valanteer posts
-
వాలంటీర్ ఆత్మహత్య! అసలేం జరిగింది??
అనంతపురం: స్థానిక 22వ వార్డు వలంటీర్ రంగనాయకులు అలియాస్ బళ్లారి (31) గురువారం సాయంత్రం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓల్డ్ సీపీఐ కాలనీలో నివాసముంటున్న ఆయనకు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. తల్లిదండ్రులు మృతి చెందారు. అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారు. బుధవారం రాత్రి జరిగిన వినాయక నిమజ్జనం సందర్భంగా అందరితో కలసి సరదాగా డ్యాన్స్‌లూ చేశారు. గురువారం సాయంత్రం తాను ఒంటరిగా నివాసముంటున్న ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
సచివాలయాల వ్యవస్థతో గ్రామ స్వరాజ్యం సాకారం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పరిపాలనలో పెను మార్పులు తెచ్చి గ్రామ స్వరాజ్యానికి నిర్వచనం చెప్పిన సచివాలయాల వ్యవస్థ ఎంతో బాగుందని, ముందుచూపుతో ఏర్పాటైన ఈ వ్యవస్థ భవిష్యత్తు తరాలకూ ఎంతో ఉపయోగకరమని ప్రజాభిప్రాయం వ్యక్తమైంది. సచివాలయాలపై పట్టణ ప్రాంత ప్రజల మనోగతం అనే అంశంపై ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ సోషల్ వర్క్ చదువుతున్న విద్యార్థిని తాటిపూడి తనూజ స్రవంతి ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కోవిడ్ సమయంలో సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పని చేసిందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు వలంటీర్ల ద్వారా చేరవేశారని తెలిపారు. సచివాలయాల్లో ఉద్యోగులు మరింత అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. అద్భుతమైన సచివాలయ వ్యవస్థ నిర్వహణలో చిన్నపాటి లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్న సూచనలు వ్యక్తమయ్యాయి. గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) 51వ వార్డులోని గాంధీనగర్ సచివాలయ పరిధిలో ఈ అధ్యయనం నిర్వహించారు. 45 ప్రశ్నలకు సచివాలయ పరిధిలోని వంద మందితో సమాధానాలు రాబట్టారు. ప్రాజెక్టు వర్క్‌ను ఏయూ వీసీ ప్రసాదరెడ్డికి ఈ నెల 28వ తేదీన విద్యార్థిని అందచేసింది. 83 మంది పురుషులు, 17 మంది మహిళలు సర్వేలో పాల్గొన్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు 9 మంది, ప్రైవేట్ ఉద్యోగులు 48 మంది, వేతన కూలీలు 24 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు. ► సచివాలయాల ఏర్పాటు మంచి నిర్ణయమని, దీనివల్ల భవిష్యత్తులోనూ ఎంతో ఉపయోగం ఉంటుందని 74 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► వారానికి ఒకసారి లేదంటే నెలకు ఒకసారైనా సచివాలయానికి వెళుతున్నట్లు 78 శాతం మంది సర్వేలో చెప్పారు. ► నవరత్నాల పథకాల గురించి సమగ్ర అవగాహన ఉందని 77 మంది పేర్కొనగా 23 మంది కొన్ని పథకాలు గుర్తున్నాయని చెప్పారు. ► అమ్మ ఒడి పథకం భేష్ అని 53 శాతం మంది వెల్లడించారు. ఇది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని తెలిపారు. ► వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ద్వారా తమ సొంతింటి కల నెరవేరిందని 62 మంది తెలిపారు. ఆ పథకానికి అర్హత లేనందున తమకు అందలేదని 38 మంది చెప్పా రు. ► 86 శాతం మందికి హెల్త్‌కార్డులుండగా 14 శాతం మంది హెల్త్ కార్డులు లేవని తెలిపారు. ► ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ పథకాలు చాలా ఉపయోగపడుతున్నాయని 64 శాతం మంది పేర్కొన్నారు. ► కోవిడ్ సమయంలో సచివాలయ సిబ్బంది తమ ఇంటిని సందర్శించారని 74 శాతం మంది పేర్కొనగా 26 శాతం మంది మాత్రం రాలేదని చెప్పారు. సచివాలయాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉందని 83 శాతం మంది తెలిపారు. ► సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉంటున్నారా? అనే ప్రశ్నకు 52 శాతం మంది అవునని పేర్కొనగా 48 శాతం మంది మాత్రం సరిగా ఉండటం లేదని చెప్పారు. వార్డు శానిటరీ సెక్రటరీ నిరంతరం విధుల్లో ఉంటున్నట్లు 32 మంది బదులిచ్చారు. ఆ తర్వాత వెల్ఫేర్ సెక్రటరీలు 18 శాతం, హెల్త్ సెక్రటరీలు 14 శాతం మంది అందుబాటులో ఉంటారని తెలిపారు. వంద మందిలో ఒక్కరు కూడా టౌన్‌ప్లానింగ్, వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీలు అందుబాటులో ఉంటున్నట్లు చెప్పలేదు. ► సచివాలయాల ద్వారా అందచేసే సేవలపై 51 శాతం మందికి అవగాహన ఉండగా 49 శాతం మంది మాత్రం పూర్తిస్థాయి అవగాహన లేదని చెప్పారు. మీ వలంటీర్ ఎవరు? తెలుసు – 89 తెలియదు – 11 మీ సచివాలయం ఎక్కడ? తెలుసు – 92 తెలియదు –08 సచివాలయాల ద్వారా ఆదాయం, నివాస దృవపత్రం పొందారా? అవును –93 లేదు –07 సచివాలయాల ద్వారా జనన, మరణ సర్టిఫికెట్లు పొందారా? అవును –86 లేదు – 14 గ్రామ స్వరాజ్యం సాకారం ఎమ్మెస్సీ సోషల్ వర్క్‌లో నా సబ్జెక్టు కమ్యూనిటీ డెవలప్మెంట్. సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుతో మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతోంది. – తాటిపూడి తనూజ స్రవంతి, ఎంఎస్సీ, సోషల్ వర్క్, ఏయూ ఇదీ చదవండి: Photo Feature: పచ్చని గిరులపై మేఘాల పల్లకి -
ఇది మనసున్న ప్రభుత్వం
సాక్షి, అమరావతి: పేద, బడుగు ప్రజల సంక్షేమం కోసం 24 గంటలు ఆలోచించే మనసున్న ప్రభుత్వం తమదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే వారికి ఆపన్న హస్తం అందించడం ద్వారా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై గురువారం శాసనసభలో సుదీర్ఘంగా జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏటా ఖర్చు చేసిన మొత్తానికి రెట్టింపు కంటే అధికంగా వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గత 18 నెలల్లో రాష్ట్రంలోని అన్ని కులాల పేద ప్రజలకు వివిధ పథకాల కింద 5.65 కోట్ల మందికి రూ.77,731.32 కోట్ల విలువైన ఆర్థిక ప్రయోజనం కల్పించినట్లు తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏటా సగటున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రూ.15,961.2 కోట్లు వ్యయం చేస్తే తమ ప్రభుత్వం రెట్టింపు కంటే ఎక్కువగా రూ.39,153 కోట్లు వ్యయం చేయడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా, ఎన్నికల ముందు సంక్షేమ పథకాలు అంటూ హడావుడి చేయడం ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తోందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. రాజకీయాలపైనే బాబు దృష్టి ► అధికారం చేపట్టిన తర్వాత పేద ప్రజలకు ఎలా సాయం చేయాలన్న ఆలోచన లేకుండా కేవలం రాజకీయాలపైనే చంద్రబాబు దృష్టి సారించారు. ఇంత కీలకమైన అంశంపై చర్చ చేపట్టినప్పుడు కూడా సూచనలు, సలహాలు ఇవ్వకుండా అబద్ధాలు మాట్లాడుతూ సభను అడ్డుకోవడం ద్వారా సస్పెండ్ అవ్వడం వరకు వెళుతున్నారు. ► ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీల అభ్యున్నతి, బాగు కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. వీటిని ఏ విధంగా ఇంకా మెరుగు పరచాలని ఆలోచిస్తున్నాం. ఈ దిశగా ప్రతిపక్షం నుంచి కూడా సూచనలు, సలహాలు తీసుకోవాలనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ కూడా ప్రతిపక్షం తీరు మారలేదు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో – ఇప్పుడు మన పాలనలో.. ► బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు చంద్రబాబు తన హయాంలో 5 ఏళ్లకు కలిపి రూ.79,806 కోట్లు ఖర్చు చేశారు. మన ప్రభుత్వం వీరి కోసం ఈ 18 నెలల కాలంలో ఏకంగా రూ.58,729 కోట్లు ఖర్చు చేసింది. చంద్రబాబుకు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వారు గుర్తుకు వస్తారు. అందుకే 2019 ఫిబ్రవరిలో బీసీ సబ్ ప్లాన్ తెచ్చాడు. అప్పుడే 13 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. పెన్షన్లు కూడా అంతే. ► ఎన్నికలకు 6 నెలల ముందు వరకు, అంటే అక్టోబర్ 2018 వరకు పెన్షన్లు కేవలం 44 లక్షలుంటే, ఎన్నికలు వచ్చే సరికి ఆ సంఖ్యను 51 లక్షలకు పెంచారు. అంటే 7 లక్షల మందికి పెన్షన్ లేదని తెలిసినా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం 61.90 లక్షలకు పైగా పెన్షన్లు ఇస్తోంది. రిజర్వేషన్లు రాకుండా చంద్రబాబు కుట్ర ► గతంలో 59.85 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నిలు జరిగాయి. అందులో 34 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యాయి. ఎన్నికలు జరపాలని 2018 అక్టోబర్ 23న హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా, తనకు అనుకూలంగా లేదని చంద్రబాబు ఎన్నికలు జరపలేదు. ► మనం అధికారంలోకి వచ్చాక ఎన్నికలకు వెళితే రిజర్వేషన్లు 50 శాతమే ఉండాలి కదా? 59.85 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారని కేసు వేయించారు. దీంతో 50 శాతం రిజర్వేషన్లతోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలకు పోవాల్సి వచ్చింది. దేనిలోనూ చిత్తశుద్ధి లేదు ► ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ బిల్లులు దాదాపు రూ.3 వేల కోట్లు బాబు బకాయిలు పెడితే, మనం చెల్లించాం. పెండింగు లేకుండా తల్లుల ఖాతాల్లో జమ చేసేలా వ్యవస్థను తీసుకువచ్చాం. ► చంద్రబాబు పొదుపు సంఘాల రుణాలు రూ.14,200 కోట్లకు పైగా మాఫీ చేస్తానని చెప్పి చేయలేదు. అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ ఇవ్వక పోవడంతో వారిపై రూ.3,036 కోట్ల భారం పడింది. మన ప్రభుత్వం వచ్చాక సున్నా వడ్డీ పథకాన్ని నిజాయితీగా అమలు చేస్తున్నాం. ఈ పథకంలో 2019–20లో అక్షరాలా రూ.1,400 కోట్లు ఇచ్చాం. ► గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ స్కూళ్ల కోసం ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేశారు. కానీ మన ప్రభుత్వం నాడు–నేడు ద్వారా రూ.10 వేల కోట్లకు పైగా వ్యయంతో 45 వేల స్కూళ్లను ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ఆధునీకరిస్తోంది. మధ్యాహ్న భోజన పథకంలో క్వాలిటీ పెంచాం. పిల్లల్లో 85 శాతం మెదడు వికాసం ఆరేళ్లలోపే జరుగుతుంది. ఈ దృష్ట్యా పిల్లలు, తల్లులు, గర్భవతులు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యం బావుండాలని వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ అని అమలు చేస్తున్నాం. అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారునికే ► ప్రవేశపెట్టిన ప్రతి పథకం సంతృప్త స్థాయిలో అర్హులందరికీ చేరాలన్నది మన ప్రభుత్వ ఆలోచన. ఇందుకని గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి 50 ఇళ్లకు వలంటీర్‌ను పెట్టాం. ఎవరైనా పథకంలో మిస్ అయితే, దరఖాస్తు తీసుకుని అర్హత ఉంటే, ఆ తర్వాత నెలలోనే ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంతో చేశాం. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో వారే నలుగురు ఉన్నారు. 60 శాతం మంత్రి పదవులు వారికే ఇచ్చాం. అణగారిన బీసీ కులాలను గుర్తించి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ఎస్సీలలో విభేదాలు రాకుండా వేర్వేరుగా మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ► రాజ్యసభకు పంపిన నలుగురిలో ఇద్దరు బీసీలు, మండలికి ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు మైనార్టీలు, ఒకరు బీసీ ఉన్నారు. కార్పొరేషన్లు, ఆలయాల చైర్మన్లు, పాలక మండళ్లు, మార్కెట్ కమిటీలలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చే విధంగా చట్టాలు చేశాం. గ్రామ సచివాలయాల్లో వారికి 82 శాతం ఉద్యోగాలు దక్కాయి. ► అక్షరాలా 1.26 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాలు, 2.61లక్షల వలంటీర్ల ఉద్యోగాలు ఆ విధంగా దాదాపు 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం. అక్కచెల్లెమ్మలకు ప్రతి అడుగులోనూ తోడుగా.. ► మహిళా పక్షపాత ప్రభుత్వంగా ప్రతి అడుగులో చూపాం. ప్రతి పథకంలో లబ్ధిదారులు అక్క చెల్లెమ్మలే. వైఎస్సార్ చేయూత ద్వారా అక్క చెల్లెమ్మల జీవితాలు మార్చేలా రిలయెన్స్, ఐటీసీ, పీ అండ్ జీ, అల్లానా, హిందుస్తాన్ యూనీ లీవర్, అమూల్ వంటి పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. రీటెయిల్ రంగంలో 77 వేల షాపులు ఏర్పాటు చేశాం. ► 4.69 లక్షల అక్క చెల్లెమ్మలకు పాడి ఆవులు, గేదెలు.. 2.49 లక్షల అక్క చెల్లెమ్మలకు మేకలు, గొర్రెల యూనిట్లు ఇస్తున్నాం. 31 లక్షల ఇళ్ల స్థలాలు నేరుగా అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. ► మహిళల కోసం దిశ చట్టం బిల్లు తీసుకొచ్చి,, దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశాం. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాం. దశలవారీ మద్య నియంత్రణ ఒక పాలసీగా అడుగులు వేశాం. 43 వేల బెల్టు షాపులు రద్దు చేశాం. వీటన్నింటి వల్ల మద్యం అమ్మకాలు తగ్గినా, ధరలు పెంచాం కాబట్టి ఆదాయం తగ్గలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి చేసిన వ్యయం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంటే జూన్ 2019 నుంచి నవంబర్ 2020 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి 58,729 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. ఇందులో ఒక్క ఏడాదిలో వ్యయం చేసినది రూ.39,153 కోట్లు. అదే టీడీపీ ప్రభుత్వం ఏడాదికి సగటున ఆ వర్గాల సంక్షేమానికి ఖర్చు చేసింది కేవలం రూ.15,962 కోట్లే. -
టీడీపీ వర్గీయుల బరితెగింపు
అనంతపురం, పెద్దపప్పూరు: తెలుగుదేశం వర్గీయులు బరితెగించారు. అర్హతలేకపోయినా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద రూ.24వేలు లబ్ధి పొందేందుకు ఏకంగా వలంటీర్‌ను బెదిరించి మరీ దరఖాస్తులో సంతకాలు చేయించుకున్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నరసాపురంలో గ్రామ వలంటీర్ ఉక్కీసల నాగేష్ వద్దకు గురువారం సాయంత్రం జేసీ సోదరుల ముఖ్య అనుచరులైన టీడీపీ నాయకులు రామాంజులరెడ్డి, భాస్కర్‌రెడ్డిల వర్గీయులు ఇద్దరు వెళ్లి తమకు ‘నేతన్న నేస్తం’ వర్తింపజేయాలని బెదిరించి మరీ దరఖాస్తులో సంతకాలు చేయించుకున్నారు. విషయం కాస్తా వైఎస్సార్సీపీ నాయకులకు తెలియడంతో వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు శుక్రవారం ఆ గ్రామాన్ని సందర్శించి వివరాలు ఆరా తీశారు. టీడీపీ నాయకుల బెదిరింపులకు భయపడిపోయిన వలంటీర్ వారిపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. -
నేటి నుంచే ‘సచివాలయ’ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ ఉద్యోగాల పోస్టుల భర్తీకి ఉద్దేశించిన రాత పరీక్షలు ఆదివారం ఉదయం 10గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. సరిగ్గా 40రోజుల క్రితం జూలై 26న మొత్తం 1,26,728 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు మొత్తం 21,69,719మంది దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న ఈ రాత పరీక్షల్లో తొలిరోజు ఒక్కరోజే 15,49,941 మంది హాజరుకానున్నారు. 3వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య ఐదు రోజుల పాటు జరిగే పరీక్షలను 6,19,812 మంది రాయనున్నారు. కాగా, మొదటిరోజు మొత్తం 4,478 కేంద్రాల్లో రాతపరీక్షలు జరగనున్నాయి. జిల్లా కేంద్రాలు మినహా.. ఇతర ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాల సమీపంలోని పోలీస్స్టేషన్లకు శనివారం మధ్యాహ్నానికే ప్రశ్నపత్రాలను తరలించి భద్రపరిచారు. పరీక్ష ప్రారంభానికి కొద్దిసేపటి ముందు వీటిని కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయా కేంద్రాలకు తరలిస్తారు. మరోవైపు.. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ప్రశ్నాపత్రాలు భద్రపరిచిన పోలీసుస్టేషన్లతో సీసీ కెమెరాల ద్వారా అనుసంధానించి పర్యవేక్షిస్తున్నారు. కాగా, పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 2 నుంచి విధుల్లో చేరనున్నారు. రేపటి నుంచే జవాబుపత్రాల స్కానింగ్? ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పరీక్ష కేంద్రాల నుంచి ఏ రోజు జవాబు పత్రాలను ఆ రోజు గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక స్ట్రాంగ్ రూమ్‌కి అధికారులు తరలించనున్నారు. వినాయక చవితి కారణంగా సోమవారం సెలవు అయినప్పటికీ వీలైతే ఆ రోజు నుంచే ఓఎమ్మార్ షీట్ల స్కానింగ్ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. స్కానింగ్ ప్రక్రియ విధులలో పాల్గొనే అధికారులకు శనివారం వర్సిటీలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హాల్ టికెట్‌తోపాటు ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి గ్రామ, వార్డు కార్యదర్శుల పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ విజయకుమార్ పలు సూచనలు చేశారు. – పరీక్షా సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. – పరీక్ష ముగిసేంత వరకు అభ్యర్థులను బయటకు అనుమతించరు. ఎవరైనా మధ్యలో వెళ్లిపోతే వారిని అనర్హులుగా ప్రకటిస్తారు. – హాలు టికెట్‌తోపాటు అభ్యర్థి గుర్తింపు కోసం ప్రభుత్వం జారీచేసిన ఫొటో ఆధార్ కార్డు, పాన్‌కార్డు, ఓటరు కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో ఏదో ఒకటి ఒరిజినల్ కార్డును అభ్యర్థులు తీసుకువెళ్లాలి. – హాలు టికెట్లో ఫోటో సక్రమంగా లేకపోతే ఫొటోపై గజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించాలి. – ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. – బ్లూ లేక బ్లాక్ పెన్ మాత్రమే అనుమతిస్తారు. పెన్సిల్ లేదా జెల్‌పెన్స్, వైటనర్‌లను అనుమతించరు. పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులందరూ ఎటువంటి వదంతులను నమ్మవద్దనీ, పూర్తిగా మెరిట్ ప్రాతిపదికనే ఈ ఉద్యోగాలన్నీ భర్తీ చేయనున్నట్లు విజయకుమార్ స్పష్టంచేశారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల సందేహాల నివృత్తికి రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ ఫోను నెంబర్లు : 9121296051, 9121296052, 9121296053, 9121296054, 9121296055 -
వీవీల నియామకానికి గ్రీన్‌సిగ్నల్
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు విద్యావాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే వీవీల నియామకం చేపట్టాల ని భావించినప్పటికీ ఉపాధ్యాయుల బదిలీల కారణంగా ఆలస్యమైంది. విద్యాశాఖ అధికా రులు ముందస్తుగా మండలాల వారీగా అవసరమైన విద్యావాలంటీర్ల వివరాలు తెప్పించుకున్నారు. ప్రస్తుతం ఈ వివరాలు మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరోమారు ఎంఈవోల నుంచి ఖాళీల వివరాలను తెప్పించుకునే పనిలో నిమగ్నమయ్యారు. స్కూల్ అసిస్టెంట్లు విధుల్లో చేరినప్పటికీ.. ఎస్జీటీల బదిలీ ప్రక్రియ బుధవారం రాత్రితో ముగిసినందున వారు విధుల్లో చేరితేగానీ లెక్క పక్కాగా తేలదని అధికారులు చెబుతున్నారు. ఏ పాఠశాలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఎంఈవోలు గుర్తించి పంపించాలంటే ఒకటి రెండు రోజులైనా పట్టవచ్చని అంటున్నారు. ఖాళీల వివరాలను బట్టి నియామక ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు ఖాళీలు తేలకముందే విద్యాశాఖ వీవీల నియామకాలకు ఉత్తర్వులు జారీ చేయడంతో గందరగోళంగా మారింది. జిల్లాలో బదిలీలకు ముందు విద్యాశాఖ అధికారులు ఖాళీల వివరాలను ఇదివరకే గుర్తించారు. ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్న చోట, ఉసాధ్యాయులు సెలవులు పెట్టిన చోట, ఇతర కారణాలతో సెలవులపై వెళ్లిన ఉపాధ్యాయుల స్థానంలో 152 ఎస్జీటీ, 100 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని గుర్తించారు. ఈ ఖాళీలను వీవీలతో భర్తీ చేయాలని ముందుగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలు జరగడంతో ఖాళీల సంఖ్య మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బదిలీ ఉపాధ్యాయులందరు విధుల్లో చేరితే గానీ ఖచ్చితమైన ఖాళీల సంఖ్య తేలదని చెబుతున్నారు. బదిలీల తర్వాత ఉన్న ఖాళీల వివరాలను అందజేయాలని బుధవారం రాత్రి ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరావు ఎంఈవోలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. గురువారం రాత్రి వరకు ఖాళీల లెక్క తేలుతుందని భావించినా స్పష్టత రాలేదు. ఇదీ షెడ్యూల్ విద్యావాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. శుక్రవారం నుంచి ఈనెల 16వరకు దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరించనున్నారు. అనంతరం హార్డ్‌కాపీలను ఎంఈవో కార్యాలయంలో సమర్పించాలి. ఎంఈవోలు వాటిని పరిశీలించి ఈ నెల 17లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలి. 18న అభ్యర్థులను ఎంపిక చేసి కలెక్టర్ అమోదం పొందుతారు. 19న పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాలు నిర్వహింస్తారు. విద్యావాలంటీర్లు 20వ తేదీన విధుల్లో చేరాల్సి ఉంటుంది. -
విద్యావలంటీర్ల నియామకం పూర్తి
కొందుర్గు : మండలంలోని వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో ప్రభుత్వం మెరిట్‌ను ఆధారంగా తీసుకొని విద్యావలంటీర్లను నియమించిందని ఎంఈఓ కిష్టారెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ స్థానాల్లో లక్ష్మికాంత్, ప్రమోద్‌కుమార్, వి.కృష్ణయ్య ఎంపికయ్యారన్నారు. ఎస్జీటీ పోస్టుల్లో బి.మంజులత, కె.కృష్ణవేణి, షహేదా, బిస్మిల్లాబేగమ్, అబ్దుల్ మతీన్, సి.సరిత, మర్రి మాలతి, రాధ, ఎం. గోవింద్, బోడంపాటి జ్యోతి, ఎం.ప్రియాంక, బోయపల్లి రాహుల్, బోయ చెన్నయ్య, బైరంపల్లి రజిత, టి.వెంకటేష్, సి.ప్రీతిక, పి.కిషన్ నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎంపికైన వలంటీర్లు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో బుధవారం ఉదయం 10 గంటలకు ఎమ్మార్సీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. మధ్యాహ్నాం తమకు కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరాలని తెలిపారు.