సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ ఉద్యోగాల పోస్టుల భర్తీకి ఉద్దేశించిన రాత పరీక్షలు ఆదివారం ఉదయం 10గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. సరిగ్గా 40రోజుల క్రితం జూలై 26న మొత్తం 1,26,728 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు మొత్తం 21,69,719మంది దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న ఈ రాత పరీక్షల్లో తొలిరోజు ఒక్కరోజే 15,49,941 మంది హాజరుకానున్నారు. 3వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య ఐదు రోజుల పాటు జరిగే పరీక్షలను 6,19,812 మంది రాయనున్నారు. కాగా, మొదటిరోజు మొత్తం 4,478 కేంద్రాల్లో రాతపరీక్షలు జరగనున్నాయి. జిల్లా కేంద్రాలు మినహా.. ఇతర ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాల సమీపంలోని పోలీస్‌స్టేషన్లకు శనివారం మధ్యాహ్నానికే ప్రశ్నపత్రాలను తరలించి భద్రపరిచారు. పరీక్ష ప్రారంభానికి కొద్దిసేపటి ముందు వీటిని కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయా కేంద్రాలకు తరలిస్తారు. మరోవైపు.. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ప్రశ్నాపత్రాలు భద్రపరిచిన పోలీసుస్టేషన్లతో సీసీ కెమెరాల ద్వారా అనుసంధానించి పర్యవేక్షిస్తున్నారు. కాగా, పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 2 నుంచి విధుల్లో చేరనున్నారు.
రేపటి నుంచే జవాబుపత్రాల స్కానింగ్?
ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పరీక్ష కేంద్రాల నుంచి ఏ రోజు జవాబు పత్రాలను ఆ రోజు గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక స్ట్రాంగ్ రూమ్‌కి అధికారులు తరలించనున్నారు. వినాయక చవితి కారణంగా సోమవారం సెలవు అయినప్పటికీ వీలైతే ఆ రోజు నుంచే ఓఎమ్మార్ షీట్ల స్కానింగ్ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. స్కానింగ్ ప్రక్రియ విధులలో పాల్గొనే అధికారులకు శనివారం వర్సిటీలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హాల్ టికెట్‌తోపాటు ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి
గ్రామ, వార్డు కార్యదర్శుల పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ విజయకుమార్ పలు సూచనలు చేశారు.
– పరీక్షా సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
– పరీక్ష ముగిసేంత వరకు అభ్యర్థులను బయటకు అనుమతించరు. ఎవరైనా మధ్యలో వెళ్లిపోతే వారిని అనర్హులుగా ప్రకటిస్తారు.
– హాలు టికెట్‌తోపాటు అభ్యర్థి గుర్తింపు కోసం ప్రభుత్వం జారీచేసిన ఫొటో ఆధార్ కార్డు, పాన్‌కార్డు, ఓటరు కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో ఏదో ఒకటి ఒరిజినల్ కార్డును అభ్యర్థులు తీసుకువెళ్లాలి.
– హాలు టికెట్‌లో ఫోటో సక్రమంగా లేకపోతే ఫొటోపై గజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించాలి.
– ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.
– బ్లూ లేక బ్లాక్ పెన్ మాత్రమే అనుమతిస్తారు. పెన్సిల్ లేదా జెల్‌పెన్స్, వైటనర్‌లను అనుమతించరు.
పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులందరూ ఎటువంటి వదంతులను నమ్మవద్దనీ, పూర్తిగా మెరిట్ ప్రాతిపదికనే ఈ ఉద్యోగాలన్నీ భర్తీ చేయనున్నట్లు విజయకుమార్ స్పష్టంచేశారు.
పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల సందేహాల నివృత్తికి రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ ఫోను నెంబర్లు : 9121296051, 9121296052, 9121296053, 9121296054, 9121296055
Comments
Please login to add a commentAdd a comment