
నిరుద్యోగ యువతను నిట్టనిలువునా ముంచిన చంద్రబాబు సర్కారు
ఉద్యోగాలు ఇవ్వకపోగా నిరుద్యోగ భృతిపై ఆశలు చిదిమేశారు
వరుసగా రెండో ఏడాది బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా విదల్చని వైనం
ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి అంటూ ఎన్నికల్లో ప్రచారం
తీరా పీఠం ఎక్కాక ఆ విషయమే గుర్తు లేనట్లు నాటకాలు
ప్రతి నెలా రూ.5,100 కోట్లు నష్టపోతున్న నిరుద్యోగులు
నిరుద్యోగ యువతను వంచించడంలో చంద్రబాబు రికార్డులు సృష్టిస్తున్నారు. హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి వారిని దగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 1999 నుంచి 2024 వరకు ఎన్నికల వేళ అధికారం కోసం ఉద్యోగాల సృష్టి.. నిరుద్యోగ భృతి.. అంటూ ఊదరగొట్టే చంద్రబాబు.. పీఠం ఎక్కిన తర్వాత హామీల తెప్ప తగలేస్తున్నారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భృతి అమలు చేస్తారని నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు.
కానీ, చంద్రబాబు అండ్ కో సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా 2024–25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంలో తీవ్ర జాప్యం చేశారు. తాజా బడ్జెట్లోనూ నిరుద్యోగుల ఊసే విస్మరించారు. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం, లేకుంటే ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని తుంగలో తొక్కారు. కూటమి పాలనలో రెండేళ్లలో నిరుద్యోగులు రూ.1,15,200కోట్లు భృతిని నష్టపోతున్నారు. – సాక్షి, అమరావతి
ఒక్క నోటిఫికేషన్ లేదు..
రాష్ట్రంలో నిరుద్యోగులు చంద్రబాబు ఉచ్చులో పడి విలవిల్లాడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ నోటిఫికేషన్లు లేవు.
గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తే కూటమి సర్కారు వచ్చిన తర్వాత మెయిన్స్ నిర్వహించడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. 2024 జూన్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గ్రూప్–1 మెయిన్స్‌ను ఈ ఏడాది మేకి వాయిదా వేసుకుంటూ వచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్‌కు మరిన్ని పోస్టులు కలిపి ఇస్తామని చెప్పి రద్దు చేశారు.
మళ్లీ ఇప్పటి వరకు డీఎస్సీ నోటిఫికేషన్‌కు దిక్కులేదు. ఈ తొమ్మిది నెలల్లో ఒక్క నోటిఫికేషన్‌ను సరిగ్గా చేపట్టలేక చేతులెత్తేసిన ప్రభుత్వం నిరుద్యోగులకు కనీసం ఆర్థిక సాయం కింద నెలకు రూ.3 వేలు ఇవ్వకుండా మోసం చేసింది. ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించుకునేందుకు అవుట్ సోర్సింగ్, డైలీ వేజస్ వర్కర్ల ఉద్యోగాలను తొలగిస్తోంది.
ఇది చంద్రబాబుకు కొత్తేమీ కాదు..
చంద్రబాబుకు నిరుద్యోగులను మోసం చేయడం కొత్తేమీ కాదు. 2014–19 మధ్య రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, నాలుగున్నరేళ్లకు పైగా ఆ ఊసే ఎత్తేలేదు. 2017–18లో రూ.500 కోట్లు కేటాయించినా, పైసా కూడా ఇవ్వలేదు. అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో ఎన్నికలకు ముందు యువ నేస్తం పేరుతో తూతూ మంత్రంగా డ్రామా నడిపించారు.
విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి సవాలక్ష ఆంక్షలు విధించి నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను భారీగా కుదించారు. తొలుత 12 లక్షలకు పైగా నిరుద్యోగ భృతికి అర్హులుగా తేల్చగా.. ఆ తర్వాత పది లక్షలకు కుదించారు. మళ్లీ అందులో 2.10 లక్షల మందే అర్హులంటూ చెప్పారు. తీరా 1.62 లక్షల మందికే ఇస్తామని, దీనికి ఈ–కెవైసీ లింక్ పెట్టారు. తుదకు అందులోనూ కొంత మందికే నిరుద్యోగ భృతి ఇచ్చి.. అందరికీ ఇచ్చినట్లు కలరింగ్ ఇచ్చుకున్నారు.
ఏటా నిరుద్యోగులకు ఇవ్వాల్సింది రూ.57,600 కోట్లు
బడ్జెట్‌లో కేటాయించింది 0
Comments
Please login to add a commentAdd a comment