాతపూర్వకంగా తేల్చి చెప్పింది.
పైగా రాష్ట్రంలో కేవలం 4.46 లక్షల మంది నిరుద్యోగులే ఉన్నట్టు కాకి లెక్కలు చూపించింది. ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై నిరుద్యోగ యువత భగ్గుమంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే వరకూ నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. తీరా గద్దెనెక్కి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఆ హామీ అమలుపై ఒక్క అడుగూ ముందుకు పడలేదు.
ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సైతం నిరుద్యోగ భృతికి ఎటువంటి కేటాయింపులు చేయలేదు. కొత్త ఉద్యోగాల భర్తీపై స్పష్టతా ఇవ్వలేదు. వాస్తవానికి రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికొక్కరు చొప్పున వేసుకున్నా నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతికి రూ.4,800 కోట్లు ఖర్చు చేయాలి.
అంటే ఏడాదికి సుమారు రూ.57,600 కోట్లు నిరుద్యోగుల సంక్షేమానికి ఖర్చవుతుంది. అయితే రాష్ట్రంలో 4.46 లక్షల మంది నిరుద్యోగులే ఉన్నట్టు బాబు ప్రభుత్వం వెల్లడించడం యువతను మోసగించడమేనని పలువురు చెబుతున్నారు.
ఉచిత బస్సు మరింత
దూరం..!మరోవైపు రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలను కూడా బాబు ప్రభుత్వం దగా చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్నారు. అధికారం చేపట్టి ఐదు నెలలు దాటినా ఈ హామీ అమలుపై కాలయాపన చేస్తున్నారు. దీనిపై ఇంకా మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని శాసన సభలో రాతపూర్వకంగా ప్రభుత్వం ప్రకటించింది.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం, మార్గదర్శకాలు, విధివిధానాలు అంటూ హామీ అమలును దాటవేస్తున్నారు. ఇప్పుడూ ఇదే చెప్పడంపై మహిళాలోకం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. మహిళలకు బస్ ప్రయాణం కోసం ఆర్టీసీలో ప్రత్యేక వ్యవస్థ అవసరం లేదని, ఉన్న బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశం కల్పించడానికి మార్గదర్శకాల రూపకల్పన అంటూ ఇంకెన్నాళ్లు కాలయాపన చేస్తారని నిలదీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment