సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నిబంధనలకు లోబడి తమ పార్టీ కార్యాలయంలో ‘నిరు ద్యోగ దీక్ష’ చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీ కోసం బీజేపీ చేపట్టిన ‘నిరుద్యోగ దీక్ష’కు తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులను, పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు.
నిరుద్యోగ యువతీ, యువకుల పక్షాన బీజేపీ చేపడుతున్న ‘నిరుద్యోగ దీక్ష’కు రాజకీయాలకు అతీతంగా మద్దతివ్వాలని ప్రజాస్వామిక వాదులను కోరారు. బీజేపీ దీక్షతో తమ పీఠం కదులుతుందనే భయంతోనే ఈ దుందుడుకు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. కాగా, దీక్షకు అనుమతినిచ్చే విషయాన్ని పున:పరిశీలించాలని, లేకుంటే సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్, ఇతర నేతలు నిబంధనలకు అనుగుణంగా ‘నిరుద్యోగ దీక్ష’ను కొనసాగిస్తారని బీజేపీ ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్, ఉపాధ్యక్షుడు డా.జి.మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడతామని, ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసేంత వరకు బీజేపీ పోరాటం ఆగదని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment