ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య యజ్ఞం | CM YS Jagan Says Replacement of 39000 posts in medical sector | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య యజ్ఞం

Published Wed, Apr 13 2022 2:38 AM | Last Updated on Wed, Apr 13 2022 7:44 AM

CM YS Jagan Says Replacement of 39000 posts in medical sector - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైద్య, ఆరోగ్య రంగంలో 39,000 పోస్టుల భర్తీని చేపట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం, పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల వరకు ఆధునికీకరణ, వైద్య ఆరోగ్య రంగంలో నాడు – నేడు ద్వారా మెరుగైన వసతుల కల్పనకు రూ.16 వేల కోట్లకు పైగా వెచ్చిస్తున్నట్లు చెప్పారు. దశాబ్దాలుగా మార్పులకు నోచుకోని విద్య, వైద్యం తదితర రంగాల్లో వ్యవస్థలను మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు.

ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, గృహ నిర్మాణం తదితర కీలక రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు చరిత్రాత్మకమన్నారు. వైద్య, ఆరోగ్య రంగంపై సీఎం జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ ఆసుపత్రులలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్‌ మోడల్‌ను ఈ సందర్భంగా పరిశీలించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..
డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ ఆసుపత్రులలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్‌ మోడల్‌ను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రి విడదల రజిని 

ఆరోగ్యశ్రీ సేవలపై బోర్డులు
విలేజ్, వార్డు క్లినిక్స్‌ దగ్గర నుంచి టీచింగ్‌ ఆస్పత్రుల వరకూ నాడు– నేడు కింద పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆరోగ్యశ్రీలో ఎలాంటి పెండింగ్‌ బిల్లులు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామన్నారు. ఇప్పటివరకు దాదాపు రూ.5,200 కోట్లు వ్యయం చేసినట్లు చెప్పారు. గత సర్కారు బకాయి పెట్టిన రూ.680 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులను కూడా అధికారంలోకి రాగానే చెల్లించామన్నారు.

రోగులను ఆర్థికంగా ఆదుకునేందుకు శస్త్ర చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటి వెళ్లే సమయంలో ఆరోగ్య ఆసరా ద్వారా డబ్బులు కూడా ఇస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్సల సంఖ్యను గణనీయంగా పెంచామన్నారు. మరింత సులువుగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలను పొందేలా సూచనలతో సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీలో అవసరం మేరకు ప్రొసీజర్లను పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు.

యజ్ఞంలా పనిచేద్దాం..
రాష్ట్రంలో వైద్య సేవలను బలోపేతం చేసేందుకు కొత్తగా 16 టీచింగ్‌ ఆస్పత్రులను నెలకొల్పుతున్నామని సీఎం జగన్‌ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలున్న మందులు ఇస్తున్నామన్నారు. భారీ మార్పులను ఆశించి అందుకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుని విద్య, వైద్యం సహా కీలక రంగాలపై అత్యంత శ్రద్ధ వహిస్తూ అనుభవం, సమర్థత ఉన్న అధికారులను ఆయా శాఖలకు కేటాయించామన్నారు. ముఖ్యమంత్రిగా తాను నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు యజ్ఞంలా అధికారులు పని చేయాలని సూచించారు. శాఖాధిపతులు, సిబ్బంది దీన్ని చాలెంజ్‌గా స్వీకరించి ఆశించిన మార్పుల సాధనకు కృషి చేయాలన్నారు.

మే నెలాఖరుకు పోస్టుల భర్తీ పూర్తి 
వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సమీక్షలో ముఖ్యమంత్రి ఆరా తీశారు. మే నెలాఖరు నాటికి అన్ని నియామకాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఇందులో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించేందుకు పెద్ద సంఖ్యలో డాక్టర్లను నియమిస్తున్నామని, వైద్యులకు ఇచ్చే జీతాల విషయంలో ఎలాంటి రాజీపడకూడదని సూచించారు. ప్రజలకు కచ్చితంగా వైద్యుల సేవలు అందుబాటులో ఉండేలా గతంలో జీతాలు పెంచుతూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అందుకనే ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై నిషేధం విధించామన్నారు.
 
నిర్మాణాల్లో ఎక్కడా రాజీపడొద్దు
ఆస్పత్రుల్లో నాడు– నేడు పనులు, విలేజ్‌ క్లినిక్స్, వార్డు క్లినిక్స్‌ నిర్మాణం, కొత్త పీహెచ్‌సీలు, మెడికల్‌ కాలేజీల నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సమీక్షిస్తూ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. వసతులు, సౌకర్యాలకు సంబంధించి ఎక్కడా లోటు రాకూడదన్నారు. 

జోరుగా 6 కొత్త మెడికల్‌ కాలేజీల పనులు
పలాస కిడ్నీ ఆస్పత్రి, కడప సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, గిరిజన ప్రాంతాల్లో స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణాల ప్రగతి గురించి సమీక్షలో అధికారులు వివరించారు. 16 కొత్త మెడికల్‌ కాలేజీల్లో 6 చోట్ల జోరుగా నిర్మాణాలు సాగుతున్నాయని చెప్పారు. పులివెందుల, పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల, విజయనగరం, అమలాపురం మెడికల్‌ కాలేజీల నిర్మాణాల ప్రగతిని తెలియచేశారు. మిగిలిన చోట్ల మే 15 నాటికల్లా మెడికల్‌ కాలేజీల నిర్మాణ పనులు ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారు. కేంద్రం నుంచి అనుమతులపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.
 
పరిశుభ్రతకు పెద్దపీట
ఆస్పత్రుల్లో సౌకర్యాలు, సదుపాయాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆస్పత్రి నిర్వహణ పరిశుభ్రంగా ఉందా? లేదా? అన్నదానిపై పరిశీలన చేయాలన్నారు. టాయిలెట్ల దగ్గర నుంచి ప్రతి విభాగం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 

పాజిటివ్‌ కేసులు ఐదే
రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు కేవలం ఐదు మాత్రమే ఉన్నాయని, డైలీ యాక్టివిటీ రేటు 0.13 శాతానికి పడిపోయిందని అధికారులు తెలిపారు. 4,30,81,428 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తైనట్లు వెల్లడించారు. 15 – 17 ఏళ్ల వారికి వంద శాతం రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తైంది. 12 – 14 ఏళ్ల వారికి మొదటిడోసు 94.47 శాతం వ్యాక్సిన్లు ఇచ్చారు. సమీక్షలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ సమీర్‌శర్మ, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్‌ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ, ఎండీ డి.మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య మిత్రలకూ ప్రోత్సాహకాలు 
ప్రతిభ ఆధారంగా వలంటీర్ల మాదిరిగా ఆరోగ్య మిత్రలకు కూడా నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షలో ఆదేశించారు. దీనిద్వారా ఆరోగ్య మిత్రల సేవలను గుర్తించినట్లు అవుతుందన్నారు. ఏడాదిలో ఒక రోజు ఎంపిక చేసి నగదు ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement