సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్)లో ఖాళీగా ఉన్న 960 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. 240 డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, 360 జూనియర్ లెక్చరర్లు, 103 పీజీటీ, 206 టీజీటీ, 51 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శివశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానం ద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. గతంలో టీఎస్‌పీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయగా ఈసారి కొత్తగా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
వివిధ విభాగాల్లో మరో 39 ఖాళీల భర్తీ:
ఎస్సీ డెవలప్‌మెంట్ డైరెక్టర్ పరిధిలో జిల్లా స్థాయి యూనిట్లలో ఖాళీగా ఉన్న 30 పోస్టుల భర్తీకి కూడా ఆమోదం తెలుపుతూ ఆర్థికశాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. జిల్లా ఆఫీసుల్లో 17 జూనియర్ అసిస్టెంట్లు, 11 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఆనందనిలయాల్లో 2 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేసే బాధ్యతను టీఎస్‌పీఎస్సీకి అప్పగించింది. సహకార సంస్థల రిజిస్ట్రార్ కమిషనర్ పరిధిలో ఖాళీగా ఉన్న 3 జూనియర్ అసిస్టెంట్లు, చక్కెర శాఖ డైరెక్టర్ కార్యాలయ పరిధిలో ఖాళీగా ఉన్న 5 జూనియర్ అసిస్టెంట్లు, ఒక సీనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టును భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment