![Telangana Gurukulam Recruitment 2022 Process - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/12/GURUKULAM--10.jpg.webp?itok=mhLKTNMQ)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు అంశం కొలిక్కి రావడంతో ప్రభుత్వ శాఖల్లో నూతన ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమమైంది. ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి తాజాగా వెలువడిన కొత్త రోస్టర్ పాయింట్లతో దాదాపు రెండు నెలలుగా ఉద్యోగ ప్రకటనలపై నెలకొన్న స్తబ్ధతకు తెరపడింది. దీంతో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన కొలువులకు త్వరలో నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కసరత్తు వేగవంతమైంది.
రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు ఆరుశాతం నుంచి పది శాతానికి పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో 80 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రత్యేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా శాఖలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) మాత్రం ఒక్క నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఇంతలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపు అంశం తెరపైకి రావడంతో నియామకాలకు సంబంధించిన ప్రక్రియలో జాప్యం జరిగింది. తాజాగా నియామకాల భర్తీకి ఆటంకాలు తొలగిపోవడంతో గురుకుల ఉద్యోగాల భర్తీకి సొసైటీలు చర్యలను వేగవంతం చేశాయి.
4 సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో 9,096 ఉద్యోగాలను టీఆర్‌ఈఐఆర్‌బీ ద్వారా భర్తీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కొలువుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలనుటీ ఆర్‌ఈఐఆర్‌బీకి సమర్పించేందుకు సొసైటీలు కసరత్తు మొదలుపెట్టాయి.ఈ నెలాఖరులోగా తమ ప్రతిపాదనలు గురుకుల నియామకాల బోర్డుకు సమర్పించేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రతిపాదనలు అందిన తర్వాత గురు కుల బోర్డు పరిశీలించి నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment