degree lecturers
-
ఆ కాలేజీల్లో కేటాయింపులపై రగడ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలో ఇటీవల జరిగిన డిగ్రీ లెక్చరర్ల కేటాయింపులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద సంఖ్యలో డిగ్రీ లెక్చరర్లను రాత్రికి రాత్రే మల్టీజోన్–1 నుంచి డిస్లొకేట్ చేస్తూ మల్టీజోన్–2కు కేటాయించడం వివాదాస్పదమవుతోంది. కేవలం ఐదు కాలేజీల నుంచి దాదాపు నలభై మంది డిగ్రీ లెక్చరర్లు మల్టీజోన్–1 నుంచి మల్టీజోన్–2కు కేటాయిస్తూ టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ గత నెల జూలై 19, 24, 29 తేదీల్లో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా వీరంతా మల్టీ జోన్–2లో వారికి కేటాయించిన చోట విధుల్లోకి చేరుతున్న నేపథ్యంలో అసలు వీరంతా ఏయే కారణాలతో డిస్లొకేట్ అయ్యారనే అంశం ఇప్పుడు గురుకుల ఉద్యోగ సంఘాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆన్లైన్లో కాకుండా మాన్యువల్‌లో ఎందుకు?టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ పరిధిలో ఉద్యోగ కేటాయింపులన్నీ ఇదివరకు కార్యదర్శిగా పనిచేసిన రోనాల్్డరోస్ సమయంలో జరిగాయి. అప్పట్లో ఉద్యోగ కేటాయింపులన్నీ గజిబిజిగా జరగడంతో వాటిని సరిదిద్దే క్రమంలో డిస్లొకేషన్ చేస్తున్నట్లు గురుకుల అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించకుండా మాన్యువల్ పద్ధతిలో చేయడంతో పెద్ద ఎత్తున తప్పులు జరిగినట్లు సొసైటీ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఓ సంఘం నేతలకే ప్రాధాన్యం? సొసైటీ కార్యాలయంలో ఉద్యోగుల కేటాయింపులు చేసే విభాగంలోని అధికారుల్లో కొంతమంది.. ఓ ఉద్యోగ సంఘానికి చెందిన వారు కావడంతో కేటాయింపుల ప్రక్రియలో పారదర్శకత లోపించిందనే ఆరోపణలు ఉన్నాయి. భూపాలపల్లి, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, కరీంనగర్, జగిత్యాల డిగ్రీ కాలేజీల నుంచి 40 మంది లెక్చరర్లను మల్టీజోన్–1 నుంచి మల్టీజోన్–2కు కేటాయించడం... వీరికి గ్రేటర్ హైదరాబాద్ చుట్టు పక్కలున్న కాలేజీల్లోనే పోస్టింగ్ ఇవ్వడంపైన ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఒక్కో లెక్చరర్ నుంచి భారీ మొత్తంలో దండుకున్న కొందరు అధికారులు ఈ ఘనకార్యం చేశారంటూ ఉద్యోగ సంఘాల నేతలు బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. ఓ ఉద్యోగ సంఘం నేతలకే పోస్టింగ్ విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలున్నాయి. ఆ తొమ్మిది మందికి నచ్చిన చోట పోస్టింగ్ ఎస్సీ గురుకుల సొసైటీలో డిప్యుటేషన్లను సొసైటీ కార్యదర్శి ఇటీవల రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ కార్యాలయంలో పనిచేస్తున్న 12 మందిని వారి సొంత స్థానాలకు పంపుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ ఇందులో తొమ్మిది మంది ఉద్యోగులకు నచ్చినచోట పోస్టింగ్ ఇచ్చారన్న విమర్శలు వస్తున్నాయి. ఓ ఉద్యోగికి ఏకంగా మహిళా విద్యా సంస్థలో పోస్టింగ్ ఇవ్వడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. మహిళా విద్యా సంస్థలో కేవలం మహిళలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. తప్పని పరిస్థితుల్లో అయితే పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వారికి అవకాశం కలి్పంచాలి. కానీ కనీస నిబంధనలు పట్టించుకోకుండా పోస్టింగ్ ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
పలువురికి ప్రభుత్వ ఉద్యోగాల జాక్‌పాట్
సిరిసిల్ల/ఉస్మానియాయూనివర్సిటీ/జన్నారం/చందుర్తి(వేములవాడ)/కోరుట్ల/మేడిపల్లి/మెట్పల్లి రూరల్: 4..3..2..4..2.. ఏ కార్పొరేట్ కళాశాల విద్యార్థులో సాధించిన ర్యాంకులు కావివి. ఒక్కొక్కరు నాలుగేసి..మూడేసి.. రెండేసి చొప్పున సాధించిన ప్రభుత్వోద్యోగాలు ఇవి. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన దుగ్గు మనీషా నాలుగు ప్రభుత్వోద్యోగాలకు ఎంపికైంది. ఇప్పటికే గురుకుల పాఠశాల, గురుకుల కళాశాలల్లో టీజీటీ, పీజీటీ అధ్యాపకురాలిగా, ఉపాధ్యాయినిగా ఎంపికైంది. తాజాగా గురువారం వెలువడిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. గురువారం మధ్యాహ్నం వెల్లడైన డిగ్రీ లెక్చరర్ ఫలితాల్లో ఎంఏ సోషల్ విభాగంలో 12వ ర్యాంకు సాధించింది. అలాగే ఓయూ క్యాంపస్‌లోని ఈఎంఎంఆర్‌సీ నైట్‌వాచ్‌మన్ ప్రవీణ్ మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ఇటీవల ప్రకటించిన గురుకుల విద్యాలయాల్లో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లికి చెందిన అంచ అర్చన అలియాస్ వనజ.. ఇటీవల వెలువడిన ప్రభుత్వ గురుకుల పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంగ్లిష్ టీచర్ ఫలితాల్లో ఉద్యోగం సాధించింది. గురువారం వెలువడిన ప్రభుత్వ గురుకుల జూనియర్ లెక్చరర్ (ఇంగ్లిష్) ఫలితాల్లోనూ ఎంపికైంది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దేశాయిపేటకు చెందిన నాగుల నరేశ్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో నిర్వహించిన ఈఎంఆర్ఎస్ పీజీటీ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. ఇటీవల నిర్వహించిన గురుకుల ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభ చూపి టీజీటీ, పీజీటీ ఉద్యోగాలతోపాటు జూనియర్ ఇంగ్లిష్ లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మరోవైపు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం సత్తక్కపల్లికి చెందిన కొడిమ్యాల పావని 17 రోజుల వ్యవధిలోనే రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ఫిబ్రవరి 13న పీజీటీ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 41వ ర్యాంకు సాధించింది. జూనియర్ లెక్చరర్ (మ్యాథమెటిక్స్)లో రాష్ట్రస్థాయిలో 139వ ర్యాంకు సాధించి, ఉద్యోగానికి ఎంపికైంది. -
తెలంగాణ మొత్తం తిరగాల్సిందే..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఏళ్ల తరబడి ఎదురు చూపుల తరువాత విడుదలైన నోటిఫికేషన్ల ప్రకా రం ఉద్యోగాలు సాధించేందుకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఆయా పోటీ పరీక్షలు రాసేందుకు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 1 నుంచి 23వ తేదీ వరకు ‘తెలంగాణ రెసి డెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు’ఆధ్వర్యంలో గురుకులాల్లో డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ, పీఎల్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్, ఫిజికల్ డైరెక్టర్.. తదితర 9 రకాల ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి హాల్‌టికెట్లను ఆన్లైన్లో పెట్టారు. అయితే ఇప్పటికీ పలువురు అభ్యర్థులకు కొన్ని పరీక్షల హాల్‌టికెట్లను వెబ్సైట్లో చూపించడం లేదు. కొన్ని డౌన్లోడ్ కావటం లేదు. కొందరికి మాత్రం కొన్ని పరీక్షల హాల్‌టికెట్లు డౌన్లోడ్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. హాల్‌టికెట్లు చూసి పలువురు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. జేఎల్, డీఎల్, టీజీటీ, పీజీటీ, పీఎల్ పరీక్షలకు పేపర్–1 (జనరల్ స్టడీస్), పేపర్–2 (మెథడాలజీ), పేపర్–3 (సబ్జెక్టు) ఉన్నాయి. పరీక్షలు రాసే విషయంలో అభ్యర్థులకు కేటాయించిన కేంద్రాలు చూస్తే కళ్లు తిరిగే పరిస్థితి ఉందని అంటున్నారు. మూడు పేపర్లకు మూడు జిల్లాలు.. మంచిర్యాలకు చెందిన నికిత అనే అభ్యర్థి టీజీటీకి దరఖాస్తు చేయగా, ఆమెకు పేపర్–1 హైదరాబాద్‌లో, పేపర్–2 మంచిర్యాలలో, పేపర్–3కి వరంగల్‌లో సెంటర్లు ఇచ్చారు. అలాగే నిజామాబాద్‌కు చెందిన రమాదేవి నిజామాబాద్‌లో పరీక్ష కేంద్రం ఆప్షన్ ఇవ్వగా, ఆమెకు పేపర్–1 రంగారెడ్డి జిల్లా, పేపర్–2 మేడ్చల్, పేపర్–3కి కరీంనగర్ జిల్లాలో సెంటర్లు ఇచ్చారు. ఖమ్మంకు చెందిన బిందుకు పేపర్–1 ఖమ్మంలో, పేపర్–2 కొత్తగూడెంలో, పేపర్–3కి సత్తుపల్లిలో సెంటర్లు ఇచ్చారు. ఈ పరీక్షలను ఆగస్టు 4, 14, 22 తేదీల్లో రాయాల్సి ఉంది. ఇక్కడే మరో పెద్ద సమస్య వచ్చిపడింది. వీళ్లు టీజీటీతోపాటు పీజీటీ, డిగ్రీ లెక్చరర్, జేఎల్ పరీక్షలకు కూడా దరఖాస్తు చేశారు. ఈ పరీక్షల కేంద్రాలు ఏయే జిల్లాల్లో కేటాయిస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో సగం జిల్లాల్లో తిరగాల్సిన పరిస్థితి.. మొత్తం 9 విభాగాల పరీక్షల్లో కీలకమైన పీజీటీ, టీజీటీ, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పరీక్షలకు మూడు చొప్పున పేపర్లకు పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలు ఒక క్రమ పద్ధతి ప్రకారం నిర్వహించడం లేదని విమర్శలు వస్తున్నాయి. టీజీటీ పరీక్షలు ఆగస్టు 4, 14, 22 తేదీల్లో ఉన్నాయి. కాగా, ఈ పరీక్షలు రాసే అభ్యర్థులు.. ఆగస్టు 9, 10, 16, 19, 21 తేదీల్లో పీజీటీ, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పరీక్షలు రాయాల్సి ఉంది. వీరికి టీజీటీ తరహాలోనే వివిధ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తే ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు వందల కిలోమీటర్ల మేర ఆగస్టు నెలంతా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని అంటున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు ఉన్న మహిళా అభ్యర్థులు నరకయాతన పడాల్సిన పరిస్థితులు కల్పించారని మండిపడుతున్నారు. ఒక అభ్యర్థి ఇలా పోటీ పరీక్షలు రాసేందుకు వివిధ జిల్లాలు తిరగాలంటే రూ. వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. -
తెలంగాణ: 2,391 కొత్త ఉద్యోగాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో మరిన్ని పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. ఇప్పటికే 9,096 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులివ్వగా... వీటి భర్తీకి సంబంధించిన ఏర్పాట్లను గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) పూర్తి చేసింది. తాజాగా మరో 2,225 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులిచ్చింది. ఈమేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో బీసీ గురుకుల పాఠశాలలకు సంబంధించి 2,132 పోస్టులకుగాను ఐదు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేయగా... జనరల్ గురుకులాల పరిధిలో 93 ఉద్యోగాలకు మరో జీఓ జారీచేశారు. అలాగే, సమాచార, పౌరసంబంధాల శాఖ పరిధిలో 166 పోస్టుల భర్తీకి మరో జీవోను ఆర్థిక శాఖ జారీ చేసింది. గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీ బాధ్యతలు టీఆర్‌ఈఐఆర్‌బీకి, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీని టీఎస్పీఎస్సీకి, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీని టీఎంహెచ్ఎస్ఆర్బీకి అప్పగించింది. -
‘అతిథి’కి అనుమతేది?
సాక్షి, బాన్సువాడ రూరల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న గెస్ట్ లెక్చరర్ల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా రెన్యువల్ ఉత్తర్వులు వెలువడకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడోరేపో ఉత్తర్వులు రాకపోతాయా..అన్న ఆశతో పనిచేస్తున్నారు. జిల్లాలో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డిలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయి. అయితే కళాశాలల్లో శాశ్వత లెక్చరర్లు లేకపోవడంతో గెస్ట్ లెక్చరర్లతో నెట్టుకొస్తున్నారు. నాలుగు కళాశాలల్లో కలిపి యాభై మంది గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు. వీరికి గతేడాది ప్రతి నెలా రూ. 21,600 వేతనం అందించారు. సాధారణంగా గతేడాది విధులు నిర్వహించిన వారికే రెన్యువల్ ఇవ్వాల్సి ఉన్నా ఈసారి ఆగస్టు మాసంలో గెస్ట్‌లెక్చరర్ల ఖాళీలు భర్తీ చేయడానికి అర్హులైన నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దీంతో గెస్ట్‌లెక్చరర్ల ఫోరం నాయకులు కోర్టును ఆశ్రయించగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 863 మంది పాత గెస్ట్ లెక్చరర్లనే కొనసాగించాలని ఉత్తర్వులు వచ్చాయి. అయితే పాత వారిని రెన్యువల్ చేయకుండా విద్యా శాఖ ఉన్నతాధికారులు అప్పీల్‌కు వెళ్లారు. దీంతో రెన్యువల్లో జాప్యం జరుగుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ‘గెస్ట్’లు.. గత విద్యాసంవత్సరంలో గెస్ట్ లెక్చరర్లుగా పనిచేసినవారు ఈ విద్యాసంవత్సరంలో రెన్యువల్ కాకపోయినా.. విధులకు హాజరవుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రిన్సిపాల్‌ల కోరిక మేరకు కళాశాలలకు వస్తున్నారు. అయితే విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా వేతనాలు లేకపోవడంతో వారు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారింది. కళాశాలకు రాకపోకలకు రవాణా ఖర్చులకూ అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ తమకు రెన్యువల్ వచ్చేంత వరకు విధులకు రాకుండా ఉంటే విద్యార్థుల చదువులు ముందుకు సాగేవా అని గెస్ట్ లెక్చరర్లు ప్రశ్నిస్తున్నారు. వెంటనే రెస్యువల్ చేసి, వేతనాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఐదేళ్లుగా పనిచేస్తున్నా.. నేను ఐదేళ్లుగా బాన్సువాడలోని ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీకళాశాలలో మాథ్స్ గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. ఈ ఏడాది రెన్యువల్ ఉత్తర్వులు రాకున్నా విద్యార్థులకు అన్యాయం జరుగరాదనే ఉద్దేశంతో విధులకు హాజరవుతున్నా. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి, వెంటనే రెన్యువల్ ఉత్తర్వులు వెలువరించి న్యాయం చేయాలి. – భీమయ్య, మ్యాథ్స్ గెస్ట్ లెక్చరర్, బాన్సువాడ ఉత్తర్వులు రాలేదు గెస్ట్ లెక్చరర్లను ఈసారి రెన్యువల్ చేయలేదు. గతేడాది పనిచేసిన వారినే కొనసాగించాలంటూ కమిషనర్ నుంచి కూడా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. అయినా 12 మంది పాతవారు విధులకు హాజరవుతుండడంతో కళాశాలలో ఎలాంటి ఇబ్బంది తలెత్తడం లేదు. ప్రస్తుతం పోస్టుల రేషనలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కమిషనర్‌నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. – గంగాధర్, ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీకళాశాల, బాన్సువాడ -
ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు
సాక్షి, అమరావతి: డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించే మెయిన్స్ పరీక్షల షెడ్యూల్లో ఏపీపీఎస్సీ స్వల్ప మార్పులు చేసింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఏకే మౌర్య ప్రకటన విడుదల చేశారు. పాత షెడ్యూల్ ప్రకారం డిగ్రీ కాలేజీ లెక్చరర్ల పోస్టుల మెయిన్ పరీక్ష నవంబర్ 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉండగా, ప్రస్తుతం నవంబర్ 29, 30వ తేదీలలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ మెయిన్ పరీక్ష ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6,8వ తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా, నవంబర్ 6, 7వ తేదీల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. నవంబర్ 6న ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్– 2 పరీక్షలను నిర్వహిస్తారు. పేపర్–3 పరీక్షను నవంబర్ 7న మధ్యాహ్నం నిర్వహించనున్నారు. -
గురుకుల జేఎల్ పోస్టులకు 17 నుంచి ఇంటర్వ్యూలు
సాక్షి, హైదరాబాద్: గురుకుల జూనియర్ కాలేజీల్లో అధ్యాపక పోస్టుల భర్తీపై రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) మరో అడుగు ముందుకేసింది. డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల భర్తీ ముందుగా చేపట్టిన తర్వాత జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని గురుకుల బోర్డు భావించింది. కానీ డిగ్రీ లెక్చరర్ ఉద్యోగ నియామక ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తడంతో ఆ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేసి జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీని ముందుకు తెచ్చింది. ఇప్పటికే జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి 1:2 పద్ధతిలో ఎంపికైన∙ప్రాథమిక జాబితాలోని అభ్య ర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేపట్టిన బోర్డు.. తాజాగా ఈ నెల 17 నుంచి 22 వరకు ఇంటర్వ్యూలు, డెమో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో తేదీలు ఖరారు చేయనుంది. పరిశీలనకు ప్రత్యేక బోర్డులు.. జేఎల్ అభ్యర్థులకు నిర్వహించే ఇంటర్వ్యూ, డెమోను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బోర్డులో గురుకుల నియామకాల బోర్డు, గురుకుల సొసైటీ, విషయ నిపుణులు, మానసిక వైద్యుడు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు సబ్జెక్టుల వారీగా కమిటీలు ఏర్పాటు చేసిన ఆ మేరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తా రు. ఇంటర్వ్యూ కేటగిరీలో 25 మార్కులుంటాయి. ఇంటర్వ్యూ, డెమో ప్రక్రియకు గరిష్టంగా 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వ్యవధి ఉంటుంది. రాత పరీక్ష మార్కులు, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తుది జాబితాను ఎంపిక చేస్తారు. త్వరలో డీఎల్ ప్రాథమిక జాబితా గురుకులాల్లో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితా త్వరలో విడుదల కానుంది. వాస్తవానికి ఇప్పటికే 1:2 పద్ధతిలో ప్రాథమిక జాబితా ప్రకటించినా.. అందులో దాదాపు 30 శాతం అభ్యర్థులకు నిర్దేశిత తేదీ నాటికి అర్హతలు లేవు. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో ఈ విషయం వెలుగు చూడటంతో అర్హతల్లేని అభ్యర్థులను జాబితా నుంచి తొలగించి కొత్త జాబితా రూపొందించేందుకు బోర్డు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా వారిని తొలగించి మెరిట్ ఆధారంగా కొత్త అభ్యర్థుల పేర్లను చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రోస్టర్ ఆధారంగా 1:2 పద్ధతిలో పేర్లను ఖరారు చేయనుంది. ఇందుకు నెలరోజులు పట్టే అవకాశం ఉంది. -
గురుకులాల్లో 960 ఖాళీ భర్తీకి ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)లో ఖాళీగా ఉన్న 960 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. 240 డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, 360 జూనియర్ లెక్చరర్లు, 103 పీజీటీ, 206 టీజీటీ, 51 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శివశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానం ద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. గతంలో టీఎస్పీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయగా ఈసారి కొత్తగా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వివిధ విభాగాల్లో మరో 39 ఖాళీల భర్తీ: ఎస్సీ డెవలప్మెంట్ డైరెక్టర్ పరిధిలో జిల్లా స్థాయి యూనిట్లలో ఖాళీగా ఉన్న 30 పోస్టుల భర్తీకి కూడా ఆమోదం తెలుపుతూ ఆర్థికశాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. జిల్లా ఆఫీసుల్లో 17 జూనియర్ అసిస్టెంట్లు, 11 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఆనందనిలయాల్లో 2 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేసే బాధ్యతను టీఎస్పీఎస్సీకి అప్పగించింది. సహకార సంస్థల రిజిస్ట్రార్ కమిషనర్ పరిధిలో ఖాళీగా ఉన్న 3 జూనియర్ అసిస్టెంట్లు, చక్కెర శాఖ డైరెక్టర్ కార్యాలయ పరిధిలో ఖాళీగా ఉన్న 5 జూనియర్ అసిస్టెంట్లు, ఒక సీనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టును భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్వ్యూల్లో మాయాజాలం!?
రాత పరీక్షల్లో వారు అత్యధిక మార్కులు తెచ్చుకున్నారు.. తమ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుందని ఎన్నో కలలుగన్నారు. జాబ్ గ్యారంటీ అనుకున్నారు.. తీరా ఫలితాలు చూశాక నీరుగారిపోయారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల విడుదల చేసిన డిగ్రీ అధ్యాపక పోస్టుల ఫలితాలు పలువురు అభ్యర్ధులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. రాత పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించినా ఇంటర్వ్యూలో మార్కులు బాగా తగ్గిపోవడంతో తాము అవకాశాలు కోల్పోతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. ఒక ప్రాతిపదిక అంటూ లేకుండా ఇంటర్వ్యూల్లో మార్కులు వేశారంటూ అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లోని ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఉర్దూ, ఒరియా, కామర్స్, ఎకనమిక్స్, హిస్టరీ, పాలిటిక్స్, మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, స్టాటస్టిక్స్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్సు, జియాలజీ సబ్జెక్టులకు సంబంధించి 504 అధ్యాపక పోస్టుల భర్తీకి 2016 డిసెంబర్ 27న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి రాత, మౌఖిక పరీక్షలు ముగించి ఇటీవలే మార్కులను ప్రకటించింది. ఇవి తెలుసుకుని అనేకమంది అభ్యర్ధులు అవాక్కయ్యారు. బోర్డు చేసిన ఇంటర్వ్యూ తీరు, మార్కుల కేటాయింపు రోజుకో రకంగా సాగినట్లు మార్కులు చూస్తే తేటతెల్లమవుతోందని వారు ఆరోపిస్తున్నారు. మౌఖికంలోనే మతలబు? ఆంగ్లం సబ్జెక్టులో 58 పోస్టులకు పరీక్షలు నిర్వహించి క్వాలిఫై అయిన వారిని 1 : 2 చొప్పున 116 మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. వీరికి గత ఏడాది నవంబర్ నెలాఖరులో ఏడు రోజులపాటు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. మొదటి రెండు రోజులు, చివరి రెండు రోజులూ బోర్డు సభ్యులు గరిష్ఠంగా 45 వరకు మార్కులు వేశారని అభ్యర్ధులు చెబుతున్నారు. మిగిలిన రోజుల్లో బోర్డు సభ్యులు 9–20 లోపు మాత్రమే మార్కులు వేశారని దీనివల్ల తాము అవకాశం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఉదాహరణకు.. నవంబర్ 27న జరిగిన ఇంటర్వ్యూల్లో ఒక్క అభ్యర్ధికి వచ్చిన 13.5 మార్కులు మినహాయిస్తే ఆ రోజున ఇంటర్వ్యూకి హాజరైన వారికి 23 నుంచి 45 మార్కుల వరకు వేశారు. రాత పరీక్షలో 261.65 మార్కులు వచ్చిన ఒక అభ్యర్థికి ఇంటర్వ్యూలో కేవలం 13 మార్కులు వేశారు. అలాగే, మరో అభ్యర్థికి రాత పరీక్షలో 262.4 మార్కులు వస్తే ఇంటర్వ్యూలో పది వచ్చాయి. మరో ఇద్దరు అభ్యర్ధులకు వరుసగా 257, 258 మార్కులు వచ్చినా మౌఖికంలో 15 మార్కులు వేశారు. అదే మరో రోజున జరిగిన ఇంటర్వ్యూలో, రాత పరీక్షలో 202 మార్కులు వచ్చిన ఓ అభ్యర్థికి మౌఖికంలో 45 మార్కులు, 170 మార్కులు వచ్చిన మరో వ్యక్తికి 40 మార్కులు వేశారు. అలాగే, రాతపరీక్షలో వరుసగా 212, 203 మార్కులు వచ్చిన మరో ఇద్దరికి 33, 39.5 మార్కులు వేశారు. వాస్తవానికి ఇంటర్వ్యూలు ముగిసిన ఒకటి రెండు రోజుల్లోనే ఫలితాలు వెలువడేవని.. కానీ ఈసారి 40 రోజుల తరువాత ప్రకటించారని బాధిత అభ్యర్ధులు ఆరోపించారు. అనుమానాలు సహజం ఇంటర్వ్యూ బోర్డులో సభ్యులు మారడమనేది ఎపీపీఎస్సీ ప్రక్రియలో సర్వసాధారణం. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన రీతిలో సమాధానాలు చెప్పిన వారికే మార్కులు వేస్తారు. అలాగే, వారి భావ వ్యక్తీకరణను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, బోర్డు బోర్డుకీ మధ్య మార్కులు వేయడంలో వ్యత్యాసాలపై అనుమానాలు, వివాదాలు సహజంగానే ఎప్పుడూ వస్తుంటాయి. బోర్డు సభ్యులను వీటిపై ప్రశ్నించలేం. – ప్రొ.పి. ఉదయభాస్కర్, ఏపీపీఎస్సీ చైర్మన్ -
ఊరట.. ’గురుకుల’ పరీక్షపై స్టే ఎత్తివేత
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట కలిగింది. గురుకులాల పరిధిలోని డిగ్రీ కళాశాలల లెక్చరర్ల రాతపరీక్షపై విధించిన స్టేను మంగళవారం హైకోర్టు ఎత్తివేసింది. దీంతో రాత పరీక్షకు మార్గం సుగమం అయింది. గురుకులాల్లోని మహిళా కళాశాలల్లో ఉద్యోగాలన్నీ కూడా మహిళలకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంపై కొంతమంది పురుష అభ్యర్థులు కోర్టుకు ఎక్కారు. దాంతో గత జులై 30న జరగాల్సిన పరీక్షను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం తరుపున కోర్టుకు తాజాగా వివరణ ఇవ్వడంతో దానితో ఏకీ భవించిన కోర్టు స్టేను ఎత్తివేసింది. దీంతో డిగ్రీ కళాశాలల లెక్కరర్ల రాత పరీక్ష జరగనుంది. మరోపక్క, గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ నియామక పరీక్షలకోసం జారీ చేసిన జీవో 1274ను హైకోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువరించకపోవడంతో దీనిపై టీఎస్పీఎస్సీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. మరోపక్క, కొత్త షెడ్యూల్‌ను కూడా టీఎస్పీఎస్సీనే ప్రకటించాల్సి ఉంది. మొత్తం 500 పోస్టుల్లో మహిళకే కేటాయిస్తూ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపైనే ధుమారం రేగింది. -
ప్రశాంతంగా ఏపీపీఎస్సీ పరీక్ష
అనంతపురం అర్బన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో డిగ్రీ లెక్చరర్లకు రెండవ రోజు బుధవారం ఆరు సెంటర్లలో నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం పరీక్షకు 470 మంది అభ్యర్థులకుగానూ 403 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 142 మందికిగానూ 120 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణకు లైజన్ అధికారులుగా నాగభూషణం, కుళ్లాయప్ప, ఆదిమూర్తి, జయరాము, రాజశేఖర్, రాజా వ్యవహరించారు.