New Infrastructure For Government Hospitals In Andhra Pradesh, Details Inside - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: మా ఆస్పత్రి మారింది

Published Mon, Mar 7 2022 3:40 AM | Last Updated on Mon, Mar 7 2022 2:00 PM

Better treatment in government hospitals in Andhra Pradesh - Sakshi

కృష్ణా జిల్లా తాళ్లపాలెం పీహెచ్‌సీకి వైద్యం కోసం వచ్చిన రోగులు

రాష్ట్రంలో ప్రజారోగ్యానికి మంచి రోజులొచ్చాయి. ప్రభుత్వ వైద్య రంగంలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మౌలిక వసతులకు ఏ కొరతా లేకుండా నాడు–నేడు కింద ఆస్పత్రులు సకల హంగులతో రూపు మార్చుకుంటున్నాయి. ప్రాథమిక ఆరోగ్య రంగం బలోపేతం అయిందని ఏ మారుమూల గ్రామంలోకి వెళ్లి.. 

ఏ పీహెచ్‌సీని చూసినా ఇట్టే తెలుస్తోంది. 
ఇది వరకు ఆయా గ్రామాల్లోని ఆస్పత్రులు ఎప్పుడు తెరుచుకునేవో.. ఎప్పుడు వైద్యుడుంటాడో ఎవరికీ తెలిసేది కాదు. వైద్యుడి సంగతి అటుంచితే కనీసం నర్సు కూడా అందుబాటులో లేని దుస్థితి ఇప్పుడు సమూలంగా మారిపోయింది. ఆరోగ్య పరంగా ఏ చిన్న సమస్య వచ్చినా నిమిషాల వ్యవధిలో వైద్యం అందుతోందని గ్రామీణ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.   

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరుకు చెందిన ఎస్‌.శిరీషది మధ్యతరగతి కుటుంబం. ఇటీవల ఇంటి వద్ద ఆడుకుంటుండగా శిరీష కుమారుడిని కుక్క కరిచింది. పిల్లవాడికి ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యాంటీ రేబీస్‌ వ్యాక్సిన్‌ వేయించడానికి వచ్చారు. వైద్య సిబ్బంది వేగంగా వివరాలు నమోదు చేసుకుని టీకా వేశారు. 15 నిమిషాల్లో వైద్య ప్రక్రియ ముగించారు. ఈ నేపథ్యంలో పీహెచ్‌సీలో వైద్య సేవలపై ఆమెను ప్రశ్నించగా.. ‘ఈ మధ్యే మా ఆస్పత్రి మారింది. కొన్నేళ్ల క్రితం ఇలా ఉండేది కాదు. ఆస్పత్రి లోపలంతా అపరిశుభ్ర వాతావరణం ఉండేది. రోగులు కూర్చోడానికి వీలుండదు.

తాగునీరు, మరుగుదొడ్లు కూడా ఉండేవి కాదు. సిబ్బంది కొరత ఉండేది. చిన్న చిన్న జబ్బులకు, వైద్య పరీక్షలకు కంకిపాడు ప్రభుత్వాస్పత్రికి రిఫర్‌ చేసే వారు. అక్కడికి వెళ్లినా లాభం ఉండేది కాదు. దీంతో 20 కిలోమీటర్ల మేర ప్రయాణించి వ్యయ ప్రయాసల కోర్చి విజయవాడకు వెళ్లే వాళ్లం. కుక్క కరిచి ఎవరైనా వస్తే ఇక్కడ టీకాలు ఉండేవి కావు. ఇక్కడి నుంచి కంకిపాడుకు వెళితే.. అక్కడా కొన్ని సార్లు టీకాలు ఉండవు. దీంతో విజయవాడకు వెళ్లక తప్పేది కాదు. కానీ ప్రస్తుతం ఆస్పత్రిని బాగా అభివృద్ధి చేశారు. తగినన్ని మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య సమస్యలకు బయటకు వెళ్లే అవస్థ తప్పింది’ అని శిరీష సంతోషం వ్యక్తం చేశారు. 

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు పీహెచ్‌సీలో గతంలో కేవలం ఒకే ఒక్క నర్సు తప్ప ఎవరూ ఉండే వారు కాదని.. ఒంట్లో బాగోలేదని చూపించుకోవడానికి ఆస్పత్రికి వచ్చిన కె.శ్యామ్‌ చెప్పాడు. ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం కింద ఆస్పత్రిని బాగా అభివృద్ధి చేసిందన్నాడు. ఇప్పుడు ముగ్గురు నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్, ఎంఎన్‌వో/ఎఫ్‌ఎన్‌వో, ఇతర సిబ్బంది ఉన్నారన్నాడు. ‘గతంలో డాక్టర్లు వేళకు వచ్చే వారు కాదు. వచ్చినప్పుడు కొద్దిసేపు ఉండి వెళ్లిపోయేవారు. దీంతో వైద్యం కోసం వచ్చిన వాళ్లు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఈ కష్టాలు పడలేక కంకిపాడు, విజయవాడకు వెళ్లాల్సి వచ్చేది. చాలా మంది ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లేవారు. ఇప్పుడా బాధలన్నీ తప్పాయి’ అని తెలిపాడు.      
    – సాక్షి, అమరావతి

అనూహ్య రీతిలో వసతుల కల్పన 
ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్‌ సహా 12 మంది స్టాఫ్‌ ప్యాట్రన్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం భారీగా నియామకాలు చేపట్టింది. కృష్ణా జిల్లా ఉప్పులూరు పీహెచ్‌సీనే తీసుకుంటే ఇద్దరు నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్, ఎఫ్‌ఎన్‌వో, ఫార్మసిస్ట్‌ పోస్టులు భర్తీ అయ్యాయి. అన్ని వసతులు కల్పించారు. దీంతో ఓపీ (ఔట్‌ పేషెంట్‌) సంఖ్య పెరిగింది. త్వరలో దీనికి నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ (ఎన్‌క్వాస్‌) గుర్తింపు రానుంది.

యూపీహెచ్‌సీల్లోనూ ఉత్తమ వైద్యం 
గతంలో 259 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్‌సీ) ఉండేవి. ప్రస్తుతం ఈ కేంద్రాలకు అదనంగా మరో 301 కేంద్రాలు.. మొత్తంగా 560 వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి కేంద్రానికి సొంతంగా భవనం ఉండేలా చర్యలు తీసుకుంటోంది. నాడు–నేడులో భాగంగా కొత్త భవనాలు, మరమ్మతుల కోసం రూ.399.2 కోట్లు ఖర్చు చేస్తోంది. 499 మంది వైద్యులను ఇప్పటికే నియమించారు. ఇతర సిబ్బందిని నియమిస్తున్నారు.  

ప్రస్తుతం 10 పడకలతో ఇన్‌ పేషెంట్‌ విభాగం అందుబాటులోకి వచ్చింది. పీహెచ్‌సీల తరహాలోనే యూపీహెచ్‌సీల్లోనూ డాక్టర్లు, నర్సులు, సిబ్బంది, మందులు, వైద్య పరీక్షలకు కొరత లేకుండా  చర్యలు తీసుకుంది.  కాగా, రూ.16,255 కోట్ల భారీ నిధులతో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్‌ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన.. 16 కొత్త మెడికల్‌ కళాశాలల నిర్మాణం, 5 గిరిజన మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు మరికొన్ని ఆస్పత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 

రూ.663 కోట్లతో నాడు–నేడు  
పీహెచ్‌సీల బలోపేతానికి ప్రస్తుత ప్రభుత్వం నాడు–నేడు కింద రూ.663 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,145 పీహెచ్‌సీలు ఉండగా, 1,125 ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులు చేపడుతున్నారు. 977 పీహెచ్‌సీలకు మరమ్మతులు, 148 పీహెచ్‌సీలకు కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే 580 పీహెచ్‌సీలలో మరమ్మతులు, వసతుల కల్పన పూర్తయింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లోపు మరమ్మతులు, వచ్చే ఏడాది జూన్‌లోపు కొత్త భవనాల నిర్మాణం పూర్తి కానుంది. నాడు–నేడు కింద జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వసతులు కల్పిస్తున్నారు. దీంతో దేశంలోనే అత్యధిక పీహెచ్‌సీలకు ఎన్‌క్వాస్‌ (నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌ – కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో ఉంటుంది) గుర్తింపు ఉన్న రాష్ట్రంగా ఏపీ సత్తా చాటింది. 320 పీహెచ్‌సీలకు ఈ గుర్తింపుతో ఏపీ తొలి స్థానంలో, 191తో గుజరాత్‌ రెండో స్థానంలో, 134తో కేరళ మూడో స్థానంలో ఉంది.   

అందుబాటులో స్పెషలిస్ట్‌ వైద్యం 
ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజల కోసం స్పెషలిస్ట్‌ వైద్య సేవలను సైతం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా 9 స్పెషాలిటీల్లో 1,278 మంది వైద్యులను నియమిస్తోంది. వీరు వారంలో ఆరు రోజుల పాటు రోజుకు రెండు పీహెచ్‌సీలకు వెళ్లి స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే 276 పోస్టులు భర్తీ అయ్యాయి.  

‘నాడు–నేడు’తో మార్పులు ఇలా.. 
► ప్రతి ఆస్పత్రిలో సిటిజన్‌ చార్టర్‌ విధిగా అమలవుతోంది. దీని ప్రకారం ఔట్‌ పేషెంట్, ఇన్‌ పేషెంట్‌ వైద్య సేవలు సమయానికి అందుతున్నాయి. ఆస్పత్రిలో వసతులు/గదులకు సంబంధించిన సైన్‌ బోర్డులు ఏర్పాటయ్యాయి. 
► నిబంధనల మేరకు అగ్నిమాపక ధ్రువీకరణ పత్రాలు, కాలుష్య నియంత్రణ మండలి సర్టిఫికెట్లు ఉన్నాయి.  రక్త పరీక్షలన్నీ అక్కడే జరిగేలా అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులతో కూడిన ల్యాబ్‌లు ఏర్పాటయ్యాయి. ప్రతి 3–4 గంటలకు ఒకసారి పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి.  
► గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అత్యవసర మందులు అందుబాటులో ఉండేవి కాదు. ప్రస్తుతం 240 రకాల ఎసెన్షియల్‌ మందులు పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంటున్నాయి. 
► చాలా ఆస్పత్రుల్లో గతంలో ఒకే వైద్యుడు ఉండేవాడు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులను తప్పనిసరి చేసింది. ఇందుకు తగ్గట్టుగా ఇప్పటికే 645 మంది డాక్టర్లు, 1,113 నర్సులు, 403 ల్యాబ్‌ టెక్నీషియన్లు సహా 2,964 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. మరో 264 డాక్టర్, 1,269 ల్యాబ్‌ టెక్నీషియన్, ఎఫ్‌ఎన్‌వో, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తోంది. నియామక ప్రక్రియ కొనసాగుతోంది.  
► గతంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పనివేళలు ఉండేవి. ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒకరు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒకరు ఓపీ చూస్తారు. రాత్రి 8 గంటల తర్వాత అత్యవసర సేవల్లో భాగంగా ఫోన్‌ చేస్తే ఆస్పత్రికి వస్తారు.   
► వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు మందుల సరఫరా, వైద్య పరీక్షల శ్యాంపిల్స్‌ సేకరించి పీహెచ్‌సీలకు తరలించడం కోసం ప్రతి పీహెచ్‌సీకి ఒక స్కూటీని త్వరలో అందుబాటులోకి తెస్తున్నారు.  
► మండలానికి రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 176 కొత్త పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తున్నారు.   
కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన్నఓగిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం 

ఈ ఫొటోలో కనిపిస్తున్న గిరిజనుడు మల్లూరి రాముకు 65 ఏళ్లు. విజయనగరం జిల్లా పార్వతీపురం వాసి. రిక్షా నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లాలంటే 150 కిలోమీటర్లు ప్రయాణించాలి. వృద్ధాప్యంలో అంత దూరం ప్రయాణించడం ప్రయాసే. రాము తరహాలో మరెవ్వరూ ఇబ్బంది పడకూడదని  రాష్ట్రంలో ఐదు గిరిజన మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలకు ప్రభుత్వం పూనుకుంది. రూ. 246 కోట్లతో శ్రీకాకుళం జిల్లా సీతంపేట, విజయనగరం జిల్లా పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, పశ్చిమగోదావరి జిల్లా కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలోని బుట్టాయగూడెం, కర్నూలు జిల్లా శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని ప్రకాశం జిల్లా దోర్నాలల్లో ఈ ఆస్పత్రుల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. గిరిజన ప్రాంతాల్లో అందుబాటులో ఉండే వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయి. వైద్యులు, సిబ్బంది కోసం క్వార్టర్స్‌ కూడా నిర్మిస్తున్నారు.   

ఇబ్బందులు ఉండవు 
మా ప్రాంతంలోనే అన్ని వసతులతో ఆస్పత్రులు అందుబాటులోకి రాబోతుండటం శుభ పరిణామం. తద్వారా రోడ్డు ప్రమాదాలు, ఇతర అనారోగ్య పరిస్థితుల్లో సరైన సమయంలో మెరుగైన వైద్యం అందక సంభవించే మరణాలు తగ్గుతాయి.  
– కొవ్వాసి నారాయణ, బుట్టాయగూడెం, పశ్చిమగోదావరి జిల్లా  

వేగంగా పూర్తి చేస్తాం 
రాష్ట్రంలో ఐదు చోట్ల గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్లకు పనులు అవార్డ్‌ చేశాం. వాళ్లు పనులు ప్రారంభించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
 – మురళీధర్‌రెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ వైస్‌ చైర్మన్, ఎండీ

ఏపీ రోల్‌ మోడల్‌ అవ్వాలన్నదే లక్ష్యం 
ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్యం అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వైద్య రంగంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా అడుగులు ముందుకు వేస్తున్నాం. నాడు–నేడు కింద ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అత్యధిక ఎన్‌క్వాస్‌ గుర్తింపు కలిగిన పీహెచ్‌సీలతో రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంది. జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నాం. దేశానికి ఏపీ రోల్‌ మోడల్‌ అవ్వాలన్న సీఎం లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నాం.      
– ఆళ్ల నాని, ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి       

ఇప్పుడు మా ఊళ్లోనే మంచి వైద్యం 
నాకు 70 ఏళ్లు. మా గ్రామంలోనే పీహెచ్‌సీ ఉంది. గతంలో ఇక్కడ సేవలు సరిగా లేనందున ఉయ్యూరులో ఓ ప్రైవేట్‌ వైద్యుడి వద్దకు వెళ్లే వాడిని. డాక్టర్‌ ఫీజు, మందులు కలిపి రూ.500 అయ్యేది. ఇప్పుడు మా ఊళ్లోనే ప్రభుత్వ ఆస్పత్రి బాగుండటంతో మంచి వైద్య సేవలు అందుతున్నాయి. క్రమం తప్పకుండా ఇక్కడికే వచ్చి, మధుమేహం, ఇతర వైద్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకువెళ్తున్నాను. వైద్యులు, సిబ్బంది బాగా చూస్తున్నారు.  
    – బి.కోటేశ్వరరావు, చినఓగిరాల, కృష్ణా జిల్లా 

ఇదివరకు ఆర్‌ఎంపీ వైద్యమే గతి 
గతంలో మా ఊరికి సమీపంలోని రాకోడు పీహెచ్‌సీలో వైద్యుడు అందుబాటులో ఉండేవాడు కాదు. దీంతో పెద్దాస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేది. అంత దూరం వెళ్లలేక ఊర్లోనే ఆర్‌ఎంపీతో చూపించుకునే వాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక ఇద్దరు వైద్యులను నియమించారు. ఎప్పుడూ ఎవరో ఒకరు అందుబాటులో ఉంటున్నారు. ఆస్పత్రికి వెళితే ప్రేమగా పలకరిస్తూ వైద్యం చేస్తున్నారు.
– పి.అప్పలనాయుడు, పెదవేమలి, విజయనగరం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement