gurukula posts
-
భారీగా ‘బ్యాక్లాగ్’! ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మిగిలిపోతున్న పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న నియామక సంస్థలకు బ్యాక్లాగ్ తిప్పలు పట్టుకున్నాయి. ఒకే సమయంలో భారీగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియలు చేపడుతుండటంతో.. గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. పోటీ పరీక్షల కోసం పకడ్బందీగా సిద్ధమవుతున్న చాలా మంది అభ్యర్థులు.. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారు. వాటిలో ఒకదానిని ఎంచుకోవడంతో మిగతా ఉద్యోగాలు ఖాళీగా మిగిలిపోతున్నాయి. ఉద్యోగ నియామక సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం, వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల కౌన్సెలింగ్‌ను ఒకే సమయంలో నిర్వహించడం వంటివి దీనికి కారణమవుతున్నాయి. ఉద్యోగాలకు ఎంపికైనవారు వాటిని వదులుకుంటే.. తర్వాతి మెరిట్ అభ్యర్థులకు కేటాయించే పరిస్థితి (రిలిక్విష్ మెంట్) లేకపోవడం కూడా సమస్యకు దారితీస్తోంది. ఇలా మిగిలిపోయిన ఉద్యోగాలకు మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసి, భర్తీ ప్రక్రియ చేపట్టాల్సి వస్తోంది. ఇటీవల భర్తీ చేసిన గురుకుల కొలువులు, పోలీస్ కానిస్టేబుల్, స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్ తదితర కేటగిరీ ఉద్యోగాల్లో సుమారు 10శాతానికిపైగా ఇలా మిగిలిపోవడం గమనార్హం. 33వేల కొలువుల్లో.. 4,590 ఉద్యోగాలు ఖాళీ.. రాష్ట్రంలో గత మూడు నెలల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో 33 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగింది. ఇందులో 4,590 ఉద్యోగాలు మిగిలిపోయినట్టు నియామక సంస్థల ప్రాథమిక గణాంకాలు చెప్తున్నాయి. ఉద్యోగులంతా పూర్తిస్థాయిలో విధుల్లో చేరితే ఇందుకు సంబంధించి మరింత స్పష్టత రానుంది. గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు పరిధిలో ఇప్పటివరకు 8.820 ఉద్యోగాల భర్తీ చేపట్టగా.. ఏకంగా 1,810 ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలినట్టు సమాచారం. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఇటీవల చేపట్టిన 15,644 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో దాదాపు 2వేల ఉద్యోగాలు భర్తీ కాలేదు. ఇక మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7 వేల స్టాఫ్ నర్సు, 1,150 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయగా.. వీటిలోనూ 780 ఉద్యోగాలు మిగిలిపోయాయి. రిలిక్విష్మెంట్ లేకపోవడంతో.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఉద్యోగ ఖాళీల భర్తీలో రిలిక్విష్మెంట్ విధానాన్ని అనుసరించారు. అంటే ఏదైనా నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రకటించిన ఖాళీలు పూర్తిస్థాయిలో భర్తీ కాకుంటే.. అందులోని తర్వాతి మెరిట్ అభ్యర్థులతో భర్తీచేసేందుకు వీలు ఉండేది. 2018 వరకు ఈ విధానాన్ని అనుసరించారు. కానీ ఈ విధానంలో పారదర్శకత లోపించిందంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, దానికితోడు ఇతర కారణాలతో రిలిక్విష్మెంట్ విధానాన్ని పక్కనబెట్టారు. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చాక జారీ అయిన నోటిఫికేషన్లలో రిలిక్విష్మెంట్ అంశాన్ని జతచేయలేదు. అంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎన్ని పోస్టులు మిగిలినా అదే నోటిఫికేషన్ కింద భర్తీ చేసే అవకాశం లేదు. ఇటీవల రిలిక్విష్మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి, నిబంధనలపై చర్చించినా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా భర్తీ ప్రక్రియలో బ్యాక్లాగ్ ఖాళీలు మిగిలిపోతున్నాయి. వాటిని భర్తీ చేయాలంటే మళ్లీ కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయాల్సిందేనని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం నియామకాల ప్రక్రియలు ఇంకా కొనసాగుతుండటంతో.. నోటిఫికేషన్ల వారీగా ఏర్పడే ఖాళీలపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. -
గురుకుల కొలువుల భర్తీ ప్రక్రియ షురూ!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. దాదాపు 9వేల ఉద్యోగాలకు సంబంధించి అర్హత పరీక్షలను నిర్వహించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) మూడు కేటగిరీల్లో మినహా మిగతా అన్ని పరీక్షల తాలుకూ ప్రశ్నాపత్రాల కీలను సైతం విడుదల చేసింది. అయితే మహిళా రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండడంతో నియామకాల ప్రక్రియలో కొంత గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం నియామకాల ప్రక్రియను తుది దశకు తీసుకువచ్చే దిశగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా అతి త్వరలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు సిద్ధమవుతున్నారు. ఎల్బీనగర్లోని కళాశాలలో శిక్షణ తరగతులు గురుకుల కొలువులకు సంబంధించి 9 రకాల నోటిఫికేషన్లు జారీ చేయగా... ఇందులో దాదాపు 54 రకాల ఉద్యోగాలున్నాయి. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి జిల్లాల వారీగా ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు ఇప్పటికే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ధ్రువపత్రాల పరిశీలనను నిశితంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించింది. వీరికి ధ్రువపత్రాల పరిశీలనపై ముందుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పరిశీలనాధికారులకు ఈనెల 28, 29 తేదీల్లో ఎల్బీనగర్లోని గురుకుల కళాశాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. రెండ్రోజలు శిక్షణలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనపై అవగాహన కల్పిస్తారు. వచ్చే నెల నుంచి పరిశీలన మొదలు మరోవైపు మహిళా రిజర్వేషన్లు, ఒకట్రెండు కేటగిరీల్లోని ఉద్యోగాల విషయంలోని అంశాలు కోర్డు పరిధిలో ఉండగా... వాటికి నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతో వచ్చే నెల రెండో వారం కల్లా 1:2 జాబితాలు విడుదల చేసి... ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ప్రతి ఆప్షన్ ఎంపిక చేసుకోవాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: గురుకుల పోస్టుల పరీక్షలు రాసిన అభ్యర్థుల నుంచి ఆప్షన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ), అక్టోబర్ 3 నుంచి 9 వరకు పాఠశాలల్లోని లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్, డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆప్షన్లు ఇవ్వాలని గురుకుల బోర్డు ఆదేశించింది. జోన్లు, సొసైటీల వారీగా ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు ఇవ్వాలని.. ఈ క్రమంలో అవకాశమున్న ప్రతి ఆప్షన్‌ను తప్పకుండా ఎంపిక చేసుకుంటేనే ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. జోన్ల వారీగా అర్హత మార్కుల్లో తేడాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఆప్షన్ విలువైనదేనని.. ఒక్క ఆప్షన్ వదులుకున్నా ఒక అవకాశం వదిలేసుకున్నట్లేనని స్పష్టం చేస్తున్నారు. ఐదు సొసైటీల పరిధిలో.. ప్రస్తుతం ఐదు గురుకుల సొసైటీల పరిధిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. రాష్ట్రంలోని ఏడు జోన్ల పరిధిలోని ఉద్యోగాలకు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక్కో అభ్యర్థి గరిష్టంగా 35 ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాధాన్యతా క్రమంలో వాటిని ఎంపిక చేసుకుంటూ ఆప్షన్ పేజీని పూర్తి చేయాలి. మహిళా అభ్యర్థులకు అదనంగా బాలికల విద్యా సంస్థల కేటగిరీ ఉండటంతో వారు 70 ఆప్షన్లు ఇవ్వాలి. మల్టీజోనల్ స్థాయిలోని డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు సమయంలోనే ఆప్షన్లు స్వీకరించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ).. జోనల్ స్థాయి పోస్టులకు మాత్రం ఇప్పుడు ఆప్షన్ అవకాశాన్ని కల్పించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కేటగిరీల వారీగా మెరిట్ జాబితాలను విడుదల చేయనుంది. వచ్చే నెల రెండో వారంలో.. రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ అర్హత పరీక్షల ను నిర్వహించిన బోర్డు.. ఇప్పుడు ప్రాథమిక జాబితా ల తయారీకి ఉపక్రమించింది. ప్రస్తుతం కళాశాల విద్య కమిషనరే ట్, ఇంటర్ బోర్డు పరిధిలో డిగ్రీ లెక్చ రర్లు, జూనియర్ లెక్చరర్లకు సంబంధించి అర్హత పరీక్షలు జరుగుతున్నాయి. టీఎస్పీఎస్సీ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. పరీక్షలు పూర్తయ్యాక మెరిట్ జాబితాలను విడుదల చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాథమిక మెరిట్ జాబితాల విడుదలలో జాప్యం జరిగినట్టు తెలుస్తోంది. వచ్చేనెల మొదటివారంతో టీఎస్పీఎస్సీ పరీక్షలు పూర్తవు తాయి. ఆ తర్వాత గురుకుల బోర్డు ప్రాధాన్యత క్రమంలో ప్రాథమిక మెరిట్ జాబితాలను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ముందుగా డిగ్రీ లెక్చరర్ పోస్టుల జాబితా విడుదల చేసి, డెమో పరీక్షలు నిర్వహిస్తారు. వాటి తుది మెరిట్ జాబితా ప్రకటించాక.. జూనియర్ లెక్చరర్ డెమో పరీక్షలు, అనంతరం పీజీటీ, టీజీటీ తదితర కేటగిరీలకు సంబంధించిన ఫలితాలను క్రమంగా వెల్లడించేలా బోర్డు అధికారులు కార్యాచరణ రూపొందించారు. -
Telangana: మరో గుడ్‌న్యూస్! డిసెంబర్లో గురుకుల నోటిఫికేషన్?
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటివరకు గిరిజన రిజర్వేషన్లు, ఇతరత్రా అవాంతరాలతో నోటిఫికేషన్ విడుదలలో జాప్యం నెలకొంది. ప్రభుత్వం అనుమతించిన పోస్టుల భర్తీకీ సంబంధించిన ప్రతిపాదనల(ఇండెంట్లు)ను గురుకుల సొసైటీలు తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డుకు సమర్పించాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రతిపాదనల మేరకు పోస్టులవారీగా రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల వివరాలను పరిశీలించేందుకు నియామకాల బోర్డు సన్నద్ధమైంది. రాష్ట్రంలోని నాలుగు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో 9,096 బోధ న, బోధనేతర పోస్టుల భర్తీకి ఇప్పటికే రాష్ట్ర ప్రభు త్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ భర్తీ బా ధ్యతలను ప్రభుత్వం తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డుకు అప్పగించింది. వారంలోగా పూర్తి... తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగా ణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) ల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో సొసైటీలవారీగా మంజూరు చేసిన పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు రూపొందించిన సొసైటీలు బోర్డుకు సమర్పించాయి. ఈ ప్రతిపాదనలను వారంరోజుల్లోగా పరిశీలించేలా బోర్డు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రతిపాదనల పరి శీలనకు షెడ్యూల్ రూపొందించిన బోర్డు సంబంధిత సొసైటీ అధికారులు సహకారం అందించాలని స్పష్టం చేసింది. సొసైటీలు సమర్పించిన ప్రతిపాదనల్లో పొరపాట్లు, సవరణలుంటే వాటిని పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వనుంది. డిసెంబర్లో నోటిఫికేషన్ గురుకుల విద్యాసంస్థల ఖాళీల భర్తీకి సంబంధించి వచ్చేనెలలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. వారంరోజుల్లోగా ప్రతిపాదనల పరిశీలన పూర్తయిన అనంతరం పోస్టుల వారీగా నోటిఫికేషన్లు ఇవ్వాలని గురుకుల నియామకాల బోర్డు కార్యాచరణ సిద్ధం చేయనుంది. ప్రాధాన్యతాక్రమంలో పై నుంచి కిందిస్థాయి వరకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ ప్రక్రియను సైతం అదే క్రమంలో పూర్తిచేయాలని భావిస్తోంది. -
గురుకుల కొలువుల భర్తీకి వేగంగా కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు అంశం కొలిక్కి రావడంతో ప్రభుత్వ శాఖల్లో నూతన ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమమైంది. ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి తాజాగా వెలువడిన కొత్త రోస్టర్ పాయింట్లతో దాదాపు రెండు నెలలుగా ఉద్యోగ ప్రకటనలపై నెలకొన్న స్తబ్ధతకు తెరపడింది. దీంతో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన కొలువులకు త్వరలో నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కసరత్తు వేగవంతమైంది. రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు ఆరుశాతం నుంచి పది శాతానికి పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో 80 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రత్యేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా శాఖలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) మాత్రం ఒక్క నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఇంతలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపు అంశం తెరపైకి రావడంతో నియామకాలకు సంబంధించిన ప్రక్రియలో జాప్యం జరిగింది. తాజాగా నియామకాల భర్తీకి ఆటంకాలు తొలగిపోవడంతో గురుకుల ఉద్యోగాల భర్తీకి సొసైటీలు చర్యలను వేగవంతం చేశాయి. 4 సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో 9,096 ఉద్యోగాలను టీఆర్‌ఈఐఆర్‌బీ ద్వారా భర్తీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కొలువుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలనుటీ ఆర్ఈఐఆర్బీకి సమర్పించేందుకు సొసైటీలు కసరత్తు మొదలుపెట్టాయి.ఈ నెలాఖరులోగా తమ ప్రతిపాదనలు గురుకుల నియామకాల బోర్డుకు సమర్పించేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రతిపాదనలు అందిన తర్వాత గురు కుల బోర్డు పరిశీలించి నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. -
Harish Rao: గురుకులాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తాం
మణికొండ/సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీక రిస్తామని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్స వాన్ని పురస్కరించుకుని గురువారం ఆయన హైద రాబాద్ శివారు నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల పాఠశాలలో మందుబిళ్లలను పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే టి. ప్రకాశ్‌గౌడ్‌తో కలసి మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హరీశ్‌రావు మాట్లా డుతూ విద్యార్థులు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరి స్థితిని నెలవారీగా సమీక్షించాలని, స్థానిక పీహెచ్సీ వైద్యులు తప్పనిసరి గురుకులాలను సందర్శించా లని ఆదేశించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో గురుకులాల సంఖ్యను 298 నుంచి 923కు పెంచామని వివరించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేశామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, గురుకు లాల కార్యదర్శి రోనాల్డ్‌రాస్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతి, నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ డి.రేఖయాదగిరి పాల్గొన్నారు. తక్కువ ఖర్చుతో పేదలకు వైద్యం అందించాలి కార్పొరేట్ ఆస్పత్రులు కూడా వీలైనంత తక్కువ ఖర్చుతో పేదలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. గురువారం బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రి లో హ్యూగో రోబోటిక్స్ అసిస్టెడ్ సిస్టం ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ.. ప్రజారోగ్యంపై ప్రభు త్వం ఏటా రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తోందని తెలి పారు. ఆరోగ్యశ్రీ కేసులు ఎక్కువగా తీసుకో వా లని కేర్ ఆస్పత్రికి సూచించారు. రోబోటిక్స్ టెక్నా లజీ అందిపుచ్చుకోవడం వల్ల రికవరీ శాతం పెరిగి, రోగి ఆస్పత్రిలో ఉండే సమయం, ఖర్చు తగ్గుతా యన్నారు. కార్యక్రమంలో కేర్ బంజారాహిల్స్ ప్రసూతి విభాగం అధిపతి డాక్టర్ మంజుల అన గాని, ఆస్పత్రి గ్రూప్ చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ నిఖిల్ మాథుర్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గోపాల్, డాక్టర్ పి. వంశీ కృష్ణ, ఆస్పత్రి సీవోవో డాక్టర్ నీలేశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
గురుకుల పోస్టుల భర్తీ.. 9,096 కొలువులకు ప్రతిపాదనలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో కొలువుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. నాలుగు గురుకుల సొసైటీల్లో 9,096 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేస్తూ నియామక బాధ్యతను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐ–ఆర్బీ)కు బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లు తదితర పూర్తి సమాచారంతో కూడిన ప్రతిపాదనల (ఇండెంట్లు)ను సంక్షేమ గురుకుల సొసైటీలు తాజాగా తయారు చేశాయి. ప్రతిపాదనల తయారీలో ప్రధానంగా నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగ కేటాయింపుల అంశం కాస్త జాప్యం కావడంతో ప్రతిపాదనల రూపకల్పన సైతం కాస్త పెండింగ్‌లో పడిపోయింది. తాజాగా జీఓ 317 ప్రకారం అన్ని గురుకుల సొసైటీల్లో ఉద్యోగ కేటాయింపులు పూర్తికాగా ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆమోదం లభించాల్సి ఉంది. ఉద్యోగ కేటాయింపుల ప్రతిపాద నలకు ఆమోదం లభించిన వెంటనే ఉద్యోగులకు కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయనున్న సొసై టీలు... వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనలను బోర్డుకు సమర్పించే అవకాశం ఉంది. బీసీ గురుకులాల్లో అత్యధిక ఖాళీలు... ప్రస్తుతం గురుకుల కొలువుల్లో అత్యధికంగా బీసీ గురుకుల సొసైటీ పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 9,096 పోస్టులకు అనుమతులు ఇవ్వగా వాటిలో మూడో వంతుకు పైబడిన ఖాళీలు మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)లో ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలో 2,267 ఉద్యోగాలు, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో 1,514 కొలువులు, తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్) పరిధిలో 1,445 ఉద్యోగ ఖాళీలున్నాయి. గురుకుల టీజీటీ పోస్టులకు టెట్ మెరిట్‌తో ముడిపడి ఉంది. ఈ క్రమంలో ఇటీవల టెట్ ఫలితాలు సైతం వెలువడటంతో ఆయా పోస్టుల నియామకాలకు మార్గం సుగమమైంది. ఇక పీజీటీ, జేఎల్, డీఎల్ పోస్టులకు సంబంధించిన నిబంధనలు సైతం ఖరారయ్యాయి. ఈ క్రమంలో గురుకుల సొసైటీలు నియామక బోర్డుకు ఇండెంట్లు సమర్పించిన వెంటనే వాటిని దాదాపు పక్షం రోజుల్లో పరిశీలించి కేటగిరీలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని గురుకుల సొసైటీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వివరించారు. -
‘గురుకుల’ విభజనపై కొత్త చిక్కులు
సాక్షి, హైదరాబాద్ : గురుకుల విద్యాసంస్థల సొసైటీల పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో పోస్టుల విభజనకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అమలుకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆ మేరకు పోస్టులను జోన్లు, మల్టీజోన్లు, జిల్లా కేడర్‌వారీగా విభజించాలి. ఆ తర్వాతే కొత్తగా నియామకాలు చేపట్టేందుకు నోటిఫికేషన్లు జారీ చేసే వీలుంటుంది. ఈ క్రమంలో పోస్టుల విభజనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతూ గురుకుల నియామకాల బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల ఆధారంగా వాటిని విభజిస్తే సరిపోతుందని బోర్డు భావించినప్పటికీ ప్రభుత్వ స్పందన భిన్నంగా రావడంతో గురుకుల నియామకాల బోర్డు తలపట్టుకుంది. మీరే స్పష్టత ఇవ్వాలి... రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త జోనల్ విధానం నేపథ్యంలో గురుకుల విద్యాసంస్థల సొసైటీలు కొత్త నిబంధనల పరిధిలోకి వస్తాయా లేదా అనే అంశాన్ని తేల్చుకునేందుకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు గత నెలలో ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు గురుకుల సొసైటీకి వర్తిస్తాయా లేక ప్రత్యేక నిబంధనలకు లోబడి పనిచేస్తాయా చెప్పాలని కోరింది. అయితే అనూహ్యంగా ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయాన్ని బోర్డుకే వదిలేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా బోర్డుకు తిరుగు లేఖ రాశారు. వీలైనంత త్వరగా దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. దీంతో బోర్డు డైరెక్టర్లు తెల్లబోయారు. ప్రభుత్వమే తేల్చాల్సిన అంశాన్ని బోర్డుకు వదిలేయడంపై అయోమయంలో పడ్డారు. ఈ క్రమంలో బోర్డు ఏర్పాటు సమయంలో బైలాస్, నియామకాల్లో పాటించిన విధానాన్ని పరిశీలించి నివేదిక తయారు చేసేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యాశాఖ సొసైటీ కార్యదర్శులు నిర్ణయించారు. ఇటీవల ప్రత్యేకంగా సమావేశమై ఒక దఫా చర్చలు జరిపిన కార్యదర్శులు మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. -
గుట్టుగా గెస్ట్‌లెక్చరర్ల నియామకాలు
నెల్లిమర్ల: జిల్లావ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరంలో ఏడు గురుకులాలను ప్రారంభిస్తున్నట్లు జూలై నెలలోనే ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం భవనాలు అందుబాటులో ఉన్న మూడు ప్రాంతాల్లో ఈ నెలలో పాఠశాలలు ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ పాఠశాలలకు సంబంధించిన గెస్ట్ టీచర్ల నియామకాలను మాత్రం అడ్డదారిలో చేపట్టారు. అధికార టీడీపీ నేతల ఒత్తిడితో ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండానే నియామకాలు చేపట్టారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న సాలూరులో కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే టీచర్లను నియమించారు. సంబంధిత బీసీ సొసైటీ అధికారులు ఈ విషయంలో టీడీపీ నేతలకు సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలేమైందంటే... విజయనగరం, కొత్తవలస, గంట్యాడ, సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి మండలం కారాడ, కురుపాం ప్రాంతాల్లో ఈ విద్యాసంవత్సరంలో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలలు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తవలస, గంట్యాడ, సాలూరు, పార్వతీపురంలో బాలికలు, విజయనగరం, కారాడ, కురుపాంలో బాలుర పాఠశాలలు ప్రారంభించాలని సంబంధిత అధికారులు ముందుకొచ్చారు. భవనాలు అందుబాటులో ఉన్న గంట్యాడ, కారాడ, సాలూరు ప్రాంతాల్లో ముందుగా ఈ నెలలోనే పాఠశాలలను ఏర్పాటుచేయాలని సన్నాహాలు చేశారు. ఈ పాఠశాలల్లో బోధనకు గెస్ట్ టీచర్లను నియమించేందుకు ప్రకటన ఇవ్వాలి. కానీ అదేమీ లేకుండానే సంబంధిత అధికారులు గెస్ట్ టీచర్ల నియామకాలు చేపట్టేశారు. అధికార టీడీపీ నేతలు చెప్పిన అభ్యర్థుల నుంచి బయోడేటాలు తీసుకుని, వారు సిఫారసు చేసినవారినే ఎంపిక చేశారన్న ఆరోపణలున్నాయి. వందిమంది దరఖాస్తు చేసుకున్నారు గెస్ట్ టీచర్ల కోసం మొత్తం వందమంది అభ్యర్థులు స్వతహాగానే దరఖాస్తు చేసుకున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. వారిలో 40మంది మాత్రమే ఇంటర్వూ్యలకు హాజరయ్యారని అంటున్నారు. మూడు పాఠశాలలకు సంబంధించి 20మందిని నియమించినట్లు తెలిపారు. అకడమిక్ గైడెన్స్ అధికారితో పాటు గురుకులాల జిల్లా కన్వీనరుతో పాటు ఒక సబ్జెక్ట్ నిపుణుడు కమిటీగా ఏర్పడి టీచర్లను ఎంపికచేసినట్లు చెబుతున్నారు. అయితే ఇదంతా అబద్ధమని, కేవలం టీడీపీ నేతలు చెప్పిన వారినే నియమించినట్లు భోగట్టా. పారదర్శకంగానే నియామకాలు జిల్లాలోని గంట్యాడ, కారాడ, సాలూరులో నెలకొల్పే బీసీ గురుకులాలకు సంబంధించిన గెస్ట్ టీచర్ల నియామకాలను పారదర్శకంగానే చేపట్టాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ప్రకటన ఇవ్వలేదు. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు కూడా ఇవ్వలేదు. గంటకు రూ. 148లు చొప్పున నెలకు గరిష్టంగా రూ 14,800 గౌరవ వేతనంగా అందజేస్తాం. రెగ్యులర్ టీచర్లను నియమించగానే వీరిని తొలగిస్తాం.–సత్యారావు, జిల్లా గురుకులాల కన్వీనర్ -
‘ప్రిన్సిపాల్’ పోస్టుల పరీక్ష రద్దుపై వెనక్కి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠశాలల్లోని 304 ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో ఓ ప్రైవేటు బ్లాగ్ నుంచి కాపీ చేసి ఇచ్చిన ప్రశ్నలను తొలగించి మిగతా ప్రశ్నలతో పేపర్ వ్యాల్యుయేషన్ చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఈ నెల 14న ఈ (పేపర్–1, పేపర్–2) పరీక్షలు టీఎస్పీఎస్సీ నిర్వహించింది. ఒక్కో పేపర్లో 150 చొప్పున 300 మార్కులకు పరీక్షలు పెట్టింది. అయితే ఓ ప్రైవేటు బ్లాగ్ నుంచి దాదాపు 200 ప్రశ్నలను యథాతథంగా ఇచ్చారంటూ పలువురు అభ్యర్థులు టీఎస్పీఎస్సీకి ఫిర్యాదు చేశారు. దీంతో టీఎస్పీఎస్సీ అధికారులు బ్లాగ్‌లో ఉన్న ప్రశ్నలను, పరీక్షలో వచ్చిన ప్రశ్నలను పరిశీలించి.. రెండు పేపర్లలోనూ కొన్ని ప్రశ్నలు యథాతథంగా వచ్చినట్లు తేల్చారు. దీనిపై లోతుగా అధ్యయనం చేసేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి.. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు కమిటీ తన నివేదికను శనివారమే టీఎస్పీఎస్సీకి అందజేసింది. సోమవారం టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ నివేదికను సభ్యులు, అధికారులు పరిశీలించారు. 67 ప్రశ్నలు తొలగింపు.. ప్రైవేటు బ్లాగ్ నుంచి కొన్ని ప్రశ్నలను యథాతథంగా ఇచ్చినట్లుగా కమిటీ తన నివేదికలో పేర్కొంది. పేపర్–1లో 12 ప్రశ్నలు, పేపర్–2లో 55 ప్రశ్నలను యథాతథంగా ఇచ్చారని వెల్లడించింది. దీంతో కమిషన్ వివిధ కోణాల్లో పరిశీలన జరిపింది. పరీక్షను రద్దు చేయాలా.. అన్న దానిపై ఆలోచనలు చేసింది. అయితే పేపర్ లీకేజీ, పెద్ద ఎత్తున మాల్ ప్రాక్టీస్ జరిగిన సందర్భాల్లోనే పరీక్షను రద్దు చేయాలన్న నిబంధన ఉందని, బ్లాగ్ నుంచి ప్రశ్నలను కాపీ చేయడం లీకేజీ కిందకు రాదన్న అభిప్రాయానికి వచ్చింది. మరోవైపు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అదే చెబుతోందని, కాపీ చేసిన ప్రశ్నలను తొలగించి మిగతా ప్రశ్నలతో పేపర్ వ్యాల్యుయేషన్ చేయాలని, వాటిని మొత్తం మార్కులతో నార్మలైజ్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని కమిషన్ ఆలోచనకు వచ్చింది. ఆ మేరకు 67 ప్రశ్నలను తొలగించి మిగతా ప్రశ్నలతో పేపర్లు వ్యాల్యుయేషన్ చేసి 300 మార్కులకు నార్మలైజ్ చేయాలని నిర్ణయించింది. అదే బ్లాగ్ నుంచి మరో పరీక్షకు.. ఈ నెల 16న జరిగిన గురుకుల జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలలోనూ అదే బ్లాగ్ నుంచి ప్రశ్నలు వచ్చాయని విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటిని పరిశీలించాలని అధికారులను టీఎస్పీఎస్సీ ఆదేశించింది. అవసరమైతే కమిటీకి అప్పగించి దర్యాప్తు చేయించాలని పేర్కొంది. మరోవైపు బ్లాగ్ నుంచి ప్రశ్నలను కాపీ చేసి ప్రశ్నపత్రం రూపొందించిన అధికారిని శాశ్వతంగా బ్లాక్‌లిస్టులో పెట్టడంతోపాటు ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. అలాగే చట్టపరంగా చర్యలు చేపట్టాలని సంబంధిత యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌కు లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. -
టీఎస్పీఎస్సీ పరిధికి కత్తెర
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరిధికి కత్తెర పడింది. ఉద్యోగాల భర్తీలో ఆలస్యం జరుగుతుండటంతో టీఎస్పీఎస్సీ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. విద్యుత్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుల తరహాలో శాఖలవారీగా నియామక బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ)ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 6 వేల పోస్టులను భర్తీ చేసే బాధ్యతను టీఆర్‌ఈఐఆర్‌బీకి అప్పగించింది. గతేడాది గురుకులాలకు సంబంధించిన పోస్టుల భర్తీ ప్రక్రియను మాత్రమే టీఎస్పీఎస్పీ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టింది. 8వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, ఇప్పటికీ నియామకాల ప్రక్రియ సాగుతూనే ఉంది. నోటిఫికేషన్ జారీ నుంచే టీఎస్పీఎస్సీకి, రెసిడెన్షియల్ సొసైటీల మధ్య సమన్వయ లోపం ప్రభుత్వానికి మచ్చ తెచ్చిపెట్టింది. నియామకాల్లో అంతులేని జాప్యానికి కారణమైంది. గురుకులాలతోపాటు అన్ని నియామకాల్లోనూ టీఎస్పీఎస్సీ పనితీరు విమర్శల పాలైంది. దీంతో టీఎస్పీఎస్సీకి బదులుగా రెసిడెన్షియల్ రిక్రూట్మెంట్ బోర్డుకే బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగో వంతు కూడా.. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో మొత్తం 1.10 లక్షల ఖాళీలున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచీ ఇప్పటి వరకు 84,548 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. వివిధ రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా ఇప్పటికే 54,724 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. అందులో 28,116 పోస్టుల భర్తీ మాత్రమే పూర్తయింది. ఖాళీల తో పోలిస్తే నాలుగో వంతు పోస్టులు కూడా ప్రభుత్వం భర్తీ చేయలేకపోయింది. టీఎస్పీఎస్సీ వల్లే ఉద్యోగాల భర్తీలో జాప్యం జరిగిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ప్రత్యామ్నాయంగా శాఖల వారీగా నియామకాలు ప్రస్తుతం పోలీస్, విద్యుత్ శాఖలకు ప్రత్యేక బోర్డులున్నాయి. వీటి ద్వారానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ సొంత ఏర్పాట్లు చేసుకుంది. టీఎస్పీఎస్సీకి అప్పగించిన పోస్టుల భర్తీని కూడా తిరిగి వైద్య శాఖనే సొంతంగా నియమించుకునేందుకు ఫైళ్లు కదుపుతోంది. అదే తరహాలో సంక్షేమ శాఖలు, వ్యవసాయ శాఖలోనూ నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అమలు కాని సీఎం హామీ 84 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని గత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చినా నియామక ప్రక్రియ మాత్రం పూర్తి కావడం లేదు. అవినీతికి అవకాశం ఇవ్వరాదన్న పేరుతో పోలీసు మినహా టీచర్ల నియామకాలతో సహా అన్ని ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం టీఎస్పీఎస్సీకి అప్పగించింది. అయితే టీఎస్పీఎస్సీ ఒక్కటే ఇన్ని ఉద్యోగ నియామకాలను చేపట్టలేకపోతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిబ్బంది లేకపోవడం వల్లే నియామక ప్రక్రియ ఆలస్యమవుతోందని టీఎస్పీఎస్సీ చెబుతోంది. కార్యాలయంలో సిబ్బంది కొరతతోపాటు సాంకేతిక సాయం సమకూర్చే సీజీజీతో సమన్వయ లోపం, ప్రభుత్వ విభాగాల నుంచి తగిన సమాచారం అందకపోవటంతోనే నియామక ప్రక్రియ ఆలస్యమవుతోందని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉద్యోగ అర్హతలు, నిబంధనలు, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు, లోకల్ కేడర్ వివరాలన్నీ శాఖలు రూపొందిస్తుండగా, నియామక ప్రక్రియ టీఎస్పీఎస్సీ చేపడుతోంది. ప్రభుత్వ శాఖలతో సమన్వయం కుదరక వివాదాలు కోర్టు మెట్లెక్కుతున్నాయి. -
నిబంధనలు పాతవే.. బోర్డు కొత్తది!
సాక్షి, హైదరాబాద్ : గురుకులాల్లో ఖాళీల భర్తీకి సంబంధించి ఏర్పాట్లు వడివడిగా సాగుతున్నాయి. టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు ఆలస్యమవుతున్నాయని భావించిన ప్రభుత్వం.. ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రశ్న పత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ, ఫలితాలు, నియామకాలకు సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు చర్చించి ఓ నిర్ణయానికొచ్చారు. మరోవైపు అభ్యర్థుల అర్హతలు, మార్కులు తదితర అంశాలను మాత్రం పాత పద్ధతికే పరిమితం చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. గతేడాది నిర్వహించిన పరీక్షల్లో 50 శాతం మార్కులున్న అభ్యర్థులకు అవకాశం కల్పించారు. అదేవిధంగా వయోపరిమితిలోనూ గతేడాది తీసుకున్న నిర్ణయాన్నే అమలు చేస్తే సరిపోతుందని మెజార్టీ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో నియామకాలకు సంబంధించి బోర్డు మాత్రమే కొత్తదని, మిగతా ప్రక్రియ పాత పద్ధతిలోనే జరుగుతుందని, దీనిపై వారం రోజుల్లో స్పష్టత వస్తుందని ఓ అధికారి ‘సాక్షి’తో అన్నారు. అన్ని గురుకులాల్లో దాదాపు 6 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ మేరకు ఖాళీలను పేర్కొంటూ ఆయా శాఖలు ప్రభుత్వానికి నివేదికలు సైతం సమర్పించాయి. తాజాగా ప్రత్యేక బోర్డు ఏర్పాటు కావడంతో భర్తీ బాధ్యతలు దాని ద్వారా చేపట్టనున్నారు. -
గురుకులాల్లో 960 ఖాళీ భర్తీకి ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)లో ఖాళీగా ఉన్న 960 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. 240 డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, 360 జూనియర్ లెక్చరర్లు, 103 పీజీటీ, 206 టీజీటీ, 51 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శివశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానం ద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. గతంలో టీఎస్పీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయగా ఈసారి కొత్తగా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వివిధ విభాగాల్లో మరో 39 ఖాళీల భర్తీ: ఎస్సీ డెవలప్మెంట్ డైరెక్టర్ పరిధిలో జిల్లా స్థాయి యూనిట్లలో ఖాళీగా ఉన్న 30 పోస్టుల భర్తీకి కూడా ఆమోదం తెలుపుతూ ఆర్థికశాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. జిల్లా ఆఫీసుల్లో 17 జూనియర్ అసిస్టెంట్లు, 11 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఆనందనిలయాల్లో 2 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేసే బాధ్యతను టీఎస్పీఎస్సీకి అప్పగించింది. సహకార సంస్థల రిజిస్ట్రార్ కమిషనర్ పరిధిలో ఖాళీగా ఉన్న 3 జూనియర్ అసిస్టెంట్లు, చక్కెర శాఖ డైరెక్టర్ కార్యాలయ పరిధిలో ఖాళీగా ఉన్న 5 జూనియర్ అసిస్టెంట్లు, ఒక సీనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టును భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. -
గురుకుల పోస్టుల్లో వాళ్లకూ చాన్సివ్వాలి!!
హైదరాబాద్: ఏడువేలకుపైగా పోస్టుల భర్తీ కోసం తాజాగా విడుదల చేసిన గురుకుల ఉపాధ్యాయుల నోటిఫికేషన్లో అనేక ఆంక్షలు ఉండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ పోస్టుల అర్హత విషయంలో అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పలు ఆంక్షలు, నిబంధనలు పెట్టడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. గురుకుల పోస్టుల నోటిఫికేషన్లో విధించిన నిబంధనలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిరుద్యోగ అభ్యర్థులు టీఎస్పీఎస్సీ ఎదుట ఆందోళన నిర్వహించారు. డిగ్రీలో బికాం చేసిన వాళ్లకూ గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అభ్యర్థుల అర్హతకు సంబంధించి విధించిన పలు నిబంధనలను తొలగించాలని వారు కోరుతున్నారు.