దగాపడ్డ.. యువనేస్తమా! | Commissions also in the Unemployment benefit | Sakshi
Sakshi News home page

దగాపడ్డ.. యువనేస్తమా!

Published Wed, Oct 3 2018 5:00 AM | Last Updated on Wed, Oct 3 2018 7:21 AM

Commissions also in the Unemployment benefit - Sakshi

నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో నిరుద్యోగులను నిండా ముంచేసిన సీఎం చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు ఎంపిక చేసుకున్న ప్రైవేట్‌ శిక్షణ సంస్థల జేబులు నింపి కమీషన్లు కాజేసే ఎత్తుగడ వేసింది. ఇందులో భాగంగానే నిరుద్యోగులకు అరకొరగా భృతి పేరుతో మంగళవారం హడావుడి చేసింది. కనీసం కేబినెట్‌ భేటీలో ప్రకటించిన సంఖ్య ప్రకారమైనా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఆ సమావేశం నిర్ణయాలనే అపహాస్యం పాలు చేసింది. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలోని 1.70 కోట్ల కుటుంబాలకు ఉద్యోగం / నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంది. పలు దఫాలుగా నిరుద్యోగుల సంఖ్యను కుదించి వడపోసిన సర్కారు చివరకు 12 లక్షల మందికిపైగా భృతికి అర్హులని తేల్చింది. కనీసం ఈ ప్రకారమైనా భృతి ఇవ్వకపోగా 4 లక్షల మందికి మాత్రమే చెల్లిస్తామంటూ జీవో ఇచ్చింది. అయితే ఇందులోనూ సగం మంది మాత్రమే ఇప్పటిదాకా భృతికి అర్హులంటూ తేల్చడం గమనార్హం. 

మరోవైపు నిరుద్యోగులకు ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ కింద నెలకు రూ.వెయ్యి ఇస్తామంటున్న సర్కారు వారికి నైపుణ్యాల పెంపుపై శిక్షణ పేరుతో ప్రైవేట్‌ సంస్థలకు నెలకు రూ.12 వేల చొప్పున రూ.480 కోట్ల దాకా చెల్లించేందుకు సిద్ధపడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

సాక్షి, అమరావతి: గత ఎన్నికల ముందు ఇంటికో జాబు ఇస్తామని, జాబు ఇవ్వకుంటే నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగులందరికీ భృతి చెల్లిస్తామంటూ చంద్రబాబు సంతకంతో కూడిన పత్రాలను ఇంటింటికి పంపిణీ చేయడం తెలిసిందే. నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగ భృతి కింద పైసా ఇవ్వకపోగా ఇప్పుడు ఎన్నికల ముందు కేవలం నాలుగు లక్షల మందికి నెలకు రూ.వెయ్యి  చొప్పున భృతి చెల్లించేందుకు అక్టోబర్‌ నెలకు రూ.40 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. భృతి కింద నిరుద్యోగులకు నెలకు కేవలం రూ.వెయ్యి ఇవ్వనుండగా వారికి శిక్షణ ఇచ్చేందుకు ప్రైవేట్‌ సంస్థలకు మాత్రం నెలకు రూ.12,000 చెల్లించనుండటం గమనార్హం. నిరుద్యోగికి భృతి కింద నెలకు రూ.వెయ్యి మాత్రమే ఇవ్వడమేమిటో.. వారికి శిక్షణ ఇచ్చే ప్రైవేట్‌ సంస్థలకు నెలకు రూ.12,000 చొప్పున ఇవ్వడమేమిటో అర్థం కావడం లేదని, ఇదంతా చూస్తుంటే పెద్దఎత్తున దోపిడీకి తెరతీసినట్లు తెలిసిపోతోందని అధికార యంత్రాంగం వ్యాఖ్యానిస్తోంది. 

ఇవ్వాల్సింది 1.70 కోట్ల మందికి.. 
గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.70 కోట్ల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం లేదంటే నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పలు షరతులతో నిరుద్యోగ యువత సంఖ్యను భారీగా తగ్గించేసింది. తొలుత నిరుద్యోగ భృతికి 10 లక్షల మంది అర్హులని ప్రకటించింది. ఆ తర్వాత కేబినెట్‌ సమావేశంలో 12,26,333 మంది భృతికి అర్హులని తేల్చింది. అయితే ఇప్పుడు ఈ ప్రకారం కూడా నిరుద్యోగులకు భృతి ఇవ్వడం లేదు. సోమవారం వరకు 2.10 లక్షల మంది భృతికి అర్హులని తేల్చింది. 1.86 లక్షల మందికి రూ.వెయ్యి చొప్పున ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

భృతిలోనూ కమీషన్ల పర్వం..
జీవో ప్రకారం భృతి కింద 4 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.40 కోట్లు చెల్లించనుండగా వారికి శిక్షణ ఇచ్చే ప్రైవేట్‌ సంస్థలకు మాత్రం నెలకు రూ.12,000 చొప్పున రూ.480 కోట్లను సర్కారు చెల్లించనుంది. ఇక్కడ దోపిడీకి ఎత్తుగడ వేశారనేది వెల్లడవుతోందని, ఆఖరికి నిరుద్యోగుల అరకొర భృతిలోనూ కమీషన్లను వదలడం లేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి కింద పరిపాలనా వ్యయం కోసం పది శాతం నిధులను జిల్లాస్థాయిలో, మరో పది శాతం నిధులను రాష్ట్రస్థాయిలో వ్యయం చేయాలని నిర్ణయించారు. ఇక ఈ పథకం ప్రచారం కోసం ఏకంగా రూ.6.40 కోట్ల వ్యయం చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. ఇదంతా ఎన్నికల ముందు హడావిడి తప్ప నిరుద్యోగులకు ఆర్థిక సాయం, పథకాన్ని అమలు చేయాలనే చిత్తశుద్ధి కానరావడం లేదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో భృతి కోసం కేటాయించిన రూ.వెయ్యి కోట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్‌ల నుంచి వెచ్చించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.  

ప్రైవేట్‌ సంస్థలకు నెలకు రూ.12 వేలు
కేబినెట్‌లో పేర్కొన్న లెక్కల మేరకు 12.26 లక్షల మందికి నెలకు రూ.వెయ్యి చొప్పున భృతి ఇవ్వడానికి రూ.122 కోట్ల వ్యయం అవుతుందని, 6 నెలలపాటు దీన్ని అమలు చేయడానికి రూ.732 కోట్ల వ్యయమవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇక భృతి చెల్లించే 12.26 లక్షల మందికి శిక్షణ ఇచ్చేందుకు నెలకు ఒక్కో నిరుద్యోగికి రూ.12,000 చొప్పున వ్యయం అవుతుందని పేర్కొంది. అంటే ప్రైవేట్‌ సంస్థల్లో నెల పాటు శిక్షణ కోసం రూ.1,500 కోట్ల వ్యయమవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పుడు అక్టోబర్‌లో కేవలం నాలుగు లక్షల మందికే భృతి ఇచ్చేందుకు రూ.40 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నాలుగు లక్షల మందికి శిక్షణ కోసం నెలకు రూ.12,000 చొప్పున ప్రైవేట్‌ శిక్షణ సంస్థలకు ప్రభుత్వం చెల్లిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement