సిరిసిల్ల/ఉస్మానియాయూనివర్సిటీ/జన్నారం/చందుర్తి(వేములవాడ)/కోరుట్ల/మేడిపల్లి/మెట్‌పల్లి రూరల్: 4..3..2..4..2.. ఏ కార్పొరేట్ కళాశాల విద్యార్థులో సాధించిన ర్యాంకులు కావివి. ఒక్కొక్కరు నాలుగేసి..మూడేసి.. రెండేసి చొప్పున సాధించిన ప్రభుత్వోద్యోగాలు ఇవి. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన దుగ్గు మనీషా నాలుగు ప్రభుత్వోద్యోగాలకు ఎంపికైంది. ఇప్పటికే గురుకుల పాఠశాల, గురుకుల కళాశాలల్లో టీజీటీ, పీజీటీ అధ్యాపకురాలిగా, ఉపాధ్యాయినిగా ఎంపికైంది. తాజాగా గురువారం వెలువడిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది.
గురువారం మధ్యాహ్నం వెల్లడైన డిగ్రీ లెక్చరర్ ఫలితాల్లో ఎంఏ సోషల్ విభాగంలో 12వ ర్యాంకు సాధించింది. అలాగే ఓయూ క్యాంపస్‌లోని ఈఎంఎంఆర్‌సీ నైట్‌వాచ్‌మన్ ప్రవీణ్ మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ఇటీవల ప్రకటించిన గురుకుల విద్యాలయాల్లో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లికి చెందిన అంచ అర్చన అలియాస్ వనజ.. ఇటీవల వెలువడిన ప్రభుత్వ గురుకుల పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంగ్లిష్ టీచర్ ఫలితాల్లో ఉద్యోగం సాధించింది. గురువారం వెలువడిన ప్రభుత్వ గురుకుల జూనియర్ లెక్చరర్ (ఇంగ్లిష్) ఫలితాల్లోనూ ఎంపికైంది.
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దేశాయిపేటకు చెందిన నాగుల నరేశ్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో నిర్వహించిన ఈఎంఆర్‌ఎస్ పీజీటీ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. ఇటీవల నిర్వహించిన గురుకుల ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభ చూపి టీజీటీ, పీజీటీ ఉద్యోగాలతోపాటు జూనియర్ ఇంగ్లిష్ లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మరోవైపు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం సత్తక్కపల్లికి చెందిన కొడిమ్యాల పావని 17 రోజుల వ్యవధిలోనే రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ఫిబ్రవరి 13న పీజీటీ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 41వ ర్యాంకు సాధించింది. జూనియర్ లెక్చరర్ (మ్యాథమెటిక్స్)లో రాష్ట్రస్థాయిలో 139వ ర్యాంకు సాధించి, ఉద్యోగానికి ఎంపికైంది.
Comments
Please login to add a commentAdd a comment