ఇంటర్వ్యూల్లో మాయాజాలం!? | Allegations on APPSC Interviews | Sakshi
Sakshi News home page

ఇంటర్వ్యూల్లో మాయాజాలం!?

Published Sun, Jan 28 2018 11:30 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

Allegations on APPSC Interviews - Sakshi

రాత పరీక్షల్లో వారు అత్యధిక మార్కులు తెచ్చుకున్నారు.. తమ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుందని ఎన్నో కలలుగన్నారు. జాబ్‌ గ్యారంటీ అనుకున్నారు.. తీరా ఫలితాలు చూశాక నీరుగారిపోయారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఇటీవల విడుదల చేసిన డిగ్రీ అధ్యాపక పోస్టుల ఫలితాలు పలువురు అభ్యర్ధులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. రాత పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించినా ఇంటర్వ్యూలో మార్కులు బాగా తగ్గిపోవడంతో తాము అవకాశాలు కోల్పోతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. ఒక ప్రాతిపదిక అంటూ లేకుండా ఇంటర్వ్యూల్లో మార్కులు వేశారంటూ అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు.     

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లోని ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఉర్దూ, ఒరియా, కామర్స్, ఎకనమిక్స్, హిస్టరీ, పాలిటిక్స్, మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, స్టాటస్టిక్స్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్, కంప్యూటర్‌ సైన్సు, జియాలజీ సబ్జెక్టులకు సంబంధించి 504 అధ్యాపక పోస్టుల భర్తీకి 2016 డిసెంబర్‌ 27న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటి రాత, మౌఖిక పరీక్షలు ముగించి ఇటీవలే మార్కులను ప్రకటించింది. ఇవి తెలుసుకుని అనేకమంది అభ్యర్ధులు అవాక్కయ్యారు. బోర్డు చేసిన ఇంటర్వ్యూ తీరు, మార్కుల కేటాయింపు రోజుకో రకంగా సాగినట్లు మార్కులు చూస్తే తేటతెల్లమవుతోందని వారు ఆరోపిస్తున్నారు.

మౌఖికంలోనే మతలబు?
ఆంగ్లం సబ్జెక్టులో 58 పోస్టులకు పరీక్షలు నిర్వహించి క్వాలిఫై అయిన వారిని 1 : 2 చొప్పున 116 మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. వీరికి గత ఏడాది నవంబర్‌ నెలాఖరులో ఏడు రోజులపాటు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. మొదటి రెండు రోజులు, చివరి రెండు రోజులూ బోర్డు సభ్యులు గరిష్ఠంగా 45 వరకు మార్కులు వేశారని అభ్యర్ధులు చెబుతున్నారు. మిగిలిన రోజుల్లో బోర్డు సభ్యులు 9–20 లోపు మాత్రమే మార్కులు వేశారని దీనివల్ల తాము అవకాశం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఉదాహరణకు..

  • నవంబర్‌ 27న జరిగిన ఇంటర్వ్యూల్లో ఒక్క అభ్యర్ధికి వచ్చిన 13.5 మార్కులు మినహాయిస్తే ఆ రోజున ఇంటర్వ్యూకి హాజరైన వారికి 23 నుంచి 45 మార్కుల వరకు వేశారు. రాత పరీక్షలో 261.65 మార్కులు వచ్చిన ఒక అభ్యర్థికి ఇంటర్వ్యూలో కేవలం 13 మార్కులు వేశారు.
  • అలాగే, మరో అభ్యర్థికి రాత పరీక్షలో 262.4 మార్కులు వస్తే ఇంటర్వ్యూలో పది వచ్చాయి.
  • మరో ఇద్దరు అభ్యర్ధులకు వరుసగా 257, 258 మార్కులు వచ్చినా మౌఖికంలో 15 మార్కులు వేశారు.
  • అదే మరో రోజున జరిగిన ఇంటర్వ్యూలో, రాత పరీక్షలో 202 మార్కులు వచ్చిన ఓ అభ్యర్థికి మౌఖికంలో 45 మార్కులు, 170 మార్కులు వచ్చిన మరో వ్యక్తికి 40 మార్కులు వేశారు. అలాగే, రాతపరీక్షలో వరుసగా  212, 203 మార్కులు వచ్చిన మరో ఇద్దరికి 33, 39.5 మార్కులు వేశారు.
  • వాస్తవానికి ఇంటర్వ్యూలు ముగిసిన ఒకటి రెండు రోజుల్లోనే ఫలితాలు వెలువడేవని.. కానీ ఈసారి 40 రోజుల తరువాత ప్రకటించారని బాధిత అభ్యర్ధులు ఆరోపించారు.

అనుమానాలు సహజం
ఇంటర్వ్యూ బోర్డులో సభ్యులు మారడమనేది ఎపీపీఎస్సీ ప్రక్రియలో సర్వసాధారణం. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన రీతిలో సమాధానాలు చెప్పిన వారికే మార్కులు వేస్తారు. అలాగే, వారి భావ వ్యక్తీకరణను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, బోర్డు బోర్డుకీ మధ్య మార్కులు వేయడంలో వ్యత్యాసాలపై అనుమానాలు, వివాదాలు సహజంగానే ఎప్పుడూ వస్తుంటాయి. బోర్డు సభ్యులను వీటిపై ప్రశ్నించలేం.
– ప్రొ.పి. ఉదయభాస్కర్, ఏపీపీఎస్సీ చైర్మన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement