సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పరిపాలనలో పెను మార్పులు తెచ్చి గ్రామ స్వరాజ్యానికి నిర్వచనం చెప్పిన సచివాలయాల వ్యవస్థ ఎంతో బాగుందని, ముందుచూపుతో ఏర్పాటైన ఈ వ్యవస్థ భవిష్యత్తు తరాలకూ ఎంతో ఉపయోగకరమని ప్రజాభిప్రాయం వ్యక్తమైంది. సచివాలయాలపై పట్టణ ప్రాంత ప్రజల మనోగతం అనే అంశంపై ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ సోషల్ వర్క్ చదువుతున్న విద్యార్థిని తాటిపూడి తనూజ స్రవంతి ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కోవిడ్ సమయంలో సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పని చేసిందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు వలంటీర్ల ద్వారా చేరవేశారని తెలిపారు. సచివాలయాల్లో ఉద్యోగులు మరింత అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. అద్భుతమైన సచివాలయ వ్యవస్థ నిర్వహణలో చిన్నపాటి లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్న సూచనలు వ్యక్తమయ్యాయి. గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) 51వ వార్డులోని గాంధీనగర్ సచివాలయ పరిధిలో ఈ అధ్యయనం నిర్వహించారు. 45 ప్రశ్నలకు సచివాలయ పరిధిలోని వంద మందితో సమాధానాలు రాబట్టారు. ప్రాజెక్టు వర్క్‌ను ఏయూ వీసీ ప్రసాదరెడ్డికి ఈ నెల 28వ తేదీన విద్యార్థిని అందచేసింది. 83 మంది పురుషులు, 17 మంది మహిళలు సర్వేలో పాల్గొన్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు 9 మంది, ప్రైవేట్ ఉద్యోగులు 48 మంది, వేతన కూలీలు 24 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు.
► సచివాలయాల ఏర్పాటు మంచి నిర్ణయమని, దీనివల్ల భవిష్యత్తులోనూ ఎంతో ఉపయోగం ఉంటుందని 74 శాతం మంది అభిప్రాయపడ్డారు.
► వారానికి ఒకసారి లేదంటే నెలకు ఒకసారైనా సచివాలయానికి వెళుతున్నట్లు 78 శాతం మంది సర్వేలో చెప్పారు.
► నవరత్నాల పథకాల గురించి సమగ్ర అవగాహన ఉందని 77 మంది పేర్కొనగా 23 మంది కొన్ని పథకాలు గుర్తున్నాయని చెప్పారు.
► అమ్మ ఒడి పథకం భేష్ అని 53 శాతం మంది వెల్లడించారు. ఇది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని తెలిపారు.
► వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ద్వారా తమ సొంతింటి కల నెరవేరిందని 62 మంది తెలిపారు. ఆ పథకానికి అర్హత లేనందున తమకు అందలేదని 38 మంది చెప్పా రు.
► 86 శాతం మందికి హెల్త్‌కార్డులుండగా 14 శాతం మంది హెల్త్ కార్డులు లేవని తెలిపారు.
► ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ పథకాలు చాలా ఉపయోగపడుతున్నాయని 64 శాతం మంది పేర్కొన్నారు.
► కోవిడ్ సమయంలో సచివాలయ సిబ్బంది తమ ఇంటిని సందర్శించారని 74 శాతం మంది పేర్కొనగా 26 శాతం మంది మాత్రం రాలేదని చెప్పారు. సచివాలయాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉందని 83 శాతం మంది తెలిపారు.
► సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉంటున్నారా? అనే ప్రశ్నకు 52 శాతం మంది అవునని పేర్కొనగా 48 శాతం మంది మాత్రం సరిగా ఉండటం లేదని చెప్పారు. వార్డు శానిటరీ సెక్రటరీ నిరంతరం విధుల్లో ఉంటున్నట్లు 32 మంది బదులిచ్చారు. ఆ తర్వాత వెల్ఫేర్ సెక్రటరీలు 18 శాతం, హెల్త్ సెక్రటరీలు 14 శాతం మంది అందుబాటులో ఉంటారని తెలిపారు. వంద మందిలో ఒక్కరు కూడా టౌన్‌ప్లానింగ్, వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీలు అందుబాటులో ఉంటున్నట్లు చెప్పలేదు.
► సచివాలయాల ద్వారా అందచేసే సేవలపై 51 శాతం మందికి అవగాహన ఉండగా 49 శాతం మంది మాత్రం పూర్తిస్థాయి అవగాహన లేదని చెప్పారు.
మీ వలంటీర్ ఎవరు?
- తెలుసు – 89
- తెలియదు – 11
మీ సచివాలయం ఎక్కడ?
- తెలుసు – 92
- తెలియదు –08
సచివాలయాల ద్వారా ఆదాయం, నివాస దృవపత్రం పొందారా?
- అవును –93
- లేదు –07
సచివాలయాల ద్వారా జనన, మరణ సర్టిఫికెట్లు పొందారా?
- అవును –86
- లేదు – 14
గ్రామ స్వరాజ్యం సాకారం
ఎమ్మెస్సీ సోషల్ వర్క్‌లో నా సబ్జెక్టు కమ్యూనిటీ డెవలప్‌మెంట్. సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుతో మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతోంది.
– తాటిపూడి తనూజ స్రవంతి, ఎంఎస్సీ, సోషల్ వర్క్, ఏయూ
ఇదీ చదవండి: Photo Feature: పచ్చని గిరులపై మేఘాల పల్లకి
Comments
Please login to add a commentAdd a comment