
గుంటూరు వెస్ట్: రాష్ట్రంలో 390 టన్నుల ఆక్సిజన్ అవసరముండగా ప్రస్తుతం 360 టన్నులు అందుబాటులో ఉందని, డిమాండ్‌కు సరిపడా ఆక్సిజన్ సరఫరా కోసం కేంద్రానికి లేఖ రాశామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి, వైద్య సదుపాయం, తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం గుంటూరు కలెక్టరేట్‌లో హోంమంత్రి మేకతోటి సుచరిత, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాని విలేకరులతో మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో 30 శాతం ఆక్సిజన్ వృథా జరుగుతోందని, ఈ వృథా అరికట్టడంపై వైద్యారోగ్య శాఖ అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌ల కొరత లేదన్నారు. రాష్ట్రానికి 12 వేల డోస్‌ల ఇంజక్షన్లు వచ్చాయన్నారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కొరత లేకుండా చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 40 పడకలున్న ఆసుపత్రులకు కోవిడ్ సెంటర్లుగా అనుమతులు మంజూరు చేస్తామన్నారు. 85 శాతానికి పైగా పాజిటివ్ రోగులు హోం ఐసోలేషన్‌లోనే చికిత్స పొందుతున్నారన్నారు. వారికి వైద్యులు నిరంతరం ఫోన్ ద్వారా సూచనలు, సలహాలు అందిస్తున్నారని చెప్పారు. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేటు ఆసుపత్రులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
విజయనగరం జిల్లాలో స్వల్ప ఇబ్బందిని ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ భూతద్దంలో చూపిస్తూ కనీస సామాజిక స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ.. ప్రభుత్వం విధిస్తున్న కోవిడ్ నిబంధనలను అందరూ తప్పక పాటించాలని కోరారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జిల్లా కోవిడ్ ప్రత్యేకాధికారి ఉషారాణి, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, శాసన సభ్యులు మొహమ్మద్ ముస్తఫా, మద్దాళి గిరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment