మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు విద్యావాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే వీవీల నియామకం చేపట్టాల ని భావించినప్పటికీ ఉపాధ్యాయుల బదిలీల కారణంగా ఆలస్యమైంది. విద్యాశాఖ అధికా రులు ముందస్తుగా మండలాల వారీగా అవసరమైన విద్యావాలంటీర్ల వివరాలు తెప్పించుకున్నారు. ప్రస్తుతం ఈ వివరాలు మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరోమారు ఎంఈవోల నుంచి ఖాళీల వివరాలను తెప్పించుకునే పనిలో నిమగ్నమయ్యారు.
స్కూల్ అసిస్టెంట్లు విధుల్లో చేరినప్పటికీ.. ఎస్జీటీల బదిలీ ప్రక్రియ బుధవారం రాత్రితో ముగిసినందున వారు విధుల్లో చేరితేగానీ లెక్క పక్కాగా తేలదని అధికారులు చెబుతున్నారు. ఏ పాఠశాలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఎంఈవోలు గుర్తించి పంపించాలంటే ఒకటి రెండు రోజులైనా పట్టవచ్చని అంటున్నారు. ఖాళీల వివరాలను బట్టి నియామక ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు ఖాళీలు తేలకముందే విద్యాశాఖ వీవీల నియామకాలకు ఉత్తర్వులు జారీ చేయడంతో గందరగోళంగా మారింది.
జిల్లాలో బదిలీలకు ముందు విద్యాశాఖ అధికారులు ఖాళీల వివరాలను ఇదివరకే గుర్తించారు. ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్న చోట, ఉసాధ్యాయులు సెలవులు పెట్టిన చోట, ఇతర కారణాలతో సెలవులపై వెళ్లిన ఉపాధ్యాయుల స్థానంలో 152 ఎస్జీటీ, 100 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని గుర్తించారు. ఈ ఖాళీలను వీవీలతో భర్తీ చేయాలని ముందుగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలు జరగడంతో ఖాళీల సంఖ్య మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
బదిలీ ఉపాధ్యాయులందరు విధుల్లో చేరితే గానీ ఖచ్చితమైన ఖాళీల సంఖ్య తేలదని చెబుతున్నారు. బదిలీల తర్వాత ఉన్న ఖాళీల వివరాలను అందజేయాలని బుధవారం రాత్రి ఇన్‌చార్జి డీఈవో వెంకటేశ్వరావు ఎంఈవోలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. గురువారం రాత్రి వరకు ఖాళీల లెక్క తేలుతుందని భావించినా స్పష్టత రాలేదు.
ఇదీ షెడ్యూల్
విద్యావాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. శుక్రవారం నుంచి ఈనెల 16వరకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. అనంతరం హార్డ్‌కాపీలను ఎంఈవో కార్యాలయంలో సమర్పించాలి. ఎంఈవోలు వాటిని పరిశీలించి ఈ నెల 17లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలి. 18న అభ్యర్థులను ఎంపిక చేసి కలెక్టర్ అమోదం పొందుతారు. 19న పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాలు నిర్వహింస్తారు. విద్యావాలంటీర్లు 20వ తేదీన విధుల్లో చేరాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment