Government job notifications
-
తెలంగాణ: 2,391 కొత్త ఉద్యోగాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో మరిన్ని పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. ఇప్పటికే 9,096 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులివ్వగా... వీటి భర్తీకి సంబంధించిన ఏర్పాట్లను గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) పూర్తి చేసింది. తాజాగా మరో 2,225 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులిచ్చింది. ఈమేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో బీసీ గురుకుల పాఠశాలలకు సంబంధించి 2,132 పోస్టులకుగాను ఐదు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేయగా... జనరల్ గురుకులాల పరిధిలో 93 ఉద్యోగాలకు మరో జీఓ జారీచేశారు. అలాగే, సమాచార, పౌరసంబంధాల శాఖ పరిధిలో 166 పోస్టుల భర్తీకి మరో జీవోను ఆర్థిక శాఖ జారీ చేసింది. గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీ బాధ్యతలు టీఆర్‌ఈఐఆర్‌బీకి, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీని టీఎస్పీఎస్సీకి, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీని టీఎంహెచ్ఎస్ఆర్బీకి అప్పగించింది. -
ఉగాదికి ఉద్యోగ నోటిఫికేషన్లు.. తొలివిడతలో భారీ సంఖ్యలో భర్తీ?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ముమ్మరంగా కసరత్తు సాగుతోంది. ఉగాది నాటికి తొలివిడత నోటిఫికేషన్ జారీచేసే అవకాశముంది. ఏప్రిల్ 2న ఉగాది పండుగ జరుపుకోనుండగా, మరో రెండువారాల్లోగా తొలి విడత నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 27 ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల శాసనసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. దశలవారీగా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడతగా 30 వేల నుంచి 40 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు సమాచారం. ఎక్కువ మంది ఈ మెగా ఉద్యోగమేళాలో భాగం పంచుకోవాలన్న ఉద్దేశంతో విడతలవారీగా ఈ నోటిఫికేషన్లు జారీ కానున్నట్లు సమాచారం. ఒకేసారి 80 వేల పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేయడం వల్ల ఇబ్బందులుంటాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. కాగా, వివిధ శాఖల నుంచి వస్తున్న ఉద్యోగ ఖాళీల సమాచారంపై రాష్ట్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. గురువారంనాటికి 10 ప్రభుత్వ శాఖలు కొలువుల భర్తీకి అనుమతి కోరుతూ ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపించాయి. హోం, వైద్యారోగ్య, రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు ఇందులో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. హోంశాఖలో 18,334 పోస్టులు, వైద్యారోగ్య శాఖలో 12,755, పాఠశాల విద్యాశాఖలో 13,086 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలకు కొన్ని మార్పులను సూచించగా ఒకటి రెండు రోజుల్లో ఆ శాఖల నుంచి తుది ప్రతిపాదనలు మళ్లీ ఆర్థిక శాఖకు అందనున్నాయి. సీఎం సూచనలు అందిన వెంటనే జీవోలు సీఎం కేసీఆర్ నుంచి సూచనలు అందిన వెంట నే శాఖల వారీగా తొలివిడత పోస్టుల భర్తీకి పరిపాలనాఅనుమతులు జారీ చేస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేయనుంది. ఆ వెంటనే సంబంధిత శాఖల సమన్వయంతో ఆయా నియామక సంస్థలు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నాయి. వివిధ శాఖల నుంచి వస్తున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారంలో ఎక్కడా తేడా రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నోటిఫికేషన్లో ఎలాంటి తప్పులు రాకుండా తగిన చర్యలు చేపట్టారు. తొలివిడత నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రక్రియ రెండువారాల్లో పూర్తి కానుందని, వచ్చే నెల ప్రారంభంలో నోటిఫికేషన్లు రావచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
తెలంగాణలో 67,820 ఉద్యోగ ఖాళీలు.. విభజన పూర్తయ్యేది ఎప్పుడో?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ఇంకొన్నాళ్లు సమయం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనవరి 1న నూతన సంవత్సర కానుకగా ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నా.. అది ఇంత త్వరగా సాధ్యమవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నోటిఫికేషన్లను జనవరిలో ఇవ్వాలంటే డిసెంబరు 20లోగా కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అయితే, ఉద్యోగుల కేటాయింపునకు చాలా సమయం పడుతుందని ఉద్యోగ సం ఘాల నేతలు పేర్కొంటున్నారు. అందుకే ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి ఇంకొన్నాళ్లు పడుతుందని చెబుతున్నారు. దీంతో అప్పటివరకు రాష్ట్రంలోని 8 లక్షల మంది నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పేలా లేవు. వివరాల సేకరణ ఏ పోస్టులు ఏ కేటగిరీలోకి వస్తాయన్న వర్గీకరణను పూర్తి చేసిన ప్రభుత్వం వివిధ శాఖల్లోని పోస్టుల వివరాలనూ సేకరించింది. శాఖల వారీగా మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న వారు, ఖాళీల వివరాలను తీసుకుంది. ఒక్క పాఠశాల విద్యాశాఖ మినహా మిగతా శాఖల వివరాల సేకరణ ఇదివరకే పూర్తికాగా.. ఇప్పుడు ఆ శాఖ లెక్క కూడా తేలింది. ఆర్థిక శాఖ క్షేత్రస్థాయి నుంచి సేకరించిన లెక్కల ప్రకారం 67,820 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆగస్టులో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్‌కు నివేదించింది. మరోసారి వాటిని పరిశీలించే ప్రక్రియను చేపట్టారు. అది పూర్తయితే ఈ వారంలోనే వివిధ శాఖల్లో ఖాళీలపై పూర్తిస్థాయి స్పష్టత రానుంది. ఆ తర్వాత అంటే వచ్చే నెల్లో ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమవుతుంది. వీలైతే ఈ నెలలోనే ఆ ప్రక్రియను పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటివరకు ఆర్డర్ టు సర్వ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను కొత్త జిల్లాల ప్రకా రం కేటాయించడం, అందుకోసం వారికి ఆప్షన్లు ఇచ్చే ప్రక్రియను వచ్చే నెలలో చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఆప్షన్లకు అందుబాటులో అన్ని పోస్టులు ఉద్యోగులు పనిచేస్తున్న పోస్టులు మాత్రమే కాకుండా శాఖల వారీగా మంజూరైన పోస్టులన్నింటినీ ఆప్షన్లకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగ సంఘాలు కూడా అదే డిమాండ్ చేశాయి. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు ఆప్షన్ల ప్రకారం వాటిని కేటాయించాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రాథమిక మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసింది. సంబంధిత జిల్లా, జోన్, మల్టీ జోన్‌లోని పోస్టులను స్థానికత ఆధారంగా కేటాయిస్తారు. ఒకవేళ ఎక్కువ మంది ఆప్షన్లు ఇస్తే సీనియర్లకు ఇస్తారు. ఇందులోనూ వికలాంగులు, వితంతువులు, కేన్సర్/కిడ్నీ వ్యాధిగ్రస్తులు, మానసిక వైకల్యం కలిగిన పిల్లలున్న వారు, జీహెచ్ఎంసీ మినహా మిగతా ప్రాంతాల్లో స్పౌజ్ (కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు), గుర్తింపు పొందిన సంఘాల వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ ప్రక్రియను డిసెంబరులోగా పూర్తి చేస్తే ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి మార్గం సుగమం అవుతుంది. విద్యాశాఖలో... రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టుల లెక్క తేలింది. ఇక జిల్లాల వారీగా విభజన చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎవరు ఏ జిల్లా పరిధిలోకి వస్తారనేది ధ్రువీకరిస్తారు. ఉమ్మడి జిల్లాల లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1.22 లక్షలు. అయితే చాలామంది పదవీ విరమణ, ఇతర కారణాల వల్ల వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం విద్యాశాఖలో వివిధ కేడర్లలో 18,927 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. అయితే వీటిలో 12,225 పోస్టులను భర్తీ చేసే అవకాశముందని అంటున్నారు. త్వరలోనే సీఎం సమావేశం.. ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ త్వరలోనే సమావేశం నిర్వహించే అవకాశముంది. కొత్త జిల్లాలకు శాశ్వత కేటాయింపులు చేపట్టేందుకు మార్గదర్శకాలపై చర్చిస్తారు. ఈ నెలాఖరులో సమావేశం జరిగే అవకాశం ఉంది. – రాజేందర్, టీఎన్జీవో, రాష్ట్ర అధ్యక్షుడు ఆయా శాఖల్లో భర్తీ చేసే అవకాశం ఉన్న పోస్టులు స్కూల్ అసిస్టెంట్–1,694, లాంగ్వేజ్ పండిట్–1,211, పీఈటీ–458, ఎస్జీటీ–8,862, హోంశాఖ–21,507, ఉన్నత విద్య–3,825, గిరిజన సంక్షేమం–1,700, వైద్యారోగ్యశాఖ– 10,048, బీసీ సంక్షేమం–3,538, ఎస్సీ సంక్షేమం–1,967, రెవెన్యూ–1,441, మైనారి టీ సంక్షేమం–1,437, గ్రామీణాభివృద్ధి– 1391, నీటి పారుదల–1,222, పురపాలక శాఖ–1,148, అటవీశాఖ–1,096, కార్మిక శాఖ–980, వ్యవసాయ శాఖ–742, పశుసంవర్థకశాఖ– 628, రోడ్లు భవనాలు, రవాణా– 492, పరిశ్రమలు–292, ఆర్థికశాఖ–838, స్త్రీ శిశుసంక్షేమం–800, జీఏడీ– 220, సాంస్కృతిక, పర్యాటక–69, ప్లానింగ్–65, పౌర సరఫరాలు–48, శాసనసభ–38, ఇంధన శాఖ–33, న్యాయ శాఖ–26, ఐటీ శాఖ– 4. -
లాక్డౌన్: సర్కారీ ఉద్యోగాలకు ఇలా తయారవ్వండి!
కరోనా మహమ్మారిని అరికట్టడానికి భారత ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. మార్చి 25 నుంచి మూడు వారాల పాటు విధించిన లాక్డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుందని అంతా భావించారు. అయితే ఇప్పటికి లాక్‌డౌన్‌ను రెండు సార్లు పొడిగించారు. మే 17 వరకు లాక్డౌన్ కొనసాగనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీంతో ఇప్పటికే ఇళ్లకే పరిమితమయ్యి అడుగు బయట పెట్టే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది డిప్రెషన్లోకి వెళుతుండగా, చాలా మంది ఇది ఇలాగే కొనసాగుతుందేమో అని భయపడుతున్నారు. అయితే ఈ పరిస్థితిలో కచ్ఛితంగా మార్పు వస్తుంది. కానీ కరోనా కారణంగా దేశ ఆర్థిక పరిస్థితులతో పాటు ప్రపంచ ఆర్ధిక పరిస్థితులు కూడా తారుమారయ్యాయి. ఇప్పుడు ఉద్యోగాల కొరత మరింత ఎక్కువయ్యింది. ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు లేవు. ఇక గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఒక్కటే మార్గం. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండటంతో గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వారికి చాలా సమయం దొరికింది. మరి ఈ సమయంలో జాబ్ కొట్టడానికి ఏం చేయాలో ఒకసారి తెలుసుకుందాం. (గవర్నమెంట్ జాబ్ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://allgovernmentjobs.in/latest-government-jobs) ఆన్లైన్ ద్వారా నేర్చుకోండి: ఈ 21వ శతాబ్ధంలో ఇంటర్నెట్ లేకుండా మనం మన జీవితాల్ని ఊహించుకోలేం. ప్రతి ఒక్కరి చేతితో మొబైల్ ఫోన్ ఉండాల్సిందే. అయితే ఇంటర్నెట్ను సోషల్ మీడియా సైట్స్ చూడటానికి కాకుండా ఎడ్యూకేషన్‌కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగించండి. గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యేవారి కోసం చాలా వెబ్సైట్లు తక్కువ రేటుకు లేదా ఉచితంగానే స్టడీ మెటీరియల్స్, ఆన్లైన్ వీడియో క్లాస్‌లు అందిస్తున్నాయి. వాటిని ఈ లాక్డౌన్ కాలంలో సద్వినియోగం చేసుకుంటే చాలా వరకు సబెక్ట్ నేర్చుకోవచ్చు. బుక్స్ చదవండి: గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అనేది ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి యేడాది పరీక్షలు సంబంధించిన సిలబస్ మార్పు చేస్తూనే ఉంటారు. ఈ సిలబస్ వరకు చదివితే సరిపోతుంది అనేది గవర్నమెంట్ జాబ్ కొట్టేవారి విషయంలో సరికాదు. యూపీఎస్సీకి లేదా ఏదైనా రాష్ట్ర స్థాయి పరీక్షలకు ప్రిపేర్ వారికి ఎంత సమయం ఉన్న సరిపోదు. ఏదో ఒక విషయం నిరంతరం తెలుసుకుంటూనే ఉండాలి. ఒకేసారి ప్రిలిమ్స్‌కి మెయిన్స్‌కి సంసిద్ధం కావాలి. దీని కోసం పుస్తకాలు చదువుతూ సబెక్ట్లపై లోతైన అవగాహన పెంచుకోవాలి. జనరల్ నాలెడ్జ్ పై పట్టుసాధించడం: గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో జనరల్ అవేర్నెస్ అనేది కీలకపాత్ర పోషిస్తుంది. అయితే చాలా మంది ఆప్టిట్యూడ్, రీజనింగ్ లాంటివి ప్రిపేర్ అవుతూ తేలికగానే ఉంటుందని జనరల్ నాలెడ్జ్ పార్ట్‌ని వదిలేస్తారు. కానీ జనరల్ అవేర్నెస్పై గ్రిప్ ఉంటే మంచి స్కోర్ సాధించవచ్చు. జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి చాలా మెటీరియల్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి: నిత్యం మన చుట్టూ జరిగే విషయాల నుంచే చాలా ప్రశ్నలు పరీక్షల్లో వస్తూ ఉంటాయి. ప్రతి ఎగ్జామ్‌కి కరెంట్ఎఫైర్స్ అనేవి చాలా ముఖ్యం. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం వల్ల కరెంట్ ఎఫైర్స్‌పై పట్టు రావడంతో పాటు పదజాలాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. ఆన్లైన్ పరీక్షలు రాయడం: పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు టైం మెనేజ్మెంట్ అనేది చాలా కీలకం. ఇచ్చిన టైం లోగా ఎన్ని ప్రశ్నలు చేయగలుగుతున్నాం. అసలు మనం ఏ సబెక్ట్‌లో వీక్‌గా ఉన్నాం. ఏ పార్ట్‌ని ఇంఫ్రూవ్ చేసుకోవాలి అనేది రోజు మాక్‌టెస్ట్‌లు రాయడం ద్వారా తెలుస్తోంది. ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా విద్యార్థులు చాలా వరకు ఏ విషయం మీద ఫోకస్ పెట్టాలి అనే దానిని తెలుసుకోగలుగుతారు. మాక్‌టెస్ట్‌ల్లో చేసే తప్పులు అసలు ఎగ్జామ్‌లో చేయకుండా చూసుకుంటూ మంచి మార్క్‌లు సాధిస్తారు. వ్యాయమం చేయడం: మనం చదువుకుంటూ ఎలాంటి ఫిజికల్ యాక్టివిటి లేకపోతే శరీరం బద్దకంగా తయారవుతుంది. ప్రస్తుతం లాక్డౌన్లో మనం బయటకి వెళ్లి అడుకోవడం లాంటివి చేయలేం కాబట్టి ఇంట్లోనే ఉండి వ్యాయమం చేస్తూ ఫిట్‌గా ఉండాలి. ఆరోగ్యం బాగున్నప్పుడే మనం చురుకుగా పనిచేయగలం. ఇలాంటి సమయంలో మనం ఇంట్లో ఉండి ప్రభుత్వానికి సహకరిద్దాం. అదేవిధంగా పరిస్థితులు కచ్ఛితంగా మాములుగా వస్తాయి. ప్రభుత్వపరీక్షలు కొనసాగుతాయి. ఇప్పటి నుంచే మన ప్రిపరేషన్ మొదలుపెడదాం. -
సర్కారీ నౌకరీ సాటి రాదు మరేదే
కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి అత్యున్నత సివిల్ సర్వీసెస్ వరకూ..ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం యువత ఆతృతగాఎదురుచూస్తోంది. ప్రకటనల సమాచారం తెలిసిన వెంటనే కోచింగ్ సెంటర్ల వైపు పరుగులు తీస్తోంది. చిన్నచిన్న ఉద్యోగాలకు సైతం ఎంటెక్‌లు, ఎంబీఏలు, పీజీలు, పీహెచ్డీ స్కాలర్స్ పోటీపడుతున్న వైనం సర్కారీ కొలువులపై యువత ఆసక్తిని తేటతెల్లం చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలపట్ల పెరుగుతున్న క్రేజ్‌పై ప్రత్యేక విశ్లేషణ.. అందరి చూపూ ప్రభుత్వ ఉద్యోగాలపైనే.. అర్హతలు, ఇన్స్టిట్యూట్లు, డిగ్రీలతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేజిక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రైవేటు ఉద్యోగాలకు సెలవులు పెట్టో.. అదీ వీలు కాకపోతే రాజీనామా చేసైనా సరే సర్కార్ కొలువును సొంతం చేసుకునే దిశగా కదులుతున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తోపాటు ఆయా రాష్ట్రాల సర్వీస్ కమిషన్ల జాబ్ నోటిఫికేషన్లకు వెల్లువెత్తుతున్న దరఖాస్తులే ఇందుకు నిదర్శనం. కానిస్టేబుల్ పోస్టులకు పీజీ అభ్యర్థులు తెలుగు రాష్ట్రాల సరళిని పరిశీలిస్తే ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇంటర్మీడియెట్ అర్హతగా ప్రకటించిన కానిస్టేబుల్ పోస్టులకు ప్రొఫెషనల్ డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, ఎం.ఫిల్ అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 40 శాతం మందికిపైగా పీజీలు, ప్రొఫెషనల్ డిగ్రీ అభ్యర్థులే ఉన్నారంటే ప్రభుత్వ ఉద్యోగాలకు పెరుగుతున్న క్రేజ్‌ను అర్థంచేసుకోవచ్చు. ప్యూన్ ఉద్యోగాలకు పీహెచ్డీ స్కాలర్స్ ప్రభుత్వ ఉద్యోగాలకు యువతలో పెరుగుతున్న ఆసక్తికి తాజా ఉదాహరణ.. ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ప్యూన్ ఉద్యోగాల నోటిఫికేషన్‌కు పీహెచ్డీ, ఎంఫిల్, ఎంటెక్ అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకోవడం. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ప్యూన్ ఉద్యోగ దరఖాస్తుల్లోనూ ఇదే తీరు. ఇందులో 30 పోస్టుల నోటిఫికేషన్‌కు దాదాపు 75 వేల మంది ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రొఫెషనల్ డిగ్రీస్ టు సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ నివేదిక ప్రకారం సివిల్స్-2013 అభ్యర్థుల్లో 40% మంది ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్, సైన్స్ గ్రాడ్యుయేట్లు, పీజీ ఉత్తీర్ణులే ఉన్నారు. మొత్తం 770 మంది విజేతల్లో బీటెక్-36%; ఎంబీబీఎస్-42.9%, మేనేజ్మెంట్-22%, ఎంటెక్-34.4%; ఎండీ/సూపర్ స్పెషాలిటీ-38.7%; సెన్సైస్ పీజీ-32.3% మంది ఉన్నారు. బ్యాంకు ఉద్యోగాలకు భారీ పోటీ 2014-15లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) చేపట్టిన కామన్ రిటెన్ ఎగ్జామినేషన్స్‌కు 23 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరుకావడమే ప్రభుత్వ ఉద్యోగాల పట్ల యువత ఆసక్తికి నిదర్శనం. పోటీ ఇంతలా ఉన్నందునే ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్ అనే విధానాలకు శ్రీకారం చుట్టడం గమనార్హం. గ్రూప్-2కు ఐదున్నర లక్షల మంది దరఖాస్తు! తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వచ్చాయి. 439 ఖాళీల గ్రూప్ -2 నోటిఫికేషన్‌కు ఏకంగా 5,64,431 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అధిక శాతం మంది ఇంజనీరింగ్, పీజీలతోపాటు ఎంఫిల్, పీహెచ్డీ అభ్యర్థులు కూడా ఉండటం గమనార్హం. అంత క్రేజ్ ఎందుకు! వేతనాలు ఆరో వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగాయి. ఏడో వేతన సంఘం సిఫార్సులు కూడా అమల్లోకి వస్తే ఎంట్రీ లెవల్లోనే నెలకు రూ. 35 వేల నుంచి రూ. 40 వేల మధ్యలో జీతం పొందే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఉన్నత స్థాయి ఉద్యోగులకు సకల సదుపాయాలు లభిస్తున్నాయి. ఒత్తిడి లేని వాతావరణం ప్రైవేటు రంగంతో పోల్చితే ప్రభుత్వ ఉద్యోగంలో విధుల నిర్వహణ పరంగా ఒత్తిడి కొంత తక్కువగా ఉంటుంది! టార్గెట్స్, డెడ్‌లైన్స్ వంటివాటి నుంచి విముక్తి పొందొచ్చనే యోచన. సంఘంలో గౌరవం మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగి అంటే ఇప్పటికీ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే గవర్నమెంట్ ఎంప్లాయిస్ను ‘బాబూస్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తుంటారు. సామాజిక సేవ చేసే అవకాశం వ్యక్తిగతంగా సామాజిక దృక్పథం, అభివృద్ధికి తోడ్పడాలనే తపన ఉన్న అభ్యర్థులు ప్రభుత్వ సర్వీసుల ద్వారా ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. మరో పార్శ్వం ఎంటెక్, ఎంబీఏ, ప్రొఫెషనల్ డిగ్రీ చదివిన వారూ ప్యూన్లు, కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గల కారణాలను లోతుగా పరిశీలిం చాలని ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి అన్నారు. వృత్తి విద్యలో నాణ్యత లోపించడం, సుమారు 50% మంది ప్రొఫెషనల్ విద్యార్థులు జాబ్స్ కోసం వేచి చూస్తుండటం, కోరుకున్న కొలువులు రాకపోవడం కూడా ఇందుకు కారణమేనని చెప్పారు. యువత ప్రభుత్వ ఉద్యోగాల వైపు దృష్టి సారించడానికి కారణం వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఒత్తిళ్లు లేని భవిష్యత్తు గ్యారెంటీ అని భావించడమే. 2008లో ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర య్యాయి. దీంతో ఎంతో మంది పింక్ స్లిప్‌లు అందుకున్నారు. అలాంటి పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండదు. పే కమిషన్ల సిఫారసుల మేరకు ప్రస్తుతం కెరీర్ ప్రారంభంలోనే ఆకర్షణీయ వేతనాలు అందుతున్నాయి. ప్రొ॥వై.వెంకటరామిరెడ్డి యూపీఎస్సీ మాజీ సభ్యులు -
ఒకే రోజు మూడు ‘పరీక్ష’లు
25న ఎస్ఎస్సీ జూనియర్ ఇంజనీర్, అటవీశాఖ, పోస్టల్ అసిస్టెంట్స్ పరీక్షలు తలపట్టుకుంటున్న నిరుద్యోగులు.. పట్టించుకోని అధికారులు హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేదే అరకొరగా. పోటీకి సన్నద్ధమయ్యే అభ్యర్థులు అహోరాత్రులు శ్రమిస్తేగానీ నెగ్గుకురాలేరు. అసలే రాష్ర్ట విభజన నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులతో నోటిఫికేషన్లు లేక ఆవేదనలో ఉన్న అభ్యర్థులపై మరో పిడుగు పడింది! ఈనెల 25వ తేదీన ఒకే రోజు మూడు పరీక్షల జరగనుండటంతో దేనికి హాజరు కావాలో తేల్చుకోలేక నిరుద్యోగులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ జూనియర్ ఇంజనీర్, పోస్టల్ అసిస్టెంట్స్, అటవీశాఖ నోటిఫికేషన్లు అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మే 25న జూనియర్ ఇంజనీర్ పరీక్ష నిర్వహణకు మార్చి 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. అంటే రెండు నెలల క్రితమే పరీక్ష తేదీ ఖరారైంది. అయితే రాష్ట్ర అటవీ శాఖ దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా అదే రోజున ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్ష నిర్వహిస్తామని ఇటీవలే తేదీని ప్రకటించింది. దీంతో రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏది రాయాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఇది చాలదన్నట్టు తాజాగా పోస్టల్ శాఖ కూడా మే 25వతేదీన పోస్టల్ అసిస్టెంట్ / సార్టింగ్ అసిస్టెంట్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించటం మూడు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఆందోళన నింపింది. పరీక్ష తేదీలను మార్చాలని అధికారులను కోరినా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. అధికారులు చొరవ చూపాలి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు కోసం ఎదురు చూస్తున్న మాకు ఈ పరీక్షలు వరంలా అనిపించాయి. కానీ ఒకే రోజు మూడు పరీక్షలు పెట్టటం అంటే నోటిఫికేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా ఒక్కటే. అధికారులు చొరవ తీసుకొని పరీక్షల తేదీలను మార్చాలి. - కృష్ణ, అభ్యర్థి, కర్నూలు ఒకే రోజు మూడు పరీక్షలా? ఒకే రోజు మూడు పరీక్షలు ఎలా నిర్వహిస్తారు? ఇది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడ మే. తేదీలు ఖరారు చేసేముందు అదే రోజు ఇతర పరీక్షలు ఉన్నాయోమో చూసుకోవాలా వద్దా? అధికారులు దీన్ని పరిశీలించి పరీక్ష తేదీలను మార్చాలి. - కిషోర్, అభ్యర్థి, హైదరాబాద్