సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్న వారికి కాస్త ఊరటనిచ్చే అంశమిది. గడచిన నాలుగు వారాల్లో దేశంలో దాదాపు 2 లక్షల ఉద్యోగాల భర్తీకి పలు కంపెనీలు నోటిఫికేషన్లు ఇచ్చాయి. సంక్షోభానంతర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కార్యకలాపాల విస్తృతిని దృష్టిలో ఉంచుకుని నియామక ప్రక్రియ చేపడుతున్నాయి. దేశంలో కంపెనీల ఉద్యోగాల నియామక ప్రణాళికలను ప్రముఖ స్టాఫింగ్ సొల్యూషన్స్ కంపెనీ ‘ఎక్స్ ఫినో’ నివేదిక వెల్లడించింది. లాక్‌డౌన్ సమయం లోనూ పలు కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాయని విశ్లేషించింది.
2 లక్షల జాబ్ ఓపెనింగ్స్
► ఎక్స్ ఫినో నివేదిక ప్రకారం.. గత 4 వారాల్లో దేశంలోని పలు కంపెనీలు దాదాపు 2 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాయి.
► వాటిలో 80 వేల ఉద్యోగాలను కొత్తగా డిగ్రీలు పొందిన ఫ్రెషర్స్‌తో భర్తీ చేయాలని నిర్ణయించాయి.
► మరో 80 వేల ఉద్యోగాలు మిడ్ సీనియర్ స్థాయిలోనివి. అంటే ఇతర కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉన్నవారితో భర్తీ చేసేందుకు ఉద్దేశించినవి.
► మొత్తంగా 91% ఫుల్‌టైమ్ ఉద్యోగాలే. మిగిలినవి కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు.
► 2 లక్షల ఉద్యోగాల్లో 25 శాతం అంటే 50 వేల మందికి గత వారంలో నియామక ఉత్తర్వులు కూడా అందాయి.
► కొత్తగా ఉద్యోగులను నియమించుకున్న వాటిలో గూగుల్, టెక్ మహీంద్ర, ఐబీఎం, కేప్ జెమిని, డెలాయిట్, జేపీ మోర్గాన్, అమెజాన్, వాల్ మార్ట్ ల్యాబ్స్, వీఎంవేర్, ఫ్లిప్ కార్ట్, బైజూస్, గ్రోఫెర్స్, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలున్నాయి.
► కొత్తగా నియమించిన ఉద్యోగాల్లో 79 శాతం ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల్లోనే ఉన్నాయి. 15 శాతం ఉద్యోగాలు బ్యాంకింగ్, ఇతర ఆర్థిక సేవా రంగాల్లో లభించాయి. 16 శాతం ఇతర రంగాల్లోని కంపెనీలు భర్తీ చేసుకున్నాయి. అత్యధికంగా 20 శాతం ఉద్యోగ నియామకాలతో బెంగళూరులోని కంపెనీలు మొదటి స్థానంలో నిలిచాయి. 8 శాతం ఉద్యోగాల భర్తీతో రెండో స్థానంలో ఢిల్లీ, 7 శాతం ఉద్యోగాల భర్తీతో మూడో స్థానంలో చెన్నై ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment