ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ల కేటాయింపులపై విమర్శలు
మూకుమ్మడిగా ‘డిస్ లొకేషన్’పై వివాదం
మల్టీ జోన్–1 నుంచి మల్టీ జోన్–2కు పెద్ద సంఖ్యలో డిగ్రీ లెక్చరర్ల కేటాయింపు
డిప్యుటేషన్ రద్దయినా సొసైటీ కార్యాలయాన్ని వదలని కొందరు ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలో ఇటీవల జరిగిన డిగ్రీ లెక్చరర్ల కేటాయింపులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద సంఖ్యలో డిగ్రీ లెక్చరర్లను రాత్రికి రాత్రే మల్టీజోన్–1 నుంచి డిస్‌లొకేట్ చేస్తూ మల్టీజోన్–2కు కేటాయించడం వివాదాస్పదమవుతోంది.
కేవలం ఐదు కాలేజీల నుంచి దాదాపు నలభై మంది డిగ్రీ లెక్చరర్లు మల్టీజోన్–1 నుంచి మల్టీజోన్–2కు కేటాయిస్తూ టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ గత నెల జూలై 19, 24, 29 తేదీల్లో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా వీరంతా మల్టీ జోన్–2లో వారికి కేటాయించిన చోట విధుల్లోకి చేరుతున్న నేపథ్యంలో అసలు వీరంతా ఏయే కారణాలతో డిస్‌లొకేట్ అయ్యారనే అంశం ఇప్పుడు గురుకుల ఉద్యోగ సంఘాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆన్‌లైన్‌లో కాకుండా మాన్యువల్‌లో ఎందుకు?
టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ పరిధిలో ఉద్యోగ కేటాయింపులన్నీ ఇదివరకు కార్యదర్శిగా పనిచేసిన రోనాల్‌్డరోస్ సమయంలో జరిగాయి. అప్పట్లో ఉద్యోగ కేటాయింపులన్నీ గజిబిజిగా జరగడంతో వాటిని సరిదిద్దే క్రమంలో డిస్‌లొకేషన్ చేస్తున్నట్లు గురుకుల అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియను ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించకుండా మాన్యువల్ పద్ధతిలో చేయడంతో పెద్ద ఎత్తున తప్పులు జరిగినట్లు సొసైటీ ఉద్యోగులు మండిపడుతున్నారు.
ఓ సంఘం నేతలకే ప్రాధాన్యం?
సొసైటీ కార్యాలయంలో ఉద్యోగుల కేటాయింపులు చేసే విభాగంలోని అధికారుల్లో కొంతమంది.. ఓ ఉద్యోగ సంఘానికి చెందిన వారు కావడంతో కేటాయింపుల ప్రక్రియలో పారదర్శకత లోపించిందనే ఆరోపణలు ఉన్నాయి. భూపాలపల్లి, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, కరీంనగర్, జగిత్యాల డిగ్రీ కాలేజీల నుంచి 40 మంది లెక్చరర్లను మల్టీజోన్–1 నుంచి మల్టీజోన్–2కు కేటాయించడం... వీరికి గ్రేటర్ హైదరాబాద్ చుట్టు పక్కలున్న కాలేజీల్లోనే పోస్టింగ్ ఇవ్వడంపైన ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ఒక్కో లెక్చరర్ నుంచి భారీ మొత్తంలో దండుకున్న కొందరు అధికారులు ఈ ఘనకార్యం చేశారంటూ ఉద్యోగ సంఘాల నేతలు బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. ఓ ఉద్యోగ సంఘం నేతలకే పోస్టింగ్ విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలున్నాయి.
ఆ తొమ్మిది మందికి నచ్చిన చోట పోస్టింగ్
ఎస్సీ గురుకుల సొసైటీలో డిప్యుటేషన్లను సొసైటీ కార్యదర్శి ఇటీవల రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ కార్యాలయంలో పనిచేస్తున్న 12 మందిని వారి సొంత స్థానాలకు పంపుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ ఇందులో తొమ్మిది మంది ఉద్యోగులకు నచ్చినచోట పోస్టింగ్ ఇచ్చారన్న విమర్శలు వస్తున్నాయి.
ఓ ఉద్యోగికి ఏకంగా మహిళా విద్యా సంస్థలో పోస్టింగ్ ఇవ్వడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. మహిళా విద్యా సంస్థలో కేవలం మహిళలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. తప్పని పరిస్థితుల్లో అయితే పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వారికి అవకాశం కలి్పంచాలి. కానీ కనీస నిబంధనలు పట్టించుకోకుండా పోస్టింగ్ ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment