
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో మరిన్ని పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. ఇప్పటికే 9,096 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులివ్వగా... వీటి భర్తీకి సంబంధించిన ఏర్పాట్లను గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) పూర్తి చేసింది. తాజాగా మరో 2,225 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులిచ్చింది. ఈమేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందులో బీసీ గురుకుల పాఠశాలలకు సంబంధించి 2,132 పోస్టులకుగాను ఐదు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేయగా... జనరల్ గురుకులాల పరిధిలో 93 ఉద్యోగాలకు మరో జీఓ జారీచేశారు. అలాగే, సమాచార, పౌరసంబంధాల శాఖ పరిధిలో 166 పోస్టుల భర్తీకి మరో జీవోను ఆర్థిక శాఖ జారీ చేసింది. గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీ బాధ్యతలు టీఆర్‌ఈఐఆర్‌బీకి, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీని టీఎస్‌పీఎస్సీకి, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీని టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీకి అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment